యునిక్రాఫ్ట్ మూవీస్
మనలో ఒకడు
తారాగణం: ఆర్.పి.పట్నాయక్, అనిత, సాయికుమార్,
తనికెళ్ళ భరణి, నాజర్, బెనర్జీ, దువ్వాసి మోహన్, రఘుబాబు,
శ్రీముఖి, రాజారవీంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.జె.సిద్ధార్థ్
ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్
మాటలు: తిరుమల్ నాగ్
నిర్మాత: గురజాల జగన్‌మోహన్
రచన, సంగీతం, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్
విడుదల తేదీ: 04.11.2016
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సినీతార, అవినీతికి పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బడా రాజకీయ నాయకుడు, విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న లెక్చరర్ బండారం బట్ట బయలు... ఇలా ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్‌తో మన న్యూస్ ఛానల్స్ హడావిడి చేయడం మనం చూస్తూనే వుంటాం. అయితే అందులో ఎంతవరకు నిజం వుంది? ఎవరు దోషులు? ఎవరు నిర్దోషులు? వంటి విషయాలను పక్కనపెట్టి చూపించిన విజువల్స్‌నే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ మన రిమోట్‌కి పనిపెట్టే వార్తలు గుప్పించడంలో టి.వి. ఛానల్స్ మించినవారు మరొకరు వుండరు. తమ తమ టిఆర్‌పి రేటింగ్స్‌ని పెంచుకోవడానికి కొన్ని ఛానల్స్ యాజమాన్యాలు ఎలాంటి ఘోరాలకు పాల్పడతాయి? తప్పు చేసినవారిని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తారు? వంటి విషయాలు ఆ నోట, ఈ నోట వినడమే తప్ప సాధారణ ప్రేక్షకులకు దీనిపై సరైన అవగాహన వుండదు. అసలు న్యూస్ ఛానల్స్‌లో ఏం జరుగుతోంది? ప్రజలకు నిజాయితీగా, నిర్భయంగా వార్తలు అందించాలని కాకుండా దానిపై సొమ్ము చేసుకోవాలని ఎందుకు ఆశ పడుతున్నారు? ఒక తప్పుడు వార్త వల్ల సాధారణ పౌరుడికి నష్టం జరిగితే దాన్ని ఒప్పుకోలేని ఛానల్ యాజమాన్యం, తప్పును సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నించని యాజమాన్యం. ఇలాంటి ఓ సున్నితమైన సమస్యని తీసుకొని ఆర్.పి.పట్నాయక్ తాజాగా రూపొందించిన చిత్రమే మనలో ఒకడు. ఈ చిత్రంలో ఆర్.పి. డిస్కస్ చేసిన అంశాలేమిటి? మెయిన్‌గా ఎవర్ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తీశాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఆ ఛానల్‌కి రోజుకో సెన్సేషనల్ న్యూస్ కావాలి. అలాంటి న్యూస్ లేకపోయినా క్రియేట్ చేసైనా సెన్సేషన్ చెయ్యాలి. అది మూడో కన్ను న్యూస్ ఛానల్ పాలసీ. దాని ఓనర్ సాయికుమార్. అతనికి అండదండగా వుంటూ అన్నివిధాలా సాయపడే న్యూస్ రీడర్ శ్రీముఖి. కట్ చేస్తే అతని పేరు కృష్ణమూర్తి(ఆర్.పి.పట్నాయక్). ఓ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అతనంటే అందరికీ గౌరవం. పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే మంచి మనిషి. ఓ రోజు క్లాస్‌లో వున్న కృష్ణమూర్తికి ప్రిన్సిపల్ నుంచి పిలుపు వస్తుంది. అతని రూమ్‌లోకి వెళ్ళిన కృష్ణమూర్తి మూడో కన్ను న్యూస్ ఛానల్‌లో వస్తున్న వార్త చూసి షాక్ అవుతాడు. దేవరాయ కాలేజ్‌లో పనిచేస్తున్న కృష్ణమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆ విషయాన్ని తమ ఛానల్‌కి ఆ కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఫోన్ చెప్పిందన్నది ఆ వార్త సారాంశం. వాస్తవానికి ఆ అమ్మాయిని వేధించేది అదే కాలేజ్‌లోని మరో కృష్ణమూర్తి. ఈ విషయంలో క్లారిటీ లేని ఛానల్ లెక్చరర్ కృష్ణమూర్తి ఫోటోని టెలికాస్ట్ చేస్తారు. దీంతో అతని జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అతని కొలీగ్స్, చుట్టు పక్కల వారు, ఆఖరికి అతని భార్య కూడా అతన్ని ఈసడించుకుంటుంది. అందులో తన తప్పేమీ లేదని చెప్పాలని కృష్ణమూర్తి చేసిన ప్రయత్నాలేవీ ఫలించవు. కోర్టుకు వెళ్ళినా అతనికి న్యాయం జరగదు. ఆ పరిస్థితుల్లో తను నిర్దోషినని కృష్ణమూర్తి ఎలా నిరూపించుకున్నాడు? దాని కోసం ఎలాంటి ప్లాన్ వేశాడు? అనేది మిగతా కథ.
ఈ చిత్రంలో కృష్ణమూర్తిగా నటించిన ఆర్.పి.పట్నాయక్ పాత్రోచితంగా నటించినప్పటికీ అది అతనికి సూట్ అవ్వలేదనేది వాస్తవం. ఆ క్యారెక్టర్‌ని మరో నటుడితో చేయిస్తే బాగుండేదనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అతని పెర్‌ఫార్మెన్స్ వల్ల పండలేదు. అతనికి భార్యగా, సాదాసీదా ఇల్లాలిగా అనిత చేసిన క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో సాయికుమార్, బెనర్జీ, దువ్వాసి మోహన్, తనికెళ్ళ భరణి, శ్రీముఖి, రఘుబాబు వారి వారి క్యారెక్టర్ల పరిధి మేరకు ఓకే అనిపించారు.
ఈ సినిమాకి టెక్నికల్‌గా ఎస్సెట్ అనిపించుకోదగిన అంశాలు అంతగా లేవనే చెప్పాలి. ఫోటోగ్రఫీగానీ, ఎడిటింగ్‌గానీ, మ్యూజిక్‌గానీ నార్మల్‌గానే అనిపిస్తాయి. కథ, కథనాల విషయానికి వస్తే ఆర్.పి. రాసుకున్న కథ కేవలం సినిమాగా తియ్యడానికి మాత్రమే పనికి వచ్చేదిగా వుంటుంది తప్ప సహజత్వానికి దగ్గరగా అనిపించదు. ఎందుకంటే ఒక ఛానల్‌లో పొరపాటుగా వచ్చిన ఫోటో వల్ల కృష్ణమూర్తి ఉద్యోగం పోతుంది, అందరి ముందు దోషిగా నిలబడతాడు. అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఎన్నో మార్గాలు వున్నా వాటిని అమలు చేయకుండా వేర్వేరు దారులు వెతుకుతుంటాడు. ఓ సందర్భంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన అరగంట వరకు ఛానల్ ఇంట్రడక్షన్, కృష్ణమూర్తి ఫ్యామిలీ గురించి చూపించడంతో సరిపోతుంది. అసలు కథలోకి వచ్చిన తర్వాత దానికి ఎలాంటి సొల్యూషన్ దొరక్కుండానే ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో అదే కొనసాగుతుంది. ప్రీ క్లెమాక్స్ నుంచి కథ కొత్తదారి పడుతుంది. అది కృష్ణమూర్తి ప్లాన్‌లో భాగమే అయినప్పటికీ చూస్తున్న ప్రేక్షకులు మాత్రం అసలు కథ ట్రాక్ తప్పిందని తిట్టుకుంటారు. ఫైనల్‌గా కృష్ణమూర్తి నిర్దోషి అని మీడియా సమక్షంలో తేలడంతో సినిమా ముగుస్తుంది. ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటలపాటు ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టాలంటే దానిచుట్టూ అల్లుకున్న కథ బోర్ అనిపించకూడదు. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే అలాంటి బోరింగ్ సీన్స్ చాలా వున్నాయి. ప్రాబ్లమ్ చాలా ఈజీగానే సాల్వ్ అవుతుంది కదా. దీనికెందుకు ఇంత రాద్ధాంతం అనిపించేలా కథనం వుంటుంది. ఆర్.పి. ఎంచుకున్న కథావస్తువు మీడియా ముసుగులో ఛానల్ యాజమాన్యాలు చేస్తున్న దారుణాలు. వాటిని సూటిగా, పక్కాగా చెప్పడంలో ఆర్.పి. ఫెయిల్ అయ్యాడు. పైపైన మాత్రమే టచ్ చేసి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమాలో పదునైన డైలాగ్స్, ఆలోచింపజేసే సంభాషణలు ఎక్కడా కనిపించవు. ఫైనల్‌గా చెప్పాలంటే మీడియాను ప్రశ్నిస్తూ ఆర్.పి.పట్నాయక్ చేసిన మనలో ఒకడు ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నల్నే మిగిల్చింది తప్ప సరైన సమాధానాల్ని ఇవ్వలేకపోయింది.
ఫినిషింగ్ టచ్: మీడియాతో అర్థంలేని ఫైట్
సినీజోష్ రేటింగ్: 2.25/5