శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
మారుతి టాకీస్
గుడ్ సినిమా గ్రూప్
రోజులు మారాయి
తారాగణం: చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజస్వి, పోసాని,
ఆలీ, వాసు ఇంటూరి, రాజా రవీంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.బాల్‌రెడ్డి
సంగీతం: జె.బి.
ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్.బి.
కథ, స్క్రీన్‌ప్లే: మారుతి
మాటలు: రవివర్మ నంబూరి
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాత: జి.శ్రీనివాస్‌రావు
దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని
విడుదల తేదీ: 01.07.2016
ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎప్పటికప్పుడు రోజులు మారిపోయాయి అనుకోకపోతే మనం బ్రతకలేం. మా రోజుల్లో ఇలా లేదు.. మా రోజుల్లో అలా లేదు అంటూ పెద్ద వారు చెప్పే మాటలు వినే యూత్ కొన్ని సంవత్సరాల తర్వాత తమ పిల్లల ప్రవర్తన చూసి మా రోజుల్లో ఇలా లేదు రోజులు మారిపోయాయి అని వారికి చెప్తారు. ఇదంతా రన్నింగ్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలని కోరుకునే మనసుకి కొత్తొక వింత పాతొక రోత. ఒకప్పుడు సామాజిక పరిస్థితులపై ఈ మాట అనుకోవాల్సి వస్తే ఇప్పుడు మాత్రం కేవలం అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తనపై అనుకోవాల్సి వస్తోంది. సినిమాలు అనేవి మనుషుల్లో వున్న అవలక్షణాలను ఎత్తి చూపి తద్వారా వారిలో మార్పును తీసుకు రావడానికి ఉపయోగ పడాలే తప్ప వారిలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించేవిగా, కొత్త కొత్త నేరాలు చేసేందుకు ఉసిగొల్పేవిగా వుండకూడదు. మారుతి డైరెక్షన్‌లో గతంలో వచ్చిన ఈరోజుల్లో సినిమాలో ప్రస్తుతం యూత్ ఎలా వుందో చూపించాడు. ఆ తర్వాత బస్‌స్టాప్ చేశాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అయినా బోలెడంత అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు మారుతి. ఈరోజు విడుదలైన రోజులుమారాయి చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించిన మారుతి అబ్బాయిల్ని అమ్మాయిలు ఎలా వాడుకోవాలి, వారిని వదిలించుకోవడానికి ఎలాంటి నేరాలు చెయ్యాలి అనేది నూరిపోసాడు. ఈరోజుల్లో, బస్టాప్ వంటి సినిమాలతో దర్శకుడుగా మచ్చ తెచ్చుకున్న మారుతి ఇటీవల నాని హీరోగా చేసిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో ఆ మచ్చను తుడిచేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే రోజులు మారాయి చిత్రంతో మారుతి మరోసారి జూలు విదిలించినట్టు కనిపిస్తోంది.
తను ప్రేమించిన అబ్బాయికి డబ్బు ఇవ్వడం కోసం అశ్వత్(చేతన్ మద్దినేని)ని ప్రేమించినట్టు నటించి అతన్నుంచి డబ్బు రాబుట్టుకుంటూ వుంటుంది ఆద్య(కృతిక). ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేసే రంభ(తేజస్వి)ని ప్రేమిస్తాడు బాస్ పీటర్(పార్వతీశం). తను ప్రేమించిన అమ్మాయి కోసం బాస్‌గా వున్న తను ఆ జాబ్‌ను ఆ అమ్మాయికి ఇచ్చేసి తను ఆఫీస్ అసిస్టెంట్‌గా సెటిల్ అయిపోతాడు పీటర్. ఓరోజు తమ భవిష్యత్తు ఎలా వుంటుందో తెలుసుకోవడానికి ఓ బాబా దగ్గరికి వెళ్తారు ఆద్య, రంభ. ఇద్దరూ ఒకేరోజు పుట్టడం, ఒకే నక్షత్రం కావడంవల్లే ఒకేచోట కలిసి వుంటున్నారని, వారిని పెళ్ళి చేసుకునే వారు పెళ్ళయిన మూడోరోజే చనిపోతారని చెప్తాడు. ఇది విని షాక్ అయిన ఆద్య, రంభ ఓ మాస్టర్ ప్లాన్ వేస్తారు. తాము ప్రేమిస్తున్నామని భ్రమపడే అశ్వత్, పీటర్‌లను దొంగ పెళ్ళి చేసుకుంటే మూడు రోజుల్లో ఇద్దరూ చనిపోతారు. ఆ తర్వాత తాము ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోదామనుకుంటారు. వాళ్ళ ప్లాన్ తెలీని అశ్వత్, పీటర్ పెళ్ళి అనగానే ఎగిరి గంతేసి ఓకే చెప్తారు. పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఆ తర్వాత అశ్వత్‌కి చెందిన ఓ ఫామ్ హౌస్‌కి వెళ్తారు నలుగురూ. పెళ్ళి జరిగినా శోభనానికి ఏదో ఒక అడ్డంకి చెప్పి మూడు రోజులు పోస్ట్‌పోన్ చేస్తారు ఆద్య, రంభ. మూడు రోజులు గడిచిపోయినా అశ్వత్, పీటర్‌లకు ఏమీ కాదు. దీంతో ఆ పనేదో మనమే చేద్దాం అని ఫామ్‌హౌస్ కీపర్ సాయంతో ఇద్దరినీ చంపేస్తారు. వారిని ఆ ఫామ్ హౌస్ ఆవరణలోనే పాతిపెట్టి సిటీకి చెక్కేస్తారు. ఆ తర్వాత ఆద్య, రంభ ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కొన్నారు? చివరికి ఏమైంది? అనేది తెరమీద చూడాల్సిందే.
సినిమా స్టార్ట్ అయిన పది నిముషాల నుంచే నెక్స్‌ట్ ఏం జరగబోతోంది అనేది కామన్ ఆడియన్స్ కూడా ఇట్టే తెలిసి పోతుంది. క్లైమాక్స్ ఎలా వుంటుందనేది కూడా కామన్ ఆడియన్ ముందే చెప్పెయ్యగలడు. మరి అలాంటి ఈ కథలో కొత్తదనం ఏముంది? మారుతి చేసిన కథ, స్క్రీన్‌ప్లేలో ఎలాంటి నావెల్టీ వుంది అనేది అతనికే తెలియాలి. అమ్మాయిల్ని అంత క్రిమినల్ మెంటాలిటీ వున్నవారిగా చూపించడం మారుతికే సాధ్యమైందేమో! పీటర్‌గా నటించిన పార్వతీశం, రంభగా నటించిన తేజస్విలకు మాత్రమే పెర్‌ఫార్మెన్స్ పరంగా ఎక్కువ మార్కులు పడతాయి. పార్వతీశం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిన కొన్ని డైలాగ్స్ అందర్నీ నవ్విస్తాయి. సినిమాలో కాస్తో కూస్తో రిలీఫ్ వుందీ అంటే అది పార్వతీశం క్యారెక్టర్ వల్లే. చేతన్ మద్దినేని, కృతిక తమ క్యారెక్టర్ల పరిధి మేరకే ఫర్వాలేదు అనిపించారు. మిగతా క్యారెక్టర్స్‌లో పోసాని, రాజా రవీంద్ర, వాసు ఇంటూరి, ఆలీ ఓకే అనిపించారు.
ఈ సినిమాకి టెక్నికల్‌గా అన్నీ మైనస్‌లే వుండడం విశేషం. బాల్‌రెడ్డి అందించిన ఫోటోగ్రఫీ ఏమాత్రం బాగాలేదు. క్వాలిటీ లేని ఫోటోగ్రఫీతో అప్పుడ్పుడు ఔట్ ఫోకస్‌లతో ఆడియన్స్ కళ్ళకు ఇబ్బంది కలిగించాడు. లైటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాని చుట్టేసారనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా దానికి తగ్గట్టుగానే వుంది. ఇక జె.బి. మ్యూజిక్ ఎక్కడా ఆకట్టుకోలేదు. పాటలు అంతంత మాత్రంగానే వున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రొటీన్‌గా వుంది. కథ, కథనాల విషయానికి వస్తే మారుతి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకున్నదేంటో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్‌ని గ్రిప్పింగ్‌గా నడిపించినట్టు అనిపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి మాటలుగానీ, సీన్స్‌గానీ ఒక బి గ్రేడ్ సినిమాలా అనిపించాయి. మేం తట్టుకోలేం అని ఆడియన్స్ మొరపెట్టుకునేలా వున్నాయి. మారుతి టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి ఈ సినిమా చేశారంటే ఇందులో ఏదో ప్రత్యేకత వుంది అనుకునే ఆడియన్స్‌కి పెద్ద షాకే తగిలింది. ఫైనల్‌గా చెప్పాలంటే రోజులు మారాయి అంటూ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే చేసిన మారుతి ప్రేక్షకుల్ని ఏమార్చలేకపోయాడు.
ఫినిషింగ్ టచ్: అవును.. ప్రేక్షకులూ మారారు
సినీజోష్ రేటింగ్: 2.5/5
Advertisement
CJ Advs