Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: వజ్రాలు కావాలా నాయనా!


మూవీ: వజ్రాలు కావాలా నాయనా! 

Advertisement
CJ Advs

బ్యానర్‌: శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్స్ 

తారాగణం: అనిల్‌ బూరగాని, నేహాదేశ్‌పాండే, నిఖిత బిస్థ్‌, విజయ్‌సాయి, చిట్టిబాబు, శివ, అశ్విని తదితరులు. 

సినిమాటోగ్రఫీ: పి. అమర్‌కుమార్‌ 

సంగీతం: జాన్‌ పోట్ల, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: శివప్రసాద్‌, 

ఎడిటింగ్‌: రామారావు జె.పి. 

కథ, నిర్మాత: కిషోర్‌ కుమార్‌ కోట, 

కథనం, డైలాగ్స్‌, దర్శకత్వం: పి. రాధాక్రిష్ణ 

విడుదల తేదీ: 17-2-2017. 

ఒక పెద్ద సినిమా హిట్‌ అయితే వచ్చే లాభం కన్నా..నిర్మాతకి ఒక చిన్న సినిమా హిట్‌ అయితే వచ్చే లాభాలే ఎక్కువ. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిరూపించాయి. 'ప్రేమకథా చిత్రమ్‌' మొదలుకుని రీసెంట్‌గా వచ్చిన 'పెళ్ళిచూపులు' చిత్రం వరకు ఎన్నో చిన్న చిత్రాలు ముందు మంచి టాక్‌ తెచ్చుకుని, ఆ తర్వాత కలెక్షన్స్‌ పరంగా కూడా పెద్ద సినిమాలకు పోటీ నిచ్చాయి. అయితే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాలో ఉండాల్సింది కంటెంట్‌. కంటెంట్‌ తో పాటు కథనం కూడా కరెక్ట్‌గా పడితే కలెక్షన్స్‌ కోసం ప్రమోషన్‌ కూడా చేయాల్సిన అవసరం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయ తీరాలకు చేర్చుతున్నారు. ప్రేక్షకుల ఈ ఆసక్తిని గమనించిన కొందరు దర్శకులు, నిర్మాతలు చిన్న సినిమాలతో తమని తాము నిరూపించుకోవచ్చని సినిమాల రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చిన సినిమా 'వజ్రాలు కావాలా నాయనా!'. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పిస్తుంది..పైన చెప్పుకున్న కొన్ని సినిమాల వలే ఈ 'వజ్రాలు కావాలా నాయనా!' ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ని రాబట్టుకుందా..! లేక ఏదో ఒకటి తీయాలని..ఏం తీస్తున్నారో కూడా తెలియకుండా పోతున్న సినిమాల లిస్ట్‌లోకి ఇది కూడా చేరిందా..వంటివి సమీక్షలో తెలుసుకుందాం. 

ఈ సినిమాకి నిర్మాత అయిన కిషోర్‌కుమార్‌ కోట కథని అందించడం విశేషం. ఆయన రాసుకున్న కథ ప్రకారం..హీరో ప్రేమ్‌(అనిల్‌ బూరగాని) తన స్నేహితులతో కలిసి ఓ సిటీలో నివసిస్తుంటాడు. తను ఎదుర్కొన్న కష్టాలు. ఇకపై ఉండకూడదంటే జీవితంలో ఏదో ఒకటి చేసి కోటీశ్వరుడు కావాలని, అందుకోసం ఏం చేయాలా అని ప్లాన్‌లు వేస్తుంటాడు. ఆ సిటీలో ఉన్న ఓ రాజకుటుంబంలో కోట్లు విలువ గల వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రేమ్‌...తన స్నేహితులతో కలిసి వాటిని దొంగిలించడానికి ప్లాన్‌ చేస్తాడు. అయితే అది అంత సామాన్యమైన విషయం కాదని ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హీరో టీమ్‌కి తెలుస్తుంది. అసలా సామాన్యమైన విషయం కానిది ఏంటి? హీరో టీమ్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయిందా లేదా? అనే చిన్నపాటి ట్విస్ట్‌లతో కూడిన విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఈ కథకి కామెడీని జోడించి తనకున్న బడ్జెట్‌ పరిమితుల్లో దర్శకుడు పి. రాధాక్రిష్ణ సినిమాని తెరకెక్కించాడు కానీ..ప్రేక్షకులని కట్టిపడేసే కథ, కథనం ఇంకా ఉండాలని గమనించలేకపోయాడు. కానీ అతను చేసిన ప్రయత్నానికి మాత్రం మెచ్చుకోవాలి. సినిమా మొత్తానికి ఇంటర్వెల్‌ పార్ట్‌ హైలైట్‌. తర్వాత బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. మిగతా సాంకేతిక పనితనం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కెమెరామెన్‌ అమర్‌..కొన్ని కొన్ని సీన్స్‌ని మాత్రం తన కెమెరాలో చాలా బాగా బంధించాడు. ఆర్టిస్ట్‌ల పరంగా తెలిసిన ముఖాలు చాలా తక్కువ. ఉన్నవాళ్లలో రాణి పాత్ర చేసిన నేహాదేశ్‌పాండే ఓకే అనిపిస్తుంది. హీరో అనిల్‌ ఇంకా రిజిష్టర్‌ కావాలి. అనిల్‌ ప్రక్కన చేసిన విజయ్‌తో పాటు మరో పాత్ర చేసిన నటులు కొన్ని సీన్స్‌లో బాగానే నవ్విస్తారు. నిఖితని గ్లామర్‌ కోసమే తీసుకుని ఉండవచ్చు. ఇంతకు మించి పాత్రల పరంగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. 

ఈ రోజుల్లో చిన్న సినిమా మెప్పించాలంటే ముందు టాక్‌ బాగుండాలి. టాక్‌ పరంగా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, కొన్ని కామెడీ సన్నివేశాలు, రాణి పాత్ర మినహా ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే అంశాలు అయితే ఏమీ లేవు. కామెడీ థ్రిల్లర్‌ అని చెప్పుకున్నా.. థ్రిల్‌ కలిగించే సీన్స్‌ సినిమా మొత్తం మీద 2,3 ఉన్నాయంతే. అవే చాలు అనుకునే వారు నిరభ్యంతరంగా సినిమా చూడొచ్చు. టైటిల్‌లో ఉన్న అభరణాన్ని ఊహిస్తే మాత్రం నిరాశ తప్పదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఇత్తడి దొరుకుతుంది నాయనా..! 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs