Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: అదిరింది


అదిరింది 
శ్రీ తెన్నాండల్‌ ఫిలింస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
తారాగణం: విజయ్‌, కాజల్‌, సమంత, నిత్యమీనన్‌, ఎస్‌.జె.సూర్య, సత్యరాజ్‌, వడివేలు, 
కోవై సరళ, రాజేంద్రన్‌ తదితరులు 
సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు 
ఎడిటింగ్‌: రూబెన్‌ 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌ 
స్క్రీన్‌ప్లే: వి.విజయేంద్రప్రసాద్‌, అట్లీ, ఎస్‌.రమణ గిరివాసన్‌ 
నిర్మాతలు: మురళి రామస్వామి, హేమారుక్మిణి, తెన్నాండల్‌ స్టూడియోస్‌ ప్రై. లిమిటెడ్‌ 
రచన: దర్శకత్వం: అట్లీ 
విడుదల తేదీ: 09.11.2017 
హీరో విజయ్‌కి తమిళ్‌లో వున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. విజయ్‌ సినిమా వస్తోందంటే అక్కడి అభిమానులకు పండగే. సినిమా ఎలా వున్నా కేవలం విజయ్‌ వల్ల భారీ ఓపెనింగ్స్‌ సాధిస్తుంది. విజయ్‌ తమిళ్‌లో చేసిన సినిమాలు తెలుగులో అనువాద చిత్రాలుగా చాలా వచ్చినప్పటికీ భారీ స్థాయిలో ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. మిగతా తమిళ్‌ హీరోల్లాగే తెలుగులో కూడా తన మార్కెట్‌ని పెంచుకోవాలనుకుంటున్న విజయ్‌ కోరిక తీరడం లేదు. తుపాకి ఒక్కటే బాక్సాఫీస్‌ దగ్గర కాస్త సందడి చేసింది. తాజాగా అట్లీ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన మెర్సల్‌ అక్కడ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. జిఎస్‌టికి సంబంధించిన కొన్ని డైలాగ్స్‌ సినిమాలో వుండడం వల్ల అది వివాదానికి దారి తీసింది. తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ ఆలస్యం అవడానికి కూడా అవే డైలాగ్స్‌ కారణమయ్యాయని తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు అదిరింది చిత్రం గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు అదిరింది చిత్రం కోసం ఎంచుకున్న కథాంశం ఏమిటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్‌ అయింది? ఈ చిత్రంతోనైనా విజయ్‌ తెలుగులో ఒక మంచి ఇమేజ్‌ని సంపాదించుకుంటాడా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 
ఓపెన్‌ చేస్తే.... ఓ హాస్పిటల్‌కి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌, మెడికల్‌ బ్రోకర్‌, హాస్పిటల్‌ హెచ్‌ఆర్‌, ఒక సర్జన్‌.. ఈ నలుగురు వ్యక్తుల కిడ్నాప్‌కి సంబంధించి డాక్టర్‌ భార్గవ(విజయ్‌)ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. కేవలం 5 రూపాయల కన్సల్టేషన్‌ ఫీజుతో వైద్యం చేసే భార్గవకు 5 రూపాయల డాక్టర్‌ అనే పేరు కూడా వుంటుంది. దీంతో అతనికి అభిమానులు కూడా భారీగానే వుంటారు. అభిమానుల నిరసనలు, నినాదాల మధ్య పోలీసులు భార్గవను అరెస్ట్‌ చేసి ఇంటరాగేషన్‌కి తరలిస్తారు. పోలీస్‌ ఆఫీసర్‌(సత్యరాజ్‌) ముందు కూర్చున్న భార్గవ తన ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడం ప్రారంభిస్తాడు. ఓ సెమినార్‌కి ప్యారిస్‌ వెళ్ళిన భార్గవను డాక్టర్‌ అర్జున్‌(హరీష్‌ పెరది) తమ హాస్పిటల్‌లో జాయిన్‌ అయి డబ్బు సంపాదించుకొమ్మని ఆశ చూపుతాడు. అక్కడే అర్జున్‌కి సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తాడు భార్గవ. వైద్యంతోపాటు మ్యాజిక్‌ కూడా తన హాబీ అని చెప్పే భార్గవ ప్యారిస్‌లోనే ఓ మేజిక్‌ షోలో పాల్గొంటాడు. ఆ షోలోనే అందరూ చూస్తుండగానే డాక్టర్‌ అర్జున్‌ని హత్య చేస్తాడు. డాక్టర్‌ భార్గవతోపాటు భార్గవలాగే వుండే మెజీషియన్‌ విజయ్‌(విజయ్‌) కూడా ఈ కేసులో ఇన్‌వాల్వ్‌ అయ్యాడని పోలీస్‌ ఆఫీసర్‌కి అర్థమవుతుంది. నలుగురు హాస్పిటల్‌ సిబ్బందిని కిడ్నాప్‌ చేసింది, డాక్టర్‌ అర్జున్‌ని చంపింది ఎవరు? భార్గవా? విజయా? అర్జున్‌ హత్యకు గురి కావడంతో అతని స్నేహితుడు డేనియల్‌ ఆరోగ్యరాజ్‌(ఎస్‌.జె.సూర్య) షాక్‌ అవుతాడు. పోలీస్‌ కస్టడీలో వున్న భార్గవను చూసి మరింత షాక్‌ అవుతాడు. అతన్ని చూస్తే 30 ఏళ్ళ క్రితం తను చూసిన దళపతి గుర్తొస్తాడు. ఆ నలుగురిని కిడ్నాప్‌ చెయ్యడానికి, డాక్టర్‌ అర్జున్‌ని హత్య చేయడానికి కారణాలేమిటి? డేనియల్‌కి గుర్తొచ్చిన దళపతి ఎవరు? భార్గవ, విజయ్‌ వైద్యరంగానికి చెందిన వారినే ఎందుకు టార్గెట్‌ చేశారు? ఇన్ని ఘటనలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అసలు దళపతి ఎవరు? అతన్ని చూసి డేనియల్‌ ఎందుకు షాక్‌ అయ్యాడు? చివరికి భార్గవ, విజయ్‌ ఏం సాధించారు? వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
విజయ్‌ ఒక్క పాత్ర చేస్తేనే చెలరేగి పోయే అతని అభిమానులు ప్రజెంట్‌లో రెండు క్యారెక్టర్లు, ఫ్లాష్‌ బ్యాక్‌లో మరో క్యారెక్టర్‌.. ఇలా మూడు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్లు చేస్తే వాళ్ళ ఆనందానికి హద్దేముంది? ఈ సినిమా ఫుల్‌ మీల్స్‌ కంటే ఎక్కువ అనే ఫీలింగ్‌ వారికి కలిగిందంటే దానికి అర్థముంది. అది తెలుగు ప్రేక్షకుల విషయంలో ఎలా వుంటుందనేది తెలియాలంటే కొంత సమయం పడుతుంది. డాక్టర్‌ భార్గవగా, మెజీషియన్‌ విజయ్‌గా హండ్రెడ్‌ పర్సెంట్‌ తన క్యారెక్టర్స్‌కి న్యాయం చేశాడు విజయ్‌. 30 ఏళ్ళ క్రితం దళపతిగా పూర్తి మాస్‌ క్యారెక్టర్‌లో అద్భుతంగా రాణించాడు. డాన్సులతో, ఫైట్స్‌తో, డైలాగ్స్‌తో అభిమానులను అలరించాడు. డాక్టర్‌ భార్గవని ప్రేమించే క్యారెక్టర్‌లో సమంత కాసేపు, విజయ్‌ని లవ్‌ చేసిన అమ్మాయిగా కాజల్‌ కాసేపు కనిపించి పాటలు పాడి వెళ్ళిపోతారే తప్ప వారి క్యారెక్టర్స్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. దళపతి భార్యగా నటించిన నిత్యామీనన్‌ క్యారెక్టర్‌ మాత్రం చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. సిటీకి ఎంతో దూరంలో వున్న తమ గ్రామంలో హాస్పిటల్‌ కట్టించాలన్న లక్ష్యంతో అడుగు ముందుకేసే క్యారెక్టర్‌లో నిత్యా పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంటుంది. తన స్వార్థం కోసం దళపతిని, అతని భార్యను మోసం చేసి వైద్యాన్ని వ్యాపారంగా మార్చి దళపతి కొడుకుల పగకు కారణమైన డేనియల్‌గా ఎస్‌.జె.సూర్య నటన అద్భుతం అని చెప్పాలి. పోలీస్‌ ఆఫీసర్‌గా సత్యరాజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 
టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే జి.కె.విష్ణు ఫోటోగ్రఫీ బాగుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు కథ నడిచే తీరుని బట్టి, కాలాన్ని బట్టి డిఫరెంట్‌ లైటింగ్స్‌తో కలర్‌ఫుల్‌గా చూపించాడు. రెహమాన్‌ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. మిగతా పాటల్లో పూర్తిగా తమిళ నేటివిటీ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఎక్స్‌లెంట్‌గా చేశాడు. రూబెన్‌ ఎడిటింగ్‌ బాగానే వున్నా సెకండాఫ్‌ లెంగ్త్‌ తగ్గించలేకపోయాడు. డైరెక్టర్‌ అట్లీ గురించి చెప్పాలంటే ఈ కథని విజయ్‌ కోసమే రాసుకున్నట్టు సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. వైద్యం పేరుతో జరుగుతున్న మోసాలను ఇతివృత్తంగా తీసుకొని దానికి కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి విజయ్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా అట్లీ రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేవిధంగా వుంది. యాక్సిడెంట్‌కి గురైన ఒక అమ్మాయికి వైద్యం చేసేందుకు డాక్టర్లు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారన్నది చాలా సహజంగా చూపించారు. గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ అంటే ప్రజల్లో వున్న భయమే కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే ఒకే డైలాగ్‌తో ప్రస్తుతం వున్న పరిస్థితిని చెప్పాడు అట్లీ. ఫస్ట్‌హాఫ్‌ని ఎంతో గ్రిప్పింగ్‌గా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో దళపతి ఎపిసోడ్‌ని మరీ సాగదీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి మెసేజ్‌తోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన అదిరింది హీరో విజయ్‌కి తెలుగులో మంచి బ్రేక్‌ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు. 
ఫినిషింగ్‌ టచ్‌: పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

Advertisement
CJ Advs

Adirindi movie review:

vijay new movie adirindi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs