స్రవంతి సినిమాటిక్స్
పి.ఆర్. మూవీస్
ఉన్నది ఒకటే జిందగీ
తారాగణం: రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, అనీషా ఆంబ్రోస్, శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, ఆనంద్, ప్రభు, రాజ్ మాదిరాజ్, హిమజ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్
సమర్పణ: స్రవంతి రవికిషోర్
నిర్మాత: కృష్ణ్యచైతన్య పోతినేని
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
విడుదల తేదీ: 27.10.2017
రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన నేను శైలజ మంచి విజయం సాధించి యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా థియేటర్స్‌కి రప్పించింది. ఆ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. ఆ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‌ని బేస్ చేసుకొని కథ రాసుకున్న కిషోర్ ఈ సినిమాలో స్నేహానికి పెద్ద పీట వేశాడు. ఈ చిత్రాన్ని కూడా స్రవంతి మూవీస్ సంస్థే నిర్మించింది. మరి ఈ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది? ఫ్రెండ్ షిప్ కాన్సెప్ట్ రామ్, కిషోర్ తిరుమలకు మరో హిట్‌ని అందించగలిగిందా? అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలుచుకున్నది ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన అభి(రామ్)కి స్నేహంలోని మాధుర్యాన్ని చూపిస్తాడు వాసు(శ్రీవిష్ణు). ఒకరిని వదిలి ఒకరు వుండలేనంత గాఢమైన స్నేహం వారిద్దరిది. తన స్నేహంతో అభికి తల్లిలేని లోటును తెలీకుండా చేస్తాడు వాసు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కట్ చేస్తే ఇటలీలోని మిలాన్‌లో పెరిగిన గడ్డంతో అభిగా హీరో రామ్ ప్రత్యక్షమవుతాడు. అక్కడ వున్న ఓ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమను తిరస్కరిస్తాడు అభి. అలా ఎందుకు చేశాడు? కట్‌చేస్తే ఫ్లాష్‌బ్యాక్... అభి, వాసులతోపాటు మరో ముగ్గురు ఫ్రెండ్స్ వుంటారు. కబుర్లు చెప్పుకుంటూ మందు కొడుతూ కాలక్షేపం చేసే బ్యాచ్. అభికి యాక్సిడెంటల్‌గా మహా(అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. అభి అభిరుచులు, అలవాట్లు, మంచితనం ఆమెను బాగా ఆకట్టుకుంటాయి. మహా కూడా తన మనసుకు బాగా దగ్గరగా వుందని ఫీల్ అవుతాడు అభి. అలా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒక ఫైన్ మార్నింగ్ మహాకి ప్రపోజ్ చెయ్యాలనుకుంటాడు అభి. అప్పుడే తన ఫ్రెండ్ వాసు వల్ల ఒక విషయం తెలుసుకుంటాడు. దానివల్ల ఇద్దరు స్నేహితుల మధ్య మనస్పర్థలు వస్తాయి. అభి ఎవ్వరికీ చెప్పకుండా ఇటలీ వెళ్ళిపోతాడు. నాలుగు సంవత్సరాల తర్వాత ఓ వార్త అతన్ని మళ్ళీ ఇండియాకి రప్పిస్తుంది. స్నేహానికి ప్రాణమివ్వడానికి కూడా వెనుకాడని ఆ ఇద్దరు స్నేహితులు విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అభి హఠాత్తుగా ఇండియా ఎందుకు వచ్చాడు? ఆ ఇద్దరు స్నేహితుల ఆపార్థాల నీడలు తొలగిపోయాయా? చివరికి కథ సుఖాంతమైందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. ఇందులో ప్రేమకథ కూడా వున్నా దాన్ని స్నేహం డామినేట్ చేసింది. ఎంత డామినేట్ చేసిందంటే ప్రపంచంలో స్నేహాన్ని మించింది మరేదీ లేదు అని చెప్పేంత. స్నేహంలోని గొప్పతనం, స్నేహానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వంటి విషయాల్లోకి డైరెక్టర్ లోతుగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ, దాన్ని ఎమోషనల్‌గా క్యారీ చెయ్యలేకపోయాడు. టీనేజ్ పిల్లల్లో వుండే స్నేహం వేరు, పాతిక, ముప్పై సంవత్సరాల యువకుల మధ్య వుండే స్నేహం వేరు. అభిగా రామ్ గడ్డంతో చాలా కొత్తగా కనిపించాడు. వాసుగా శ్రీవిష్ణుకి మంచి పాత్ర లభించింది. రామ్ మంచి నటుడే అయినా తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసే అవకాశం దర్శకుడు ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఇక శ్రీవిష్ణు ఏ సీన్‌లోనైనా తన మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కనబడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అది హ్యాపీ మూడ్ అయినా, సెంటిమెంట్ సీన్ అయినా ఒకే ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ తన అనుభవాన్ని దాచేసుకున్నాడు. సెకండాఫ్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించే లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేషన్ చాలా అసహజంగా అనిపిస్తుంది. మత్తులో ఓ హీరోకి ముద్దు పెడుతుంది. మత్తులో లేకపోయినా మరో హీరోకి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగేస్తుంది. కారణం లేకుండానే హీరోతో లవ్‌లో పడిపోతుంది. లుక్ పరంగా లావణ్య ఈ సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించింది. ఇక ఆమె పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రియదర్శి అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశాడు. అన్నింటికంటే అనుపమ పరమేశ్వరన్ పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన క్యారెక్టర్‌కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది. సినిమాకి మెయిన్ ప్లస్ ఎవరు అంటే ఫస్ట్‌హాఫ్‌లో కనిపించే అనుపమ. లుక్ పరంగా, గ్లామర్ పరంగా అందర్నీ ఆకట్టుకుంది అనుపమ. ఆమెకు వాడిన కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.
సాంకేతికంగా ముందుగా చెప్పుకోవాల్సింది సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ గురించి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించాడు. అనుపమ పరమేశ్వరన్‌ను మరింత గ్లామర్‌గా చూపించాడు. నేను శైలజ చిత్రాన్ని మ్యూజికల్‌గా పెద్ద హిట్ చేసిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాలోని పాటలపై అంత శ్రద్ధ పుట్టలేదేమో అనిపిస్తుంది. ట్రెండు మారినా, వాటమ్మా వాట్ ఈజ్ దిస్సమ్మా అనే పాటలు బాగున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. కొన్నిచోట్ల ఇంతకుముందు దేవి చేసిన సినిమాల్లోని మ్యూజిక్ వినిపించింది. ఎడిటర్ శ్రీకర్‌ప్రసాద్ ఇంకా కత్తెరకి పనిచెప్పొచ్చు. డైరెక్టర్ కిషోర్ తిరుమల గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం చేసుకున్న కథలో మంచి విషయం ఉన్నప్పటికీ, కథనంలో ఆకట్టుకోలేకపోయాడు. స్నేహం మీద మంచి డైలాగ్స్ చెప్పించాడు కానీ, రిపీట్ గా అవే అవే చేయించడంతో బాగున్నా డైలాగ్స్ కూడా నార్మల్ గా అనిపిస్తాయి. స్నేహం నేపథ్యంలో నడిచే ఈ సినిమాతో కిషోర్ తిరుమల ఏం చెప్పదలుచుకున్నాడో అది సూటిగా చెప్పేస్తే బాగుండేది. అనవసర సీన్స్ తో కథని సాగదీశాడు. ఫస్ట్‌హాఫ్‌ని ఎంతో గ్రిప్పింగ్‌గా నడపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి అసలు కథను పక్కనపెట్టి వెడ్టింగ్ ప్లానర్ లావణ్య త్రిపాఠిని హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. ఉన్నది ఒకటే జిందగీ ఒక బలమైన కథ, కథనాలతో, మాటలతో అందరికీ కనెక్ట్ అయ్యేలా తియ్యాలని కిషోర్ చేసిన విశ్వప్రయత్నం మంచిదే కానీ, కనెక్షన్ విషయంలోనే కనెక్ట్ చేయలేకపోయాడు. ఫైనల్‌గా చెప్పాలంటే స్నేహం కోసం ప్రాణాలిచ్చే స్నేహితులకి ఇది చాలా బాగా నచ్చుతుంది. స్నేహాన్ని కూడా యూజ్ అండ్ త్రో గా చూసేవారికి మాత్రం ఈ సినిమా రుచింపదు.
ఫినిషింగ్ టచ్: వాట్ అమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా!