బుట్టబొమ్మ క్రియేషన్స్, విన్‌విన్‌విన్ క్రియేషన్స్
నక్షత్రం
తారాగణం: సందీప్‌కిషన్, సాయిధరమ్‌తేజ్(ప్రత్యేక పాత్రలో), రెజినా, ప్రగ్యా జైస్వాల్, శివాజీరాజా, ప్రకాష్‌రాజ్, తనీష్ తదితరులు
సినిమటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్
సంగీతం: భీమ్స్, భరత్ మధుసూదనన్, హరిగౌర
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: భీమ్స్
ఎడిటింగ్: శివ వై.ప్రసాద్
నిర్మాతలు: కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు
రచన, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేదీ: 04.08.2017
ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలకు మంచి క్రేజ్ వుండేది. అతని కొత్త సినిమా వస్తోందంటే ఒక కొత్త కథ మనం చూడొచ్చు అనే ఆశ ప్రేక్షకుల్లో వుండేది. ఏ సినిమాకి ఆ సినిమాయే అన్నట్టు ప్రతి సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో తీస్తూ వచ్చాడు. వాటి జయాపజాయలను పక్కన పెడితే ఆ సినిమాలకు అతను పెట్టిన ఎఫర్ట్‌ని అందరూ అప్రిషియేట్ చేసేవారు. గులాబితో ప్రారంభమైన అతని కెరీర్ గ్రాఫ్ నిన్నే పెళ్లాడతా, మురారి, సముద్రం, ఖడ్గం, చందమామ వంటి సినిమాలతో ఎక్కడికో వెళ్ళిపోయి అతన్ని క్రియేటివ్ డైరెక్టర్‌ని చేసేసింది. అయితే గత కొన్నేళ్ళుగా అతనిలో క్రియేటివిటీ కొరవడిందా? లేక ట్రెండ్‌కి తగ్గట్టు కథలను రాసుకోలేకపోతున్నాడా? ఆడియన్స్ పల్స్‌ని జడ్జ్ చెయ్యడంలో విఫలమవుతున్నాడా? అనేది అర్థం కాకుండా ప్రతి సినిమా పరాజయాన్ని చవిచూస్తోంది. ఆ కోవలోకే వస్తుంది శుక్రవారం విడుదలైన నక్షత్రం. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న కృష్ణవంశీ సినిమా కాబట్టి ఎంతో కొంత కొత్తదనం వుంటుందని, ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తోనే సినిమా తీసి వుంటాడని ఆశించిన ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు కృష్ణవంశీ.
యూనిఫాం వేసుకోని ప్రతి ఒక్కడూ పోలీసే, సీతారాములకు రక్షణ కల్పించే హనుమంతుడు కూడా పోలీసే అని చెప్తూ చిన్నతనంలోనే ఖాకీ యూనిఫామ్‌పై ఇష్టం పెంచుకునేలా చేస్తాడు రామారావు(సందీప్ కిషన్) తండ్రి. రామారావు లక్ష్యం ఒక్కటే తను పోలీస్ కావాలి. ఆల్రెడీ రెండు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన రామారావు మూడో ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయి అందులో పాస్ అవుతాడు. ఫైనల్‌గా ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళాల్సిన టైమ్‌లో అతనిపై కక్ష గట్టిన రాహుల్(తనీష్) రౌడీలతో కలిసి ఎటాక్ చేస్తాడు. అలా పోలీస్ అవ్వాలనుకున్న రామారావు ప్రయత్నం ప్రతిసారీ బెడిసి కొడుతూనే వుంటుంది. ఇది ఓ కథ అయితే డిఎస్‌పిగా పనిచేస్తున్న అలెగ్జాండర్(సాయిధరమ్‌తేజ్) హఠాత్తుగా అదృశ్యమవుతాడు. అతను ఏమైపోయాడో ఎవ్వరికీ తెలీదు. అతని దగ్గర పనిచేసే డ్రైవర్ సీతారామ్(శివాజీరాజా) ఉన్నట్టుండి తాగుబోతుగా మారిపోతాడు. మరోపక్క సిటీలో బాంబు పేలుళ్ళలో చాలామంది చనిపోతారు. పోలీస్ కమిషనర్ కొడుకైన రాహుల్ ఆ ముఠాతో చేతులు కలుపుతాడు. ఇలా సినిమాలో సంపూర్ణంగా లేని చాలా కథలు కలిసి కలగాపులగంగా మారిపోయి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని అతలాకుతలం చేస్తాయి. అనవసరంగా వచ్చే హడావిడి సన్నివేశాలు. అర్థాంతరంగా వచ్చిపడే పాటలు. సమయం సందర్భం, లేకుండా నవ్వించే ప్రయత్నం చేసే కమెడియన్స్. ఓవర్ యాక్షన్ చేసే మిగతా క్యారెక్టర్లు. ఇలా ఆడియన్స్‌కి ఎన్నిరకాలుగా తలనొప్పి తెప్పించవచ్చో అన్నిరకాలుగా ట్రై చేశాడు కృష్ణవంశీ. అర్థంపర్థంలేని, తలా తోక లేని కథతో అన్నిరకాలుగా ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితుల్లోకి నెట్టేశాడు. పెర్‌ఫార్మెన్స్ పరంగా చెప్పుకోవాల్సిన ఒకే ఒక్క ఆర్టిస్ట్ సందీప్ కిషన్. కథ, కథనాలు ఎలా వున్నా, క్యారెక్టరైజేషన్స్ ఎలా వున్నా తన క్యారెక్టర్‌ని ఎంతో కష్టపడి చేశాడని చెప్పాలి. ఇక ప్రత్యేక పాత్ర చేసిన సాయిధరమ్‌తేజ్‌కి పెర్‌ఫార్మ్ చేసే అవకాశమే లేదు. సినిమాలో వున్నాడంటే వున్నాడు అనేలాగే అతని క్యారెక్టర్ వుంది తప్ప ఆడియన్స్ ఏమాత్రం ఆ క్యారెక్టర్‌తో కనెక్ట్ అవ్వరు. ఇక మిగతా క్యారెక్టర్ల గురించి, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
సాంకేతిక విభాగాలకు వస్తే ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో అత్యంత నీచంగా వున్న ఫొటోగ్రఫీని ఈ సినిమాలో చూడొచ్చు. బి గ్రేడ్ సినిమాలు కూడా ఫోటోగ్రఫీ పరంగా క్వాలిటీగా వుంటున్న ఈరోజుల్లో క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకుంటున్న కృష్ణవంశీ నుంచి ఇలాంటి ఫోటోగ్రఫీతో సినిమా రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2 గంటల 46 నిముషాల సినిమాలో ఏ దశలోనూ ఫోటోగ్రఫీని ఆస్వాదించలేం. దానికి తగ్గట్టుగానే పాటల్ని ఎంతో నాసిరకంగా తీశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఈ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. కానీ, ఏ ఒక్కరూ వినదగ్గ పాటల్ని చెయ్యలేకపోయారు. భీమ్స్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా అంతా రణగొణ ధ్వనులతో నింపేసి సినిమాని మరింత బ్యాడ్ చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎడిటింగ్ కూడా అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. ఒక్క సినిమాలో ఇన్ని అవలక్షణాలు కనిపించడానికి కారకుడైన కృష్ణవంశీ గురించి చెప్పాల్సి వస్తే ఏమాత్రం కొత్తదనం లేని ఔట్ డేటెడ్ కథ, చూసి చూసి విసిగిపోయిన క్యారెక్టరైజేషన్లతో కథ ఎటు వెళ్తుందో అర్థంకాని అయోమయంలో ప్రేక్షకుల్ని పడేయడంలో సక్సెస్ అయ్యాడు. తను చెప్పాలనుకున్నదేమిటనే విషయంలో పూర్తి క్లారిటీలేని కృష్ణవంశీ సినిమాని అస్తవ్యస్తంగా తీశాడు. ఫైనల్‌గా చెప్పాలంటే నక్షత్రం చిత్రంతో ప్రేక్షకులకు పట్టపగలే నక్షత్రాలు చూపించి తనేమిటో మరోసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు. ఈ సినిమా ఎ, బి, సి... ఇలా ఏ సెంటర్ ఆడియన్స్‌నీ ఆకట్టుకోదని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఫినిషింగ్ టచ్: చుక్కలు చూపించిన కృష్ణవంశీ