గుడ్ సినిమా గ్రూప్, బాహుమాన్య ఆర్ట్స్
వెంకటాపురం
తారాగణం: రాహుల్, మహిమ మక్వానా, అజయ్, అజయ్ ఘోష్, కాశీవిశ్వనాథ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
సంగీతం: అచ్చు
ఎడిటింగ్: మధు
సమర్పణ: బేబీ ఆద్యశ్రీ
నిర్మాతలు: తూము ఫణికుమార్, శ్రేయాస్ శ్రీనివాస్
రచన, దర్శకత్వం: వేణు మడికంటి
విడుదల తేదీ: 12.05.2017
మర్డర్ మిస్టరీ.. అంటే ఎవరికైనా ఆసక్తి కలిగించే అంశమే. ఒక మర్డర్ జరగడానికి ముందు జరిగే సంఘటనలు, మర్డర్ తర్వాత ఆ మిస్టరీని ఛేదించే దిశలో జరిగే ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ సక్రమంగా ఎగ్జిక్యూట్ చెయ్యగలిగితే ఆ డైరెక్టర్ పాస్ అయిపోయినట్టే. అలాంటి మర్డర్ మిస్టరీతోనే తెరకెక్కిన చిత్రం వెంకటాపురం. హ్యాపీడేస్ చిత్రంతో నటుడుగా పరిచయమైన రాహుల్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా హీరోగా హిట్ కొట్టలేకపోయాడు. వేణు మడికంటి దర్శకత్వంలో రూపొందిన వెంకటాపురం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్. మరి ఈ సినిమా రాహుల్ కెరీర్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఈ మర్డర్ మిస్టరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? అసలు ఈ సినిమాకి వెంకటాపురం అనే టైటిల్‌ని ఎందుకు పెట్టారు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
ఓపెన్ చేస్తే ఓ కుర్రాడు ఓ వ్యక్తి కోసం వెతుకుతూ వుంటాడు. ఆ వ్యక్తిని కలిసి రెండు వేల రూపాయలు ఇచ్చి ఓ కొడవలి కొంటాడు. తర్వాత బార్‌కి వచ్చి ఫుల్‌గా తాగి కొడవలి పట్టుకొని ఎవరినో చంపడానికి భీమిలీ బీచ్‌కి వస్తాడు. తను ఎవరిని చంపాలనుకున్నాడో వారి కోసం ఎదురుచూస్తుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఎప్పటిలాగే తెల్లారింది. కానీ, భీమిలీ బీచ్‌లో ఓ అమ్మాయి శవం ప్రత్యక్షమైంది. దాంతో అందరూ షాక్ అయ్యారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. కానిస్టేబుల్స్‌తో సహా అక్కడికి చేరుకున్నాడు. శవం దగ్గర దొరికిన ఐడి కార్డ్‌ని బట్టి అది చైత్ర(మహిమ మక్వానా) అనే అమ్మాయిదని పోలీసులు నిర్ధారణకు వస్తారు. ఆ హత్య ఎవరు చేసి వుంటారు అని ఆరా తీసిన పోలీసులు ఆ అమ్మాయి వుండే అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌లో వుంటున్న ఆనంద్(రాహుల్) ఆమె లవర్ అనీ, అతనే చైత్రను హత్య చేసి వుంటాడని ఫిక్స్ అవుతారు పోలీసులు. అయితే అతను ఎలా వుంటాడనేది పోలీసులకు తెలీదు. హంతకుడి కోసం వైజాగ్ అంతా జల్లెడ పడతారు పోలీసులు. అంతకుముందే ఎటమ్ట్ మర్డర్ కింద అరెస్ట్ అయిన ఆనంద్ వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లోనే వుంటాడు. తాము వెతుకుతున్న ఆనంద్ ఇతనే అని పోలీసులకు తెలీదు. మరి చైత్రను హత్య చేసింది ఎవరు? ఆనంద్ ఎవరి మీద మర్డర్ ఎటమ్ట్ చేశాడు? ఆనంద్‌కి, చైత్రకు సంబంధం ఏమిటి? భీమిలీ బీచ్‌కి కొడవలితో వచ్చింది ఎవరు? వంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
హ్యాపీడేస్ తర్వాత కొన్ని సినిమాలు చేసిన రాహుల్‌కి ఇది కొత్త క్యారెక్టర్ అనే చెప్పాలి. డైరెక్టర్ వేణు మడికంటి ఈ క్యారెక్టర్ కోసం రాహుల్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ అతను పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో, హావభావాలతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో మాత్రమే అతని పెర్‌ఫార్మెన్స్ బాగుంది. ఇక హీరోయిన్ మహిమ మక్వానా వున్నంతలో ఫర్వాలేదు అనిపించింది. మిగిలిన క్యారెక్టర్స్‌లో ఎస్.ఐ.గా అజయ్‌ఘోష్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అజయ్ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ఈ చిత్రంలోని మిగతా ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతికంగా చూస్తే ఈ చిత్రానికి తక్కువ మార్కులే పడతాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ పెద్ద మైనస్ అని చెప్పాలి. సాయిప్రకాష్ ఫోటోగ్రఫీ ఏ దశలోనూ బాగా అనిపించదు. ఇలాంటి మర్డర్ మిస్టరీలకు ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటే తప్ప కథ, కథనాలు ఆకట్టుకోవు. మ్యూజిక్ విషయానికి వస్తే అచ్చు చేసిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే వున్నా చాలా సీన్స్‌లో సౌండ్ లౌడ్‌గా వుండడం వల్ల రణగొణ ధ్వనిలా అనిపిస్తుంది. ఆ సౌండ్‌లో కొన్ని డైలాగ్స్ కూడా వినిపించలేదు. ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగానే వుంది. మర్డర్ మిస్టరీ అనేది పాతదే అయినా సెకండాఫ్‌లో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చేసాడు డైరెక్టర్. ఇలాంటి సినిమాకి ప్రొడక్షన్ వేల్యూస్ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటే రిజల్ట్ ఓ రేంజ్‌లో వుంటుంది. కానీ, ప్రొడక్షన్ వేల్యూస్ పూర్‌గా వుండడం వల్ల సినిమాని చాలా ఛీప్‌గా తీశారన్న ఫీలింగ్ కలుగుతుంది. డైరెక్టర్ వేణు గురించి చెప్పాలంటే ప్రయత్నం మంచిదే అయినా ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో హీరో, హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ పదే పదే సిగరెట్ కాల్చుకోవడానికి కాలేజీ టెర్రస్ పైకి వెళ్ళడం, ఆ తర్వాత నిర్మానుష్యంగా వున్న బీచ్‌కి వెళ్ళి రౌడీల బారిన పడడం వంటి సీన్స్ చాలా అసహజంగా వున్నాయి. దాదాపు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్‌గానే నడుస్తుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన కొంత సేపటి తర్వాత కథలో చలనం వచ్చి కాస్త స్పీడందుకుంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువ శాతం కథ వెంకటాపురం పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఈ సినిమాకి ఆ టైటిల్‌ని పెట్టారు. క్లైమాక్స్‌లో హీరో చేతికి గన్ ఇచ్చి బ్యాలెన్స్ వున్న ఒక్కడిని కూడా లేపెయ్యమని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హీరోకి ఫ్రీడమ్ ఇవ్వడం కూడా నేచురల్‌గా లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మర్డర్ మిస్టరీని కొత్తగా చూపించడానికి చేసిన ఈ ప్రయత్నంలో ఎన్నో మైనస్‌లు మనకు కనిపిస్తాయి. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు వున్నప్పటికీ టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వరు. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా వున్న ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందా లేదా అనేది డౌటే.
ఫినిషింగ్ టచ్: కొత్త ప్రయత్నాన్ని చుట్టేశారు!