శ్రీసత్యసాయి ఆర్ట్స్
మీలో ఎవరు కోటీశ్వరుడు
తారాగణం: నవీన్‌చంద్ర, పృథ్వీ, సలోని, శృతి సోధి, మురళీశర్మ,
పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ధన్‌రాజ్, పిళ్ళా ప్రసాద్,
ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: బాలరెడ్డి పి.
సంగీతం: డి.జె.వసంత్
ఎడిటింగ్: గౌతంరాజు
కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి
కథావిస్తరణ: విక్రమ్‌రాజ్
సమర్పణ: లక్ష్మీరాధామోహన్
నిర్మాత: కె.కె.రాధామోహన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు
విడుదల తేదీ: 16.12.2016
మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ టైటిల్ వినని తెలుగువారు లేరు. అక్కినేని నాగార్జున నిర్వహించిన ఈ షోలో పాల్గొని లక్షాధికారులు అయిన వారున్నారు. ఇప్పుడు అదే టైటిల్‌తో, ఒక్క ఐడియా కోటి రూపాయలు అనే క్యాప్షన్‌తో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మాత కె.కె.రాధామోహన్ ఓ చిత్రాన్ని నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ అంటూ పబ్లిసిటీ మొదలుపెట్టి, సినిమాలోని కొన్ని కామెడీ బిట్స్‌తో ఒక అద్భుతమైన ట్రైలర్‌ను రిలీజ్ చెయ్యడం ద్వారా ఆద్యంతం నవ్వులు పంచే చిత్రమని ప్రేక్షకుల్ని నమ్మించగలిగారు. నవీన్‌చంద్ర, పృథ్వీ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూసి సరదాగా రెండు గంటలు నవ్వుకోవచ్చని థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతవరకు ఎంటర్‌టైన్ చెయ్యగలిగింది? అసలు ఈ సినిమాకి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ట్రైలర్‌లో చూపించినట్టు నిజంగానే సినిమాలో అంత కామెడీ కంటెంట్ వుందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
డబ్బు, హోదాతో అన్నీ వచ్చేస్తాయని, అవి వుంటే సంతోషం, ఆనందం మన వెంటే తిరుగుతాయని నమ్మే ఓ బిజినెస్‌మేన్ ఎబిఆర్(మురళీశర్మ). అతని కూతురు ప్రియ(శృతిసోధి) ఓ మధ్యతరగతికి చెందిన ప్రశాంత్(నవీన్‌చంద్ర) ప్రేమలో విచిత్రంగా పడిపోతుంది. వీళ్ళిద్దరి ప్రేమను ఎబిఆర్ ఎలాగూ ఒప్పుకోడు. ఫ్లైట్స్‌లో తిరిగే మేమెక్కడ? వ్యవసాయం చేసుకునే మీరెక్కడ? మా దగ్గర వున్నంత సంతోషంగా, ఆనందంగా నా కూతురు నీ దగ్గర వుండగలదా? అని ప్రశాంత్‌ని అడుగుతాడు. అప్పుడు ప్రశాంత్ తన టాలెంట్‌ని చూపించి సంతోషం వేరు, ఆనందం వేరు అంటూ ఓ కొత్త డెఫినెషన్ ఇస్తాడు. ఒక్కసారి ఓడి గెలిస్తే వచ్చేదే ఆనందం అని, అలా చేసి చూడమని ఎబిఆర్ ఈగోను హర్ట్ చేస్తాడు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న ఎబిఆర్ తనకు నష్టం వచ్చే బిజినెస్ ఐడియా చెప్పినవారికి కోటి రూపాయలు ఇస్తానని ఎనౌన్స్ చేస్తాడు. సినిమా తీస్తే తప్పకుండా నష్టం వస్తుందని ఓ గొప్ప ఐడియా ఇస్తాడు సినిమాలు తీసి నష్టపోయిన తాతారావు(పోసాని). ఆ ప్రాసెస్‌లో ఫ్లాప్ సినిమాలు తియ్యడంలో ఎక్స్‌పర్ట్ అయిన రోల్డ్‌గోల్డ్ రమేష్(రఘుబాబు)ని ప్రవేశపెడతాడు తాతారావు. వేరియేషన్ స్టార్‌గా చెప్పుకునే జూనియర్ ఆర్టిస్ట్ వీరబాబు హీరోగా తమలపాకు పేరుతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్లాప్ సినిమా తియ్యడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేసిన తమలపాకు చిత్రానికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది? సంతోషం, ఆనందం మధ్య వున్న వ్యత్యాసాన్ని ఎబిఆర్ తెలుసుకోగలిగాడా? ప్రశాంత్, ఎబిఆర్ మధ్య జరిగిన ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది మిగతా కథ.
ప్రేక్షకుల్ని నాన్‌స్టాప్‌గా నవ్వించాలంటే క్యారెక్టర్స్ ద్వారా పుట్టే కామెడీ కంటే కథలోని మెయిన్ పాయింటే కామెడీతో కూడుకున్నదై వుండాలి. అప్పుడే ప్రేక్షకులు దాన్ని ఒక కామెడీ సినిమాగా పరిగణిస్తారు. క్యారెక్టర్స్ ద్వారా వచ్చే కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు కూడా వున్నాయి. అయితే అలాంటి సినిమాలు సక్సెస్ అయిన దాఖలాలు తక్కువ. ఈ సినిమా విషయానికి వస్తే మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ జనంలో బాగా రిజిష్టర్ అయిన టైటిల్‌తో సినిమాని స్టార్ట్ చేసి, ఆద్యంతం వినోదాల విందు పంచే చిత్రంగా పబ్లిసిటీ చేసినా సినిమాలో అంత విషయం లేదని చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. హీరోయిన్ ఎంట్రీతో స్టార్ట్ అయ్యే సినిమా ఆ తర్వాత హీరో వెంట పడుతూ ప్రేమించమని వేధించడం, దానికి హీరో ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత ఇద్దరూ ఐ లవ్ యు చెప్పుకోవడం వరకు జరిగే ప్రాసెస్ అంతా తెగ బోర్ కొట్టిస్తుంది. వేరియేషన్ స్టార్ వీరబాబుగా పృథ్వీ ఎంటర్ అయిన తర్వాత అయినా సినిమాలో కామెడీ స్పీడప్ అవుతుందేమో అనుకుంటే అది అంతకంటే బోర్ అనిపిస్తుంది. ఒక ఫ్లాప్ సినిమా తియ్యడానికి కారణమైన హీరో హీరోయిన్ల ఎపిసోడ్ ఎంత పేలవంగా వుందో సినిమాలో సినిమా అంతకంటే పేలవంగా వుంది. పృథ్వీ అనగానే కామెడీ బాగుంటుందని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పృథ్వీ టెన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేదు. తమలపాకు సినిమాలోని కథ చాలా ఫ్లాట్‌గా ఎక్కడా నవ్వు రాని విధంగా వుంది. జనరల్‌గా ప్రతి సినిమాలో పృథ్వీ కనిపించే పది నిముషాలు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తాడు. కానీ, ఈ సినిమాలో సెకండాఫ్ మొత్తం అతనే వున్నా కామెడీ అనేది పండలేదు. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పోసాని కృష్ణమురళి, రఘుబాబు పెర్‌ఫార్మెన్స్ వల్ల అడపా దడపా నవ్వుకునే అవకాశం వచ్చింది తప్ప మెయిన్ క్యారెక్టర్స్ ఈ విషయంలో సక్సెస్ అవ్వలేకపోయారు.
సాంకేతికంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. బాలరెడ్డి ఫోటోగ్రఫీ చాలా సాదా సీదాగా వుంది. డిజె వసంత్ పాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. డైరెక్టర్ సత్తిబాబు గురించి చెప్పాలంటే గతంలో అతను చేసిన కామెడీ సినిమాల కంటే తక్కువ స్థాయిలో ఈ సినిమా వుంది. కథలో విషయం లేకపోవడం, మాటలు అక్కడక్కడ మాత్రమే పేలడం, కథనం నత్త నడకతో సాగడం, ఎంటర్‌టైన్‌మెంట్ తక్కువగా వుండడం, పృథ్వీ కామెడీ పండకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌లుగా మారాయి. ఈ కథలో ఒక ఫ్లాప్ సినిమా తియ్యాలని ట్రై చేసిన నిర్మాత ఎబిఆర్ సక్సెస్ అవ్వలేక సూపర్‌హిట్ సినిమా తీశాడు. వాస్తవానికి వస్తే అందర్నీ ఎంటర్‌టైన్ చేసి సూపర్‌హిట్ కొట్టాలనుకున్న రాధామోహన్, సత్తిబాబు మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారు.
ఫినిషింగ్ టచ్: ఒక్క సినిమా బోలెడంత బోరు
సినీజోష్ రేటింగ్: 2/5