Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: రాజా చెయ్యి వేస్తే


వారాహి చలన చిత్రం 

Advertisement
CJ Advs

రాజా చెయ్యి వేస్తే 

తారాగణం: నారా రోహిత్‌, ఇషా తల్వార్‌, నందమూరి తారకరత్న, 

శివాజీ రాజా, శశాంక్‌, రాజీవ్‌ కనకాల తదితరులు 

సినిమాటోగ్రఫీ: భాస్కర్‌ సామల 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: తమ్మిరాజు 

మాటలు: సుధీర్‌ చిలుకూరి 

సమర్పణ: సాయి శివాని 

నిర్మాత: రజనీ కొర్రపాటి 

రచన, దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి 

విడుదల తేదీ: 29.04.2016 

బాణం, సోలో చిత్రాల తర్వాత సరైన హిట్‌ లేని నారా రోహిత్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు నెలల్లో రోహిత్‌ నటించిన తుంటరి, సావిత్రి చిత్రాలు విడుదలై పరాజయాన్ని చవి చూశాయి. మూడో చిత్రంగా రాజా చెయ్యి వేస్తే ఈరోజు విడుదలైంది. వారాహి చలన చిత్రం బేనర్‌పై ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రమైనా నారా రోహిత్‌కి విజయాన్ని అందించిందా? విలన్‌గా నటించిన నందమూరి తారకరత్నకి ఈ చిత్రం ఎలాంటి హెల్ప్‌ అయింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఈమధ్యే వచ్చిన తుంటరి, సావిత్రి చిత్రాల్లో నారా రోహిత్‌ క్యారెక్టరైజేషన్‌ విషయంలోగానీ, పెర్‌ఫార్మెన్స్‌ విషయంలోగానీ అంత కేర్‌ తీసుకున్నట్టు కనిపించదు. ఈరోజు విడుదలైన రాజా చెయ్యి వేస్తే చిత్రంలో కూడా అలాంటి తప్పులే జరిగినట్టు అనిపిస్తుంది. హీరోకి ఒక ఎయిమ్‌ అంటూ వుండదు. ఒకవేళ వున్నా దాన్ని సీరియస్‌గా తీసుకోడు. తన శక్తికి మించిన పనే అయినా డాన్సులు చెయ్యాలని ట్రై చేస్తాడు. కథగా చెప్పుకోవాలంటే డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో మూడు సంవత్సరాలు టైమ్‌ తీసుకొని ఇంటి నుంచి వచ్చేస్తాడు రాజారామ్‌(నారా రోహిత్‌). అలాగని ఎక్కడికో వెళ్ళడు. అదే ఊళ్ళో వుంటాడు. అదే ఊళ్ళో అతని తండ్రి శివాజీ(శివాజీరాజా) పోలీస్‌ ఆఫీసర్‌. ఈ విషయాన్ని క్లైమాక్స్‌లో రివీల్‌ చేస్తారనుకోండి. హీరో కథ ఇలా వుంటే.. మరో పక్క విలన్‌ విజయ్‌ మాణిక్‌(నందమూరి తారకరత్న) అంటే సిటీలో అందరికీ భయమే. ఎలాంటి ఎవిడెన్స్‌ లేకుండా హత్య చేయడం అతని స్పెషాలిటీ. అతని వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి. తమ వాళ్ళని పోగొట్టుకున్న ఎంతోమంది మాణిక్‌కి శత్రువులుగా మారతారు. కానీ, అతన్ని ఏమీ చేయలేకపోతారు. అతను కూడా ఎవరినీ లెక్క చేయడు. విలన్‌ పరిస్థితి అలా వుంటే డైరెక్టర్‌ అవ్వాలన్న యాంబిషన్‌ వున్న మన హీరో ఓరోజు తను ప్రేమించిన అమ్మాయి చైత్ర(ఇషా తల్వార్‌)కి కాఫీ షాప్‌లో ఓ కథ చెప్తాడు రాజా. ఆ కథని ఆ షాప్‌లో వున్న చాలా మంది విని అప్రిషియేట్‌ చేస్తారు. ఆ తర్వాత అతనికి ఓ లెటర్‌ వస్తుంది. రాజా చెప్పిన కథ తను కూడా విన్నానని, తనకో లవ్‌స్టోరీ రాసివ్వమని అడ్వాన్స్‌ కూడా పంపిస్తాడు ఆ అపరిచితుడు. లవ్‌స్టోరీలంటే ఇష్టపడని రాజా తన లవ్‌స్టోరీనే కథగా రాసి పంపిస్తాడు. కానీ, ఆ వ్యక్తి ప్రస్తుతం లవ్‌స్టోరీ వద్దని, ఓ కాన్సెప్ట్‌ చెప్పి దానికి క్లైమాక్స్‌ రాయమంటాడు. రాజా రాసిన క్లైమాక్స్‌ ఆ వ్యక్తికి బాగా నచ్చుతుంది. అయితే ఆ క్లైమాక్స్‌లో హీరో విలన్‌ని చంపినట్టుగానే తన కోసం ఒక వ్యక్తిని చంపాలని ఒక గన్‌, చంపాల్సిన వ్యక్తి ఫోటో పంపిస్తాడు. అతను చంపాల్సింది ఎవరినో కాదు విజయ్‌ మాణిక్‌ని. తను చెప్పినట్టు చెయ్యకపోతే రాజానే చంపేస్తానంటాడు ఆ అపరిచితుడు. తను ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ లవర్‌ని కూడా చంపేస్తానని రాజాని బెదిరిస్తాడు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? విజయ్‌ మాణిక్‌ని చంపడానికి రాజానే ఎందుకు సెలెక్ట్‌ చేసుకున్నాడు? ఒక మనిషిని చంపడం నేరమని భావించే రాజా ఆ పని చెయ్యడానికి ఒప్పుకున్నాడా? విజయ్‌ మాణిక్‌ని చంపాలనుకుంటున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే. 

నారా రోహిత్‌ ఇంతకుముందు చేసిన చిత్రాల సంగతి ఎలా వున్నా ఈమధ్య వచ్చిన సినిమాల్లో అతన్ని చూడాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా డాన్సుల్లో ఆ ఇబ్బంది ఎక్కువగా తెలుస్తుంది. తుంటరి, సావిత్రి చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా రోహిత్‌ క్యారెక్టరైజేషన్‌ బలంగా లేదు. సరైన ఎమోషనల్‌ సీన్స్‌గానీ, సరైన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌గానీ రోహిత్‌పై చెయ్యలేకపోయారు. విలన్‌గా చేసిన తారకరత్న హీరో పెర్‌ఫార్మెన్స్‌ని డామినేట్‌ చేశాడు. సినిమా స్టార్టింగ్‌లోనే ఎంట్రీ ఇచ్చే తారకరత్న హీరో రేంజ్‌ బిల్డప్‌తో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాడు. సినిమా స్టార్ట్‌ అయిన 15 నిముషాలకు హీరో ఎంటర్‌ అవుతాడు. తారకరత్న విలన్‌గా తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరో కంటే విలన్‌కే ఎక్కువ ఫైట్‌ సీక్వెన్స్‌లు వుండడం ఈ చిత్రంలోని విశేషం. హీరోయిన్‌ ఇషా తల్వార్‌ని కేవలం గ్లామర్‌కే పరిమితం చేయకుండా ఆమెకు పెర్‌ఫార్మ్‌ చెయ్యడానికి కొంత స్కోప్‌ ఇచ్చారు. మిగతా క్యారెక్టర్లలో శివాజీ రాజా క్యారెక్టర్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

భాస్కర సామల ఫోటోగ్రఫీ బాగుంది. సినిమా అంతా రిచ్‌గా కనిపించడానికి కృషి చేశాడని అర్థమవుతుంది. ఇక సాయికార్తీక్‌ సంగీతం గురించి చెప్పాల్సి వస్తే అతని గత చిత్రాల్లోని పాటల్లాగే ఈ చిత్రంలోని పాటలు కూడా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగా చేశాడు. రెండు పాటలు విజువల్‌గా బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్‌ ఫర్వాలేదు. అయితే రెండు మూడు చోట్ల ఎడిటింగ్‌ పరంగా జర్క్‌ రావడం మనం గమనించవచ్చు. ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ని కత్తిరించి వుంటే లెంగ్త్‌ తగ్గి వుండేది. సుధీర్‌ చిలుకూరి రాసిన డైలాగ్స్‌ బాగున్నాయి. కొన్ని డైలాగ్స్‌ ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. డైరెక్టర్‌ ప్రదీప్‌ చిలుకూరి విషయానికి వస్తే కథలో కొత్తదనం లేదు. కథలోని క్యారెక్టర్స్‌ బలంగా లేవు. రివెంజ్‌ డ్రామాని కొత్త చెప్పే ప్రయత్నం చేసినా అది వర్కవుట్‌ అవ్వలేదు. తన తండ్రిని చంపిన విలన్‌ని హీరోయిన్‌ చంపాలనుకోవడం అనే చిన్న పాయింట్‌ని తీసుకొని దాని చుట్టూ కథ అల్లడానికి, అనవసరమైన సీన్స్‌తో, పాటలతో సినిమాని సాగదీయడానికి డైరెక్టర్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. కథ, కథనాల్లో పస లేకపోయినా, స్లో నేరేషన్‌తో సినిమా తీసినా కొన్ని సీన్స్‌లో టేకింగ్‌ పరంగా ఓకే అనిపించాడు డైరెక్టర్‌. 

ఓ కూరగాయల మార్కెట్‌లో విలన్‌ ఎంట్రీతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. విలన్‌ చేసే భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌తో అతను ఎంత క్రూరుడు అనే విషయం ఎస్టాబ్లిష్‌ అవుతుంది. ఎప్పుడైతే హీరో ఎంటర్‌ అవుతాడో ఒక్కసారిగా సినిమా స్లో అయిపోతుంది. అతని ఫ్రెండ్స్‌తో కలిసి చేసే కామెడీ, హీరోయిన్‌తో పాడే పాటలు, ఫ్లాష్‌బ్యాక్‌లో వాళ్ళిద్దరి లవ్‌స్టోరీ ఆడియన్స్‌కి తెగ బోర్‌ కొట్టిస్తుంది. ఎప్పుడైతే విలన్‌ని చంపడానికి హీరో రెడీ అవుతాడో అక్కడ ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అవుతుంది. సెకండాఫ్‌ అంతా థ్రిల్లింగ్‌ వుంటుందనుకునే ఆడియన్స్‌కి కొంత నిరాశ ఎదురవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో మాదిరిగానే సెకండాఫ్‌ని రన్‌ చేయడానికి చాలా అనవసరమైన సీన్స్‌ని జొప్పించాడు డైరెక్టర్‌. ఎంత సేపటికీ క్లైమాక్స్‌ రాదేంటీ అనే అసహనం కూడా మొదలవుతుంది. విలన్‌ని చంపడానికి హీరో డిసైడ్‌ అయినప్పటికీ హీరోయిజం అనేది ఎక్కడా కనిపించదు. విలన్‌వల్ల నష్టపోయిన వారే హీరోకి ఆయుధాలు అందిస్తుంటే ఫైనల్‌గా హీరోయిన్‌ చేతుల్లో విలన్‌ లైఫ్‌ ఎండ్‌ అవుతుంది. ఈ సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవాలంటే విలన్‌గా చేసిన తారకరత్న, అప్పుడప్పుడు పేలే కొన్ని జోక్స్‌, సాయికార్తీక్‌ మ్యూజిక్‌, భాస్కర్‌ సామల ఫోటోగ్రఫీ. ఇక మైనస్‌లుగా నారా రోహిత్‌ లుక్‌, అతని పెర్‌ఫార్మెన్స్‌, అతని క్యారెక్టరైజేషన్‌, చెప్పాలనుకున్న పాయింట్‌ చిన్నదే అయినా సాగదీసి స్లో నేరేషన్‌లో చెప్పిన విధానం, కొత్తగా చెప్పాలని ట్రై చేసినా పాత కథేగా అనిపించడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌లుగా మారాయి. రాజా చెయ్యి వేస్తే అనే టైటిల్‌కి, కథకి, హీరో క్యారెక్టరైజేషన్‌కి ఎక్కడా సంబంధం వుండదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్యకాలంలో నారా రోహిత్‌ చేసిన తుంటరి, సావిత్రి కోవలోకే ఈ సినిమా కూడా వెళ్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: విషయం తక్కువ.. బిల్డప్‌ ఎక్కువ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs