Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ద్వారక


లెజెండ్‌ సినిమా 

Advertisement
CJ Advs

ద్వారక 

తారాగణం: విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి, పృథ్వీ, మురళీశర్మ, ప్రభాకర్‌, ప్రకాష్‌రాజ్‌, జాకీ, షకలక శంకర్‌, సుదర్శన్‌, నవీన్‌, ప్రభు, రఘుబాబు తదితరులు 

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

మాటలు: లక్ష్మీభూపాల్‌ 

సమర్పణ: సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ 

నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్‌ పెనుబోలు 

రచన, దర్శకత్వం: శ్రీనివాస రవీంద్ర(ఎం.ఎస్‌.ఆర్‌.) 

విడుదల తేదీ: 03.03.2017 

టెక్నాలజీ ఎంత పెరిగినా, సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా కొంత మంది విద్యావంతులు కూడా బాబాలను, స్వామీజీలను దేవుళ్ళుగా భావిస్తారు, పూజిస్తారు. అయితే అందులో నిజమైన బాబాలు తక్కువే. ప్రజల్ని మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తినవారే ఎక్కువ. ఆశ్రమాలను అడ్డు పెట్టుకొని బికారులు సైతం కోటీశ్వరులుగా మారిన సంఘటనలు సైతం మనం చూస్తున్నాం. ఇదే అంశాన్ని తీసుకొని విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్‌ పెనుబోలు నిర్మించిన చిత్రం ద్వారక. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ సినిమా చూసిన తర్వాత బాబాల విషయంలో, స్వామీజీల విషయంలో ప్రజలు ఎడ్యుకేట్‌ అయ్యే అవకాశం వుందా? పెళ్ళిచూపులు చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండకి ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు ఎర్రశ్రీను(విజయ్‌ దేవరకొండ). అతను ఓ దొంగ. ఓ దొంగతనం చేసి పారిపోతుండగా వసుధ(పూజా ఝవేరి)ని చూసి ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి శ్రీను ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి టెర్రస్‌ మీదకి చేరుకొని అక్కడే వున్న ఓ కాషాయ వస్త్రాన్ని ఒంటికి చుట్టుకొని పడుకుంటాడు. కాస్త వెనక్కి వెళ్తే.. నష్టాల్లో వున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక వ్యక్తి రాకతో పుంజుకుంటుందని, కోట్లకు పగలెత్తుతావని ఓ స్వామీజీ(పృథ్వీ) మాటల్ని సీరియస్‌గా తీసుకొని అతని కోసం చూస్తుంటాడు ఆ వ్యాపారి. టెర్రస్‌ మీద కాషాయ వస్త్రంతోనే పడుకున్న శ్రీను తెల్లవారే సరికి కృష్ణానంద స్వామిగా మారిపోతాడు. అక్కడే వున్న స్వామీజీ కూడా అతనే దేవుడని, కృష్ణానంద స్వామి అని ధృవీకరిస్తాడు. ఇక అంతే.. అప్పటి నుంచి ఆ అపార్ట్‌మెంట్‌ ఓ ఆశ్రమంగా మారిపోతుంది. రోజూ వందల సంఖ్యలో, వేల సంఖలో భక్తులు వచ్చి డబ్బు రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇవన్నీ నచ్చని శ్రీను అక్కడి నుంచి పారిపోదామనుకుంటాడు. ఆ టైమ్‌లో తను ప్రేమించిన వసుధను చూస్తాడు. ఆమె కోసం అక్కడే వుండిపోతాడు. కోట్లల్లో ఆదాయం వస్తున్న ఆశ్రమాన్ని ఒక లాయర్‌, ఒక పోలీస్‌, ఒక రాజకీయ నాయకుడు తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. తాము చెప్పినట్టే వినాలని శ్రీనుని ఆదేశిస్తారు. అతను దేవుడు కాదని, ఒక దొంగ అని తెలుసుకున్న వసుధ అతన్ని అసహ్యించుకుంటుంది. తను అతన్ని ప్రేమించాలంటే మనిషిగా మారమని చెప్తుంది. మరో పక్క ఎప్పుడూ దొంగ బాబాలను ఏరి పారేసే పనిలోనే వుండే చైతన్య(మురళీశర్మ) దృష్టి కృష్ణానంద స్వామిపై పడుతుంది. టైమ్‌ కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే కృష్ణానంద స్వామిగా ఛలామణి అవుతున్న శ్రీను వ్యక్తిగతంగా మంచివాడేనని, వసుధ కోసమే అక్కడ వున్నాడని తెలుసుకుంటాడు. శ్రీను దేవుడు ముసుగులో నుంచి బయటపడి సాధారణ జీవితం గడిపేందుకు చైతన్య ఒక ప్లాన్‌ వేస్తాడు. ఆ ప్లాన్‌ ఏమిటి? తన ప్రేమ కోసం వేల కోట్ల డబ్బుని శ్రీను వదులుకోవడానికి సిద్ధపడ్డాడా? ఆశ్రమాన్ని గుప్పిట్లో పెట్టుకున్న త్రిమూర్తుల నుండి శ్రీను ఎలా తప్పించుకున్నాడు? చివరికి శ్రీను, వసుధల పెళ్ళి జరిగిందా? అనేది మిగతా కథ. 

సాధారణ ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి కలిగించని కథ. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల్ని కూడా సెలెక్ట్‌ చేసుకున్నారు. శ్రీనుగా, కృష్ణానంద స్వామిగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌లో విజయ్‌ దేవరకొండ అస్సలు సూట్‌ అవ్వలేదని చెప్పొచ్చు. అతని పెర్‌ఫార్మెన్స్‌గానీ, అతని క్యారెక్టర్‌లో వున్న ఎమోషన్స్‌గానీ ఏ దశలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. రొమాంటిక్‌ సీన్స్‌లో కూడా అతన్ని భరించడం కష్టమే అన్నట్టుగా వుంది అతని పెర్‌ఫార్మెన్స్‌. ఇక హీరోయిన్‌గా నటించిన పూజా ఝవేరి తన క్యారెక్టర్‌ పరిధిలో ఓకే అనిపించింది. పాటల్లో ఆమె గ్లామర్‌ ఏమాత్రం ఎక్స్‌పోజ్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో ప్రభాకర్‌ చేసిన లాయర్‌ పాత్ర, జాకీ చేసిన పోలీస్‌ క్యారెక్టర్‌, ప్రభు చేసిన పొలిటికల్‌ లీడర్‌ క్యారెక్టర్‌ ఏమాత్రం కొత్తదనం లేని విలన్‌ క్యారెక్టర్స్‌. ప్రీ క్లైమాక్స్‌లో కనిపించే ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. హేతువాది చైతన్యగా మురళీశర్మ క్యారెక్టర్‌ కాస్త కొత్తగా అనిపించినా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చూస్తే పైన చెప్పిన ఆర్టిస్టులకు ఈ క్యారెక్టర్లు పెద్దగా పేరు తెచ్చేవి కావు. సుదర్శన్‌, షకలక శంకర్‌, నవీన్‌లతో అక్కడక్కడ కామెడీ చేయించే ప్రయత్నం చేసినా అది అంతగా సక్సెస్‌ అవ్వలేదు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే శ్యామ్‌ కె.నాయుడు ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్‌ అన్నీ రిచ్‌గానే కనిపిస్తాయి. ముఖ్యంగా పాటల్లో ఆ రిచ్‌నెస్‌ అనేది బాగా తెలుస్తుంది. సాయికార్తీక్‌ చేసిన పాటల్లో రెండు డూయట్స్‌ మాత్రమే వినదగ్గవిగా వున్నాయి. వాటి పిక్చరైజేషన్‌ కూడా బాగుంది. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో సాయికార్తీక్‌ ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కాస్తో కూస్తో కొన్ని సీన్స్‌ ఎలివేట్‌ అయ్యాయంటే అది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్లే. లక్ష్మీభూపాల్‌ రాసిన మాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హీరోతో చెప్పించిన కొన్ని డైలాగ్స్‌ ఆడియన్స్‌ చెవులకు కూడా చేరని విధంగా వున్నాయి. మేకింగ్‌ పరంగా చూస్తే పాటల పిక్చరైజేషన్‌ బాగుంది. హీరో చుట్టూ తిరిగే ఈ కథ ఒక అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ మీదే ఎక్కువగా వుంటుంది. కథని బట్టే ఈ సినిమాకి ఖర్చు పెట్టారు తప్ప ఎలాంటి ఆడంబరాలు ఈ సినిమాలో కనిపించవు. డైరెక్టర్‌ శ్రీనివాస రవీంద్ర గురించి చెప్పాలంటే ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా అతను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న విషయంలో అసలు విషయం లేదు. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఏ దశలోనూ సినిమా ఆకట్టుకోదు. టి.వి.లో ఓ సీరియల్‌ చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప సినిమా చూస్తున్నామనిపించదు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా రిలీజ్‌ అయిన ఈ సినిమాలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే సీన్‌ ఒక్కటి కూడా లేదు. ఇందులోని క్యారెక్టర్లు కూడా చాలా విచిత్రంగా వుంటూ మనల్ని వేధిస్తుంటాయి. ఒక ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ముగిసిన తర్వాత సెకండాఫ్‌లో మరిన్ని ట్విస్టులు వుంటాయని ఆశించే ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. మనం ఊహించినట్టుగానే సినిమా నడుస్తూ.. నడుస్తూ.. క్లైమాక్స్‌కి చేరుతుంది. క్లైమాక్స్‌ కూడా పరమ రొటీన్‌గా వుండడంతో నీరసంగా థియేటర్‌ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథలోగానీ, కథనంలోగానీ ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా లేకపోవడం, బోరు కొట్టించే సన్నివేశాలు కోకొల్లలుగా వుండడం సినిమాకి పెద్ద మైనస్‌ పాయింట్స్‌. కథ, కథనాలు ఎలా వున్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యం పెరిగిన ఈ టైమ్‌లో ద్వారక లాంటి సినిమా చూడాలంటే సాహసం చెయ్యాల్సిందే. 

ఫినిషింగ్‌ టచ్‌: వృధా ప్రయాస 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs