Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: అర్థనారి


పత్తికొండ సినిమాస్‌ 

Advertisement
CJ Advs

అర్థనారి 

తారాగణం: అర్జున్‌ యజత్‌, మౌర్యాని తదితరులు 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీనివాస్‌ గాదిరాజు 

సంగీతం: రవివర్మ 

మాటలు: నివాస్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

సమర్పణ: భరత్‌రాజ్‌ 

నిర్మాత: రవికుమార్‌ ఎం. 

రచన, దర్శకత్వం: భానుశంకర్‌ చౌదరి 

విడుదల తేదీ: 01.07.2016 

దేశభక్తి అనేది అందరికీ వుండాలి. అలాగే బాధ్యత అనేది ప్రతి ఒక్కరికీ వుండాలి. ఓ వ్యక్తికి ఈ రెండూ ఎక్కువ పాళ్ళలో వుంటే ఏం జరుగుతుంది? ఏ చిన్న తప్పునీ సహించలేడు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే భరించలేడు. ఎమోషనల్‌ అయిపోతాడు, అలా ప్రవర్తించిన వ్యక్తి ఏ స్థాయిలో వున్నా ఎదురు తిరుగుతాడు. అలాంటి వ్యక్తి కథే అర్థనారి. రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల అవినీతిని ఎండగట్టే సినిమాలు ఎన్నో వచ్చాయి. అర్థనారి కూడా అలాంటి సినిమానే. కాకపోతే చిత్రంలోని ప్రధాన పాత్రను ఎంచుకున్న తీరు వేరు. గతంలో కొన్ని సినిమాలను డైరెక్ట్‌ చేసినా దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన భానుశంకర్‌ హిజ్రా ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం అర్థనారి. ఆమధ్య లారెన్స్‌ చేసిన కాంచన ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాకుండా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా అందించింది. ఆ సినిమాలో శరత్‌కుమార్‌, లారెన్స్‌ హిజ్రాలుగా కనిపించి అందర్నీ మెప్పించారు. ఈ చిత్రంలో అర్జున్‌ యజత్‌ అర్థనారిగా, గుడిపూడి శివకుమార్‌గా రెండు పాత్రలు చేశాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? ఒక రొటీన్‌ కథకి హిజ్రా క్యారెక్టర్‌ని జోడించి సక్సెస్‌ఫుల్‌ మూవీగా రూపొందించడంలో డైరెక్టర్‌ భానుశంకర్‌ చౌదరి ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? హీరో అర్జున్‌ యజత్‌ కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అవుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

హైదరాబాద్‌ సిటీ పోలీసుల్ని ఓ వ్యక్తి వణికిస్తున్నాడు, కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సీరియల్‌ మర్డర్స్‌తో సైకోని మరపిస్తున్నాడు. పోలీస్‌ ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులను మొదట కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత హత్య చేసి రాష్ట్రంలో కలకలం సృషిస్తున్నాడు. చివరికి ముఖ్యమంత్రిని కూడా కిడ్నాప్‌ చేసి హత్య చేశాడు. ఆ వ్యక్తే అర్థనారి. వరస హత్యలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అర్థనారిని ఎన్నో ఛేజింగ్‌ల తర్వాత అరెస్ట్‌ చేస్తారు. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించినా ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడో చెప్పడు. కోర్టులో జడ్జి అడిగినా చెప్పకపోగా అతనిపైనే దాడికి పాల్పడతాడు. ఇలాంటి వ్యక్తి బ్రతికి వుంటే సమాజానికి హాని జరుగుతుందని, అందుకే అర్థనారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్తాడు జడ్జి. మరో రెండు రోజుల్లో అర్థనారిని ఉరి తీస్తారనగా చనిపోయే ముందు చివరి కోరిక ఏమిటని అడిగితే రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారితో తను మాట్లాడాలనుకుంటున్నానని చెప్తాడు. దీంతో జైల్‌లోనే టి.వి. ఛానల్స్‌ ద్వారా లైవ్‌ ఏర్పాటు చేస్తారు. ఆ లైవ్‌లో తను అర్థనారిని కాదని, మగాడినని చెప్తాడు. అయితే అప్పటివరకు అతను చేసిన హత్యల వెనుక కారణాలు ఏమిటి? అతనికి జరిగిన అన్యాయం ఎలాంటిది? సి.ఎం.తో సహా ఎంతో మంది పోలీసులను, ప్రభుత్వ అధికారులను ఎందుకు హత్య చేశాడు? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

అర్థనారిగా, గుడిపూడి శివకుమార్‌గా అర్జున్‌ యజత్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. కొత్తవాడైనా రెండు క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా అర్థనారిగా అతని బాడీ లాంగ్వేజ్‌గా పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. ఆవేశపరుడైన శివకుమార్‌గా అతని పెర్‌ఫార్మెన్స్‌ పీక్స్‌కి వెళ్ళిందని చెప్పాలి. ఈ సినిమా అతని కెరీర్‌కి చాలా ప్లస్‌ అవుతుందని చెప్పాలి. అతనికి జోడీగా నటించిన మౌర్యాని తన క్యారెక్టర్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి చేసింది. మిగతా క్యారెక్టర్లలో దాదాపు అందరూ కొత్తవాళ్ళే నటించారు. ఆయా క్యారెక్టర్లకు వాళ్ళు కూడా న్యాయం చేశారు. 

టెక్నికల్‌గా చూస్తే సాయిశ్రీనివాస్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా ఎఫెక్టివ్‌గా తియ్యగలిగాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవివర్మ పాటల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే అనిపించాడు. పెద్ద పెద్ద సినిమాలను ఎడిట్‌ చేసిన కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ అతని స్థాయికి తగ్గట్టుగా లేదు. చాలా చోట్ల సీన్స్‌ అర్థాంతరంగా ఎండ్‌ అయినట్టు అనిపిస్తాయి. ఇక డైరెక్టర్‌ భానుశంకర్‌ చౌదరి గురించి చెప్పాల్సి వస్తే బాధ్యతలేని వాడికి భారత దేశంలో బ్రతికే హక్కులేదు అనే కాన్సెప్ట్‌నే కథగా ఎంచుకొని కొత్తదనం కోసం అర్థనారి క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే కథ, కథనాల పరంగా సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేకపోయినా ఒక హిజ్రా అంత ఈజీగా అన్ని హత్యలు ఎందుకు చేస్తోంది? ఎలా చేస్తోంది? ఒక్కదానికే అది ఎలా సాధ్యమైంది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతాయి. అయితే ఇలాంటి సినిమాల్లో లాజిక్స్‌ అనేవి వుండవు. వాటి కోసం వెతకడం కూడా వృధా ప్రయాసే అవుతుంది. పెద్ద పెద్ద పోలీస్‌ ఆఫీసర్లను, ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా సునాయాసంగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్ళి పోవడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. సినిమా కాబట్టి ఆ మాత్రం సినిమాటిక్‌గా వుండాలి. అంతవరకు ఓకే. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత అనేది వుండాలి. అయితే అది ఏ ఒక్కరికో వుంటే సరిపోదు. ఈ సినిమా విషయానికి వస్తే హీరోకి బాధ్యత వుంది. కానీ, సినిమా ఎండ్‌ అయ్యే వరకు ఒక్కరిలోనూ ఆ మార్పు కనిపించదు. అతను చేసే మంచి పనులు చూసి చప్పట్లు కొట్టేవారే తప్ప అతన్ని అనుసరించేవారు ఎవరూ కనిపించరు. శివకుమార్‌లాంటి వ్యక్తులు దేశంలో ఎంతో మంది వుంటారు. కానీ, వారిని ఫాలో అయ్యేవారే తక్కువ. అందరికీ బాధ్యత వుండాలని ఒక మంచి సందేశంతో భానుశంకర్‌ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగిందే. కొత్త ఆర్టిస్టుల నుంచి చక్కని పెరఫార్మన్స్ రాబట్టుకోవడంలో డైరెక్టర్ భానుశంకర్ సక్సెస్ అయ్యాడు. ఇందులో నివాస్‌ రాసిన మాటలు కూడా ఆలోచింపజేసేవిగా, కథ, కథనాలకు ఉపయోగపడేవిగా వున్నాయి. 

అర్థనారి చేసే హత్యలతో స్టార్ట్‌ అయ్యే సినిమా ఫస్ట్‌ హాఫ్‌ ఎండింగ్‌ వరకు అతను చేసే రకరకాల హత్యలతోనే నిండిపోయి వుంటుంది. మధ్య మధ్య హిజ్రాల ఆట పాటలతో కాస్త కాలక్షేపం జరుగుతుంది. సెకండాఫ్‌ అంతా అర్థనారి ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌తో సరిపోతుంది. అర్థనారి చేస్తున్న హత్యల వెనుక ఏదో బలమైన కారణం వుంటుందని అందరికీ తెలిసినా చివరి వరకు ఆ సస్పెన్స్‌ని కొనసాగించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఈ సినిమాకి అర్థనారిగా అర్జున్‌ జయత్‌ పెర్‌ఫార్మెన్స్‌, అలాగే కొంతమంది కొత్త ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌, డైరెక్టర్‌ సెలెక్ట్‌ చేసుకున్న అర్థనారి క్యారెక్టర్‌ ప్లస్‌ పాయింట్స్‌ కాగా, రొటీన్‌ కథ, కథనాలు, రివెంజ్‌ డ్రామా, సెకండాఫ్‌లో సాధారణమైన ఫ్లాష్‌ బ్యాక్‌ మైనస్‌ పాయింట్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే కథ పాతదే అయినా అర్థనారి క్యారెక్టర్‌ వల్ల కొంత ఆసక్తి వుంటుంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంటుంది. కథ, కథనాల్లో కొన్ని లొసుగులు వున్నా, లాజిక్స్‌ మిస్‌ అయినా సినిమా ఓకే అనిపిస్తుంది. బి, సి సెంటర్లలో ఈ సినిమాకి కలెక్షన్ల పరంగా మంచి టాక్‌ వచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: అర్థనారికి సగం మార్కులు 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs