Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: జ్యో అచ్యుతానంద


వారాహి చలన చిత్రం 

Advertisement
CJ Advs

జ్యో అచ్యుతానంద 

తారాగణం: నారా రోహిత్‌, నాగశౌర్య, రెజినా, సీత, 

తనికెళ్ళ భరణి, శశాంక్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి. దిలీప్‌ 

సంగీతం: శ్రీకళ్యాణ్‌ రమణ 

ఎడిటింగ్‌: కిరణ్‌ గంటి 

సమర్పణ: సాయి శివాని 

నిర్మాత: రజని కొర్రపాటి 

రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ అవసరాల 

విడుదల తేదీ: 09.09.2016 

అష్టాచమ్మా చిత్రంతో నటుడుగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడుగా మారి నాగశౌర్య, రాశిఖన్నా జంటగా రూపొందించిన ఊహలు గుసగుసలాడే చిత్రం ప్లెజెంట్‌ లవ్‌స్టోరీగా అందరి ప్రశంసలు అందుకుంది. తన రెండో ప్రయత్నంగా నారా రోహిత్‌, నాగశౌర్య హీరోలుగా, రెజినా హీరోయిన్‌గా అవసరాల శ్రీనివాస్‌ రూపొందించిన చిత్రం జ్యో అచ్యుతానంద. వారాహి చలన చిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన మొదటి చిత్రంతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస్‌ జ్యో అచ్యుతానంద చిత్రాన్ని ఎంత సెన్సిబుల్‌గా తీశాడు? ఏమేర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేశాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

శ్రీనివాస్‌ అవసరాల మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే ఓ సినిమాలా కాకుండా చాలా నేచురల్‌ సన్నివేశాలతో, సంభాషణలతో నిండి వుంటుంది. దాంతో ఆడియన్స్‌ ఆ సినిమా బాగా కనెక్ట్‌ అయింది. తన రెండో సినిమాకి కూడా అదే పంథాలో వెళ్ళాడు శ్రీనివాస్‌. కథ విషయానికి వస్తే అచ్యుత్‌(నారా రోహిత్‌), ఆనంద్‌(నాగశౌర్య) అన్నదమ్ములు. ఎప్పుడూ ఒకరి మీద ఒకరు సెటైర్‌లు వేసుకునే ఈ అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయ్యాయి. తల్లితో కలిసి వుంటున్న ఆ అన్నదమ్ముల జీవితంలో ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ వుంది. పెళ్ళికాక ముందు తమ ఇంట్లో అద్దెకు దిగిన జ్యోత్స్న(రెజినా)ను ఇద్దరూ ప్రేమిస్తారు. ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఒక మిస్‌ అండర్‌స్టాండింగ్‌ వల్ల ఆమె హర్ట్‌ అయి అమెరికా వెళ్ళిపోతుంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా వస్తుంది జ్యోత్స్న. అయితే ఆమె వచ్చింది అన్నదమ్ముల మీద పగ తీర్చుకోవడానికి. పగ పెంచుకునేంతగా అచ్యుతానంద ఆమెను బాధపెట్టారా? అయితే అది ఎలాంటిది? జ్యోత్స్న వాళ్ళిద్దరినీ ఎలా ఆట పట్టించింది? అనేది మిగతా కథ. 

నారా రోహిత్‌, నాగశౌర్య, రెజినాల పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో, లిమిట్‌గా వుండే డైలాగ్స్‌తో వారి క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. హీరోలకు తల్లిగా నటించిన సీత క్యారెక్టర్‌కి ఎలా ప్రాధాన్యతా లేదు. పట్టుమని నాలుగు డైలాగులు లేని క్యారెక్టర్‌ అది. సినిమా మొత్తం మూడు మెయిన్‌ క్యారెక్టర్స్‌ మధ్యే తిరుగుతుంటుంది కాబట్టి మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే వెంకట్‌ సి.దిలీప్‌ ఫోటోగ్రఫీ బాగుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు చాలా నీట్‌గా చూపించాడు. శ్రీకళ్యాణ్‌ రమణ మ్యూజిక్‌ ఫర్వాలేదు. రెండు పాటలు వినసొంపుగా వున్నాయి. వాటి పిక్చరైజేషన్‌ కూడా బాగుంది. కథను, కథలోని ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా చేశాడు. కిరణ్‌ గంటి ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఇక డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్‌ గురించి చెప్పాలంటే ఒక చిన్న కథని తీసుకొని మూడు క్యారెక్టర్లతో రెండు గంటలపాటు ఎంటర్‌టైన్‌ చెయ్యాలనుకున్నాడు. అచ్యుత్‌, ఆనంద్‌ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్స్‌ నుంచే కామెడీ కొంతవరకు సినిమాకి ప్లస్‌ అయింది. ఊహలు గుసగుసలాడే తరహాలోనే స్లో నేరేషన్‌తో సినిమా స్టార్ట్‌ అవుతుంది. నేరేషన్‌ ఎంత స్లోగా వున్నా ఆడియన్స్‌ని ఇన్‌వాల్వ్‌ చేసే కథ కాకపోవడంతో బోర్‌ ఫీల్‌ అవుతారు. ఫస్ట్‌ హాఫ్‌లో హీరోల యాంగిల్స్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌లను పదే పదే చూపించడం కొంచెం కొత్తగా అనిపించినా ఆ తర్వాత సీన్‌లోనే బోర్‌ కొట్టేస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త గ్రిప్పింగ్‌గా వున్నప్పటికీ సెకండాఫ్‌లో కథలో కదలిక లేక టైమ్‌ పాస్‌ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హీరోల మీద పగ తీర్చుకునే ప్రాసెస్‌లో హీరోయిన్‌ జరుగుతున్న ఎంగేజ్‌మెంట్‌ని కూడా కాదని వెళ్ళిపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. కథని క్లైమాక్స్‌కి తెచ్చేందుకు శ్రీనివాస్‌ నానా తంటాలు పడాల్సి వచ్చింది. సెకండాఫ్‌లో చెప్పుకోదగిన విషయం ఏదైనా వుందీ అంటే అది అన్నదమ్ముల మధ్య నడిచే క్లైమాక్స్‌. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం వున్నా దాన్ని వ్యక్తపరుచుకోలేని నిస్సహాయ స్థితిని హృదయాలకు హత్తుకునేలా చిత్రీకరించడంలో శ్రీనివాస్‌ సక్సెస్‌ అయ్యాడు. 

కథతోపాటే వచ్చే కొన్ని కామెడీ సీన్స్‌, హీరోలు, హీరోయిన్‌ మధ్య నడిచే ట్రాక్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో కూడా స్లో నేరేషన్‌ వుండడం వల్ల అప్పుడప్పుడు టి.వి. సీరియల్‌ గుర్తుకు వస్తుంది. ఇక సెకండాఫ్‌ గురించి చెప్పక్కర్లేదు. ఫక్తు టి.వి. సీరియల్‌లా సీన్స్‌ వచ్చి వెళ్తుంటాయి. క్లైమాక్స్‌ వరకు ఇదే తంతు నడుస్తుంది. మంచి ఫీల్‌ని కలిగించే క్లైమాక్స్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. సినిమాని ఎంత నేచురల్‌గా తియ్యాలని ట్రై చేసినా స్లో నేరేషన్‌ వల్ల కంటెంట్‌ని ఎంజాయ్‌ చెయ్యడం కంటే ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవ్వడమే ఎక్కువ జరుగుతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత క్లుప్తంగా, ఎంత తెలివిగా చెప్పావన్నదే ఆడియన్స్‌కి కావాలి తప్ప గంట సినిమాని రెండు గంటలు లాగితే తట్టుకునే ఓపిక ఆడియన్స్‌కి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది కేవలం మల్టీప్లెక్స్‌లకు మాత్రమే పరిమితమయ్యే సినిమా. బి, సి సెంటర్స్‌లో ఈ చిత్రానికి ఆదరణ లభించే అవకాశం చాలా తక్కువ. ఎలాంటి హడావిడి లేని ఒక క్లీన్‌ మూవీ చూడాలనుకునే కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: జో కొట్టే.. జ్యోఅచ్యుతానంద! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs