'రాజా ది గ్రేట్'
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: రవితేజ, మెహరీన్, రాధిక, ప్రకాష్‌రాజ్, సంపత్‌రాజ్, వివన్ భాటేన, శ్రీనివాసరెడ్డి, పోసాని, రాజేంద్రప్రసాద్, మాస్టర్ మహాధన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మోహనకృష్ణ
సంగీతం: సాయికార్తీక్
ఎడిటింగ్: తమ్మిరాజు
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాత: శిరీష్
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: 18.10.2017
రవితేజ అంటే మాస్.. మాస్ అంటే రవితేజ. ఈమధ్య చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాడు. పటాస్, సుప్రీమ్ వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో సూపర్‌హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన రాజా ది గ్రేట్ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి ఒక కొత్త ఎలిమెంట్‌ని జతచేసి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాడు అనిల్ రావిపూడి. మరి ఆ కొత్త ఎలిమెంట్ ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది? గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఎప్పటిలాగే తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యగలిగాడా? మొదటి రెండు సినిమాలు కమర్షియల్‌గా హిట్ చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు రాజా(రవితేజ). పుట్టుకతోనే అంధుడు. రాజా తల్లి అనంతలక్ష్మీ(రాధిక). కొడుకు అంధుడు కావడంతో భర్త కూడా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోని అనంతలక్ష్మీ కొడుకుని తన శిక్షణతో అన్నింటిలోనూ రాటుదేలేలా చేస్తుంది. చిన్నతనం నుంచి రాజాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఎలాంటి సమస్యనైనా, పరిస్థితినైనా ఎదుర్కొనే గుండె ధైర్యాన్నిస్తుంది. ఆమె కోరిక ఒకటే. కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. కానీ, దానికి రూల్స్ ఒప్పుకోవన్న విషయం ఆమెకీ తెలుసు. అయినా తన ప్రయత్నం మాత్రం మానదు. ఏదైనా పోలీస్ ఆపరేషన్‌లో పార్టిసిపేట్ చేసేలా చూడమని ఐ.జి.ని రిక్వెస్ట్ చేస్తుంది. ఓ అమ్మాయి ప్రాణాలు రక్షించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ చేస్తున్న ఆపరేషన్‌లో ఎక్స్‌ట్రా పర్సన్‌గా రాజాని సెలెక్ట్ చేస్తారు. అతనితోపాటు అతని స్నేహితుడు(శ్రీనివాసరెడ్డి) కూడా ఆ ఆపరేషన్ బృందంతో బయల్దేరతాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు ఎవరి నుంచి ప్రాణ భయం వుంది? శుత్రువు బారి నుంచి రాజా ఆ అమ్మాయిని కాపాడగలిగాడా? టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథగా చెప్పుకుంటే ఇందులో ఒక శాతం కూడా కొత్త దనం లేదు. హీరో అంధుడు అనే ఒకే ఒక్క పాయింట్.. కథ పాతదైనా సినిమా చూసేలా చేస్తుంది. ఆపదలో వున్న హీరోయిన్‌ని.. హీరో కాపాడే కథలు తెలుగులో కోకొల్లలుగా వచ్చాయి. అందులో ఇదీ ఒకటి తప్ప కథలో ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే కథ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు దర్శకుడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్ లెవల్స్‌ని బాగా మెయిన్‌టెయిన్ చేశాడు. అన్నీ చేస్తూనే నాకు కనపడదు అంటూ రవితేజ చెప్పే డైలాగ్, ముఖచిత్రం ఎలా వుంది అంటూ రవితేజ పదే పదే అడిగే డైలాగ్, ఇట్స్ లాఫింగ్ టైమ్ అంటూ సిట్యుయేషనల్‌గా వచ్చే డైలాగ్స్ ఆడియన్స్‌ని బాగా నవ్విస్తాయి. ఐ యామ్ బ్లైండ్. బట్, ఐ యామ్ ట్రైన్డ్ అంటూ రవితేజ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ ఆడియన్స్‌ని ఉత్సాహపరుస్తుంది. రాజా క్యారెక్టర్‌లో రవితేజ జీవించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి సీన్‌లోనూ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఇరగదీశాడని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గకుండా డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ తన స్పీడ్‌ని చూపించాడు రవితేజ. కథ పరంగా, కథనం పరంగా, రాజా క్యారెక్టరైజేషన్ పరంగా కొన్ని లాజిక్‌లు మిస్ అయినప్పటికీ వాటిని టేకిట్ ఈజీగా తీసుకుంటే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. లక్కీగా మెహరీన్ పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదు అనిపించింది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రాజా తల్లిగా రాధిక చేసిన ఎమోషనల్ పెర్‌ఫార్మెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దేవుడ్ని అడిగాను అంటూ కూతురు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రిగా ప్రకాష్‌రాజ్ మరోసారి తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హీరో చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌కి శ్రీనివాసరెడ్డి తన ఫుల్ సపోర్ట్ అందించాడు. రాజేంద్రప్రసాద్ కనిపించిన కాసేపు తన స్టైల్‌లో ప్రేక్షకుల్ని నవ్వించాడు. హీరో చిన్నప్పటి క్యారెక్టర్‌లో కనిపించిన రవితేజ తనయుడు మహాధన్ అంధుడిగా బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అందించాడు. మొదటి సినిమా అయినా ఆ ఫీల్ రాకుండా తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే మోహనకృష్ణ ఫోటోగ్రఫీ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా డార్జిలింగ్ అందాలు, పాటల చిత్రీకరణ కళ్ళకు ఇంపుగా అనిపించాయి. సాయికార్తీక్ చేసిన పాటలు రెండు ఆకట్టుకున్నాయి. ఎప్పటిలాగే తనదైన స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే రెండున్నర గంటల సినిమాలో ఈజీగా 10 నిముషాల అనవసరమైన సన్నివేశాల్ని తొలగించవచ్చు. వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే అతను రాసుకున్న కథలో కొత్తదనం లేదు. కానీ, అంధుడు అనే ఎలిమెంట్ సినిమాకి ప్లస్ అయింది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో సింపతిని గెయిన్ చేసే సీన్స్ చాలా వుంటాయి. కానీ, ఈ సినిమాలో అలాంటి ఒక్క సీన్ కూడా పెట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో క్యారెక్టర్‌తో కామెడీ చేయించడానికే ఎక్కువ ప్రయత్నం చేశాడు. హీరో చేసే ఫైట్స్‌గానీ, విలన్‌ని ఛాలెంజ్ చేసి హీరో గెలవడం వంటి సీన్స్ ప్రేక్షకులు ఆలోచనలో పడేలా చేశాయి. కాకపోతే నెక్స్‌ట్ ఏం జరగబోతోంది? హీరో ప్లాన్ ఏమిటి? అనేది ముందుగా ఊహించే అవసరం రానివ్వలేదు. అనిల్ రాసిన మాటలు కూడా బాగా పేలాయి. కొన్ని కామెడీ సీన్స్‌లో చెప్పించిన డైలాగ్స్ ప్రేక్షకులు పడి పడి నవ్వుకునేలా వున్నాయి. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోయాను, కళ్ళు లేకపోయినా చేతికి వాచ్ ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే నాకు సోకెక్కువ వంటి డైలాగ్స్ కొత్తగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్, కామెడీ, థ్రిల్ చేసే ఫైట్‌తో ఫస్ట్‌హాఫ్ బాగుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ ముందుకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో అనవసరమైన సీన్స్ అవసరం ఏర్పడింది. దాంతో ఎక్కడి కథ అక్కడే ఆగిపోయింది. మాటి మాటికీ విలన్‌కి హీరో ఛాలెంజ్ విసురురతాడు. ఇద్దరూ ఎదురుపడినా అక్కడితో కథ ఎండ్ అవ్వదు. అలా ఎప్పటికీ కథ క్లైమాక్స్‌కి రాదు. ఒక దశలో సినిమా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో మళ్ళీ ఓ పాటతో మొదటికి వస్తుంది. ఇలా సెకండాఫ్‌లో రిపీటెడ్ సీన్స్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. అయితే మధ్య మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ వల్ల కాస్త రిలాక్స్ అయ్యేలా చేశాడు. రవితేజ పెర్‌ఫార్మెన్స్, కామెడీ, కొన్ని ఎమోషనల్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థ్రిల్ చేసే ఫైట్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్ళకపోవడం, మళ్ళీ మళ్ళీ క్లైమాక్స్ రావడం, లాజిక్ మిస్ అయిన కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రవితేజ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆద్యంతం నవ్వులు పూయించే రాజా ది గ్రేట్ ఈ దీపావళికి మంచి కాలక్షేపాన్ని ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు.
ఫినిషింగ్ టచ్: రవితేజ ది గ్రేట్
Advertisement
CJ Advs
raviteja new movie raja the great directed by anil ravipudi