వై నాట్ స్టూడియోస్
గురు
తారాగణం: వెంకటేష్, రితిక సింగ్, నాజర్, ముంతాజ్ సర్కార్, జాకీర్ హుస్సేన్, తనికెళ్ళ భరణి, రఘుబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటింగ్: సతీష్ సూర్య
మాటలు: హర్షవర్థన్
నిర్మాత: ఎస్.శశికాంత్
రచన, దర్శకత్వం: సుధ కొంగర
విడుదల తేదీ: 31.03.2017
తను సాధించలేనిది తన కొడుకు సాధించాలని కోరుకుంటాడు తండ్రి. అలాగే తను అందుకోలేని లక్ష్యాన్ని తన శిష్యుడు అందుకోవాలని ఆరాటపడతాడు ఓ గురువు. కొడుకుగానీ, శిష్యుడుగానీ తమ కలని నెరవేర్చినపుడు ఆ తండ్రిలో, ఆ గురువులో కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆ విజయం మిగిలిన వారికి కూడా స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది. అలాంటి ఓ అద్భుతమైన కథతో రూపొందిన చిత్రమే గురు. తమిళ్‌లో ఇరుది సుట్రుగా, హిందీలో సాలా కడూస్‌గా సుధ కొంగర దర్శకత్వంలో రూపొంది కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో రీమేక్ చేశారు. బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని కలలు కన్న ఓ బాక్సర్ చివరికి కోచ్‌గా మారి తన శిష్యుల ద్వారా తన కలను నెరవేర్చుకుంటాడు. తమిళ్‌లో, హిందీలో మాధవన్ పోషించిన ఈ క్యారెక్టర్‌ని తెలుగులో వెంకటేష్ చేశారు. మరి తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? కోచ్ క్యారెక్టర్‌కి వెంకటేష్ ఎంతవరకు న్యాయం చేశాడు? తమిళ్‌లో, హిందీలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న రితిక సింగ్‌కి తెలుగు వెర్షన్ ఎలాంటి పేరును తెచ్చింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు ఆది(వెంకటేష్) బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్న తన లక్ష్యం కొన్ని రాజకీయాల వల్ల మరుగున పడిపోతుంది. చివరికి బాక్సింగ్ కోచ్‌గా స్థిరపడిపోతాడు. స్టూడెంట్స్ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని, అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణతో ఆదిని వైజాగ్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వైజాగ్‌లో అమ్మాయిలకు బాక్సింగ్ కోచ్‌గా వెళ్తాడు. అప్పటివరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినా తనలాంటి బాక్సర్ లేరన్న బాధ అతన్ని వేధిస్తుంటుంది. ఆ సమయంలోనే రామేశ్వరి అలియాస్ రాముడు(రితిక సింగ్)కి బాక్సింగ్‌లో వున్న టాలెంట్ గురించి తెలుసుకుంటాడు. రామేశ్వరికి, ఆమె అక్క లక్ష్మీకి డబ్బులిచ్చి మరీ ట్రైనింగ్ ఇస్తుంటాడు. బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం వారిని ట్రైన్ చేస్తుంటాడు. అన్ని విషయాలు దురుసుగా ప్రవర్తించే రాముడు మొదట్లో ఆదిని అసహ్యించుకుంటుంది. తర్వాత అతని మంచితనం తెలుసుకొని ప్రేమలో పడుతుంది. రాముడ్ని శిష్యురాలిగానే చూసే ఆది ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. ఆ బాధతోనే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓడిపోతుంది రాముడు. దాంతో రాముడ్ని తిట్టి ఇంటికి పంపించేస్తాడు ఆది. ఆది ఛాంపియన్ అవ్వకుండా రాజకీయం చేసిన దేవ్ ఖత్రి(జాకీర్ హుస్సేన్) రాముడుపై తప్పుడు కేసు పెట్టి జైల్‌లో పెట్టిస్తాడు. ఆది ఆమెను బయటికి తీసుకొస్తాడు. అప్పటి నుంచి బాక్సింగ్ మీదే తన దృష్టినంతా పెడుతుంది రాముడు. తన స్టూడెంట్‌ని బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలనుకున్న ఆది కల నెరవేరిందా? రాముడు వరల్డ్ ఛాంపియన్ షిప్‌కి వెళ్ళేందుకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? రాముడు ఛాంపియన్ అయ్యే క్రమంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని అధిగమించి ఆమె ఛాంపియన్ ఎలా అయింది? అనేది మిగతా కథ.
బాక్సింగ్ కోచ్ ఆదిగా విక్టరీ వెంకటేష్ పెర్‌ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు వెంకటేష్ చెయ్యని డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ పెర్‌ఫార్మ్ చేశాడని అర్థమవుతుంది. ఒక విధంగా తమిళ్, హిందీలో ఈ క్యారెక్టర్ చేసిన మాధవన్ కంటే వెంకటేష్‌కే ఎక్కువ మార్కులు పడతాయనిపిస్తుంది. రామేశ్వరిగా నటించిన రితిక సింగ్ పెర్‌ఫార్మెన్స్ సినిమాకి మరో పెద్ద హైలైట్. ఫస్ట్‌హాఫ్‌లో రఫ్ అండ్ టఫ్‌గా వుండే స్లమ్ అమ్మాయిగా రితిక పెర్‌ఫార్మెన్స్ ఎక్స్‌లెంట్‌గా వుంది. వెంకటేష్‌తో పోటాపోటీగా నటించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేవ్ ఖత్రిగా నటించిన జాకీర్ హుస్సేన్ పెర్‌ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్‌గా వుంది. కొన్ని సీన్స్‌లో దేవ్ క్యారెక్టర్‌ని చూస్తే మనకే కొట్టాలన్నంత కోపం వస్తుంది. అంత నేచురల్‌గా జాకీర్ ఈ క్యారెక్టర్‌ని చేశాడు. నాజర్, రఘుబాబు, అనితాచౌదరి తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా ఈ సినిమా ఫోటోగ్రఫీ పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. ప్రతి సీన్ ఎంతో నేచురల్‌గా చూపించాడు కె.ఎ.శక్తివేల్. ముఖ్యంగా బాక్సింగ్ పోటీల్లో అతని కెమెరా పనితనం కొట్టొచ్చినట్టు కనిపించింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే పాటలన్నీ బాగా చేశాడు. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఫస్ట్ టైమ్ వెంకటేష్ పాడిన పాట కూడా ఎంటర్‌టైనింగ్‌గా వుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చాడు సంతోష్. కథ, కథనాలకు తగ్గట్టుగా సినిమా నిడివిని రెండు గంటలలోపు వుండేలా చూడడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు. హర్షవర్థన్ రాసిన మాటలు కూడా ఇన్‌స్పైరింగ్‌గా వున్నాయి. మేకింగ్ విషయానికి వస్తే నిర్మాత శశికాంత్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తీశారు. డైరెక్టర్ సుధ కొంగర గురించి చెప్పాలంటే.. గతంలో హిందీలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చినా ఈ చిత్రాన్ని కమర్షియల్‌గా సక్సెస్ అయ్యే అంశాలతో రూపొందించారు. అశ్వని నాచప్ప, భానుచందర్ ప్రధాన పాత్రల్లో మౌళి దర్శకత్వంలో వచ్చిన అశ్వని చిత్రం మెయిన్ థీమ్ కూడా ఈ కథని పోలే వుంటుంది. అయితే అది అథ్లెట్‌కి సంబంధించింది. కొన్ని రాజకీయాల వల్ల ఛాంపియన్ అవ్వలేకపోయిన భానుచందర్ స్టేడియం కీపర్‌గా వర్క్ చేస్తుంటాడు. స్లమ్‌లో వుండే అశ్వని టాలెంట్‌ని గుర్తించి ఆమెను ఛాంపియన్ చెయ్యాలనుకుంటాడు. అదే కథను కొన్ని మార్పులు చేసి గురుగా రూపొందించారు. కథ, కథనం విషయంలో డైరెక్టర్ సుధని తప్పకుండా అప్రిషియేట్ చెయ్యాలి. ఓ పక్క ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ కథని చేయడం, వెంకటేష్, రితిక సింగ్‌ల నుంచి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సుధ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. వెంకటేష్, రితికల పెర్‌ఫార్మెన్స్, కథ, కథనాలు, ఆడియన్స్‌ని కట్టి పడేసే ఎమోషన్స్, ఆడియన్స్‌ని టెన్షన్‌కి గురి చేసే క్లైమాక్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, స్లో నేరేషన్, సెకండాఫ్‌లో కొంత సేపు కథ నడవకుండా ఏవో ఒక సీన్స్ రావడం, కామన్ ఆడియన్ కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం మైనస్‌లుగా చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే అందర్నీ ఇన్‌స్పైర్ చేసే కథ, కథనాలతో, ఆకట్టుకునే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌తో అద్భుతంగా రూపొందిన గురు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.
ఫినిషింగ్ టచ్: భలే సినిమా గురు!
సినీజోష్ రేటింగ్: 3.25/5