Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: నగరం


ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

Advertisement
CJ Advs

నగరం 

తారాగణం: సందీప్‌ కిషన్‌, రెజీనా, శ్రీ, చార్లీ, మధుసూదన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సెల్వకుమార్‌ ఎస్‌.కె. 

సంగీతం: జావేద్‌ రియాజ్‌ 

ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

సమర్పణ: అశ్వనికుమార్‌ సహదేవ్‌ 

నిర్మాణం: పొటెన్షియల్‌ స్టూడియోస్‌ 

రచన, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌ 

విడుదల తేదీ: 10.03.2017 

ఎన్నో కథలు విన్నాను. కానీ, ఏదీ నచ్చలేదు. అందుకే ఇంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు ఒక అద్భుతమైన కథతో సినిమా చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో ఈ కథ చేశాం అని ఒక హీరో చెప్తాడు. మంచి కథలు దొరక్కపోవడం వల్లే సినిమాలు తీయడం లేదని ఒక నిర్మాత చెప్తాడు. తెలుగు సినిమాలకు కథలు కరువయ్యాయని మరి కొంతమంది వాపోతుంటారు. అయినప్పటికీ తీసిన సినిమాల కథల్నే అటు మార్చి, ఇటు మార్చి ఓ సినిమాని తీసి జనం మీదకి వదులుతారు. అది ఎంత స్పీడ్‌గా జనంలోకి వెళ్లిందో అంతకంటే స్పీడ్‌గా వెనక్కి వచ్చేస్తుంది. కథలు కరువయ్యాయి అని స్టేట్‌మెంట్లు ఇచ్చే హీరోలు, దర్శకనిర్మాతలు ఈరోజు విడుదలైన నగరం చిత్రాన్ని చూస్తే తమ అభిప్రాయం తప్పని ఒప్పుకుంటారు. ఎసి రూముల్లో, విదేశాల్లో కూర్చుంటే కథలు రావని, జనంలోకి వెళ్తే వాళ్ళు మెచ్చే కథలే దొరుకుతాయన్న విషయం బోధపడుతుంది. నలుగురు వేర్వేరు వ్యక్తుల కథలతో డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు లోకేష్‌ ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ కథలో, కథనంలో వున్న కొత్తదనం ఏమిటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? సందీప్‌ కిషన్‌కి ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుంది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌, రెజీనా, శ్రీ, చార్లి.. ఈ నలుగురికి సంబంధించిన కథలతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఈ నాలుగు కథల్ని లింక్‌ చేస్తూ ఓ ఐదో కథ పుట్టుకొస్తుంది. ఈ చిత్రంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ నాలుగు క్యారెక్టర్ల పేర్లను ఎక్కడా మెన్షన్‌ చెయ్యకపోవడం. ఎవరి పేరూ వినిపించకుండా సినిమా కంప్లీట్‌ అవుతుంది. ఆయా వ్యక్తుల ఎమోషన్సే ముఖ్యం కానీ పేర్లు కాదని దర్శకుడి అభిప్రాయం కావచ్చు. ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా ఒక కథ అని చెప్పడానికి లేదు. తన ప్రియురాలి కోసం ఉద్యోగం చెయ్యడానికి చెన్నయ్‌ వస్తాడు శ్రీ. తన పరిధిలో లేకపోయినా అతనికి ఉద్యోగం ఇప్పించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది రెజీనా. ఓ దశలో తనకు ఉద్యోగం వద్దు అని వెళ్ళిపోతున్న శ్రీని బ్రతిమలాడి వెనక్కి తీసుకొస్తుంది. మరో వైపు అల్లరి చిల్లరగా తిరుగుతూ లైఫ్‌ అంటే కేర్‌లెస్‌గా వుండే సందీప్‌ కిషన్‌.. రెజీనాని ప్రేమిస్తాడు. తనని ప్రేమించమంటూ వేధిస్తుంటాడు. ఇక నాలుగో క్యారెక్టర్‌ చార్లి. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కొడుక్కి చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు సంపాదించేందుకు కుటుంబ సమేతంగా చెన్నయ్‌ వచ్చి పికెపి అనే ఓ గూండా దగ్గర క్యాబ్‌ తీసుకుంటాడు. పైన చెప్పుకున్న నలుగురి లైఫ్‌లోకి ఓ కిడ్నాప్‌ వచ్చి చేరుతుంది. దాంతో వారి జీవితాల్లో అలజడి మొదలవుతుంది. ఆ కిడ్నాప్‌ కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇంతకీ కిడ్నాప్‌ అయింది ఎవరు? ఆ కిడ్నాప్‌ వల్ల ఈ నలుగురి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? చివరికి చెన్నయ్‌ నగరం ఈ నలుగురి కథకు ఎలాంటి ముగింపున్చింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

సినిమా చూస్తున్నంత సేపు ఆయా క్యారెక్టర్లే మనకి కనిపిస్తాయి తప్ప ఆర్టిస్టులు కనిపించరు. దర్శకుడు ఆయా క్యారెక్టర్లను డిజైన్‌ చేసిన విధానం అలా వుంది. ఈ సినిమాలో కనిపించే ప్రతి ఆర్టిస్టు తమ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశారు. సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశాడు. అతను చేసిన క్యారెక్టర్లలో ఇది ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. రెజీనా క్యారెక్టర్‌ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఒక పరిచయం లేని వ్యక్తికి ఉద్యోగం ఇప్పించాలని ఎందుకు తాపత్రయ పడుతుంది అనేది చివర్లో రివీల్‌ అయినపుడు ఆ క్యారెక్టర్‌ అలా ఎందుకు బిహేవ్‌ చేసిందో తెలుస్తుంది. ఈ క్యారెక్టర్‌లో రెజీనా ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి చేసింది. నగరంలో ఒక మనిషి ఏమైపోతున్నా ఎవరూ పట్టించుకోరని, ఉద్యోగం మానేసి ఊరికి వెళ్ళిపోదామని డిసైడ్‌ అయి జరిగే సంఘటనల వల్ల మానసిక వ్యధను అనుభవించే క్యారెక్టర్‌లో శ్రీ అద్భుతంగా నటించాడు. కొడుక్కి చికిత్స చేయించడానికి సిటీకి వచ్చిన వ్యక్తికి మొదటిరోజే ఎదురైన సంఘటన అతన్ని ఎలాంటి టెన్షన్‌కి గురి చేసిందనేది అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేసి చూపించాడు చార్లి. పికెపిగా మధుసూదన్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేశాడు. 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సెల్వకుమార్‌ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పాలి. ఈ కథలో నైట్‌ ఎఫెక్ట్‌లో ఎక్కువ శాతం సినిమా వుంటుంది. చెన్నయ్‌ నగరాన్ని నైట్‌ ఎఫెక్ట్‌లో ఎంతో అందంగా, మరెంతో సహజంగా చిత్రీకరించాడు. కథ, కథనాలకు తగ్గట్టుగా, పాత్రల మధ్య వుండే ఎమోషన్స్‌కి అనుగుణంగా చక్కని లైటింగ్‌తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యం వుంది. కథతోపాటే వెళ్ళే పాటల్ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ జావేద్‌ రియాజ్‌ ఎంతో నేచురల్‌గా చేశాడు. కథలోని ఎమోషన్‌ని, సస్పెన్స్‌ని ఎలివేట్‌ చేస్తూ చక్కని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాడు. నాలుగు కథల్ని విడి విడిగా చూపిస్తూ చివర్లో మరో ఎలిమెంట్‌తో ఈ కథల్ని జత చేస్తూ ప్రేక్షకులు ఎక్కడా కన్‌ఫ్యూజ్‌ అవ్వకుండా తన ఎడిటింగ్‌తో మ్యాజిక్‌ చేశాడు ఫిలోమిన్‌ రాజ్‌. చెప్పుకోవడానికి, చూడడానికి ఇది సాదా సీదా కథలా అనిపించినా, కథలోని క్యారెక్టర్ల మధ్య వున్న వేరియేషన్స్‌, 24 గంటల్లో కథ స్టార్ట్‌ అయి ఎండ్‌ అయ్యే కథ కాబట్టి నంబరాఫ్‌ వర్కింగ్‌ డేస్‌ వుంటాయి. ఈ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా మంచి ఔట్‌పుట్‌ని తీసుకొచ్చారు. ఇక డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ గురించి చెప్పాలంటే రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు భిన్నంగా తన సినిమా వుండాలన్న ఆలోచనతో ఒక కొత్త కథకు శ్రీకారం చుట్టాడు. దానికి కొత్త తరహాలో స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు కథలో, కథనంలో, క్యారెక్టర్ల మధ్య వుండే వేరియేషన్స్‌లో, ఎమోషన్స్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా ప్రతి విషయానికి క్లారిటీ ఇస్తూ సినిమాని నడిపించాడు. అసలు కథలోకి వెళ్ళడానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో కొన్ని అనవసరమైన సీన్స్‌తో టైమ్‌ వేస్ట్‌ చేయకుండా సినిమా స్టార్ట్‌ అయిన ఐదు నిముషాల్లోనే ఆడియన్స్‌ని కథలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత సీన్‌ బై సీన్‌ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు. నెక్స్‌ట్‌ సీన్‌లో ఏం జరగబోతోంది అనే విషయం ఆడియన్స్‌ ఊహకందని విధంగా చక్కని సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేశాడు. స్క్రీన్‌పై చూస్తున్న ప్రతి సీన్‌ మన కళ్ళ ఎదుట జరుగుతోందా అన్నంతగా ఆడియన్స్‌ని కథలో ఇన్‌వాల్వ్‌ చేసేశాడు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా హండ్రెడ్‌ పర్సెంట్‌ నచ్చుతుంది. రొటీన్‌ ఫార్ములా చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్‌కి నగరం కొంత నిరాశ కలిగించవచ్చు. సినిమాని ఎంత కొత్తగా ప్రజెంట్‌ చేసినా ప్రతి సినిమాలోనూ కొన్ని మైనస్‌లు వుంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్‌లు వున్నాయి. స్లో నేరేషన్‌, కామన్‌ ఆడియన్‌ని ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు లేకపోవడం, సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు రిలీఫ్‌ అనేది లేకపోవడం వల్ల ఒక వర్గం ప్రేక్షకులకు నిరాశ కలిగే అవకాశం వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఏ సినిమా చూసినా రొటీన్‌గానే వుంది, కొత్తదనం లేదు అని బాధపడే ప్రేక్షకులకు నగరం హండ్రెడ్‌ పర్సెంట్‌ నచ్చుతుంది. మంచి కథ, కాన్సెప్ట్‌తోపాటు కామెడీ, గ్లామర్‌ వంటి అంశాలను కోరుకునే కొందరు సగటు ప్రేక్షకులకు మాత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. ఏది ఏమైనా చూసిన కథల్నే మళ్ళీ మళ్ళీ చూసి పెదవి విరిచే ప్రేక్షకులకు నగరం ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs