శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
జయదేవ్
తారాగణం: గంటా రవి, మాళవిక, వినోద్‌కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్, హరితేజ, శ్రావణ్, శివారెడ్డి, కోమటి జయరామ్, రవిప్రకాష్, సుప్రీత్, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి తదితరులు
సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
మూలకథ: అరుణ్‌కుమార్
రచన: పరుచూరి బ్రదర్స్
నిర్మాత: కె.అశోక్‌కుమార్
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
విడుదల తేదీ: 30.6.2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్ నిర్మించిన చిత్రం జయదేవ్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో రూపొందిన సేతుపతి ఆధారంగా జయదేవ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. రెగ్యులర్‌గా వచ్చే పోలీస్ స్టోరీలకు భిన్నంగా ఈ చిత్రంలో వున్న అంశాలేమిటి? తన మొదటి సినిమాలోనే పోలీస్ ఆఫీసర్‌గా నటించిన గంటా రవి ఏ మేర ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు? ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించడంలో జయంత్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? కొత్త హీరో గంటా రవిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
ఇలాంటి పోలీస్ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు కథలు కొత్తగా ఏమీ వుండవు. విలన్ చేసే అక్రమాలను వెలికి తీయడం, అతన్ని వల్ల నష్టపోయినవారికి న్యాయం చేయడం వంటి అంశాలే ఎక్కువగా వుంటాయి. ఈ సినిమా కూడా అలాంటి కథతోనే రూపొందింది. తన విధి నిర్వహణలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాడు హీరో. విలన్ వల్ల ఎంతో నష్టపోతాడు. ఆ తర్వాత తన తెలివి తేటలతో విలన్ ఆట కట్టిస్తాడు. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో విలన్ మస్తాన్‌రాజు(వినోద్‌కుమార్). ఎప్పటిలాగే అతను పాల్పడే నేరాలను సాక్ష్యాధారాలతో నిరూపించాలని చూస్తాడు జయదేవ్(గంటా రవి). చివరికి హీరో విజయం సాధిస్తాడు. ఈ కథలో మనకు కొత్తగా అనిపించే విషయాలు ఏమీ వుండవు. హీరో, విలన్ క్యారెక్టరైజేషన్ కూడా రొటీన్‌గానే వుంటుంది. ఈమాత్రం కథని తమిళం నుంచి దిగుమతి చేసుకోవడం ఎందుకో అర్థం కాదు. ఈ కథని తెరకెక్కించిన విధానం కూడా చాలా సాదాసీదాగా వుంది. పోలీస్ ఆఫీసర్‌గా గంటా రవి తన పెర్‌ఫార్మెన్స్‌తో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
గెటప్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ అతనికి సూట్ అవ్వలేదు. ఈ విషయంలో దర్శకుడు కాస్త తెలివిని ప్రదర్శించాడు. హీరోని ఎక్కువ షాట్స్‌లో చూపించకుండా మేనేజ్ చేశాడు. డైలాగ్స్ చెప్పడంలో, డాన్సుల్లో, ఫైట్స్‌లో ఏమాత్రం ఇన్‌వాల్వ్ అయి చేయలేకపోయాడు. అతని పెర్‌ఫార్మెన్స్‌కి మార్కులు ఆశించడం అత్యాశే అవుతుంది. ఎన్నో భారీ చిత్రాలను, సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన జయంత్ ఓ కొత్త డైరెక్టర్‌లా వ్యవహరించాడే తప్ప ఏ సీన్‌ని ఇంట్రెస్టింగ్‌గా తియ్యలేకపోయాడు. నిర్మాణ పరంగా అశోక్‌కుమార్ అన్ని విధాలుగా కాంప్రమైజ్ అయిపోయాడని సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. ఖర్చు కనిపించకుండా సినిమాని చుట్టేశారనిపిస్తుంది. ఏ ఒక్క సీన్ కూడా రిచ్‌గా అనిపించదు. ఎంతసేపూ రాళ్ళ క్వారీ, ఇల్లు, ఓపెన్ ప్లేస్‌లు తప్ప సినిమాలో ఏమీ కనిపించవు. హీరోయిన్ వుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చి హీరోతో పాట పాడి వెళ్ళిపోతుంటుంది. ఎంత పెద్ద హిట్ అయిన సినిమాకైనా, ఫ్లాప్ అయిన సినిమాకైనా ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు వుంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే ఒక్క ప్లస్ పాయింట్ కూడా మనకు కనిపించదు. మిగతా నటీనటుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే విలన్‌గా నటించిన వినోద్‌కుమార్ క్యారెక్టర్ చాలా అసహజంగా అనిపిస్తుంది. అతని గెటప్‌గానీ, చెప్పే డైలాగ్స్‌గానీ ఆకట్టుకోలేదు. టివిలో పాపులర్ అయిన బిత్తిరి సత్తికి ఓ క్యారెక్టర్ ఇచ్చి ఆడియన్స్‌ని నవ్వించమన్నారు. కానీ, అది సక్సెస్ అవ్వలేదు. పోసాని, రవిప్రకాష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుప్రీత్, శివారెడ్డిల నటన పరమ రొటీన్‌గా వుంది. టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ఏ ఒక్కరూ ఈ సినిమాకి న్యాయం చెయ్యలేకపోయారు. జవహర్‌రెడ్డి ఫోటోగ్రఫీ చాలా నాసికరంగా వుంది. దానికి తగ్గట్టుగానే మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చాలా స్పీడ్‌గా వుంది. ఎంత స్పీడ్ అంటే కొన్ని చోట్ల ఆర్టిస్టుల మొహాలు కూడా కనిపించవు. జయంత్‌కి ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ ఈ సినిమాలో ఒక్క పాటని కూడా బాగా చెయ్యలేకపోయాడు. విషయం తక్కువ హడావిడి ఎక్కువ అన్నట్టుగా సీన్‌లో విషయం లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హైప్ చెయ్యాలనుకున్నాడు. వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా బాగాలేదు. ఫైట్స్‌తో రవి ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాకి ఎంచుకున్న కథ రొటీన్ అని మనం చెప్పుకుంటున్నాం. ఇదే కథతో తమిళ్ సూపర్‌హిట్ కొట్టారు. తెలుగులో కొన్ని మార్పులు చెయ్యడం వల్ల అవే సినిమాకి మైనస్‌గా మారింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు జయంత్. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ కథ, పరమ రొటీన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆడియన్స్‌ని అతలాకుతలం చేసిన జయదేవ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎ, బి, సి.. ఇలా ఏ సెంటర్ ఆడియన్స్‌నీ జయదేవ్ ఆకట్టుకోడని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
ఫినిషింగ్ టచ్: బాబోయ్.. జయదేవ్!