Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: మజ్ను


సమీక్ష: మజ్ను 

Advertisement
CJ Advs

బ్యానర్స్: ఆనంది ఆర్ట్స్, కేవ మూవీస్

తారాగణం: నాని, అను ఎమ్మాన్యూయెల్, ప్రియా శ్రీ, వెన్నెల కిశోర్, రాజ్ తరుణ్, తదితరులు. 

సినిమాటోగ్రఫీ: జ్ఞ్యానశేఖర్

సంగీతం: గోపి సుందర్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాత: కిరణ్ 

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విరించి వర్మ

విడుదల తేదీ: 23.09.2016

ఉత్తమాభిరుచి గల నిర్మాతగా కిరణ్, గ్రామీణ వాతావరణంలో తెలుగుదనం ఉట్టిపడే పాత్రలతో మనసులని కట్టిపడేసిన ఉయ్యాల జంపాలతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ, న్యాచురల్ హీరోగా వరస హిట్లతో దూసుకుపోతున్న నానితో ఇద్దరు కొత్త ముద్దుగుమ్మలు అను ఎమ్మాన్యూయెల్, ప్రియా శ్రీలు ఆడిన ప్రేమాటకు గోపి సుందర్ సంగీతం అందించారు. ప్రమోషన్ విషయంలో కాస్త వెనకబడినా చాలా వరకు చిత్రం ట్రైలర్ మెప్పించడంతో మజ్ను మీద అంచనాలు ఫర్వాలేదు అనే స్థాయిలో ఏర్పడ్డాయి. మరి నాని మరోసారి ఈ కొత్త మజ్ను అవతారంలో మెప్పించగలిగాడా లేదా అన్నది సమీక్షిద్దాం.

ఓ హీరో, ఇద్దరు హీరోయిన్లు అనగానే చటుక్కున ఇది త్రికోణ ప్రేమ చిత్రం అని పసిగట్టే చురుకైన ప్రేక్షకులున్న ఈ జనరేషన్లో ముందుగానే ఎన్నో క్లూలు వదిలి ఆ తరువాత విడుదలయింది మజ్ను. ఆ పాతకాలం మజ్ను ప్రేమించిన ఒక్క అమ్మాయి లైలాను మరిచిపోవడానికి చావును వెతుక్కునే క్లైమాక్స్ కోసం ఫేమస్ అయితే మన నాని మజ్ను మాత్రం ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేసుకున్నాడు. అంటే కథలో ఎటువంటి సారూప్యత లేకపోయినా కేవలం ప్రమోషన్ కోసమే మజ్ను అని టైటిల్ వేశారు. ఎలాగయితే టైటిల్ విషయంలో నాణ్యత లోపించిందో మన కథలో కూడా విరించి వర్మ ఏళ్ళ తరబడి చిలికి చిలికి రసం సాంతం పిండేసిన ఓ సాదాసీదా కథను రాసుకున్నాడు. 

రాజమౌళి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసే ఆదిత్యకు (నాని) బాహుబలి షూటింగ్ దగ్గరి రథం మీద ఇంట్రడక్షన్ అంటే యాక్షన్ అనుకునేలోపే కంగాళీ కామెడీ చేస్తూ సినిమా మీద మొదటి ఫ్రేమ్ లోనే అనుమానం కలిగించాడు విరించి. హీరోయిన్ సుమాంజలిని (ప్రియా శ్రీ) మొదటి చూపులోనే ప్రేమించడానికి ఆదిత్యకి కలిగిన ప్రేరణ ఏమిటో అర్ధమయ్యేలోపే ఓ పాట వేసేసుకొని ఆ అమ్మాయి కూడా మనాడికి ఫ్లాట్ అయిపోతుంది. ఇదేంటబ్బా కంటెంట్ లేకుండా కథనం ముందుకు వెళుతుంది అనుకుంటుంటే ఆదిత్య ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథను ముందేస్తాడు. భీమరవంలో ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగంలో చేరాల్సిన తరుణంలో అదే ఊళ్ళో అదే కాలేజీలో చదువుతున్న జూనియర్ స్టూడెంట్ కిరణ్మయి (అను ఎమ్మాన్యూయెల్) ప్రేమలో పడతాడు ఆదిత్య. ఆమె కోసం అదే కాలేజీలో లెక్చరరుగా మారి స్టూడెంట్ ప్రేమను పొందుతాడు. ఇంత మెచ్యూరుగా ఉన్న లవ్ స్టోరీ ఓ అర్థంపర్థం లేని పిచ్చి కారణంతో బ్రేకప్ చేయించాడు దర్శకుడు. ఇలా మెల్లిగా ఆదిత్యను ప్రేక్షకులు ఓన్ చేసుకుంటుంటే కథ మధ్యలో నా మనసు ఇంకా కిరణ్మయినే కోరుకుంటోంది అని ఆదిత్య అనడంతో నీరసం కారిపోతుంది. నేనేమీ తక్కువ తిన్నానా అనేలా సుమాంజలి మాత్రం ఆదిత్యలోని సిన్సియారిటీకి ప్రేమలో జారుతుంది. ఇక కిరణ్మయి, సుమాంజలిలో అక్కాచెల్లెల్లు (కజిన్స్) అనడం ఏ మాత్రం వింతైన ఇంటర్వెల్ కాదని చెప్పాలా. 

రెండో సగం మొత్తం అక్కా చెల్లెళ్ళతో ఆదిత్య ఆటకు సరిపోతుంది. కామెడీ కోసం కథను ముంబై తీసుకెళ్లి టాక్సీ డ్రైవర్ సంజయ్ లీల భన్సాలీ (వెన్నెల కిశోర్)తో నవ్వింపజేసే ప్రయత్నం కేవలం కంటెంట్ లేకపోవడం వల్లే అని ఐతే పసిగట్టొచ్చు. తరువాత హేమంత్ (రాజ్ తరుణ్) అంటూ సుమాంజలి బావను దింపి కథను క్లైమాక్స్ వరకు నెట్టుకొచ్చాడు విరించి. మీరనుకునేలా ముగింపు పెద్ద పజిల్ ఏమీ కాదు. పాత్రలన్నీ తమ తమ ఔచిత్యాలను దెబ్బ తీసుకుంటూ ఆదిత్య, కిరణ్మయిలు కలపడమే.

ఉయ్యాల జంపాలలోని ముఖ్యపాత్రల్లో ఉన్న నిబధ్ధత, సెన్సిటివిటీ లాంటివి విరించి ఈసారి మజ్నులో ఎటు నుండి చూపలేకపోయాడు. పూర్తిగా నాని మీదే డిపెండ్ అవుతూ లైటర్ కామెడీ పైన రాసుకున్న సంభాషణల మీదే బండిని లాగించే ప్రయత్నం చేసాడు. కథలో రసం, చట్నీలు లేవు గనక ఇడ్లీ రుచి కూడా చప్పగా మిగిలింది. కథనం సైతం ఓ గొప్పగా అనిపించదు. ప్రేమ చిక్కుముడిలో పడ్డ ముగ్గురు ముఖ్య పాత్రల యొక్క సంఘర్షణ పేవలంగా ఉండడమే మజ్నుకు అతి పెద్ద మైనస్. వినూత్నమైన కథల కోసం జుట్టు పీక్కుంటున్న ఈ రోజుల్లో, పాత కథలనే నమ్ముకుంటున్న విరించి లాంటి దర్శకులు కనీసం కథనం, పాత్ర చిత్రణల మీదైనా మరి కాస్త దృష్టి పెట్టాల్సింది. ఇంతటి టెస్టెడ్ కథ, కథనంలో కంటికి, చెవులకి ఇంపుగా అనిపించినవి మాత్రం జ్ఞ్యానశేఖర్ కెమెరా పనితనం, గోపి సుందర్ హృద్యమైన సంగీత బాణీలు. అలా ఓల్డ్ ఫార్మటు దర్శకత్వ శైలిలో తెర మీద సరదాగా, నవ్యంగా క్యారెక్టర్లు కదిలాయంటే అది పైన పేరుకొన్న ఇద్దరి గొప్పతనమే. నిర్మాతగా కిరణ్ తప్పకుండా మజ్నుకి మంచి బడ్జెట్ కేటాయించారు. దానికి తగ్గట్టుగానే టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నారన్నది మరో విషయంలెండి.

మజ్నుకి ఆన్ స్క్రీన్ మీద పూర్తి ప్రాణం పోసింది నానీనే. మరోసారి నటనలో తనకున్న ఈజ్ ఎటువంటిదో ప్రదర్శించాడు. సినిమా ఆల్ మోస్ట్ ఫుల్ లెంగ్త్ ప్రతి ఫ్రేములో నానీని ఉండేలా దర్శకుడు విరించి డిజైన్ చేసుకున్నాడంటే ఎంతలా అతడి ఒక్కడి మీదే మజ్ను ఆధారపడింది అవగతం అవుతుంది. హీరోయిన్లలో అను ఎమ్మాన్యూయెల్ ఫర్వాలేదనిపించింది. మరీ అందగత్తె కాకపోయినా చక్కటి కట్టుబొట్టుతో చూడ ముచ్చటగా అగుపించింది. ప్రియా శ్రీ ప్రాముఖ్యతలేని తిక్క పాత్రలో సోసోగా ఉంది. రాజ్ తరుణ్, రాజమౌళిల క్యామియోలు బలవంతంగా పెట్టినవే తప్ప పెద్దగా పనికిరావు. పోసాని కృష్ణ మురళి, సత్య, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు.

తెలుగు సినిమా అంటే హీరో సెంట్రిక్ ఉండాలని ఓ నియమం. అది స్టార్ హీరోలకు తూచా తప్పకుండా వర్తిస్తుంది. న్యాచురల్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకోగానే నానీ కూడా బడా స్టార్ హీరోల సరసన చేరే దిశగా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడా అనే స్థాయిలో సందేహం కలిగేలా మజ్ను రూపొందింది. స్టార్ట్ టు ఎండ్, ఓన్లీ అండ్ ఓన్లీ నానీ తప్ప మిలిగిలిన పాత్రల నుండి ఎటువంటి సపోర్ట్ లభించదు. అలాగే కథ, కథనం కూడా సోసోగా ఉండడంతో ఎక్కడ చూసినా నానీ ఒక్కడే సర్వాంతర్యామిలా దర్శనమిస్తూ మూవీని బతికిస్తూ వచ్చాడు. టెక్నీకల్ డిపార్ట్మెంట్ల నుండి పూర్తి మద్దతు లభించినా, ఆన్ స్క్రీన్ అవుట్ పుట్ విషయంలో నానీ ఈజ్ ది సేవియర్ అనక తప్పదు. 

మెగాస్టార్ చిరంజీవి అయినా, సూపర్ స్టార్ రజినీకాంత్ అయినా కథాబలం కొంతలో కొంత తోడయితేనే వారి స్టార్ డం జతకలిసి ఓ చిత్రాన్ని సంపూర్ణ విజయం వరకు చేరుస్తుంది. కథ లేకపోతే చిరంజీవిని కూడా కాసేపు చూసాక బోర్ కొట్టేస్తుంది. మజ్ను విషయంలో కూడా అదే జరిగింది. చాలా చోట్ల నానిలోని మంత్ర శక్తిని చూస్తూ ముగ్దులం అవుతామే తప్ప సినిమాను పూర్తిగా ఆస్వాదించేలా అనిపించదు. నానీపైన వల్లమాలిన అభిమానం ఉంటె మజ్ను మీకు తప్పక నచ్చుతుంది. అబ్బే అలాంటిది ఏమీ లేదు. మేము సినిమాను కేవలం సినిమాలా అందరి సమిష్టి కృషిగా అనిపిస్తేనే హృదయానికి దగ్గరగా ఫీల్ అవుతాం అంటే అదో లెక్క. అసలు మజ్ను ఏ లెక్కలోకి వెళుతుందో బాక్సాఫీస్ లెక్కలే తేల్చుతాయి. 

ఒకటి మాత్రం క్లియర్, సూపర్ హిట్ భలే భలే మగాడివోయ్ తరువాత నానీని మిలియన్ డాలర్ క్లబ్బులోనో, పాతిక కోట్ల ఎలైట్ లిస్టులోనో చేర్చిన తదుపరి కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మెన్ చిత్రాలను ఇండస్ట్రీ హిట్లుగా పరిగణించినా స్టార్ హీరోగా నాని మాత్రం తన జడ్జిమెంటుతో ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్నాడు. వసూళ్ళలో కూడా అది సుస్పష్టం. న్యూ రిలీజ్ మజ్ను సైతం నానీని మరో స్టెప్ తక్కువ చేసిందే తప్ప పైకి మాత్రం లేపలేదు.

ఫినిషింగ్ టచ్: ప్రేమ త్రికోణం కాదు నానీకోణం

సినీజోష్ రేటింగ్: 2.5/5.0

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs