పి.వి.పి. సినిమా
ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్
బ్రహ్మోత్సవం
తారాగణం: మహేష్, కాజల్, సమంత, ప్రణీత,
సత్యరాజ్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, జయసుధ,
రేవతి, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మిక్కీ జె.మేయర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: గోపీసుందర్
నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
విడుదల తేదీ: 20.05.2016
అనుబంధాలు అడుగంటి పోతున్న ఈరోజుల్లో, ఆప్యాయతలు ఆమడ దూరం వరకే పరిమితమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిజజీవితంలోనే కాదు సినిమాల విషయంలోనూ అది నిజమని ప్రూవ్ అవుతోంది. మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, హార్రర్.. ఇలా రకరకాల జోనర్స్‌లో వచ్చే సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు విపరీతమైన ఆదరణ వుండేది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఆడియన్స్ టేస్ట్ మారింది. దానికి తగ్గట్టుగానే రచయితలు, డైరెక్టర్ల అభిరుచులు కూడా మారాయి. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీసినంత ఈజీగా సెంటిమెంట్ సినిమాలను తియ్యలేకపోతున్నారు. మనసుకు హత్తుకునే సెంటిమెంట్.. బంధాలు, అనుబంధాలను తెలిపే కథాంశాలతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు కూడా ధైర్యం చెయ్యలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మహేష్ లాంటి స్టార్ హీరోతో బ్రహ్మోత్సవం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చెయ్యడానికి ముందుకొచ్చింది పివిపి సినిమా. మహేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ సినిమాను రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల మరోసారి అదే ఫ్యామిలీ సెంటిమెంట్‌తో హిట్ కొట్టాలని ట్రై చేశాడు. ఈ ఇద్దరి హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న బ్రహ్మోత్సవం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ సినిమాపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యిందా? మహేష్‌కి శ్రీకాంత్ అడ్డాల రెండో హిట్‌ని ఇవ్వగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అది విజయవాడలోని ఓ రిచ్ ఫ్యామిలీ. లెక్కకు మించిన కుటుంబ సభ్యులు వుండే ఆ ఇంట్లో ప్రతిరోజూ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇంటి పెద్ద చంటిబాబు(సత్యరాజ్). అతని చుట్టూ నలుగురు బావమరుదులు వుంటారు. అందరూ కలిసి పెద్ద బిజినెస్ చేస్తుంటారు. చంటిబాబు వల్ల తనకు గుర్తింపు రావడం లేదని పెద్ద బావమరిది(రావు రమేష్) తెగ బాధపడిపోతుంటాడు. తన కూతురికి, చంటిబాబు కొడుకు(మహేష్) పెళ్ళి చెయ్యాలని ఆశ పడ్డ బావమరిది అది కుదరకపోవడంతో బావతో తెగ తెంపులు చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. షాక్ తిన్న చంటిబాబు.. ఒకడు వెళ్లిపోయాడు, మిగతా ముగ్గురైనా మన దగ్గరే వుండేలా చెయ్యాలని కొడుకుతో చెప్పి చనిపోతాడు. తన చుట్టూ ఎప్పుడూ నలుగురు వుండాలని, కుటుంబ సభ్యులు ఎప్పుడూ సెలబ్రేషన్స్‌తో హ్యాపీగా వుండాలని కోరుకునే తండ్రి కోసం కొడుకు ఏం చేశాడు? తమ కుటుంబం నుంచి వేరుగా వెళ్ళిపోయిన మావయ్య తన తప్పు తెలుసుకోవడానికి, మళ్లీ ఆ ఇల్లు సెలబ్రేషన్స్‌తో నిండిపోవడానికి హీరో చేసిందేమిటి? అనేది మిగతా కథ.
ఇది చాలా సింపుల్ కథ. ఒక విధంగా చెప్పాలంటే చాలా పాత కథ. మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన కథ. దాన్ని కొత్తగా చెయ్యాలనే ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప కథలోగానీ, కథనంలోగానీ, క్యారెక్టరైజేషన్స్‌లోగానీ ఎక్కడా కొత్తదనం కనిపించదు. బ్రహ్మోత్సవం అనే టైటిల్‌కి తగ్గట్టుగా సమయం, సందర్భం అనేది లేకుండా ఆ రిచ్ ఫ్యామిలీ ఎప్పుడూ ఆట పాటలతో గడిపేస్తూ వుంటుంది. పేరు లేని హీరోగా మహేష్ ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయిల్ని ఆట పటిస్తూ కాలం గడిపేస్తూ వుంటాడు. పెర్‌ఫార్మెన్స్ పరంగా మహేష్ తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్‌లో కనిపించే కాజల్ ఏమాత్రం ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేసింది. గ్లామర్ పరంగా కాజల్‌కి ఈ సినిమాలో తక్కువ మార్కులే పడతాయి. మహేష్ తండ్రిగా సత్యరాజ్ ఓకే అనిపించాడు. ఈ తరహా క్యారెక్టర్లు ఇంతకుముందు చాలా చేసి వుండడంతో మనం కొత్తగా ఫీల్ అవ్వం. సెకండాఫ్‌ని కంటిన్యూ చెయ్యడానికి వచ్చిన సమంత సినిమా లెంగ్త్‌ని పెంచడానికే తప్ప ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. మిగతా క్యారెక్టర్లలో ఆకట్టుకునే ఒకే ఒక క్యారెక్టర్ పెద్ద బావమరిది రావు రామేష్. అప్పటి వరకు స్లోగా, నీరసంగా నడుస్తున్న సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌కి ముందు రావు రమేష్ చెప్పిన డైలాగ్స్ క్లాప్స్ కొట్టిస్తాయి. సినిమాలో ఇంకా లెక్కకు మించిన క్యారెక్టర్స్ వున్నా ఏదీ చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కాదు, ఆయా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మహేష్ లాంటి స్టార్ హీరోతో చాలా గ్రాండియర్‌గా రూపొందించిన బ్రహ్మోత్సవం చిత్రానికి టెక్నికల్ ఎస్సెట్స్‌గా చెప్పాల్సి వస్తే మొదట సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గురించి చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌ని ఫ్రెష్‌గా, రిచ్‌గా చూపించడంలో రత్నవేలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. తోట తరణి ఆర్ట్ వర్క్ సినిమాకి గ్రాండియర్ లుక్‌ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ గురించి చెప్పాల్సి వస్తే సినిమాకి అదే పెద్ద మైనస్ అయింది. సినిమాలోని అన్ని పాటలూ ఆల్రెడీ మనం వినేసిన పాటల్లాగే అనిపించాయి తప్ప ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా లేదు. దానికి తగ్గట్టుగానే విజువలైజేషన్ చాలా పూర్‌గా వుంది. గోపీసుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు అనిపించాడు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకొని మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించాలన్న శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నం ఫలించలేదు. కథ పరంగా, కథనం పరంగా ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో బ్రహ్మోత్సవం ఓ సాధారణ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాల ఏం చెప్పదలుచుకున్నాడన్న విషయం ఎవ్వరికీ అర్థం కాదు. కుటుంబం నుంచి వేరుగా వెళ్ళిపోయిన మావయ్యకు నచ్చజెప్పి తీసుకు రావడాన్ని పక్కన పెట్టి హీరోయిన్‌తో కలిసి హరిద్వార్, కాశి, లక్నో, పూనె, బెంగుళూరు.. ఇలా ఎక్కడెక్కడో వున్న తమ బంధువులను వెతకడానికి హీరో వెళ్ళడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. దాని వల్ల హీరో కుటుంబానికి ఒరిగేది ఏమిటో డైరెక్టర్ చెప్పలేకపోయాడు. సినిమా చూస్తున్నంత సేపు ఓ కథలా కాకుండా ఏ సీన్‌కి ఆ సీనే అన్నట్టుగా అనిపించడం, నెక్స్‌ట్ ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ కూడా లేకపోవడంతో క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా? సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీకాంత్ అడ్డాల, కృష్ణ చైతన్య కలిసి రాసిన మాటల్లో ఎక్కువ శాతం సాధారణ ప్రేక్షకులకు అర్థం కాని విధంగానే వున్నాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చెయ్యాలనుకున్న శ్రీకాంత్ ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో కూడా శ్రద్ధ పెట్టకపోవడంతో సినిమాకి అది కూడా పెద్ద మైనస్ అయింది.
చాలా సాదా సీదాగా స్టార్ట్ అయ్యే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ కూడా చాలా సింపుల్‌గా వుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ అంతా రకరకాల సెలబ్రేషన్స్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. కుటుంబ పెద్ద అయిన చంటిబాబు చుట్టూ కథ తిరుగుతూ వుంటుంది తప్ప హీరోకి ఎలాంటి ఇంపార్టెన్స్ వుండదు. ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నిలబడి నవ్వుతూనో, టిఫిన్ చేస్తూనో, భోజనం చేస్తూనో, హీరోయిన్ కాజల్‌తో టైమ్ పాస్ చేస్తూనో కనిపిస్తాడు తప్ప అతనికి మరో యాక్టివిటీ వున్నట్టు అనిపించదు. హీరో ఫ్యామిలీలో ఫంక్షన్స్, హీరో, హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్, ఆ తర్వాత సడన్‌గా హీరో తండ్రి చనిపోవడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి కుటుంబం నుంచి వేరుగా వెళ్ళిపోయిన మావయ్యను తీసుకు రావడాన్ని పక్కన పెట్టి వెనక ఏడు తరాలకు సంబంధించిన బంధువులను వెతుక్కుంటూ హీరోయిన్‌తో కలిసి దేశమంతా తిరుగుతాడు హీరో. చివరికి మావయ్య రావు రమేష్ తన తప్పు తెలుసుకునే ప్రాసెస్‌లో ఓ సెంటిమెంట్ సీన్‌తో క్లైమాక్స్‌కి వస్తుంది. శ్రీమంతుడులాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ హీరో మహేష్ చేసిన ఈ బ్రహ్మోత్సవం ఓ సాదా సీదా సినిమా అనిపిస్తుందే తప్ప ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించదు. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేక్షకులు, మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బ్రహ్మోత్సవం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఫినిషింగ్ టచ్: ఇది సాధారణ ఉత్సవం.
సినీజోష్ రేటింగ్: 2.5/5