రామదూత క్రియేషన్స్
సిద్ధార్థ
తారాగణం: సాగర్, రాగిణి నంద్వాని, సాక్షిచౌదరి, కోట శ్రీనివాసరావు,
రణధీర్, అజయ్, సుబ్బరాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, సన, నాగినీడు,
సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కథ: విస్సు
మాటలు: పరుచూరి బ్రదర్స్
సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.దయానందరెడ్డి
విడుదల తేదీ: 16.09.2016
టి.వి. ఆడియన్స్‌కి సాగర్ సుపరిచితుడు. చక్రవాకం, మొగలిరేకులు వంటి మెగా సీరియల్స్‌లో నటించి అందరి మెప్పు పొందిన సాగర్ సిద్ధార్థ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. జీనియస్, రామ్‌లీల చిత్రాలను నిర్మించిన దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, కె.వి.దయానందరెడ్డి డైరెక్టర్ చేశాడు. టి.వి. సీరియల్స్‌తో ఎక్కువగా మహిళా ప్రేక్షక ఆదరణ కలిగిన సాగర్ హీరోగా చేసిన మొదటి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? మూడో సినిమా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాకి కమర్షియల్‌గా ఎంత వరకు వర్కవుట్ అవుతుంది? సాగర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ ఎలాంటి కథాంశంతో రూపొందింది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
టి.వి. సీరియల్స్‌లో మంచి స్పార్క్ వున్న ఆర్టిస్టుగా సాగర్ పేరు వుంది. అతన్ని సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలన్న దాసరి కిరణ్‌కుమార్ ఆలోచన మంచిదే అయినా దానికి తగ్గ కథని, ఆర్టిస్టుల్ని ఎన్నుకోవడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. ఒక ఫ్యాక్షన్ కథని తీసుకొని దాని చుట్టూ ఓ ప్రేమకథని అల్లి ఒక సాధారణ చిత్రంగా సిద్ధార్థ ని బయటికి తీసుకొచ్చారు. రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు వుండడం, దాని వల్ల ఆ రెండు కుటుంబాలు నష్టపోవడం, ఒకరి తర్వాత ఒకరు సీరియల్‌గా హత్యలు చేసుకుంటూ పోవడం వంటి కథలు మనకి కొత్తేమీ కాదు. దానికి ఒక లవ్‌స్టోరీని చేర్చడం కూడా మనకి తెలియనిది కాదు. మరి ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకనిర్మాతల ఆంతర్యం ఏమిటో మనకు బోధపడదు. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధమైన సాగర్‌కి తన టాలెంట్‌ని పూర్తి స్థాయిలో చూపించే అవకాశం సిద్ధార్థ ఇవ్వలేదు.
కథగా చెప్పాలంటే అతని చంద్రప్రతాప్(నాగినీడు). అతనికి, అంకినీడు(రామరాజు)కి మధ్య కొన్ని గొడవలున్నాయి. ప్రజల పక్షపాతిగా అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్న చంద్రప్రతాప్‌ని హత్య చేస్తాడు అంకినీడు. ఇది తెలుసుకున్న చంద్రప్రతాప్ కొడుకు సూర్యప్రతాప్(సాగర్) అంకినీడుని చంపేస్తాడు. రోజురోజుకీ ఆ రెండు కుటుంబాల మధ్య పెరిగిపోతున్న పగ, ప్రతీకారాలు చల్లారంటే సూర్యని ఎక్కడికైనా పంపించెయ్యాలని నిర్ణయిస్తుంది అతని తల్లి. దాంతో చేసేది లేక తన తమ్ముడు భాను(రణధీర్)తో కలిసి మలేషియా వెళ్ళిపోతాడు. సూర్య చంపడానికి అంకినీడు మనుషులు వెయిట్ చేస్తుంటారు. మలేషియా వెళ్ళిన తర్వాత అతని పేరు సిద్ధార్థగా మార్చబడుతుంది. మలేషియా వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో సూర్యకు సహస్ర(రాగిణి నంద్వాని) పరిచయమవుతుంది. పరిచయం ఫ్రెండ్‌షిప్‌గా ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. వారిద్దరి సాన్నిహిత్యానికి ఫలితంగా సహస్ర ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ టైమ్‌లో ఊళ్ళో అంకినీడు మనుషులు కాంప్రమైజ్‌కి వచ్చారని, వెంటనే ఇండియా బయల్దేరి రమ్మని సూర్యకి పిలుపొస్తుంది. ఇండియా వచ్చిన తర్వాత సూర్యకి తెలిసిన విషయం ఏమిటంటే అంకినీడు కూతుర్ని తను పెళ్ళి చేసుకుంటే ఆ రెండు కుటుంబాల మధ్య వున్న గొడవలకు ఫుల్‌స్టాప్ పడుతుందని. తల్లి బలవంతం మీద సూర్య ఆ పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఈ విషయం సహస్రకి తెలుస్తుంది. సూర్య పెళ్ళి చేసుకోవడంపై సహస్ర ఎలా స్పందించింది? ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం సూర్యకి తెలుసా? అంకినీడు కూతుర్ని సూర్య పెళ్ళి చేసుకున్నాడా? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ.
సూర్యగా, సిద్ధార్థగా రెండు పేర్లతో కనిపించే సాగర్ పెర్‌ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోగల హీరో అనిపించుకోవడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. దానికి కథ, కథనాలు, డైరెక్టర్ టేకింగ్ కారణాలుగా చెప్పుకోవచ్చు. హీరోయిన్లు రాగిణి, సాక్షి పెర్‌ఫార్మెన్స్ కూడా ఫర్వాలేదు అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టుల్లో కోట శ్రీనివాసరావు, నాగినీడు, అజయ్ తదితరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. టెక్నికల్‌గా చూస్తే ఎస్.గోపాలరెడ్డి ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. ప్రతి సీన్‌లోనూ రిచ్‌నెస్ చూపించడంలో బాగా సక్సెస్ అయ్యాడు. మణిశర్మ పాటల పరంగా ఆకట్టుకోలేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా చేశాడు. డైరెక్టర్ కె.వి.దయానందరెడ్డి సెలెక్ట్ చేసుకున్న కథలోనే సత్తా లేకపోవడం వల్ల సినిమాలోని ఏ సీనూ కొత్తగా అనిపించదు. పైగా హీరో కనిపించిన ప్రతిసారీ ఓ ఇంట్రడక్షన్‌లా స్లో మోషన్‌లో నడిచి రావడం ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేకపోవడం వల్ల సినిమా చాలా సీరియస్‌గా సీరియల్‌లా నడుస్తూ వుంటుంది. సెకండాఫ్‌లో కథను క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళడం కోసం కొన్ని అనవసరమైన సీన్స్‌ని ఇరికించడం, నవ్వు రాని సీన్స్‌ని ఎంతో సీరియస్‌గా ఇరికించడం సినిమాకి మైనస్ అయింది. సాగర్‌కి ఆర్.సి.ఎం.రాజుతో డబ్బింగ్ చెప్పించడం వల్ల అది హీరో వాయిస్‌లా కాకుండా ఎవరో విలన్ వాయిస్‌లా అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక సీరియల్‌లా స్టార్ట్ అవుతుంది. స్లో నేరేషన్, పైగా స్లో మోషన్ సీన్స్‌తో టి.వి.ని గుర్తు చేస్తుంది. కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమా సీరియల్‌కి ఎక్కువ, సినిమాకి తక్కువ అన్నట్టుగా వుంటుంది.
ఫినిషింగ్ టచ్: సీరియల్‌కి ఎక్కువ సినిమాకి తక్కువ
సినీజోష్ రేటింగ్: 2/5