Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: మహానుభావుడు


యు.వి.క్రియేషన్స్‌ 

Advertisement
CJ Advs

మహానుభావుడు 

తారాగణం: శర్వానంద్‌, మెహరీన్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, భద్రం, నల్లవేణు, రామరాజు తదితరులు 

సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫి 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌ 

రచన, దర్శకత్వం: మారుతి 

విడుదల తేదీ: 29.09.2017 

ఒక సినిమా ఆకట్టుకోవాలన్నా, మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెట్టాలన్నా వుండాల్సిన ప్రధాన ఆయుధం కథ. ఆ కథకి ప్రేక్షకుల్ని కనెక్ట్‌ చేసే కథనం రాసుకోవడంలోనే దర్శకుడి అసలు ప్రతిభ బయటపడుతుంది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించే ఎలిమెంట్స్‌ వుండాలి. ఒక సంవత్సరంలో అలా వచ్చిన సినిమాలను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఈ సంవత్సరం రెండు, మూడు సినిమాలు మాత్రమే ఆ స్థాయిలో వున్నాయి. సగటు ప్రేక్షకులు కోరుకునేది వినోదం. అది ఏ రూపంలో అందించినా సినిమాని విజయవంతం చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. అలా వినోద ప్రధానంగా, కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే రూపొందించిన సినిమా ఈ శుక్రవారం విడుదలైన మహానుభావుడు. భలేభలే మగాడివోయ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శర్వానంద్‌ హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. భలే భలే మగాడివోయ్‌ చిత్రంలో మతిమరుపు అనే ఎలిమెంట్‌ని తీసుకొని ఆసక్తికరమైన కథ, కథనాలతో ఆద్యంతం నవ్వులు పూయించిన మారుతి మహానుభావుడు చిత్రం కోసం ఎంచుకున్న ఎలిమెంట్‌ ఏమిటి? అదే స్థాయిలో మరోసారి ప్రేక్షకుల్ని నవ్వించడంలో మారుతి సక్సెస్‌ అయ్యాడా? హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన శర్వానంద్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అవుతుంది? డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న యు.వి. క్రియేషన్స్‌కి ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ని అందిస్తుందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మారుతి చేసిన భలే భలే మగాడివోయ్‌ చిత్రానికి, ఈ చిత్రానికి చాలా దగ్గరి పోలికలు వున్నాయి. ఆ సినిమాలో హీరో మతిమరుపు అనే డిజార్డర్‌ కలిగి వుంటాడు. ఈ సినిమాలో హీరో ఓసిడి(అబ్‌సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌)తో బాధపడుతుంటాడు. ఓసిడిలో చాలా రకాలు వున్నా మన హీరో మాత్రం అతి శుభ్రత అనే డిజార్డర్‌ కలిగి వుంటాడు. అతి శుభ్రతతో తన చుట్టూ వున్నవారిని ఇబ్బంది పెడతాడు, వారి కోపానికి కారణమవుతాడు. కథ విషయానికి వస్తే ఆనంద్‌(శర్వానంద్‌) ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ప్రతీదీ శుభ్రంగా వుండాలనుకుంటాడు. తన ముందు ఒక బైక్‌ దుమ్ము పట్టి వుందంటే మెంటల్‌గా డిస్ట్రబ్‌ అవుతాడు. ఆ బైక్‌ తనది కాకపోయినా కడిగి శుభ్రం చేయడానికి వెనకాడడు. ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి కూడా ఒప్పుకోడు. ఆఖరికి తన తల్లి చేతి ముద్ద తినడానికి కూడా ఇష్టపడడు. వంటగది నుంచి వచ్చిన తల్లి చేతిలో ఏవైనా క్రిములు వుంటాయేమోనని భయం. ఇలాంటి విచిత్రమైన ప్రవర్తన కలిగిన ఆనంద్‌ తన ఆఫీస్‌లోనే పనిచేసే మేఘన(మెహరీన్‌)ని ఇష్టపడతాడు. ఎందుకంటే ఆమె కూడా శుభ్రతకు ప్రాధాన్యమిచే అమ్మాయి. అలా వారి మధ్య పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఆనంద్‌ గురించి తన తండ్రి రామరాజు(నాజర్‌)కి చెబుతుంది మేఘన. ఓరోజు ఆనంద్‌ని కలుసుకోవడానికి సిటీకి వస్తాడు రామరాజు. అతని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతాడు. అతన్ని తన అల్లుడుగా ఒప్పుకోడు. చివరికి తండ్రిని ఒప్పిస్తుంది మేఘన. ఆరోజే ఆనంద్‌ని డిన్నర్‌కి పిలుస్తారు తండ్రీకూతుళ్ళు. అక్కడ జరిగిన ఓ అనూహ్యమైన ఘటన మేఘన... ఆనంద్‌ని అసహ్యించుకునేలా చేస్తుంది. పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్న మేఘన మనసు విరిగిపోవడానికి కారణం ఏమిటి? ఇద్దరూ విడిపోవడానికి దారి తీసిన ఆ ఘటన ఏమిటి? మేఘనను ఎంతగానో ఇష్టపడే ఆనంద్‌ తను చేసిన తప్పుని సరిదిద్దుకోగలిగాడా? రామరాజు..., ఆనంద్‌ని అల్లుడుగా అంగీకరించాడా? మేఘనను ప్రసన్నం చేసుకోవడానికి ఆనంద్‌ ఏం చేశాడు? అనేది మిగతా కథ. 

ఓసీడీతో తను ఇబ్బంది పడడమే కాకుండా అందర్నీ ఇబ్బంది పెట్టే క్యారెక్టర్‌లో శర్వానంద్‌ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించడంలో సక్సెస్‌ అయ్యాడు. అలాగే కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో, సెంటిమెంట్‌ సీన్స్‌లో కూడా మెప్పించాడు. మెహరీన్‌ గ్లామర్‌ సినిమాకి చాలా ప్లస్‌ అయింది. నటనకు స్కోప్‌ వున్న ఆ క్యారెక్టర్‌కి మెహరీన్‌ పూర్తి న్యాయం చేసింది. వెన్నెల కిషోర్‌ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వించాడు. ఫస్ట్‌హాఫ్‌లో కనిపించే నల్లవేణు కూడా వున్న కాసేపు ఎంటర్‌టైన్‌ చేశాడు. జిడ్డేష్‌ క్యారెక్టర్‌ చేసిన భద్రం కూడా నవ్వించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. నాజర్‌ చేసిన తండ్రి క్యారెక్టర్‌ రొటీన్‌గా వుంటుంది. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే నిజార్‌ షఫీ ఫోటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌ అయింది. భలే భలే మగాడివోయ్‌ తర్వాత మారుతి కాంబినేషన్‌లో నిజార్‌ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌, ప్రతి షాట్‌ ఎంతో రిచ్‌గా చూపించడంలో నిజార్‌ ప్రతిభ కనిపించింది. అలాగే పాటల్ని కూడా ఎంతో అందంగా చిత్రీకరించాడు. నిజార్‌ ఫోటోగ్రఫీ వల్ల మెహరీన్‌ మరింత అందంగా కనిపించింది. థమన్‌ చేసిన పాటలన్నీ బాగున్నాయి. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ని ఎలివేట్‌ చేస్తూ థమన్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ కూడా బాగానే వుంది. అయితే రెండున్నర గంటల సినిమాని ఓ పది నిముషాలు తగ్గించి వుంటే మరింత స్పీడ్‌గా వుండేది. సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ని తొలగించే అవకాశం వున్నా ఆ ప్రయత్నం చెయ్యలేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చిత్రాన్ని రిచ్‌గా నిర్మించారు వంశీ, ప్రమోద్‌. డైరెక్టర్‌ మారుతి విషయానికి వస్తే భలే భలే మగాడివోయ్‌ విజయం తర్వాత బాబు బంగారంతో పరాజయాన్ని చవి చూశాడు. అలాగే శతమానం భవతి తర్వాత శర్వానంద్‌ చేసిన రాధ ఫ్లాప్‌ అయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మహానుభావుడు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని సక్సెస్‌ వైపు అడుగులు వేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతవరకు తెలుగులో ఎవరూ టచ్‌ చేయని ఓసీడీ అనే పాయింట్‌ని తీసుకొని దాన్ని మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో మారుతి కొంతవరకు సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌హాఫ్‌ని తీసినంత గ్రిప్పింగ్‌గా సెకండాఫ్‌ని చెయ్యలేకపోయాడు. సినిమా స్టార్ట్‌ అయిన పావుగంటలోనే హీరో.... హీరోయిన్‌ ఊరికి వెళతాడని, అక్కడ కుస్తీ పోటీల్లో పాల్గొంటాడని సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమైపోతుంది. అలాగే సినిమాలోని సీన్స్‌లో నెక్స్‌ట్‌ ఏం జరగబోతుందనేది కూడా తెలిసిపోతుంది. సిటీలో సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌ నుంచి సెకండాఫ్‌లో ఒక్కసారిగా పల్లెటూరికి వెళ్ళిపోవడం వరకు బాగానే వున్నా.. అక్కడ తీసిన కొన్ని సీన్స్‌లో లాజిక్‌ అనేది కనిపించదు. పల్లెటూరు అయినప్పటికీ ఒక ఉన్నత కుటుంబానికి బాత్‌రూమ్‌లు కూడా లేవని, ఆరు బయటే స్నానం చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అలాగే కుస్తీ పోటీల్లో విజేతలైన వారి గ్రామపెద్దని సర్పంచ్‌గా ఎన్నుకోవడం అనేది ఇప్పుడు మనం ఎక్కడా చూడం. సినిమాలోని మరో మైనస్‌ పాయింట్‌ ఏమిటంటే ఓసీడీతో బాధపడుతున్న హీరో ప్రేమలో పడతాడు, ఆమె ప్రేమ కోసం పల్లెటూరు వెళతాడు, మధ్యలో ఎన్నో సీన్స్‌ జరుగుతాయి. కానీ, అతనిలో కాస్త కూడా మార్పు రాదు. క్లైమాక్స్‌లో హీరోయిన్‌ ప్రేమ కోసం ఒక్కసారిగా మారిపోయి మట్టిలో కుస్తీ పోటీలకు దిగుతాడు. అందులో విజయం సాధించి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. అతనిలోని మార్పుని అంచెలంచెలుగా చూపించి వుంటే బాగుండేది. తన కొడుకు తనలా కాకూడదని భావించిన హీరో అందరు పిల్లల్లాగే వర్షంలో తడుస్తూ అందరితో కలిసిపోవాలని చేసిన ప్రయత్నం బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్యకాలంలో యాక్షన్‌ సినిమాలతో, ఎక్స్‌పెరిమెంట్‌ మూవీస్‌తో విసిగి వేసారిన ప్రేక్షకులకు మహానుభావుడు మంచి రిలీఫ్‌నిస్తుంది. కొన్ని లాజిక్‌ మిస్‌ అయిన సీన్స్‌, ప్రస్తుత ట్రెండ్‌కి అనుగుణంగా లేని సీన్స్‌ వున్నప్పటికీ ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేయవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

telugu movie mahanuvbhavudu review:

telugu movie mahanubhavudu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs