Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: హలో


అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ 

Advertisement
CJ Advs

హలో 

తారాగణం: అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, అనీష్‌ కురువిల్లా, సత్యకృష్ణన్‌, మైకేల్‌ గాంధీ, అజయ్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, కృష్ణుడు తదితరులు 

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

నిర్మాత: అక్కినేని నాగార్జున 

రచన, దర్శకత్వం: విక్రమ్‌ కె. కుమార్‌ 

విడుదల తేదీ: 22.12.2017 

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అక్కినేని అఖిల్‌ తొలి చిత్రం అఖిల్‌ అందర్నీ నిరాశ పరిచింది. 13, ఇష్క్‌, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ రెండో ప్రయత్నంగా చేసిన హలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్‌కి, ట్రైలర్‌కి, పాటలకు మంచి స్పందన వచ్చింది. తొలి సినిమా నిరాశపరిచినప్పటికీ హలోతో డెఫినెట్‌గా హిట్‌ కొడతామన్న కాన్ఫిడెన్స్‌ యూనిట్‌లో కనిపించింది. ఈ విషయంలో అఖిల్‌తోపాటు నాగార్జున కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. విభిన్న కథాంశాలతో, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేసే విక్రమ్‌కుమార్‌ హలో సినిమాకి ఎంచుకున్న కథాంశం ఏమిటి? అఖిల్‌ని ఈ సినిమా ద్వారా ఎలా ప్రజెంట్‌ చేశాడు? ఈ సినిమాతో అఖిల్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతవరకు ఆకట్టుకున్నాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

చిన్నప్పటి స్నేహం.. పెద్దయ్యాక ప్రేమగా మారడం, అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు కలుసుకునే పరిస్థితులు లేకపోవడం, కథ ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత చివరికి కలుసుకోవడం, కథ సుఖాంతమవడం... ఇలాంటి కథలు తెలుగులో కోకొల్లలుగా వచ్చాయి. హలో కోసం ఎంచుకున్న కథ కూడా అలాంటిదే. డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో, ఆకట్టుకునే క్యారెక్టరైజేషన్స్‌తో దర్శకుడు కథని ఎలా నడిపించాడు అనేది హలో చిత్రంలోని ప్రత్యేకత. శ్రీను(మైకేల్‌ గాంధీ) ఓ అనాథ. చేతిలో ఏక్‌తార్‌తో తనకు వచ్చిన సంగీతాన్ని వినిపిస్తూ ఓ సిగ్నల్‌ కూడలిలో వచ్చి పోయేవారు ఇచ్చేది తీసుకొని జీవితాన్ని నడిపిస్తుంటాడు. ఆ సమయంలో జున్ను అనే ఓ అమ్మాయి పరిచయమవుతుంది. శ్రీను సంగీతాన్ని జున్ను ఇష్టపడుతుంది. ఇద్దరి స్నేహం బలపడుతుంది. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు ఇద్దరూ ఆ సిగ్నల్‌ దగ్గర ఉన్న పార్కులో కలుసుకుంటూ వుంటారు. అదే టైమ్‌లో జున్ను తండ్రికి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్‌ అవడంతో అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఓ 100 రూపాయల నోటు మీద ఫోన్‌ నెంబర్‌ రాసిచ్చి ఫోన్‌ చెయ్యమని చెప్తుంది. ఆ వందనోటు అందుకునే టైమ్‌లో ఓ కుర్రాడు ఆ నోటుని కొట్టేస్తాడు. అతన్ని వెంబడించే క్రమంలో శ్రీనుని ఓ కారు ఢీ కొడుతుంది. ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న సరోజిని(రమ్యకృష్ణ) ఒక్కసారిగా షాక్‌ అవుతుంది. శ్రీనుని హాస్పిట్‌లో జాయిన్‌ చేస్తారు. తన వల్ల ఓ కుర్రాడు హాస్పిటల్‌లో చేరడంతో తల్లడిల్లిపోతుంది సరోజిని. ఆమె భర్త ప్రకాష్‌(జగపతిబాబు) ఆమెను సముదాయిస్తాడు. తర్వాత పిల్లలు లేని ఆ దంపతులు శ్రీనుని దత్తత తీసుకుంటారు. అతని పేరుని అవినాష్‌(అఖిల్‌)గా మారుస్తారు. ఢిల్లీ వెళ్ళిపోయిన జున్ను అసలు పేరు ప్రియ(కళ్యాణి ప్రియదర్శన్‌). ఆరోజు నుంచి రోజూ ఉదయం అదే టైమ్‌కి శ్రీను... జున్ను కోసం ఎదురుచూస్తుంటాడు. ఢిల్లీలో ఉన్న ప్రియ.. శ్రీను ఫోన్‌ కోసం ఎదురుచూస్తుంటుంది. అలా 15 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎదురుచూస్తూనే ఉంటారు. మరి వీళ్ళిద్దరూ మళ్ళీ తారసపడ్డారా? ఒకరినొకరు గుర్తుపట్టుకోగలిగారా? తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? చివరికి వీరి ప్రేమకథ సుఖాంతమైందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

తొలి చిత్రం అఖిల్‌లో డాన్సుల పరంగా, ఫైట్స్‌ పరంగా, నటన పరంగా అఖిల్‌కి మంచి మార్కులే పడినా సినిమాలో విషయం లేకపోవడం వల్ల ఆ సినిమా అతని కెరీర్‌కి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. ఓ చక్కని ప్రేమకథ, హృదయానికి హత్తుకునే సెంటిమెంట్‌, మంచి పాటలు, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కనువిందు చేసే ఫోటోగ్రఫీ వీటన్నింటినీ మించి పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అఖిల్‌ సాధించిన పరిణతి హలో చిత్రానికి ఘనవిజయాన్ని అందించాయి. చక్కని స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ప్రతి సీన్‌లోనూ తన నటనతో ఆకట్టుకున్న అఖిల్‌కి హలో మంచి ఆరంభాన్నిచ్చింది. ముఖ్యంగా పార్కోవర్‌ యాక్షన్‌ సీన్స్‌లో అఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతం అని చెప్పాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు సాధించిన అఖిల్‌ ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడడం విశేషం. ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్‌ హీరోలలో ఎక్కువ క్వాలిటీస్‌ అఖిల్‌లో ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌ తొలి చిత్రంతోనే అందర్నీ అలరిస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్‌ చెయ్యడంలో కళ్యాణి సక్సెస్‌ అయ్యింది. హీరోయిన్‌గా కళ్యాణికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఇద్దరి తర్వాత చెప్పుకోవాల్సింది జగపతిబాబు, రమ్యకృష్ణ క్యారెక్టర్ల గురించి. ముఖ్యంగా రమ్యకృష్ణ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సెంటిమెంట్‌ సీన్స్‌లో తన నటనతో కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. హీరో తండ్రిగా జగపతిబాబు మరోసారి తన హుందాతనాన్ని ప్రదర్శించాడు. 

ఈ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌ టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌. పి.ఎస్‌.వినోద్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌ అని చెప్పక తప్పదు. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా, మరెంతో అందంగా చూపించిన వినోద్‌ని అభినందించక తప్పదు. ఇష్క్‌, మనం చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన అనూప్‌ రూబెన్స్‌ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. ప్రతి పాటా వీనుల విందుగా ఉంది. దానికి తగ్గట్టుగానే ఎంతో అందంగా పాటల్ని చిత్రీకరించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అనూప్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి హైప్‌ తీసుకొచ్చింది. 2 గంటల 11 నిడివిలో సినిమాని చక్కగా ఎడిట్‌ చేశాడు ప్రవీణ్‌ పూడి. వినోద్‌ ఫోటోగ్రఫీకి తోడు రాజీవన్‌ చేసిన ప్రొడక్షన్‌ డిజైన్‌ సినిమాకి మరింత అందం తీసుకొచ్చింది. ఈ సినిమా ఇంత అందంగా, ఇంత రిచ్‌గా రూపొందడానికి ముఖ్య కారకుడు నాగార్జున. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రతి ఫ్రేమ్‌ క్వాలిటీగా రావడానికి ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఎంతో తోడ్పడ్డాయి. డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌ గురించి చెప్పాలంటే. తీసుకున్న కథాంశం ఏదైనా దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా, సినిమాలో ఇన్‌వాల్వ్‌ అయ్యేలా చెయ్యడంలో విక్రమ్‌ సిద్ధహస్తుడు. హలో చిత్రంతో మరోసారి అది ప్రూవ్‌ అయింది. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చినా, ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో లాజిక్స్‌ మిస్‌ అయినా వాటిని పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్‌ చేసేలా తీర్చిదిద్దడంలో విక్రమ్‌ కృషి మెచ్చుకోదగింది. కథతోపాటే నడిచే కామెడీతో అక్కడక్కడా నవ్వులు పూయించడం, శ్రుతి మించని సెంటిమెంట్‌తో కళ్ళు చెమ్మగిల్లేలా చేయడం విక్రమ్‌కే సాధ్యమైంది. ఫైనల్‌గా చెప్పాలంటే అందమైన ప్రేమకథగా రూపొందిన హలో చిత్రం ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ ఒక్క డైలాగ్‌ కూడా అభ్యంతరకరంగా లేకపోవడం, కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందడం వల్ల హలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: స్వచ్ఛమైన ప్రేమకథ

hello movie review:

akhil new move hello
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs