సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నేనే రాజు నేనే మంత్రి
తారాగణం: రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెస, నవదీప్, అశుతోష్ రాణా, శివాజీరాజా, తనికెళ్ళ భరణి, అజయ్, జయప్రకాష్‌రెడ్డి, ప్రదీప్ రావత్, పోసాని, సత్యప్రకాష్, రఘు కారుమంచి తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి. దిలీప్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సమర్పణ: డి.సురేష్‌బాబు
నిర్మాతలు: కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి
రచన, దర్శకత్వం: తేజ
విడుదల తేదీ: 11.08.2017
యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా నిర్మాణం జరుపుకుంటున్న సమయంలో ఉషాకిరణ్ మూవీస్ బేనర్‌లో చిత్రం పేరుతో ఓ సినిమా వచ్చింది. తెలుగు సినిమా తెలుగు సినిమా రూటు మార్చిన సినిమా అది. దర్శకనిర్మాతల దృష్టి, ప్రేక్షకుల దృష్టి ప్రేమకథా చిత్రాలవైపు మళ్ళిందంటే ఆ ఘనత ఖచ్చితంగా తేజకు దక్కుతుంది. చిత్రం తర్వాత ప్రేమకథా చిత్రాల ఒరవడి బాగా పెరిగింది. తేజ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత యాక్షన్ విత్ కామెడీ సినిమాల జోరు పెరగడంతో తేజ జోరు కూడా తగ్గింది. ట్రెండ్ మారినా తన మేకింగ్ స్టైల్ మార్చుకోకపోవడంతో అతని సినిమాలు పరాజయాల బాట పట్టాయి. దాంతో దర్శకుడిగా చాలా గ్యాప్ వచ్చింది. మధ్య మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులు వాటిని తిప్పి కొట్టారు. ఇప్పుడు దగ్గుబాటి రానా హీరోగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తన కెరీర్‌లో ఓ డిఫరెంట్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నేనే రాజు నేనే మంత్రి అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. చాలా గ్యాప్ తర్వాత ఓ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన తేజకు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? బాహుబలితో జాతీయస్థాయిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రానా కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేనే రాజు నేనే మంత్రి చిత్రం ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్ చెయ్యగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఓపెన్ చేస్తే ఉరి శిక్ష పడ్డ ఖైదీ జోగేంద్ర(రానా దగ్గుబాటి)ని ఉరికంబం ఎక్కించడానికి రంగం సిద్ధం చేస్తుంటారు. అతని చివరి కోరిక ఏమిటి అని జైలర్ అడిగిన ప్రశ్నకు తన జీవిత కథను టి.వి. ఛానల్ లైవ్‌లో చెప్పేలా చేయమని పోలీసులను కోరతాడు. అతను కోరిన విధంగా లైవ్ ఏర్పాటు చేస్తారు. జోగేంద్ర తన కథ మొదలు పెడతాడు.
అతని పేరు జోగేంద్ర(రానా దగ్గుబాటి). చిన్న ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేస్తూ వుంటాడు. అతని భార్య పేరు రాధ(కాజల్). రాధ అంటే జోగేంద్రకు ప్రాణం. ఆమెను ఎవరు ఏమన్నా తట్టుకోలేడు. పెళ్ళయిన మూడు సంవత్సరాలకు తల్లి కాబోతున్న రాధ తొలి కార్తీకదీపం వెలిగిస్తానని మొక్కుకుంటుంది. దీపం వెలిగించడానికి గుడికి వెళ్ళిన రాధని ఆ ఊరి సర్పంచ్ భార్య నెట్టేయడంతో కిందపడిపోతుంది. దాంతో గర్భస్రావం జరుగుతుంది. తను సర్పంచ్ భార్య అయి వుంటే తొలి దీపం వెలిగించే దాన్ని అని రాధ బాధపడుతుంది. విషయం తెలుసుకున్న జోగేంద్ర తెలివిగా సర్పంచ్‌ని మాయ చేసి తను కూడా ఎన్నికల్లో అతనికి పోటీగా నిలబడతాడు. అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. అదే ప్రజాదరణతో ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో మంత్రి అవ్వాలని, ఆ వెంటనే సి.ఎం. అయిపోవాలని డిసైడ్ అవుతాడు. ఐదు సంవత్సరాల్లో సి.ఎం. అయిపోవడానికి సెటిల్‌మెంట్లు, బిజినెస్ చేసి కోట్లు గడిస్తాడు. ముఖ్యమంత్రి కావడానికి పావులు కదుపుతూ వుంటాడు. సి.ఎం. కావాలన్న జోగేంద్ర కల ఫలించిందా? ఆ పదవి దక్కించుకునే క్రమంలో జోగేంద్ర ఎలాంటి పనులు చేశాడు? తక్కువ టైమ్‌లో ఉన్నత పదవులు చేపట్టిన జోగేంద్రకి శత్రువులు వున్నారా? వారి వల్ల అతను ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? చివరికి సి.ఎం. అవ్వగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
జోగేంద్రగా రానా దగ్గుబాటి పెర్‌ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. అతని క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ని బాగా చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోగానీ, యాక్షన్ సీన్స్‌లోగానీ తన నటనతో ఆకట్టుకున్నాడు. గృహిణిగా కాజల్ నటన కూడా చాలా నేచురల్‌గా వుంది. రానా, కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అజయ్, అశుతోష్ రాణా, పోసాని, నవదీప్ తమ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. కేథరిన్ త్రెస చేసిన స్పెషల్ క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. జోగేంద్రను ప్రేమించి తన ప్రేమ కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడే క్యారెక్టర్‌లో అద్భుతంగా రాణించింది.
సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే వెంకట్ సి.దిలీప్ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని ఆకట్టుకునేలా తియ్యడంలో సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకున్నాయి. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వుంది. రాజకీయ నేపథ్యంలో వచ్చే కొన్ని డైలాగ్స్ ఆడియన్స్‌చేత చప్పట్లు కొట్టిస్తాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్‌హాఫ్ అంతా చాలా గ్రిప్పింగ్‌గా వుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన అరగంట తర్వాత క్లైమాక్స్ వరకు సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌కి రావడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఆ మధ్యలో వచ్చే చాలా సీన్స్ ఎడిట్ చేసినా కథనంలో ఎలాంటి మార్పు వుండదు. కానీ, లెంగ్త్‌ని అలాగే పెంచుకుంటూ పోయారు. దర్శకుడు తేజ గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కథ రాసుకొని ప్రేక్షకులు ఊహించని విధంగా సీన్స్ క్రియేట్ చేస్తూ ఫస్ట్‌హాఫ్‌ని చాలా స్పీడ్‌గా రన్ చేసాడు. సెకండాఫ్‌లో ఒక దశలో సినిమా అయిపోయిందనుకుంటున్న తరుణంలో మరింత సాగదీసి క్లైమాక్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేశాడు. ఎంతో భారీగా వుంటుందనుకున్న క్లైమాక్స్‌ని చాలా సాదా సీదాగా ముగించేయడం థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకులు సినిమా ఫర్వాలేదు అనుకునేలా చేసింది. తేజ నుంచి ఒక మంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. హీరో క్యారెక్టరైజేషన్, రానా, కాజల్ పెర్‌ఫార్మెన్స్, ఫోటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, మాటలు సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే, సెకండాఫ్‌లో క్లైమాక్స్ వరకు కథను నడిపించడం కోసం కొన్ని అనవసరమైన సీన్స్‌తో సాగదీయడం సినిమాకి మైనస్ అయింది. ఫైనల్‌గా చెప్పాలంటే నేనేరాజు నేనే మంత్రి అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ఫినిషింగ్ టచ్: రానా ఒన్ మ్యాన్ షో