Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: స్పైడర్‌

telugu movie spyder,spyder movie review,telugu movie spyder review in cinejosh,spyder movie cinejosh review,mahesh new movie spyder,murugadoss movie spyder | సినీజోష్‌ రివ్యూ: స్పైడర్‌

ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
స్పైడర్‌ 
తారాగణం: మహేష్‌, రకుల్‌ప్రీత్‌, ఎస్‌.జె.సూర్య, భరత్‌, ప్రియదర్శి, జయప్రకాష్‌, నాగినీడు తదితరులు 
సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ 
సంగీతం: హేరిస్‌ జయరాజ్‌ 
ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌ 
సమర్పణ: ఠాగూర్‌ మధు 
నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌ 
రచన, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌ 
విడుదల తేదీ: 27.09.2017 
ప్రతి మనిషిలోనూ సహజంగా నాలుగు శాతం శాడిజం వుంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయట పడుతూ వుంటుంది. ఒక మనిషిలో 15 శాతం శాడిజం లక్షణాలు వున్నాయంటే అతని ప్రవర్తన ఏ స్థాయిలో వుంటుంది? అతని శాడిజాన్ని శాటిస్‌ఫై చేసే విషయాలు ఎలా వుండాలి? ఎదుటి మనిషి ఏడిస్తే ఆనందపడతాడు. ఒక మనిషి చనిపోతే వారి బంధువుల ఏడుపులు అతనికి సంతోషాన్ని కలిగిస్తాయి. తన సంతోషం కోసం మనుషుల్ని చంపి వారి బంధువులు బాధపడుతుంటే తృప్తి పడే వ్యక్తిత్వం వున్న ఓ శాడిస్ట్‌ భైరవుడు(ఎస్‌.జె.సూర్య). ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఆఫీసర్‌గా పనిచేసే శివ(మహేష్‌)కి సామాజిక స్పృహ ఎక్కువ. కాల్‌ ట్యాపింగ్‌ ద్వారా ఎవరైనా సమస్యల్లో వుంటే వారికి సహాయం చేయడం అతని ప్రవృత్తి. దాని కోసం తనే కొత్త సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టి నేరాలు జరగడానికి ముందే పసిగట్టి వాటిని ఆపుతుంటాడు. శాడిస్ట్‌ అయిన భైరవుడు వరసగా హత్యలు చేస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఎవరికీ కనిపించకుండా, పోలీసులకు దొరక్కుండా తన శాడిజాన్ని ప్రదర్శిస్తుంటాడు. భైరవుడ్ని పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు శివ. దాని కోసం ఎంత రిస్కయినా చెయ్యడానికి సిద్ధపడతాడు. ఈ ఆపరేషన్‌లో శివ సక్సెస్‌ అయ్యాడా? భైరవుడ్ని మట్టుపెట్టాడా? అనేది కథ. 
కమర్షియల్‌ సినిమాలోనూ అంతర్లీనంగా సందేశాన్నిస్తూ సినిమాలు రూపొందించే మురుగదాస్‌ గజిని, తుపాకి వంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. అతని సినిమాలు తెలుగులోనూ ఘనవిజయాలు సాధించాయి. విభిన్న కథాంశాలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపించే మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలకు అంతేముంది? ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ నెలకొంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో స్పైడర్‌ చిత్రం రూపొందబోతోందన్న వార్త వచ్చిన క్షణం నుంచి సినిమాపై ఊహాగానాలు ఆకాశాన్నంటాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా వుంటుందని, మహేష్‌కి మరో బ్లాక్‌బస్టర్‌ ఖాయమని అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. పైగా మహేష్‌ తమిళ రంగంలోకి ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వడం కూడా మరో విశేషంగా చెప్పుకోవచ్చు. సంతోష్‌ శివన్‌ ఫోటోగ్రఫీ చేయడం ఈ ప్రాజెక్ట్‌కి మరింత వన్నె తెచ్చింది. మరి ఈ కాంబినేషన్‌ అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యిందా? అంటే.. లేదనే చెప్పాలి. మురుగదాస్‌ నుంచి ఇలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదనేది అందరి అభిప్రాయం. మానవత్వం అనేది నశించిపోతోందని, పెద్ద ఉపద్రవాలు వచ్చినపుడు తప్ప పక్కనుంచి వెళ్ళే మనిషిని కూడా పట్టించుకోనంత మెకానికల్‌ లైఫ్‌ని ప్రజలు గడుపుతున్నారని చెప్పుకొచ్చారు. తమకు పరిచయం లేని వ్యక్తికి సహాయం చేయడం కంటే మించిన ఆనందం మరొకటి వుండదన్నది ఈ సినిమాలో హీరో ఆలోచన. తన తెలివి తేటలతో నేరాలు జరగకుండా ఎంతో మందిని కాపాడిన శివ.. భైరవుడ్ని అడ్డుకోలేకపోతాడు. ఓ పెద్ద బండరాయి రోడ్డు మీద దొర్లేట్టు చేస్తాడు భైరవుడు. కానీ, ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాత, మరెన్నో వాహనాలు ధ్వంసం అయిన తర్వాతగానీ దాన్ని ఆపలేకపోతాడు. ఆ తర్వాత భైరవుడు ఒక పెద్ద హాస్పిటల్‌ని నేలమట్టం చేయబోతున్నాడని తెలిసినా ఎంతో ప్రాణ నష్టం జరిగిన తర్వాతే అతన్ని చంపుతాడు. క్లైమాక్స్‌లో విలన్‌ని చంపేసినా ఎక్కువసార్లు అతనిదే పైచేయిగా కనిపిస్తుంది. ఐబి ఆఫీసర్‌గా మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. ప్రతి ఎమోషన్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ క్యారీ చేశాడు. ఇక విలన్‌గా చేసిన ఎస్‌.జె.సూర్య తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ కేవలం కొన్ని లవ్‌ సీన్స్‌ కోసం, పాటల కోసం అన్నట్టుగా అప్పుడప్పుడు కనిపిస్తుంది. భైరవుడి తమ్ముడిగా భరత్‌ వున్నంతలో బాగానే చేశాడు. ఇక సినిమాలో మిగతా క్యారెక్టర్ల గురించి పోషించిన ఆర్టిస్టుల గురించి చెప్పుకునేంత లేదు. 
టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తీసిన ఈ సినిమాకి సంతోష్‌ శివన్‌ ఫోటోగ్రఫీ చాలా ప్లస్‌ అయింది. ప్రతి సీన్‌ని ఎంతో గ్రాండియర్‌గా తియ్యడంలో సంతోష్‌ ప్రతిభ కనిపిస్తుంది. మురుగదాస్‌ చేసిన చాలా సినిమాలను మ్యూజికల్‌గా సూపర్‌హిట్‌ చేసిన హేరిస్‌ జయరాజ్‌ ఈ సినిమాలోని పాటలతో నిరుత్సాహపరిచాడనే చెప్పాలి. బూమ్‌ బూమ్‌ సాంగ్‌, స్పైడర్‌ థీమ్‌ మ్యూజిక్‌ తప్ప చెప్పుకునే పాటలు లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ అద్భుతంగా చేశాడు. శ్రీకర్‌ప్రసాద్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు అన్‌కాంప్రమైజ్డ్‌ మేకింగ్‌ ప్రతి సీన్‌లో కనిపించింది. డైరెక్టర్‌ మురుగదాస్‌ గురించి చెప్పాలంటే అతను ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్‌ మంచిదే అయినా దాన్ని ఎగ్జిక్యూట్‌ చెయ్యడంలో, ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. టేకాఫ్‌ బాగానే వున్నా భైరవుడి కోసం శివ ట్రైన్‌లో బయల్దేరి, ఆ తర్వాత సైకిల్‌పై వెళ్ళి స్మశానంలో ఓ పెద్దాయన్ని కలుసుకోవడం, అక్కడ భైరవుడి ఫ్లాష్‌బ్యాక్‌ గురించి తెలుసుకోవడం.. ఇదంతా వేరే సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. బోర్‌ కొడుతుంది కూడా. తన తమ్ముడ్ని పట్టుకున్న శివకు వార్నింగ్‌ ఇస్తూ టి.వి.లో ముసుగుతో కనిపించే భైరవుడు మెట్రో బ్రిడ్జి పిల్లర్స్‌లో శవాలున్నట్టు చెప్పడం, భైరవుడి తమ్ముడ్ని అతని కళ్ళముందే చంపడంతో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరో, విలన్‌ మధ్య తీవ్రమైన ఫైట్‌ వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేసిన ఆడియన్స్‌కి నిరాశే ఎదురవుతుంది. ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ కాకపోయినా సైకలాజికల్‌గా దెబ్బ తియ్యగల భైరవుడు ఎక్కడ వున్నాడో తెలుసుకున్న శివ అతన్ని పట్టుకోవడానికి టి.వి. సీరియల్స్‌ చూసే నలుగురు లేడీస్‌ని సెలెక్ట్‌ చేసుకుంటాడు. వారితో గోడలు ఎక్కిస్తాడు, జంప్‌ చేయిస్తాడు. చివరికి భైరవుడి ఆధీనంలో వున్న కొంతమందిని రక్షిస్తాడు, భైరవుడ్ని అరెస్ట్‌ చేయిస్తాడు. ఈ సీన్‌ చూసిన సగటు ప్రేక్షకుడికి వచ్చే సందేహం ఒక్కటే.. విలన్‌ ఎక్కడ వున్నాడో హీరోకి తెలుసు. అలాంటప్పుడు పోలీసులతో ఆ రిస్క్‌ చేయించి భైరవుడ్ని పట్టుకోవచ్చు కదా. లేడీస్‌ని ఇన్‌వాల్వ్‌ చేసి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చెయ్యాల్సిన అవసరం ఏమిటి? ఎంతో మంది చావుకు కారణమైన భైరవుడ్ని ఒక సాధారణ ఫైట్‌తోనే అంతం చేయడంతో క్లైమాక్స్‌ తేలిపోయింది. డిఫరెంట్‌ పాయింట్‌ని తీసుకొని, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమాని మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన క్లైమాక్స్‌తో ఎండ్‌ చేయడం సబబుగా అనిపించదు. సినిమా మొదలైన నిముషం నుంచి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌కి ఎక్కడా రిలీఫ్‌ కనిపించదు. కామెడీ అనేది సినిమాలో ఎక్కడా లేదు. మధ్యలో హీరోయిన్‌ వచ్చి పాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అది ఏమాత్రం వర్కవుట్‌ అవ్వలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్‌ సినిమా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తీసిన సినిమా కావడం వల్ల ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ స్ట్రాంగ్‌గా వున్నా దాన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్ళగలిగే స్టామినా కథ, కథనాల్లో లేదు. కాబట్టి దసరా సీజన్‌, మహేష్‌ అభిమానులు ఈ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్ళే అవకాశం వుంది. 
ఫినిషింగ్‌ టచ్‌: మహేష్‌కి మరో డిఫరెంట్‌ మూవీ!

Advertisement
CJ Advs

telugu movie spyder review:

mahesh new movie spyder
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs