హారిక అండ్ హాసిని క్రియేషన్స్
అజ్ఞాతవాసి
తారాగణం: పవన్‌కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్, ఆది పినిశెట్టి, ఖుష్‌బూ, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్, బొమన్ ఇరాని, తనికెళ్ళ భరణి, రఘుబాబు, అజయ్, జయపక్రాష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: వి.మణికందన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల తేదీ: 10.01.20.18
పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. సినిమా ప్రారంభం అయిన రోజు నుంచే రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంటారు. వారికి జయాపజయాలతో సంబంధం లేదు. పవన్ వరసగా ఫ్లాప్ సినిమాలు చేసినా తర్వాతి సినిమా కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తారు. అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి. పవన్‌కళ్యాణ్, తివ్రిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే తమ హీరోకి అత్తారింటికి దారేదిలాంటి మరో బ్లాక్‌బస్టర్ ఖాయం అనుకున్నారంతా. దానికి తగ్గట్టుగానే సినిమాకి బాగా హైప్ వచ్చింది. పవన్‌కళ్యాణ్ 25వ చిత్రంగా రూపొందిన అజ్ఞాతవాసికి సంబంధించి విడుదల చేసిన స్టిల్స్‌గానీ, పోస్టర్స్‌గానీ, ట్రైలర్‌గాని అభిమానుల్లో ఆశల్ని చిగురింపజేశాయి. జనవరి 10 కోసం అందరూ వెయ్యికళ్ళతో ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. మరి ఈ అజ్ఞాతవాసి చిత్రంతోనైనా పవన్‌కళ్యాణ్ తన అభిమానుల్ని ఖుషి చేశాడా? పవన్, త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు గోవింద భార్గవ్ అలియాస్ వింద(బొమన్ ఇరాని). వేలాది కోట్లకు అధిపతి. ఎబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో అతని వ్యాపార సామ్రాజ్యం ప్రపంచమంతటా విస్తరించింది. హఠాత్తుగా అతని కొడుకు మోహన్ భార్గవ్ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. వింద ఆత్మహత్య చేసుకుంటాడు. అయితే మోహన్‌ది యాక్సిడెంట్ కాదని, విందది ఆత్మహత్య కాదని వింద భార్య ఇంద్రాణి(ఖుష్‌బూ)కి తెలుసు. తన భర్తని, కొడుకుని హత్య చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు అస్సాంలో అజ్ఞాతంలో ఉన్న పెద్ద కొడుకు అభిషిక్త్ భార్గవ్(పవన్‌కళ్యాణ్)ని పిలిపిస్తుంది. కట్ చేస్తే అభిషిక్త్.. వింద మొదటి భార్య కొడుకు. బిజినెస్‌లో పక్కన ఉన్నవారి వల్లే మోసపోయిన వింద.. కొడుకుని బిజినెస్ వాతావరణానికి దూరంగా తన బావమరిది దగ్గర ఉంచుతాడు. ఇంద్రాణి పిలుపుతో ఎబి గ్రూప్ ఆఫ్ కంపెనీలో బాలసుబ్రహ్మణ్యం పేరుతో ఒక ఉద్యోగిగా చేరి తండ్రిని చంపిన హంతకుల ఆరా తీయడం మొదలుపెడతాడు. అసలు విందాని, అతని కొడుకుని చంపింది ఎవరు? ఏం ఆశించి ఆ హత్యలు చేశారు? ఆ హంతకుల్ని కనిపెట్టే క్రమంలో అభిషిక్త్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా పరిష్కరించాడు? ఎబి గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ.
అజ్ఞాతవాసి సినిమాలో మేజర్ పార్ట్ పవన్‌కళ్యాణ్‌దే అని చెప్పాలి. దాదాపు ప్రతి సీన్‌లో పవన్‌కళ్యాణ్ కనిపిస్తాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అతని భుజాలపైనే సినిమాని నడిపించాడు. యాక్షన్, కామెడీ, కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ల విషయానికి వస్తే కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పాటల కోసమే హీరోయిన్లు అన్నట్టుగా ఉన్నారు. రావు రమేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్ చేసిన కామెడీ, డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. ఆది పినిశెట్టి విలన్‌గా స్టైలిష్ పెర్‌పార్మెన్స్ ఇచ్చాడు. తల్లి పాత్రలో ఖుష్‌బూ ఆకట్టుకోలేకపోయింది. మిగతా ఆర్టిస్టులు ఫర్వాలేదు అనిపించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాల్సి వస్తే మణికందన్ ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించడంలో మణి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా తొలి సినిమా చేసిన అనిరుధ్ సక్సెస్ అయ్యాడు. మూడు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా చేశాడు. రెగ్యులర్‌గా వుంటే మ్యూజిక్‌తో కాకుండా కొత్తగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. పాటలు వినడానికి బాగానే ఉన్నా విజువల్‌గా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ముఖ్యంగా హీరోగానీ, హీరోయిన్‌గానీ డాన్స్ చేసిన సందర్భాలు సినిమాలో కనిపించవు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఫస్ట్‌హాఫ్ వరకు బాగానే అనిపించినా సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌తో అస్తవ్యస్తంగా మారింది. ఈ చిత్రం ప్రొడక్షన్ వేల్యూస్ చాలా హైలో ఉన్నాయని చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైట్‌మాస్టర్ డా.కె.రవివర్మ గురించి. ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ వరకు ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ని ఎంతో స్టైలిష్‌గా చేశాడు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే... ప్రతి సినిమాలోనూ తన మార్క్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథ, కథనాలు ఉంటాయి. వేరే సినిమాల్లోని కొన్ని పంచ్ డైలాగులు విన్నప్పుడు ఇది త్రివిక్రమ్ మార్క్ పంచ్ అని చెప్పగలం. కానీ, ఈ సినిమాలో ఆ తరహా డైలాగులు కొన్ని మాత్రమే ఉన్నాయి. రెండు గంటల నలభై నిమిషాల సినిమాలో నవ్వుకునే సందర్భాలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కేవలం పవన్‌కళ్యాణ్ బిల్డప్ షాట్స్, అతను కదలకుండా చేసే ఫైట్స్, అతని స్టైల్‌లో కామెడీ అనిపించుకునే కొన్ని సీన్స్, సగటు ప్రేక్షకులకు అర్థం కాని ఉప కథలు, మచ్చుకైనా లేని సెంటిమెంట్, ఏమాత్రం ఆకట్టుకోని ఎమోషన్.. వెరసి అజ్ఞాతవాసి చిత్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ చిత్రానికి మాతృకగా చెప్పుకుంటున్న లార్గోవిచ్ సినిమాలో మనకు కొత్తగా అనిపించే కథ ఏమిటో సినిమా చూసిన వారెవరికీ అర్థం కాదు. ఈ తరహా కథలు కాస్త అటూ ఇటూగా గతంలో తెలుగులో చాలా వచ్చాయి. ఇది కేవలం పవన్‌కళ్యాణ్ అభిమానుల కోసం తీసిన సినిమాలా అనిపిస్తుందే తప్ప కథపై హార్డ్ వర్క్ చేసినట్టుగా ఎక్కడా కనిపించదు. ప్రతి సీన్ క్లైమాక్స్‌లా వుంటుంది అని ఓ సినిమాలో ఆలీ చెప్పినట్టుగా.. ఈ సినిమాలో ప్రతి సీన్ పవన్‌కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌లా ఉంటుంది. బిల్డప్ షాట్స్‌పై, ఫైట్స్‌పై పెట్టిన శ్రద్ధ కథ విషయంలోగానీ, కథనం విషయంలోగానీ పెట్టలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్‌కళ్యాణ్ సినిమాలు ఏవరేజ్ అనిపించుకున్నా కలెక్షన్లపరంగా ఎలాంటి ఢోకా ఉండదనేది బయ్యర్ల, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. కానీ, పవన్ గత రెండు సినిమాలు ఆ విషయంలో కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమా విషయానికి వస్తే కేవలం పవన్‌కళ్యాణ్ చరిష్మావల్ల ఈ సినిమాకి కలెక్షన్లు రావాలి తప్ప కథ, కథనాలు, టేకింగ్ వల్ల కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని బిల్డప్ సీన్స్, కొంత కామెడీతో ఓకే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ కూడా బాగుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి అప్పటివరకు కథపై ఉన్న ఆసక్తి కాస్తా సన్నగిల్లుతుంది. అనవసరమైన కామెడీ, ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో సినిమా నడుస్తుంటుంది. ఓ పేలవమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న క్రేజ్ వల్ల కలెక్షన్లు బాగానే ఉండే అవకాశం వుంది.
ఫినిషింగ్ టచ్: అగమ్యగోచరం.. అజ్ఞాతవాసి