Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా


శివరాజ్‌ ఫిలింస్‌, ఎన్‌.కె.ఆర్‌. ఫిలింస్‌ 

Advertisement
CJ Advs

జయమ్ము నిశ్చయమ్మురా 

తారాగణం: శ్రీనివాసరెడ్డి, పూర్ణ, పోసాని, కృష్ణభగవాన్‌, ప్రవీణ్‌, 

జీవా, రవివర్మ, జోగినాయుడు, కృష్ణంరాజు తదితరులు 

సినిమాటోగ్రఫీ: నగేష్‌ బనెల్‌ 

సంగీతం: రవిచంద్ర 

ఎడిటింగ్‌: వెంకట్‌ 

సమర్పణ: ఎ.వి.ఎస్‌.రాజు 

నిర్మాతలు: శివరాజ్‌ కనుమూరి, సతీష్‌ కనుమూరి 

రచన, దర్శకత్వం: శివరాజ్‌ కనుమూరి 

విడుదల తేదీ: 25.11.2016 

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా.. జంకు బొంకు లేక ముందుకు సాగిపొమ్మురా.. అంటూ ఆరోజుల్లో ఎన్టీఆర్‌ పాట పాడి మరీ చెప్పారు. ఏ పని చేసినా ధైర్యంగా చెయ్యాలి, ఆత్మ విశ్వాసంతో చెయ్యాలి తప్ప అంధ విశ్వాసం, మూఢ నమ్మకాలతో కాదు.. అనేది చాలా సినిమాల్లో చూపించేశారు. మళ్ళీ అదే విషయాన్ని మరో కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నమే జయమ్ము నిశ్చయమ్మురా. శ్రీనివాసరెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా శివరాజ్‌ కనుమూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమెడియన్‌గా అందరిచేతా శభాష్‌ అనిపించుకున్న శ్రీనివాసరెడ్డి హీరోగా సినిమా అనగానే ఆడియన్స్‌ అతని నుంచి కామెడీనే ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడం సహజం. మరి వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ని శ్రీనివాసరెడ్డి రీచ్‌ అయ్యాడా? ఈ సినిమాలో అతను ఎలాంటి క్యారెక్టర్‌ చేశాడు? దేశవాళీ వినోదం అంటూ ఈ సినిమాకి పబ్లిసిటీ చేశారు? మరి ఈ సినిమాలో వినోదం ఎంత పాళ్ళలో వుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మన హీరో పేరు సర్వ మంగళం(శ్రీనివాసరెడ్డి). మంచి భక్తుడు, మూఢ నమ్మకాల విషయంలో అంతకుమించి అన్నట్టుగా వుంటాడు. ఏ పనైనా శుభఘడియల్లోనే చేస్తుంటాడు. ఈ విషయంలో అతన్ని గైడ్‌ చేస్తుంటాడు పిత(జీవా) అనే స్వామీజీ. సర్వం రాసిన ఓ ఎగ్జామ్‌లో పాస్‌ అయి ఉద్యోగం సంపాదించుకుంటాడు. అది పిత చెప్పినట్టుగా చెయ్యడం వల్లే జరిగిందని నమ్ముతాడు. కాకినాడలోని మున్సిపల్‌ ఆఫీస్‌లో గుమస్తాగా ఉద్యోగంలో జాయిన్‌ అవుతాడు. అంతకుముందు ఒకటి రెండు సందర్భాల్లో తనకు ఎదురుగా వచ్చిన రాణి(పూర్ణ) వల్లే తనకు మంచి జరిగిందని నమ్మిన సర్వం ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. తమ ఆఫీస్‌ పక్కనే వున్న మీ సేవలో పనిచేసే రాణి పుట్టినరోజు వివరాలు సంపాదించి పితకు పంపిస్తాడు. పిత కూడా ఇద్దరి జాతకం అద్భుతంగా వుందని చెప్పడంతో తన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాడు సర్వం. ఆ ప్రయత్నంలో అతనికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. జాతకాలు, మూఢనమ్మకాలు అనేవి మనిషి బలహీనతలు అనీ, ఆత్మ విశ్వాసం వుంటే దేన్నయినా సాధించవచ్చని తెలుసుకుంటాడు. తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విషయంలో సర్వం తెలుసుకున్న విషయాలు ఏమిటి? మూఢ నమ్మకాల్ని పక్కన పెట్టి ఆత్మ విశ్వాసంతో సర్వం తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? చివరికి కథ ఎలా సుఖాంతమైంది? అనేది మిగతా సినిమా. 

సాధారణంగా కమెడియన్‌గానే ఎక్కువ సినిమాల్లో మనం చూసిన శ్రీనివాసరెడ్డి ఇందులో భిన్నమైన క్యారెక్టర్‌ చేశాడు. సిన్సియర్‌ లవర్‌గా తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. అతని క్యారెక్టర్‌లో కామెడీ పాళ్ళు తక్కువ అవడం సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేని అంశమే అయినప్పటికీ కథ పరంగా అతను చేసిన క్యారెక్టర్‌ సరైనదే అనిపిస్తుంది. రాణిగా పూర్ణ చేసిన క్యారెక్టర్‌లో కొత్తదనం ఏమీ లేకపోయినా తన క్యారెక్టర్‌ని బాగానే చేసింది. కథలోని హీరో, హీరోయిన్‌ల క్యారెక్టర్లను పక్కన పెడితే ఇక చెప్పుకోవాల్సింది కమెడియన్ల గురించి. మున్సిపాలిటీ ఆఫీస్‌ చుట్టూ తిరిగి ఇబ్బంది పడే క్యారెక్టర్‌లో పోసాని తన సహజశైలిలో నటించాడు. ఎదుటి వారు సంతోషంగా వుంటే చూడలేని విచిత్రమైన క్యారెక్టర్‌లో కృష్ణభగవాన్‌ మంచి కామెడీని పండించాడు. అతను చేసిన మంగళవారం ఎపిసోడ్‌ అందర్నీ బాగా నవ్విస్తుంది. మున్సిపాలిటీ బ్రోకర్‌ తత్కాల్‌గా ప్రవీణ్‌ కూడా బాగా నవ్వించాడు. జాయింట్‌ కలెక్టర్‌గా రవివర్మ ఆకట్టుకున్నాడు. తన ఆఫీస్‌లో వుండే కోతి బొమ్మతో అతను సీరియస్‌గా చెప్పే డైలాగ్స్‌ మనకు నవ్వు తెప్పిస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో కామన్‌గా కనిపించే క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు బాగా ఎంటర్‌టైన్‌ చేశాడు. అతను కనిపించిన ప్రతి సీన్‌లో నవ్వించాడు. ఇక ప్రభాస్‌ శ్రీను, రఘు కారుమంచి కూడా నవ్వించడంలో తమ వంతు ప్రయత్నం చేశారు. 

టెక్నికల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో ఫోటోగ్రఫీ బాగున్నా విజువల్‌గా ఎఫెక్టివ్‌గా చూపించడంలో సక్సెస్‌ అవ్వలేకపోయారు. లొకేషన్స్‌, బ్యాక్‌డ్రాప్‌ అన్నీ బాగానే వున్నట్టు అనిపించినా టెక్నికల్‌గా స్టాండర్డ్స్‌ తగ్గాయనిపిస్తుంది. మ్యూజిక్‌ విషయానికి వస్తే రవిచంద్ర చేసిన పాటల్లో ఓ బంగరు చిలక అనే పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. మిగిలిన పాటలు అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిముషాలు. వాస్తవానికి ఈ కథకి, ఇందులో కామెడీ సీన్స్‌కి అంత నిడివి అవసరం లేదనిపిస్తుంది. లెంగ్త్‌ని పెంచే సీన్స్‌ 20 నిముషాల వరకు కట్‌ చేసే వీలుంది. ఈ విషయంలో ఎడిటర్‌కి ఎంతవరకు స్వేచ్ఛనిచ్చారో తెలీదు. డైరెక్టర్‌ శివరాజ్‌ కనుమూరి గురించి చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దని, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళమనే సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చాడు. హీరో తనకు తగిన భార్యగా హీరోయిన్‌ని అనుకొని ఆమె ప్రేమను పొందడానికి ప్రయత్నించడం అనేది కామనే. అయితే దాన్ని లెంగ్తీగా చూపించడం వల్ల ఫస్ట్‌ హాఫ్‌లో చాలా బోర్‌ కొడుతుంది. దానికి తగ్గట్టుగా స్లో నేరేషన్‌ కూడా మైనస్‌ అయింది. కథ చుట్టూ సెట్‌ చేసుకున్న కామెడీ క్యారెక్టర్స్‌తో వీలైనంత ఎక్కువ కామెడీ చేయించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. దేశవాళీ వినోదం అంటూ ఈ సినిమాకి ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగానే కామెడీ కూడా దేశవాళీగానే వుంది. సొసైటీలో మనం జనరల్‌గా చూసే క్యారెక్టర్లతోనే కామెడీని క్రియేట్‌ చేశాడు. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో అక్కడక్కడ కొన్ని బోర్‌ కొట్టించే సన్నివేశాలున్నా అందరూ హాయిగా ఎంజాయ్‌ చేసేలా డైరెక్టర్‌ శివరాజ్‌ కనుమూరి ఈ చిత్రాన్ని రూపొందించాడు. అన్ని సినిమాల్లోలాగా ట్విస్ట్‌తో కూడిన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, ఓ భారీ ఫైట్‌తో క్లైమాక్స్‌.. ఇందులో లేవు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ చాలా సాదా సీదాగా వుంటాయి. నేరేషన్‌ స్లోగా వుండడం, ఒక్క పాట మినహా మ్యూజిక్‌ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం, సినిమా లెంగ్త్‌ ఇవన్నీ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌గా నిలిచినప్పటికీ అందర్నీ ఆకట్టుకునే కామెడీ వల్ల ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌తోనే ఆడియన్స్‌ థియేటర్‌ నుంచి బయటికి వస్తారు. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటారు. కమర్షియల్‌గా ఈ సినిమా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: జయమ్ము నిశ్చయమ్మురా.. 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs