వి క్రియేషన్స్, షణ్ముఖ ఫిలింస్
కబాలి
తారాగణం: రజనీకాంత్, రాధికా ఆప్టే, విన్‌స్టన్ చో,
ధన్సిక, కిశోర్, దినేష్ రవి, జాన్ విజయ్, రుత్విక తదితరులు
సినిమాటోగ్రఫీ: జి.మురళి
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్.
సమర్పణ: కలైపులి ఎస్. థాను
నిర్మాతలు: కె.ప్రవీణ్‌కుమార్ వర్మ, కె.పి.చౌదరి
రచన, దర్శకత్వం: పా. రంజిత్
విడుదల తేదీ: 22.07.2016
సూపర్‌స్టార్ రజనీకాంత్... భారత చలన చిత్ర చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించిన హీరో. అంతర్జాతీయంగానూ కోట్లాది అభిమానుల్ని కలిగి వున్న ఏకైక హీరో. రజనీకాంత్ కొత్త సినిమా రిలీజ్ అవుతోందంటే భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. తన స్టైల్‌తో, తన మేనరిజమ్స్‌తో ఆడియన్స్‌ని కట్టి పడేసే రజనీ వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఈ వయసులో కూడా అతనికి వున్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని అతని లేటెస్ట్ మూవీ కబాలి ప్రూవ్ చేస్తోంది. జూలై 22న సినిమా రిలీజ్ అవుతోందని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో కబాలి ఫీవర్ స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. జూలై 22 రానే వచ్చింది. ఈమధ్యకాలంలో ఇంతటి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డ సినిమా కబాలియే కావడం విశేషం. మరి ఈరోజు రిలీజ్ అయిన కబాలి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎంతవరకు రీచ్ అయింది? అభిమానుల్ని సూపర్‌స్టార్ ఎంతవరకు ఎంటర్‌టైన్ చెయ్యగలిగాడు? డైరెక్టర్ రంజిత్ రజనీ అభిమానుల్ని శాటిస్‌ఫై చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు కోరుకునేది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, అంతకుమించిన యాక్షన్. ఈ వయసులో తమ హీరో మెరుపులా కదలాలని, అతని మేనరిజమ్స్‌తో మెస్మరైజ్ చెయ్యాలని అభిమానులు కోరుకోరు. కానీ, స్క్రీన్ మీద రజనీ కనిపిస్తే చాలు, స్టైల్‌గా వాక్ చేస్తే చాలు, విజిల్స్ వేయించే డైలాగ్స్ చెప్తే చాలు అనుకుంటారు. నేచురల్ లుక్‌తో, ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో రజనీ చేసిన ఈ కబాలి వీటన్నింటికీ విరుద్ధంగా వుంది. కేవలం కథకే ఇంపార్టెన్స్ ఇచ్చి హీరోయిజాన్ని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్ చెయ్యలేకపోయాడు డైరెక్టర్ రంజిత్. సినిమా మొత్తం రజనీకాంత్ ఒక సాధారణమైన క్యారెక్టర్ ఆర్టిస్టులా కనిపించాడే తప్ప ఎక్కడా కబాలి అనే టైటిల్‌కి తగ్గట్టుగా పవర్‌ఫుల్‌గా అనిపించలేదు. ఆ రేంజ్‌లో రజనీతో డైరెక్టర్ రంజిత్ చేయించలేకపోయాడు అనడం సబబుగా వుంటుంది.
ఓపెన్ చేస్తే 25 సంవత్సరాల జైలు జీవితం గడిపిన కబాలి(రజనీకాంత్) విడుదలవుతాడు. వచ్చీ రావడంతోనే తన శత్రువైన టోనీ లీ(విన్‌స్టన్ చో) మనుషులకు తను మున్ముందు ఏం చేయబోతున్నాడనేది ఓ ట్రైలర్‌లా చూపిస్తాడు. అసలు కబాలికి, టోనీ లీకి మధ్య వైరం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్ళాలి. మలేషియాలో భారతీయులను(తెలుగు వెర్షన్ కాబట్టి భారతీయులు అనే పదం వాడారు) బానిసలుగా చూడడం, రబ్బరు తోటల్లో పనిచేసే చైనా వారికి మనకంటే ఎక్కువ వేతనం చెల్లించడం వంటి విషయాల్లో కబాలి జోక్యం చేసుకొని మనవారికి కూడా సమానమైన వేతనం వచ్చేలా చేస్తాడు. మలేషియాలో డ్రగ్ మాఫియా, వ్యభిచారం వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ 43 పేరుతో ఓ గ్యాంగ్‌ని రన్ చేస్తుంటాడు టోనీ లీ. తన వ్యాపారానికి అడ్డు వచ్చేవారిని హతమారుస్తూ వుంటాడు. అతను, అతని గ్యాంగ్ చేసే వ్యాపారాలను తన అనుచరులతో కలిసి అడ్డుకుంటాడు కబాలి. అలా కబాలి, టోనీలీ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. చిన్నతనంలోనే డ్రగ్స్ అమ్మే వారిని జీవితాలు మార్చడం కోసం ఫ్రీ లైఫ్ ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు కబాలి. ఇదిలా వుంటే మలేషియాలో వున్న భారతీయుల్ని రెచ్చగొడుతున్నాడని, ఆ క్రమంలో కొంతమందిని హత్య చేశాడన్న అభియోగంపై కబాలికి 25 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. టోనీ లీని ఎదుర్కొనే క్రమంలో కబాలి భార్య కుందనవల్లి(రాధికా ఆప్టే) హత్యకు గురవుతుంది.
ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత జైలు నుంచి వచ్చిన కబాలి తన శత్రువు టోనీ లీకి చుక్కలు చూపిస్తాడని, అతని గ్యాంగ్‌తో ఓ ఆటాడుకుంటాడని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ, సినిమాలో అలాంటిదేమీ జరగదు. రజనీ ఇంట్రడక్షన్ సీన్‌కి ఇచ్చిన బిల్డప్ చూస్తే మిగతా సినిమా ఇరగదీసేస్తుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ, ఆ తర్వాత జరిగే కథ గానీ, కథనం గానీ ఏమాత్రం ఆసక్తికరంగా వుండవు. చాలా స్లో నేరేషన్‌తో సాదా సీదా సీన్స్‌తో ప్రేక్షకుల ఉత్సాహాన్ని నీరుగార్చేలా సాగుతుంది. విలన్, అతని తాలూకు మనుషులు కబాలిని రకరకాలుగా టార్గెట్ చేస్తున్నా అతను మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోడు. స్టోరీ ఏదో టర్న్ తీసుకోబోతోంది అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సినిమా అంతా సెకండాఫ్‌లోనే వుంటుందని ఆశపడే ఆడియన్స్‌కి సెకండాఫ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నీరసం ఆవహిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కబాలి ఎలా సైలెంట్‌గా వున్నాడో సెకండాఫ్‌లో కూడా అదే సైలెంట్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ఒక దశలో సినిమా గ్రాఫ్ పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ వెంటనే పడిపోతుంది. అలా పడుతూ లేస్తూ క్లైమాక్స్ చేరుకుంటుంది. కాల్పులతో కూడిన ఈ క్లెమాక్స్‌లో కబాలి.. టోనీ లీని హతమారుస్తాడు. అక్కడితో సినిమా ఎండ్ అవ్వదు. కొన్ని నెలల తర్వాత.. ఫ్రీ లైఫ్ ఫౌండేషన్‌కి చెందిన ఓ స్టూడెంట్‌కి గన్ ఇచ్చి పంపిస్తారు మలేషియా పోలీసులు. ఓ ఫంక్షన్‌లో వున్న కబాలి దగ్గరికి వస్తాడు ఆ స్టూడెంట్. స్క్రీన్ బ్లాంక్ అవుతుంది, గన్‌తో కాల్చిన సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు సినిమా ఎండ్ అవుతుంది.
కథ, కథనాల విషయం పక్కన పెడితే కేవలం రజనీకాంత్ కోసం ఈ సినిమాని ఓసారి చూడాలనుకునే వారు చూడొచ్చు. 65 సంవత్సరాల వయసులో అదే ఎనర్జీని చూపించాలని ట్రై చేసిన రజనీని మెచ్చుకోవాల్సిందే. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇంతకు ముందు సినిమాల్లోని రజనీ మెరుపులు కబాలిలో లేకపోయినా సెటిల్డ్‌గా, నేచురల్‌గా అతని పెర్‌ఫార్మెన్స్ వుంటుంది. ఇది అభిమానులకు ఎంతవరకు రుచిస్తుందో తెలీదు. సినిమాలో కథను ముందుకు నడిపించే అంశాల కంటే ప్రేక్షకుల్ని విసిగించే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ వున్న రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నప్పుడు అభిమానులు అతన్నుంచి ఆశించే అంశాలు ఏమిటి? అతన్ని ఎలా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు? అనే విషయాల్ని డైరెక్టర్ మర్చిపోయాడు. రంజిత్ రాసుకున్న కథలో నేచురాలిటీ లేకపోయినా ఆడియన్స్‌ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా లేవు. విలన్ వల్ల ఎంతో నష్టపోయిన హీరో 25 సంవత్సరాలు జైల్లో వుండి వచ్చిన తర్వాత అతనిపై రివెంజ్ తీర్చుకోవాలనే హీరో ఎమోషన్ ఎంత పీక్స్‌లో వుండాలి? కానీ, కబాలి మాత్రం చాలా కూల్‌గా వుంటూ జరిగే అనర్థాలన్నీ చూస్తూ వుంటాడు తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకోడు. ఫస్ట్ హాఫ్‌లో తన కూతుర్ని కలుసుకున్న కబాలి తన భార్య కూడా బ్రతికే వుందని తెలుసుకొని సెకండాఫ్‌లో కూతురుతో సహా ఆమెను కలుసుకోవడానికి బయల్దేరతాడు. ఈ ప్రయాణం ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోగా, మన టైమ్‌ని తినేస్తోందన్న ఫీలింగ్ కలిగిస్తుంది. కబాలి భార్యగా రాధికా ఆప్టే పెర్‌ఫార్మెన్స్ బాగుంది. అలాగే కబాలి కూతురు యోగిగా ధన్సిక తన డిఫరెంట్ లుక్, యాక్షన్‌తో ఆకట్టుకుంది. ఇక మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. టెక్నికల్ ఎస్సెట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే జి.మురళి సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌డ్రాప్ రిచ్‌గా వుండడంతోపాటు ఫోటోగ్రఫీ కూడా రిచ్‌గానే వుండడం వల్ల టోటల్ సినిమాలో రిచ్‌నెస్ కనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ పాటల పరంగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని మాత్రం అదుర్స్ అనిపించాడు. డైరెక్టర్ రంజిత్ మాత్రం ప్రేక్షకుల, అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేకపోయాడు. ఎండ్ సీన్‌లో గన్ పేలిన సౌండ్‌తో సినిమాని ఎండ్ చెయ్యడం వల్ల అసలక్కడ ఏం జరిగిందనే విషయంలో డైరెక్టర్ క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ఫైనల్‌గా చెప్పాలంటే కబాలి సినిమా ఒక రేంజ్‌లో వుంటుందనే హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్ళే ఆడియన్స్ నిరాశతో వెనుతిరుగుతారు. రజనీకి వున్న క్రేజ్ వల్ల కలెక్షన్లపరంగా సినిమాకి ఎలాంటి ఢోకా వుండదనేది మాత్రం వాస్తవం.
ఫినిషింగ్ టచ్: కబాలి రా... అంతలేదు
సినీజోష్ రేటింగ్: 2.5/5