Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: ఖైదీ నంబర్ 150


సమీక్ష: ఖైదీ నంబర్ 150 

Advertisement
CJ Advs

తారాగణం: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, అలీ, బ్రహ్మానందం, రఘుబాబు, నాజర్‌, నాగ బాబు తదితరులు

బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, లైకా

రచన: పరుచూరి బ్రదర్స్‌

కథ: మురుగదాస్‌

మాటలు: బుర్రా సాయిమాధవ్‌, వేమారెడ్డి

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

కూర్పు: గౌతంరాజు

ఛాయాగ్రహణం: రత్నవేలు

నిర్మాత: రామ్‌ చరణ్‌

కథనం, దర్శకత్వం: వి.వి. వినాయక్‌

విడుదల తేదీ: జనవరి 11, 2017  

వినీలాకాశంలో చుక్కలెన్నున్నా మెగా చుక్కకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి చిరంజీవి కాసింత బ్రేక్ తీసుకొని పునరాగమనం చేస్తూ తెర మీద తనకే సాధ్యమైన మాస్ మసాలాను దట్టించి ఆకలిగొన్న అభిమానులకు కడుపు నిండా ఫుల్ మీల్సును వడ్డించే చిత్రంగా ఖైదీ నం 150 సినిమా హాళ్లలో దిగింది. అంగరంగ వైభవంగా, సంక్రాంతి ఓ మూడు రోజుల ముందే మన ఇంటి ముంగిట నిలచిందా అనేంత జోరు హుషారులో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కేరింతల మధ్య మెగా స్టార్ సినిమా చూడడంలో ఉండే ఆ కిక్కే వేరు. వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ఈ ఖైదీ నం 150 నిజానికి తమిళ చిత్రం కత్తి రీమేక్ అయినా, మాకు అన్నయ్య ఉంటె చాలు ఇంకేమి అడగొద్దు అనేలా క్రిటిక్స్ నిర్మించిన కోటగోడలని సైతం తునాతునకలు చేస్తూ రిలీజుకు ముందే అమెరికాలో ప్రివ్యూ షోలతో రికార్డుల భరతం పట్టి మిలియన్ డాలర్ క్లబ్బులో దర్జాగా కాలూపుతున్న చిరంజీవి చిత్రం మిగతా అంశాలని మరి విశ్లేషిద్దామా.

కథగా చూస్తే నీరూరు అనే ఓ పల్లెటూరి రైతులను దోచుకుంటున్న కోలా కంపెనీ కార్పొరేట్ అగర్వాల్ (తరుణ్ అరోరా) అరాచకాలకు ఎదురు నిలిచిన కొణిదెల శివ శంకర్ (చిరంజీవి) పోరాటమే ఈ కథ. మెలిక ఏమిటంటే శివ శంకర్ స్థానంలోకి అచ్చూ అతనిలానే ఉండే కత్తి శీను (చిరంజీవి) అనే తెలివైన, బలమైన ఖైదీ కలకత్తా జైలు నుండి పారిపోయి రావడమే. అతనికి తోడుగా ఉండే మిత్రుడు (అలీ), ప్రియురాలు లక్ష్మి (కాజల్) మరియు నీరూరులోని వృద్దాప్యం చెందిన ఓ సమూహం కథలోని కామెడీ, సెంటిమెంట్ పాళ్లను జోడిస్తుంది. ఓవరాలుగా చూస్తే ఇది అవుట్ అండ్ అవుట్ చిరంజీవి సినిమా అనడమే సెంట్ పర్సెంట్ రైట్.

ఇలా కథలో, కథనంలో నవ్యత లోపించినా చిరంజీవి పునరాగమనం చిత్రం కావడంతో మెగాస్టార్ అరవయి ఒక్క ఏళ్ళ వయసులో ఎలా చిందేశారు, ఎలా పోరాటాలు చేశారు, కామెడీ టైమింగ్ ఎలా ఉంది... ఇంకో మాటలో చెప్పాలంటే ఎలా కుమ్మేసారు అని చూడడానికే మనం ఎక్కువ మక్కువగా ఉంటాం. అందుకే కాబోలు ఫ్యాన్స్ ఆశించే అంశాల మీద ఉంచిన శ్రద్ధ వినాయక్ కాసింత కథనం బిగించడంలో పెట్టి ఉంటె ఈనాటి ఖైదీ స్థాయి ఆనాటి ఖైదీకి సరితూగేలా ఉండేది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా రైతుల సమస్యలను, బాధలను కూడా చిరంజీవి ముఖ కవళికలు ద్వారానే ఎమోషన్ ద్వారా రాబట్టాలనుకున్న వినాయక్ ఏ స్థాయిలో చిరు సెంట్రిక్ మూవీ చేయాలనుకున్నాడో అవగతం అవాలి. 

శంకర్ పాత్రలో చిరంజీవి ఆనాటి ఖైదీలోని అమాయకత్వం ఆహార్యం, వాక్చాతుర్యతతో ప్రేక్షకుల కంటనీరు పెట్టించారు. ఇక రెండోది కత్తి శీను రోల్ ఈయనకి దంచికొట్టిన పిండిలాంటిది. అలాగే ఆడియెన్స్ సైతం రిలీఫ్ ఫీలయ్యి బాస్ ఈజ్ బ్యాక్ అనేలా అమోఘమైన ఎనర్జీతో నడిచింది. మనం కోరుకునే కామెడీ, నృత్యాలు, పోరాటాలు, రొమాన్స్, హీరోఇజం ఈ పాత్ర సొంతం. కాజల్ అగర్వాల్ ఓన్లీ ఫర్ గ్లామర్ అండ్ సాంగ్స్ అనేలా తయారయింది. సినిమా మొత్తం మీద పాటలను మినహాయిస్తే ఈవిడకు దక్కిన స్క్రీన్ టైం జస్ట్ మూడు నిమిషాలు ఉండి ఉండవచ్చు. కామెడీ కోసం బ్రహ్మానందాన్ని ఎన్నోసార్లు వాడి పడేసిన ఓ ట్రాకులో ఇరికించేసి ఇబ్బంది పెట్టారు. అలీ పాత్ర ఫుల్ లెంగ్త్ చిరుతో ట్రావెల్ అవుతుంది. తరుణ్ అరోరాకి విలన్ కన్నా మోడల్ ఛాయలు ఎక్కువ. అందుకే గట్టి విలనీ లేక త్రాచు హీరో వైపు ఎక్కువ మొగ్గినా పెద్ద కిక్కు రాలేదు. సరైన ప్రతినాయకుడు లేకపోవడం సినిమాకు అతిపెద్ద డ్రాబ్యాక్. మిగిలిన ఆర్టిస్టుల్లో రఘుబాబు ఫకారం, నాగబాబు న్యాయమూర్తి అవతారం, నాజర్ ఎపిసోడ్ అలా వఛ్చి ఇలా పోయేవే తప్ప కథనానికి పనికొచ్చింది ఏమీ లేదు.

రత్నవేలు కెమెరాలో చిరంజీవి అందం మరింత ద్విగుణీకృతం అయింది. శంకర్ పాత్రలో కంటే శీను పాత్రలో మెగాస్టార్ అదుర్స్ అనిపిస్తాడు. గౌతంరాజు కూర్పు విభాగంలో పెద్ద మెరుపులేవీ కనిపించలేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు, రత్తాలు థియేటర్ మొత్తం హోరెతించాయి. నీరు నీరు పాట మనసును హత్తుకుంది. డ్యాన్స్ మాస్టర్లు లారెన్స్, జానీ అండ్ శేఖర్ పనితనం బాగానే వుంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. సాయి మాధవ్ బుర్ర, వేమా రెడ్డి సంభాషణలు ఫర్వాలేదు. మూలకథ రచనకు మురుగదాస్ పేరు వేసి ఆయన్ని గౌరవించారు. చరణ్ నిర్మాతగా మొదటి సినిమాతోనే హద్దులు, పద్దులు తెలుసుకున్నారు.

సినిమా టేకాఫ్ కాస్త మందకొడిగానే ఉంటుంది. కలకత్తా జైలు నుండి పారిపోయిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్న సంభాషణలు పెద్దగా పండలేదు. అలీ రావడంతో చిరు కామెడీతో టైం పాస్. హీరోయిన్ కాజల్ ఎంట్రీ పాటలకు, లవ్ ట్రాకుకు తెర లేపుతుంది. అటు వైపు శంకర్ పాత్రలోకి శీను వెళ్ళడానికి మరింత స్ట్రాంగ్ రీజన్ ఇస్తే బాగుండేది. శంకర్ బ్యాక్ స్టోరీని తెర మీద ఆవిష్కరించిన వైనం కట్టి పడేసింది. అందుకే ఫస్ట్ హాఫ్ కథాపరంగా, బాస్ పరంగా బాగుంది అనేలా తయారయింది.

రెండో సగంలో వినాయక్ పట్టు తప్పింది. బ్యాక్ బోనుగా ఉండాల్సిన కాయిన్ ఫైట్, పైప్ లైన్లోకి మంచి నీరును ఆపిన దృశ్యాలు పెద్దగా పండలేదు, చుట్టి పడేశారన్న ఫీలింగ్ కలిగింది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మొత్తం చిత్రాన్ని ముగించాలన్న ఆత్రమే తప్ప సరైన ఆవేశం కానరాలేదు.

ఎన్ని ప్లస్సులు, మైనస్సులు వెదికినా చిరంజీవి ఇమేజి ముందు నిలబడవు. ఎందుకంటే ఇది బాస్ ఈజ్ బ్యాక్ మూవీ కాబట్టి. అరవైలో సైతం ఇరవై హీరోలకున్న చార్మ్ చిరు సొంతం. అందుకే కొలతలు పక్కన పెట్టి మెగా మాయలో పడి దొర్లాలంటే ఖైదీ నం 150ని దర్శించుకోవాల్సిందే. బాక్సాఫీస్ పరంగా రానున్నవి మరిన్ని పండగ రోజులు కనక చిత్రానికి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండకపోవచ్చు. బాస్ దెబ్బకి బాక్సాఫీస్ బద్దలయినట్టే. సో, ఫ్యాన్స్ కుమ్ముడు షురూ.

ఫినిషింగ్ టచ్: బాస్ ఈజ్ బ్యాక్ (కండిషన్స్ అప్లై) 

సినీజోష్ రేటింగ్: 3/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs