వారాహి చలన చిత్రం
పటేల్ సార్
తారాగణం: జగపతిబాబు, పద్మప్రియ, తాన్యా హోప్, ఆమని, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్‌సింగ్, ప్రభాకర్, బేబీ డాలీ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
సంగీతం: డి.జె.వసంత్
ఎడిటింగ్: గౌతంరాజు
మాటలు: ప్రకాష్
నిర్మాత: రజనీ కొర్రపాటి
రచన, దర్శకత్వం: వాసు పరిమి
విడుదల తేదీ: 14.07.2017
హీరో నుంచి విలన్‌గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి సినిమాలు చేస్తున్నాడు జగపతిబాబు. వాసు పరిమి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన చిత్రం పటేల్ సార్‌లో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జగపతిబాబు. 60 సంవత్సరాల క్యారెక్టర్‌లో ఓ కొత్త గెటప్‌లో జగపతిబాబు కనిపించిన పటేల్ సార్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథలో జగపతిబాబుకి కొత్తగా కనిపించిన అంశం ఏమిటి? కొత్త డైరెక్టర్ వాసు పరిమి అతని క్యారెక్టర్‌ని ఏ విధంగా హైలైట్ చేశాడు? ఈ కథకి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారు? పటేల్ సార్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
పటేల్ సార్‌లో కొత్తగా కనిపించే అంశమేమీ లేదు. రొటీన్ రివెంజ్ డ్రామా అని సినిమా స్టార్ట్ అయిన పది నిముషాల్లోనే అర్థమైపోతుంది. క్లైమాక్స్ ఏమిటి అనేది కూడా స్టార్టింగ్‌లోనే తెలిసిపోతుంది. కథ విషయానికి వస్తే పటేల్ రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్. అతనికి తోడుగా చూపులేని ఓ చిన్న పాప వుంటుంది. పటేల్ నలుగురు క్రిమినల్స్‌ని టార్గెట్ చేస్తాడు. ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్ళడమే అతని పని. 60 ఏళ్ళ వయసులో అతనికి హత్యలు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? అతనికి జరిగిన అన్యాయం ఏమిటి? అతనితోపాటు వున్న చిన్నపాప ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ అయిన తర్వాత జగపతిబాబు చేసిన కొత్త తరహా క్యారెక్టర్ ఇది. అంటే గెటప్ పరంగా జెబి ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. వరస హత్యలు చేస్తూ వెళ్ళడం అనేది కూడా కొత్తగానే అనిపించినా ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు మనం గతంలో చాలా చూశాం. కథ, కథనాలు ఎలా వున్నా జగపతిబాబు తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్‌లోగానీ, సెంటిమెంట్ సీన్స్‌లోగానీ ఆకట్టుకునే పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. బేబీ డాలీ కూడా తన నటనతో ఆకట్టుకుంది. సినిమా స్టార్టింగ్ నుండి కథతో లింక్ అయి వున్న క్యారెక్టర్‌లో పోసాని తనదైన స్టైల్‌లో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన తాన్యా హోప్ అక్కడక్కడా ఓవర్ యాక్షన్ చేసినా ఓవరాల్‌గా తన క్యారెక్టర్‌ని బాగా చేసిందనే చెప్పాలి. మిగతా క్యారెక్టర్స్‌లో రఘుబాబు, కబీర్‌సింగ్, ప్రభాకర్, సుబ్బరాజు, శుభలేఖ సుధాకర్ తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సి వస్తే శ్యామ్ కె.నాయుడు ఫోటోగ్రఫీ రిచ్‌గా అనిపించింది. ప్రతి ఫ్రేమ్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలోని పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా చేశాడు డి.జె.వసంత్. గౌతంరాజు ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే కొన్ని అనవసరమైన సీన్స్‌తో సినిమా నిడివిని పెంచే ప్రయత్నం చేశారు. వాటిని కట్ చేసి వుంటే బాగుండేది. ప్రొడక్షన్ వేల్యూస్ ఫర్వాలేదు. డైరెక్టర్ వాసు పరిమి గురించి చెప్పాలంటే రొటీన్ రివెంజ్ డ్రామాని కొత్తగా చూపించాలని ట్రై చేశాడు. అయితే సినిమాలో చాలా సందర్భాల్లో మిస్ అయిన లాజిక్ వల్ల ఆ ప్రయత్నం అంతగా సక్సెస్ అవ్వలేదు. సింథటిక్ డ్రగ్స్ గురించి సినిమా స్టార్టింగ్‌లో మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత విలన్ దాన్ని ఎలా దేశంలోకి ప్రవేశపెట్టాడు. దానివల్ల ఎంత ప్రమాదం జరిగింది అనేది వివరించలేదు. విలన్ గ్యాంగ్ ఎంత గట్టిదైనా వాళ్ళని చంపడానికి వారి స్థావరానికి హీరో ఇట్టే చేరిపోతుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్‌గా హీరో మర్డర్లు చేస్తూ వెళ్ళడం వల్ల చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరో కొడుకు క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం వల్ల, వారి మధ్య నడిచిన కొన్ని సెంటిమెంట్ సీన్స్ వల్ల గ్రాఫ్ కాస్త పెరిగింది. అతను విలన్లను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది తెలిసిన తర్వాత సినిమా మీద కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత కూడా మరో సీన్‌తో ఓ కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ ఓకే అని డిసైడ్ అవుతాం. ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కొన్ని అంశాలు వున్నప్పటికీ పటేల్‌సార్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ అని చెప్పక తప్పదు.
ఫినిషింగ్ టచ్: అంతలేదు సార్!