బ్లాక్‌బస్టర్ స్టూడియో, ఇన్‌బాక్స్ పిక్చర్స్, స్టూడియో గ్రీన్, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
నాగభరణం
తారాగణం: విష్ణువర్థన్(క్రియేటెడ్), రమ్య, దిగంత్, సాయికుమార్, ముకుల్‌దేవ్, సాధుకోకిల తదితరులు
సినిమాటోగ్రఫీ: హెచ్.సి.వేణు
సంగీతం: గురుకిరణ్
ఎడిటింగ్: జాని హర్ష
మాటలు: ఎం.ఎస్.రమేష్
సమర్పణ: జయంతిలాల్ గాడ(పెన్)
నిర్మాతలు: సాజిద్ ఖరేషి, ధవల్ గాడ, సొహైల్ అన్సారి
రచన, దర్శకత్వం: కోడి రామకృష్ణ
విడుదల తేదీ: 14.10.2016
కోడి రామకృష్ణ సినిమాలు అనగానే సాధారణ ప్రేక్షకులకు సైతం గుర్తొచ్చే సినిమాలు అమ్మోరు, అరుంధతి. ఈ చిత్రాలు కథ, కథనాల కంటే విజువల్‌గా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెండు చిత్రాల స్థాయిలో గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ మూవీ నాగభరణం. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఒకేసారి ఈరోజు విడుదలైంది. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ని విజువల్‌గా ఒక క్యారెక్టర్‌గా క్రియేట్ చేయడం ఈ చిత్రానికి సంబంధించి ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి తరహాలో రూపొందిన మరో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ నాగభరణం అంతకుముందు కోడి రామకృష్ణ చేసిన చిత్రాల స్థాయిలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసిందా? ఈ చిత్రం కోసం ఎంచుకున్న కథాంశం ఏమిటి? విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడంలో గ్రాఫిక్స్ ఎంతవరకు ఉపయోగపడ్డాయి? కథ, కథనాల పరంగా, గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే గ్రాఫిక్స్‌తో రూపొందే ఈ తరహా చిత్రాలు సహజత్వానికి దూరంగా వుంటాయి. అయితే వాటికి బలమైన కథ, కథనాలు కూడా తోడైతే సినిమాలో వుండే మైనస్‌ల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. నాగభరణం విషయానికి వస్తే ఈ సినిమాకి మైనస్ పాయింట్‌గా మారింది కథ, కథనాలే. ఎంత ఊహాజనితమైన కథయినా చూసే ప్రేక్షకులకు ఆమోదయోగ్యంగా అనిపించాలి. కానీ, ఈ సినిమాలో అలాంటి సందర్భం ఎక్కడా కనిపించదు. కథ విషయానికి వస్తే సూర్యగ్రహణం రోజున అన్ని లోకాలలో వుండే దేవతల దైవత్వం క్షీణిస్తుందని, అందుకని వారి శక్తులన్నింటినీ ఒక మహా కలశంలో నిక్షిప్తం చేసి భూలోకంలోనే ఓ చోట భద్రపరుస్తారు. సూర్యగ్రహణానికి ముందు కొన్ని దుష్ట శక్తులు ఆ కలశాన్ని దక్కించుకొని దేవతలను నిర్వీర్యుల్ని చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆ కలశాన్ని కాపాడే బాధ్యతను శివయ్య కుటుంబానికి అప్పగిస్తారు. తరతరాలుగా ఆ కలశాన్ని ఆ కుటుంబమే కాపాడుతూ వస్తుంది. ప్రస్తుతానికి వస్తే ఈ సినిమాలో కథానాయకుడి పేరు నాగచరణ్(దిగంత్). అతను, అతని ఫ్రెండ్స్ కలిసి ఓ మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటు చేసుకొని మ్యూజిక్ కాంపిటీషన్స్‌కి వెళ్తుంటారు. ఓ రోజు మానస(రమ్య) అనే అమ్మాయి ఆ ట్రూప్‌లో చేరాలని వస్తుంది. ఆమెను తమ ట్రూప్‌లో చేర్చుకోవడం ఇష్టం లేకపోయినా ఏదో విధంగా అతని ఇంట్లో సెటిల్ అవుతుంది మానస. ఇదిలా వుంటే ఎక్కడో భద్రపరిచిన మహాకలశం అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ చేరుతుంది. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్‌లో ఆ కలశాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటిస్తారు. కాంపిటీషన్‌లో ఎలాగైనా గెలిచి కలశాన్ని దక్కించుకోవాలని విలన్ ట్రై చేస్తుంటాడు. మరో పక్క ఎప్పటి నుంచో ఓ అఘోరా ఆ కలశం కోసం పోరాటం చేస్తుంటాడు. మరి ఆ కలశం చివరికి ఎవరికి దక్కింది? అసలు మానస ఎవరు? నాగచరణ్ మ్యూజిక్ ట్రూప్‌లో ఆమె ఎందుకు చేరింది? మానస ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? మ్యూజిక్ కాంపిటీషన్‌లో మహాకలశాన్ని నాగచరణ్ గెలుచుకున్నాడా? లేక దాన్ని దుష్టశక్తులు చేజిక్కించుకున్నాయా? అనేది మిగతా కథ.
కోడి రామకృష్ణ రాసుకున్న ఈ కథలో అన్నీ లొసుగులే కనిపిస్తాయి తప్ప ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే ఒక్క అంశం వుండదు. దైవ శక్తులు వున్న ఓ మహా కలశాన్ని మ్యూజిక్ కాంపిటీషన్‌లో ట్రోఫీగా ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ కలశం కోసమే నాగచరణ్ దగ్గరికి వచ్చిన మానస అప్పుడప్పుడు గ్రాఫిక్స్‌లో తన శక్తుల్ని చూపించినా కలశం దక్కించుకోవడంలో మాత్రం వాటిని వాడదు. నాగచరణ్ వల్లే కలశం రక్షింపబడుతుందని నమ్ముతుంది. హీరో స్నేహితులు ఓ యాక్సిడెంట్ ద్వారా చనిపోయే స్థితిలో వున్నా వారిని కాపాడలేకపోతుంది. కానీ, శత్రువుల్ని మాత్రం ఒక్కొక్కరిని చంపుతూ వస్తుంది. అసలు కథ ఇంటర్వెల్ ముందే స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు అనవసరమైన సీన్స్‌తో, నవ్వు తెప్పించని కామెడీతో టైమ్ పాస్ చేసినట్టుగా వుంటుంది. కేవలం గ్రాఫిక్స్‌తో ఆడియన్స్‌ని రెండు గంటల సేపు కూర్చోబెట్టాలనే లక్ష్యమే కనిపిస్తుంది తప్ప కథ, కథనాల విషయంలో, క్యారెక్టరైజేషన్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మాత్రం శూన్యం. సినిమాలో ఎంచుకున్న మెయిన్ పాయింట్ మంచిదే అయినా దానిచుట్టూ అల్లిన కథ, కథనం సినిమాకి పెద్ద మైనస్ అయింది. క్లైమాక్స్‌లో శివుడు పంపిన దూతగా ఎంటర్ అయిన విష్ణువర్థన్ దుష్ట శక్తుల్ని హతమార్చి కలశాన్ని రక్షిస్తాడు. విష్ణువర్థన్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి అతనితో ఫైట్స్ చేయించడం, డాన్స్ చేయించడం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా నిడివిని పెంచే సీన్స్‌తో, పాటలతో, నవ్వు రాని కామెడీ సీన్స్‌తో నింపేసి ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో అసలు కథలోకి వెళ్ళిన డైరెక్టర్ సెకండాఫ్‌ని సీరియస్‌గా కథపైనే నడిపించినా క్లైమాక్స్‌కి వచ్చే సరికి కేవలం గ్రాఫిక్స్, విష్ణువర్థన్ ఎంట్రీ మాత్రమే అద్భుతం అనేలా వుంటుంది తప్ప క్లైమాక్స్ చాలా చప్పగా అనిపిస్తుంది. సినిమాని హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. మానసగా, నాగమ్మగా రమ్య పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో స్టార్ట్ అయ్యే ఫ్లాష్‌బ్యాక్‌లో నాగమ్మ క్యారెక్టర్ అరుంధతిని పోలి వుంటుంది. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్, రమ్య గెటప్ వుంటుంది. ఒక విధంగా అరుంధతి సినిమానే మెయిన్ పాయింట్, బ్యాక్‌డ్రాప్ మార్చి నాగభరణంగా తీశారనిపిస్తుంది. అక్కడ దుష్టశక్తి పశుపతిని హతమార్చడమే అరుంధతి లక్ష్యమైతే, ఇక్కడ కలశాన్ని కాపాడడం కోసం అఘోరాను చంపడమే నాగమ్మ లక్ష్యం. నాగచరణ్‌గా దిగంత్ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. శివయ్యగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించిన సాయికుమార్ పెర్‌ఫార్మెన్స్ ఎప్పటిలాగే బాగుంది. హెచ్.సి. వేణు ఫోటోగ్రఫీ బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. గురుకిరణ్ చేసిన పాటలు మామూలుగా అనిపిస్తాయి. అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌లో బాగున్నట్టు అనిపించినా, మరికొన్ని సీన్స్‌లో రణగొణ ధ్వని ఎక్కువైంది. కథ, కథనాలు ఎలా వున్నా విజువల్ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి సెకండాఫ్ నచ్చే అవకాశం వుంది. మేకింగ్ పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని గ్రాఫిక్స్ చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ తరహా కథాంశంతో ఈమధ్యకాలంలో ఏ సినిమా రాకపోవడం, ఆడియన్స్‌ని థ్రిల్ చేసే విజువల్ ఎఫెక్ట్స్, విష్ణువర్థన్ క్రియేటెడ్ క్యారెక్టర్, రమ్య పెర్‌ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్‌గా నిలిచిన ఈ సినిమా బి, సి సెంటర్స్‌లో ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం వుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు బలమైన కథని కూడా ఆశించే ప్రేక్షకులను మాత్రం నాగభరణం నిరాశపరుస్తుంది.
ఫినిషింగ్ టచ్: విషయం కంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ
సినీజోష్ రేటింగ్: 2/5