శ్రీవెంకటేశ్వర సినీచిత్ర
రాధ
తారాగణం: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, అక్ష పార్థసాని, కోట శ్రీనివాసరావు, రవికిషన్, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, షకలక శంకర్, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: రాథాన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: చంద్రమోహన్, మధుసూదన్
సమర్పణ: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
నిర్మాత: భోగవల్లి బాపినీడు
రచన, దర్శకత్వం: చంద్రమోహన్
విడుదల తేదీ: 12.05.2017
రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు భిన్నంగా వుండాలన్న ఉద్దేశంతో కొంతమంది డైరెక్టర్లు తమ సినిమాల్లోని హీరోలకు డిఫరెంట్ మేనరిజమ్స్ పెట్టడం లేదా పెద్దయ్యాక తను ఏం కావాలనుకుంటున్నాడో చిన్నప్పటి నుంచే ఊదర గొట్టేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ ఎక్కువగా రవితేజ మీద వర్కవుట్ అయ్యాయి. కొత్త దర్శకుడు చంద్రమోహన్‌తో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ బేనర్‌లో భోగవల్లి బాపినీడు నిర్మించిన రాధ చిత్రంలో హీరో శర్వానంద్ క్యారెక్టర్ కూడా ఇలాంటిదే. తను పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటూ పెరుగుతాడు. మరి హీరో అన్న తర్వాత అనుకున్నది సాధించి కానీ వదిలిపెట్టడు కాబట్టి నిజంగానే పోలీస్ అయిపోతాడు. హీరో పోలీస్ అయితే ఆ సినిమాలోని కథ, కథనాలు ఎలా వుంటాయి? హీరో ఎలాంటి సాహసాలు చేస్తాడు? దుష్టశక్తుల్ని ఎలా అంతమొందిస్తాడు ఇత్యాది విషయాలు మన తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అయితే రొటీన్ కథ, రొటీన్ కథనం, రొటీన్ కాన్‌ఫ్లిక్ట్స్... వీటన్నింటినీ జోడించి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కొత్త ఫార్మాట్‌లో సినిమా చేస్తే ఎలా వుంటుంది? అనే ప్రశ్నకు సమాధానమే ఈరోజు విడుదలైన రాధ చిత్రం. మరి ఈ సినిమాలో చూపించిన డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమిటి? పోలీస్‌గా శర్వానంద్ ఎలాంటి పెర్‌ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు? కొత్త దర్శకుడు చంద్రమోహన్ తన టేకింగ్‌తో ఎంతవరకు ఆకట్టుకోగలిగాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
రాధాకృష్ణ(శర్వానంద్)కి చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే విపరీతమైన భక్తి. ఎప్పుడూ భగవద్గీత వింటూ కృష్ణుడి పేరునే జపిస్తుంటాడు. ఒకరోజు రాధని ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు ఓ పోలీస్. దాంతో కృష్ణుడి జపం కాస్తా పోలీస్ జపంగా మారుతుంది. తను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలన్న కోరిక రాధాకృష్ణలో రోజురోజుకీ బలపడుతుంది. ఆ ఎయిమ్‌తోనే పెద్దవాడవుతాడు. యూనిఫామ్ వేసుకోకుండానే క్రిమినల్స్‌ని పట్టుకోవడంలో పోలీసులకు హెల్ప్ చేస్తుంటాడు. రాధాకృష్ణకి వున్న ఏకైక లక్ష్యం గురించి తెలుసుకున్న డిజిపి అతన్ని ఎస్.ఐ.గా అపాయింట్ చేస్తాడు. మరోపక్క సి.ఎం. పదవి కోసం ఇద్దరు పెద్ద లీడర్స్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అందులో భాగంగా సుజాత(రవికిషన్) ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. దానివల్ల చాలా మంది పోలీసులు చనిపోతారు. చనిపోయిన పోలీసులు మద్యం సేవించి వున్నారని రిపోర్ట్ వస్తుంది. ఈ సంఘటనతో సుజాతకు సంబంధం వుందని తెలుసుకుంటాడు రాధ. పోలీసుల చావుకి బాధ్యుడైన సుజాతని టార్గెట్ చేస్తాడు రాధ. సుజాత వేసిన ప్లాన్ వల్ల పోలీసులు ఎలా చనిపోయారు? అతనిపై రాధ ఎలా పగ తీర్చుకున్నాడు? ప్రజల్లో పోలీసుల పట్ల ఏర్పడిన దురభిప్రాయాన్ని రాధ తొలగించగలిగాడా? అనేది మిగతా కథ.
ఇప్పటివరకు హీరో శర్వానంద్ ఎటెమ్ట్ చెయ్యని ఓ కొత్త క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాడు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. పాటల్లో, ఫైట్స్‌లో, విలన్‌తో చేసిన సీన్స్‌లో శర్వానంద్ పెర్‌ఫార్మెన్స్‌కి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శర్వానంద్‌కి జోడీగా నటించిన లావణ్య త్రిపాఠి కేవలం లవ్ సీన్స్‌కి, పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. ఆమె క్యారెక్టర్‌కి అంత ప్రాధాన్యత లేదు. దానికి తగ్గట్టుగానే ఆమె పెర్‌ఫార్మెన్స్ కూడా వుంది. మినిస్టర్ సుజాతగా రవికిషన్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. అతని క్యారెక్టర్‌లో వున్న డిఫరెంట్ వేరియేషన్స్‌ని అద్భుతంగా చూపించాడు. కోట శ్రీనివాసరావు, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి చేసిన క్యారెక్టర్స్ చాలా రొటీన్‌గా వున్నాయి. షకలక శంకర్, సప్తగిరి కామెడీ చేయడానికి ట్రై చేశారు. అక్కడక్కడ సక్సెస్ అయ్యారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాలంటే కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించడంలో కార్తీక్ సక్సెస్ అయ్యాడు. రాథాన్ చేసిన పాటల్లో రెండు పాటలు ఫర్వాలేదు అనిపిస్తాయి. పాటల పిక్చరైజేషన్ మాత్రం చాలా రొటీన్‌గా వుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో వున్న కొన్ని బోరింగ్ సీన్స్‌ని ఎడిట్ చేస్తే సినిమా మరింత స్పీడ్ అయ్యేది. మూడు పాటలకు సెట్స్ వెయ్యడం, రెండు పాటలు విదేశాల్లో చిత్రీకరించడం బడ్జెట్ పెంచుకోవడానికే తప్ప మరెలాంటి ఉపయోగం లేదు. డైరెక్టర్ చంద్రమోహన్ గురించి చెప్పాలంటే తన మొదటి సినిమానే అయినా ఎంతో ఎక్స్‌పీరియన్స్ వున్న డైరెక్టర్‌లా చేశాడు చంద్రమోహన్. అయితే టోటల్ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆడియన్స్‌కి బోర్‌ని, విసుగుని కలిగిస్తుంది. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌లో విలన్‌పై పగ తీర్చుకోవడానికి హీరో ఎలాంటి ప్లాన్స్ వేశాడు అనేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని ఆడియన్స్‌కి కలిగించడంలో డైరెక్టర్ చంద్రమోహన్ సక్సెస్ అయ్యాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టడంలో కూడా ఫర్వాలేదనిపించుకున్నాడు. రొటీన్ ఛైల్డ్ ఎపిసోడ్స్‌తో స్టార్ట్ అయ్యే సినిమాలో బోర్ కొట్టించే రొటీన్ లవ్ ట్రాక్, నవ్వు తెప్పించని కామెడీ సీన్స్‌తో రొటీన్‌గా రన్ అవుతుంది. సెకండాఫ్ కూడా కథ పరంగా రొటీనే అనిపించినా హీరో ఎలా విన్ అవుతాడో చూడాలన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కొన్ని ప్లస్‌లు, మరికొన్ని మైనస్‌లతో రూపొందిన ఈ రొటీన్ కమర్షియల్ మూవీ మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు వున్నాయి.
ఫినిషింగ్ టచ్: రొటీనే అయినా.. ఓకే.