Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: హైపర్‌


14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ 

Advertisement
CJ Advs

హైపర్‌ 

తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, సత్యరాజ్‌, రావు రమేష్‌, 

నరేష్‌, మురళీశర్మ, తులసి, పోసాని, ప్రభాస్‌ శ్రీను తదితరులు 

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 

సంగీతం: జిబ్రాన్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: మణిశర్మ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

మాటలు: అబ్బూరి రవి 

సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి 

నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర 

రచన, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌ 

విడుదల తేదీ: 30.09.2016 

ప్రభుత్వాధికారుల్లో అవినీతి పేరుకు పోయి వుందన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వాధికారుల్లో కూడా నిజాయితీకి మారుపేరుగా నిలిచినవారు ఎంతోమంది వున్నారని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ విధులు నిర్వర్తిస్తున్నారని అప్పుడప్పుడు వింటూ వుంటాం. అలాంటి ఓ నిజాయితీగల ప్రభుత్వ అధికారి కథే ఈరోజు విడుదలైన హైపర్‌. ఆ ప్రభుత్వాధికారి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, అతని కొడుకుగా హీరో రామ్‌ ఈ చిత్రంలో నటించాడు. రామ్‌తో కందిరీగ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించారు. రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండో సినిమా వీరిద్దరికీ ఎలాంటి ఫలితాన్నిచ్చింది? నిజాయితీ అనే కాన్సెప్ట్‌ని తీసుకొని, దానికి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమాగా తియ్యడంలో సంతోష్‌ శ్రీన్‌వాస్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? కమర్షియల్‌గా ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు నారాయణమూర్తి(సత్యరాజ్‌). సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా వర్క్‌ చేస్తూ నిజాయితీకి మారు పేరు అనిపించుకున్నాడు. ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళితే అతని కొడుకు సూర్య(రామ్‌) పుట్టగానే చెవులు చిల్లులు పడేలా ఏడ్చినా తండ్రి చేతుల్లోకి రాగానే కామ్‌ అయిపోతాడు. అలా పుట్టినప్పటి నుంచే తండ్రి మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడు. సూర్య ముందు అతని తండ్రిని ఎవరు ఏమన్నా తట్టుకోలేని స్వభావం సూర్యది. తండ్రి కోసం ప్రాణమైనా ఇచ్చెయ్యడానికి సిద్ధపడే కొడుకు అతను. ఓ రోజు తన తండ్రిని ఓ ప్రమాదం నుంచి కాపాడిన గజ(మురళీశర్మ) అనే రౌడీకి ఫ్రెండ్‌ అయిపోతాడు సూర్య. ఇదిలా వుంటే సిటీలో నిబంధనలకు విరుద్ధంగా మినిస్టర్‌ రాజప్ప(రావు రమేష్‌) కడుతున్న షాపింగ్‌ మాల్‌కి పర్మిషన్‌ ఇవ్వడానికి నారాయణమూర్తి ఒప్పుకోకపోవడంతో అతనిపై కక్ష గడతాడు. అతనితో ఎలాగైనా ఆ ఫైల్‌ మీద సంతకం పెట్టించమని గజకి అప్పగిస్తాడు రాజప్ప. గజకి ఫ్రెండ్‌గా మారిపోయిన సూర్య అతని సమస్య తన సమస్యగా భావించి ఆ ఫైల్‌ మీద సంతకం పెట్టిస్తానంటాడు. అయితే ఆ ప్రభుత్వాధికారి తన తండ్రేనని తెలియని సూర్య అతని మీద సామ భేద దాన దండోపాయాలను ప్రయోగిస్తాడు. ఓ ఫైన్‌ మార్నింగ్‌ నిజం తెలుసుకున్న సూర్య.. గజకి ఎదురు తిరుగుతాడు. తన తండ్రిని ఇబ్బంది పెడుతున్న మినిస్టర్‌ రాజప్పకి వార్నింగ్‌ కూడా ఇస్తాడు. తన తండ్రి ఆ ఫైల్‌ మీద సంతకం పెట్టక ముందే అతనితో మంత్రి పదవికి రాజీనామా చేయిస్తానని ఛాలెంజ్‌ చేస్తాడు సూర్య. దీంతో ఈగో దెబ్బతిన్న రాజప్ప... నారాయణమూర్తి నిజాయితీకి మచ్చ తేవడమే పనిగా పెట్టుకుంటాడు. తన తండ్రికి ఎదురైన సమస్యని సూర్య ఎలా పరిష్కరించాడు? రాజప్పతో ఛాలెంజ్‌ చేసినట్టుగా అతనితో రాజీనామా చేయించాడా? ఈ క్రమంలో తండ్రి నుంచి సూర్య ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? రాజప్పని సూర్య తెలివిగా ఎలా దెబ్బ తీశాడు అనేది మిగతా కథ. 

తండ్రిని విపరీతంగా ప్రేమించే కొడుకుగా, తండ్రికి ఎవరు ఎలాంటి ఆపద తలపెట్టినా వారికి ఎదురెళ్ళి పోరాడే కొడుకుగా రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే హైపర్‌గా కనిపించాడు రామ్‌. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో, సెంటిమెంటల్‌ సీన్స్‌లో మంచి నటనను ప్రదర్శించాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి ప్రలోభాలకు లొంగని అధికారిగా, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా నారాయణమూర్తి పాత్రలో సత్యరాజ్‌ ఒదిగిపోయారని చెప్పాలి. తన పాత్ర స్వభావానికి తగ్గట్టుగా అన్నిరకాల ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి హత్తుకునేలా పెర్‌ఫార్మ్‌ చెయ్యడంలో సత్యరాజ్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. తన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే రాజప్ప క్యారెక్టర్‌ని రావు రమేష్‌ అద్భుతంగా చేశాడు. అతను చెప్పే డైలాగ్స్‌ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఈ సినిమాకి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి ఈ మూడు పాత్రలే. హీరోయిన్‌గా రాశి ఖన్నా తన అందచందాలతో కనువిందు చేసింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా కూడా రాశికి మంచి మార్కులు వెయ్యొచ్చు. గజగా మురళీశర్మ, తల్లి పాత్రలో తులసి, హీరోయిన్‌ తండ్రిగా పోసాని పెర్‌ఫార్మెన్స్‌ షరా మామూలే. ఈమధ్యకాలంలో కొన్ని మంచి పాత్రలు చేసిన నరేష్‌ ఈ చిత్రంలో ఏమాత్రం ప్రాధాన్యతలేని ఓ సాధారణ క్యారెక్టర్‌ చేశాడు. 

సాంకేతిక పరంగా ఈ చిత్రానికి మెయిన్‌ ఎస్సెట్‌గా నిలిచింది సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించడంలో సమీర్‌ సక్సెస్‌ అయ్యాడు. జిబ్రాన్‌ చేసిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. మణిశర్మ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలో మన దృష్టికి వచ్చే సందర్భాలు తక్కువ. అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కొన్ని సీన్స్‌ని ఎలివేట్‌ చెయ్యలేకపోయింది. గౌతంరాజు ఎడిటింగ్‌ బాగానే వున్నా ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ని కట్‌ చేసి వుంటే సినిమా ఇంకా స్పీడ్‌గా వుండేది. అబ్బూరి రవి రాసిన మాటలు కొన్ని సీన్స్‌లో అద్భుతంగా అనిపిస్తాయి, మరికొన్ని సీన్స్‌లో సిల్లీగా అనిపిస్తాయి. ఒక ఉద్యోగి బాధ్యత గురించి సత్యరాజ్‌ చెప్పే డైలాగ్స్‌ అందర్నీ ఆలోచింపజేస్తాయి. ఇక డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ గురించి చెప్పాలంటే తండ్రిని అమితంగా ఇష్టపడే ఓ కొడుకు కథగా స్టార్ట్‌ చేసి ఆ తర్వాత నారాయణమూర్తి, రాజప్ప మధ్య జరిగే కథే మెయిన్‌ స్టోరీ అనిపించేలా చేశాడు. హీరోని హీరోయిన్‌ చుట్టూ తిప్పడానికి లేదా హీరోయిన్‌ని హీరో చుట్టూ తిప్పుకోవడానికే ఫస్ట్‌హాఫ్‌ని ఎక్కువగా ఉపయోగించాడు. ఈ సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు మన మదిలో ఎన్నో సినిమాలు మెదులుతాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, ఫైట్‌ వరకు సినిమా ఓకే అనిపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి రకరకాల ట్విస్ట్‌లతో అన్నీ హీరోకి అనుకూలంగానే జరుగుతుండడంతో సినిమా ఒన్‌ సైడ్‌ అయిపోయింది. నారాయణమూర్తితో సంతకం చేయించడం కోసం అతని భార్యకి జరగాల్సిన ఆపరేషన్‌ని అడ్డుకున్న రాజప్పతోనే ఆ ఆపరేషన్‌ చేయించేలా సూర్య చెయ్యడంతో సినిమా కంప్లీట్‌ అయిపోయిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక అక్కడి నుంచి రాజప్ప రిజైన్‌ చేసే వరకు సినిమాని ఎక్స్‌టెండ్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్‌ ఎఫెక్టివ్‌గానే వున్నా, మరికొన్ని సీన్స్‌ బోర్‌ కొట్టించేలా వున్నాయి. లాజిక్‌లు, సాధ్యాసాధ్యాల జోలికి వెళ్ళకుండా ఒక సినిమాగా హైపర్‌ని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌, రాశిఖన్నా గ్లామర్‌, సత్యరాజ్‌, రావు రమేష్‌ల పెర్‌ఫార్మెన్స్‌, జిబ్రాన్‌ చేసిన పాటలు, సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే, కథ, కథనాల్లో లొసుగులు, సహజత్వానికి బహుదూరంగా వుండే సన్నివేశాలు, ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో సాగదీసే సీన్స్‌ సినిమాకి మైనస్‌గా నిలిచాయి. 14 రీల్స్‌ అధినేతలు ఎక్కడా కాంమ్రైజ్‌ అవకుండా సినిమాని రిచ్‌గా తీశారు. ఫైనల్‌గా చెప్పాలంటే రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో కందిరీగ తర్వాత వచ్చిన ఈ హైపర్‌ సినిమా పరంగా అంత చెప్పుకోదగింది కాకపోయినా కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుండడంతో కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు వున్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: హైపర్‌ అంటే ఒక్క సంతకమే! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs