Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు


అరన్‌ మీడియా వర్క్స్‌ 

Advertisement
CJ Advs

అప్పట్లో ఒకడుండేవాడు 

తారాగణం: నారా రోహిత్‌, శ్రీవిష్ణు, తాన్యా హోప్‌, బ్రహ్మాజీ, 

రాజీవ్‌ కనకాల, సత్యప్రకాష్‌, ప్రభాస్‌ శ్రీను, సత్యదేవ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: నవీన్‌ యాదవ్‌ 

సంగీతం: సాయికార్తీక్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సురేష్‌ బొబ్బిలి 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

సమర్పణ: రోహిత్‌ 

నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌ 

రచన, దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర 

విడుదల తేదీ: 30.12.2016 

నారా రోహిత్‌ ఇప్పటివరకు హీరోగా 13 సినిమాల్లో నటించినా హిట్‌ అయిన సినిమాలు చాలా తక్కువ. తాజాగా రోహిత్‌ నిర్మాతగా కూడా మారి హీరోగా నటించిన చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. ఈ సంవత్సరం ఇది అతను నటించిన ఆరో సినిమా కావడం విశేషం. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి నారా రోహిత్‌ చేసిన ఈ సినిమా టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పట్లో ఒకడుండేవాడు అనే డిఫరెంట్‌ టైటిల్‌తో కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకొని సాగర్‌ రూపొందించిన ఈ సినిమా హీరోగా, నిర్మాతగా నారా రోహిత్‌కి ఎలాంటి ఫలితాన్నిచ్చింది? హీరోగా శ్రీవిష్ణుకి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అయింది? ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌ చెప్పదలుచుకున్నదేమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అది 1992. హైదరాబాద్‌లోని రైల్వే కాలనీలో తల్లితో కలిసి వుండే రాజు(శ్రీవిష్ణు)కి క్రికెట్‌ ప్లేయర్‌గా మంచి పేరు వుంది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించి వార్తల్లోకి ఎక్కుతాడు. నేషనల్‌ స్థాయిలో క్రికెట్‌ ఆడి పేరు తెచ్చుకోవాలన్నది అతని యాంబిషన్‌. అతను నిత్య(తాన్యా హోప్‌) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతని లైఫ్‌ అలా జాలీగా గడిచిపోతున్న తరుణంలో దురదృష్టం ఇంతియాజ్‌ ఆలీ(నారా రోహిత్‌) రూపంలో అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఐదేళ్ళ క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయిన రాజు అక్క అహల్య నక్సలైట్‌గా మారిపోతుంది. నక్సలైట్‌ దళపతి సవ్యసాచిని పెళ్ళి చేసుకుంటుంది. నక్సలైట్స్‌ని అంతమొందించే క్రమంలో మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ వస్తున్న ఇంతియాజ్‌ కన్ను రైల్వేరాజుపై పడుతుంది. అతని అక్క నక్సలైట్‌ కావడం వల్ల ఇంతియాజ్‌ ఫోకస్‌ అంతా రాజుపైనే పెడతాడు. అహల్య ఆచూకీ చెప్పమంటూ హింసిస్తుంటాడు. ఇంతియాజ్‌ వల్ల, రౌడీషీటర్‌ భగవాన్‌ దాస్‌ వల్ల రైల్వే రాజు జీవితం అల్లకల్లోలమైపోతుంది. రాజుపై పోలీస్‌ కేసులు వుండడంతో క్రికెట్‌ టీమ్‌కి సెలెక్ట్‌ అవ్వడు. మరో పక్క నక్సలైట్స్‌ చేతుల్లోనే అక్క అహల్య హత్య చేయబడుతుంది. ఆ బాధతో అతని తల్లి కూడా చనిపోతుంది. అన్నివిధాలా కృంగిపోయిన రైల్వేరాజుకి బిజినెస్‌మేన్‌ అశోక్‌కుమార్‌రెడ్డి(రాజీవ్‌ కనకాల) పరిచయమవుతాడు. దాంతో రైల్వేరాజు రేంజ్‌ పెరుగుతుంది. తన కెరీర్‌ నాశనమవడానికి కారణమైన ఇంతియాజ్‌పై పగ తీర్చుకోవడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి రైల్వే రాజు, ఇంతియాజ్‌ మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? రైల్వేరాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ. 

ప్రజెంట్‌లో స్టార్ట్‌ అయ్యే ఈ కథలో ఓ లేడీ జర్నలిస్ట్‌ జైల్లో వున్న రైల్వేరాజు మిత్రుడ్ని కలుసుకోవడం, అతని ద్వారా రైల్వేరాజు కథ తెలుసుకోవడం జరుగుతుంది. 90 దశకంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల్ని తీసుకొన్ని వాటిని సినిమాటిక్‌గా అందర్నీ ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్‌ సాగర్‌ సక్సెస్‌ అయ్యాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే టైటిల్‌ రైల్వేరాజుకే వర్తిస్తుంది కాబట్టి సినిమాలో అతని క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యముంటుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా నారా రోహిత్‌ క్యారెక్టర్‌కి కూడా కథలో ఇంపార్టెన్స్‌ వున్నప్పటికీ రైల్వే రాజు క్యారెక్టరే హైలైట్‌ అవుతుంది. ఆ క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌లెంట్‌ అని చెప్పాలి. అన్ని రకాల ఎమోషన్స్‌ని అద్భుతంగా పండించాడు. అతన్ని క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ చేసి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నారా రోహిత్‌ కూడా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. నిత్యగా తాన్యా హోప్‌ పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ చేసింది. ఆమె గ్లామర్‌ కూడా సినిమాకి బాగా ప్లస్‌ అయింది. క్లైమాక్స్‌లో కనిపించే సత్యదేవ్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో కంటతడి పెట్టించాడు. మిగతా క్యారెక్టర్స్‌లో ప్రభాస్‌ శ్రీను, బ్రహ్మాజీ, రాజీవ్‌ కనకాల ఇన్‌వాల్వ్‌ అయి చేశారు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌కి వస్తే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ అంతగా హెల్ప్‌ అవ్వలేదు. ఫిక్షనల్‌ బయోపిక్‌గా రూపొందిన ఇలాంటి సినిమాలో సినిమాటోగ్రఫీకి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. ప్రజెంట్‌లో వచ్చే సీన్స్‌, 90 దశకంలోని సీన్స్‌ ఒకేలా అనిపిస్తాయి. ఈ రెండింటికీ వేరియేషన్స్‌ చూపించకపోవడం వల్ల విజువల్‌గా ఆడియన్స్‌ శాటిస్‌ఫై అవ్వకపోవచ్చు. సాయికార్తీక్‌ మ్యూజిక్‌ సినిమాకి ఏమాత్రం ప్లస్‌ అవ్వలేదు. సినిమాలో పాటలకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా ఉన్న రెండు మూడు పాటలు కూడా ఆకట్టుకునేలా లేవు. ఇక సురేష్‌ బొబ్బిలి చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్ళింది. కథలోని ప్రతి ఎమోషన్‌ని తన మ్యూజిక్‌తో హైలైట్‌ చేశాడు సురేష్‌. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ కూడా కథ, కథనాలకి తగ్గట్టుగా ఆకట్టుకునేలా వుంది. డైరెక్టర్‌ సాగర్‌ కె.చంద్ర గురించి చెప్పాల్సి వస్తే. అప్పట్లో ఒకడుండేవాడు అనే టైటిల్‌ని సెలెక్ట్‌ చేసుకోవడంలోనే అతను సగం సక్సెస్‌ అయ్యాడు. తను అనుకున్న కథని చక్కని స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ బోర్‌ ఫీలవకుండా నడిపించడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. వినడానికి ఇది పాత కథలాగే అనిపించినా కథనం వల్ల నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ పెంచుతుంది. నారా రోహిత్‌ తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన ఈ సినిమాలో ఫోటోగ్రఫీని మినహాయిస్తే మిగతావన్నీ బాగా కుదిరాయి. కంటెంట్‌ పరంగా స్ట్రాంగ్‌గా వున్న ఈ సినిమాకి ఎ సెంటర్స్‌లో రెస్పాన్స్‌ అద్భుతంగా వుంటుందనడంలో సందేహం లేదు. బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌ కోరుకునే కామెడీ, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ సినిమాలో లేకపోవడం వల్ల అప్పట్లో ఒకడుండేవాడు వారికి ఎంతవరకు శాటిస్‌ఫై చేస్తుందో చూడాలి. ఫైనల్‌గా చెప్పాలంటే డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ని కోరుకునేవారికి, కొత్త తరహా చిత్రాలను చూడడానికి ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: అప్పటి కథతో వచ్చిన ఫ్రెష్ మూవీ

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs