ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్
ఈడోరకం ఆడోరకం
తారాగణం: మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారికా,
హెబా పటేల్, డా. రాజేంద్రప్రసాద్, రవిబాబు,
అభిమన్యు సింగ్, సుప్రీత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్
సంగీతం: సాయికార్తీక్
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
మాటలు: డైమండ్ రత్నబాబు
సమర్పణ: ఎ టివి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: 14.04.2016
సినిమాల్లో ఎన్నో రకాలు వున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, మెసేజ్ ఓరియంటెడ్, ఫీల్‌గుడ్ మూవీస్, కామెడీ.. ఇలా చాలా రకాల సినిమాలు వున్నా ఎక్కువ శాతం ఆడియన్స్ ఇష్టపడేది మాత్రం కామెడీనే. నిత్యం సమస్యలతో సతమతమయ్యే ప్రేక్షకులు కూసింత రిలాక్స్ అవ్వడానికి కామెడీ సినిమాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన రేలంగి నరసింహారావు, జంధ్యాల, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి డైరెక్టర్స్ ఎక్కువగా కామెడీ సినిమాలనే చేసి దాంట్లో కాస్త మెసేజ్‌ని కూడా జోడించి నవ్వించేవారు. వారి తరహాలోనే జి.నాగేశ్వరరెడ్డి కూడా కామెడీనే నమ్ముకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నాగేశ్వరరెడ్డి సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్‌లో వుంది. ఆ నమ్మకంతోనే మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ఈడోరకం ఆడోరకం. వినోదం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ద్వారా ఎవరెవరు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించారు? నాగేశ్వరరెడ్డి గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా వుందా? మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అయింది? పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా వచ్చిన ఈడోరకం ఆడోరకం ఆడియన్స్‌ని ఎంతవరకు శాటిస్‌ఫై చేసింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక కన్‌ఫ్యూజన్ డ్రామా. అర్జున్, అశ్విన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అర్జున్ తండ్రి నారాయణ(రాజేంద్రప్రసాద్) సిటీలో పెద్ద లాయర్. అశ్విన్ తండ్రి కోటేశ్వరరావు(పోసాని కృష్ణమురళి) సబ్ ఇన్‌స్పెక్టర్. ఈ ఇద్దరు మిత్రులూ కలిసి ఓ పెళ్ళికి వెళ్ళినపుడు అక్కడ నీలవేణి(సోనారికా)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు అర్జున్. సుప్రియ(హెబా పటేల్)ను చూసి ఇష్టపడతాడు అశ్విన్. కానీ, సుప్రియ మాత్రం అతనికి ముందే పడిపోతుంది. అలా వారి ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఒక అనాథను పెళ్ళి చేసుకుంటానని తన ఫ్రెండ్స్‌తో నీలవేణి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా అనాథగా మారిపోతాడు అర్జున్. ఆ తర్వాత అతన్ని నీలవేణి కూడా ప్రేమిస్తుంది. నీలవేణి అన్నయ్య గజన్న(అభిమన్యు సింగ్) పెద్ద రౌడీ. అర్జున్ అనాథ అని తెలిసి తన చెల్లెలికి, అర్జున్‌కి రిజిష్టర్ మ్యారేజ్ చేసేస్తాడు. నీలవేణి భర్తతో కలిసి ఒక ఇల్లు తీసుకొని రెంట్‌కి వుండాలని డిసైడ్ అవుతుంది. అనుకోకుండా అర్జున్ తండ్రి నారాయణ ఇల్లునే నీలవేణి సెలెక్ట్ చేస్తుంది. ఇది తెలుసుకొని షాక్ అయిన అర్జున్ నీలవేణి భర్తగా అశ్విన్‌ని రంగంలోకి దించుతాడు. ఇక అక్కడి నుంచి ఆ ఇంట్లో వారికి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కన్‌ఫ్యూజన్ అనే పాట కూడా వస్తూ వుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల అశ్విన్, సుప్రియ కూడా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. తను నారాయణ కొడుకునని సుప్రియ అన్నయ్యకు చెప్తాడు అశ్విన్. అలా ఈ పెళ్ళిలో కూడా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అర్జున్, అశ్విన్ ఆడుతున్న ఈ ఆటలో ఎవరు ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యారు? దాని వల్ల ఎలాంటి అపార్థాలు చోటుచేసుకున్నాయి? తను అనాథ అని అబద్ధం చెప్పి నీలవేణిని పెళ్ళి చేసుకున్న అర్జున్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? తను నారాయణ కొడుకునని చెప్పి సుప్రియను పెళ్ళి చేసుకున్న అశ్విన్‌కి ఎదురైన ఇబ్బందులేమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
కన్‌ఫ్యూజన్ డ్రామాతో ఈ తరహా కథలు గతంలో కోకొల్లలుగా వచ్చాయి. ముఖ్యంగా పెళ్ళికి సంబంధించిన కన్‌ఫ్యూజన్ చూసి చూసి ఆడియన్స్ విసిగి వేసారారు. బ్లాక్ అండ్ వైడ్ కాలం నుంచి ఈ తరహా కథలు రకరకాల బ్యాక్‌డ్రాపుల్లో వస్తూనే వున్నాయి. కన్‌ఫ్యూజన్ డ్రామా అనేది ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తుంది. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే బలవంతంగా ఆడియన్స్‌ని నవ్వించేందుకే ఈ కథాంశాన్ని ఎంచుకున్నట్టు అర్థమవుతుంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ డ్రమెటిక్‌గానే యాక్ట్ చేసారు తప్ప సహజత్యం అనేది ఎవరి పెర్‌ఫార్మెన్స్‌లోనూ కనిపించలేదు. ఇక మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ల పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సోనారిక హీరోయిన్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక హెబా పటేల్ క్యారెక్టర్ కుమారి 21ఎఫ్ క్యారెక్టర్‌కి కొనసాగింపా అనేలా ఆమె డైలాగ్స్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ అనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, రవిబాబు ఆడియన్స్‌ని నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేశారు. దాని కోసం అప్పుడప్పుడు ఎడల్డ్ డైలాగ్స్ కూడా వారితో చెప్పించారు.
ఈ చిత్రానికి టెక్నికల్‌గా హెల్ప్ అయ్యే అంశాలు ఏమీ లేవు. సిద్ధార్థ్ ఫోటోగ్రఫీగానీ, సాయికార్తీక్ మ్యూజిక్‌గానీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్‌గానీ ఏ సందర్భంలోనూ ఆహా అనిపించేలా లేవు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ వర్క్ అంతా చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. డైమండ్ రత్నబాబు రాసిన డైలాగ్స్ సినిమాలో అక్కడక్కడా పేలాయి. కొన్ని డైలాగ్స్ నవ్వు తెప్పించేవిగా వున్నాయి. అయితే డైలాగ్స్‌లో ప్రాస కోసం ప్రాకులాట ఎక్కువగా కనిపించింది. డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గతంలో చేసిన సినిమాలు దీనికంటే మెరుగ్గా వున్నాయని చెప్పొచ్చు. ఎంచుకున్న కథాంశంలో పస లేనపుడు దానికి ఎన్ని హంగులు అద్దినా వృధా ప్రయాసే అవుతుందని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరికి తెలియకుండా మరొకరు పెళ్ళి చేసేసుకుంటారు. సినిమాలో ఇది మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే తన భార్యకి మొగుడిగా నటించమని ఫ్రెండ్‌ని అడుగుతాడు ఒక హీరో. ఆ ప్రాసెస్‌లో లాజిక్ లేని చాలా సీన్స్ ఆడియన్స్‌ని చాలా ఇబ్బంది పెట్టాయి.
రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే కబ్జా పోరాటంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరోలిద్దరూ తమ ఇంట్రడక్షన్ సాంగ్‌కి డాన్సులు చేసేస్తారు. ఈ పాటలో సునీల్ నటించడం విశేషం. ఆ తర్వాత హీరోలిద్దరూ హీరోయిన్లను కలుసుకోవడం, లవ్, సాంగ్స్, ఒక హీరో పెళ్ళి జరిగిపోవడం, కన్‌ఫ్యూజన్ డ్రామా స్టార్ట్ అవడంతో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండాఫ్‌లో మరో హీరో పెళ్ళి కావడంతో ఆ కన్‌ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నింటికీ ఓ గోడౌన్‌లో క్లారిటీ ఇస్తాడు డైరెక్టర్. ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది. పూర్తి స్థాయి కామెడీ సినిమాల సంఖ్య తగ్గిపోతున్న ఈరోజుల్లో ఒక మంచి కామెడీ సినిమాను చూద్దామని థియేటర్‌కి వెళ్ళే ఆడియన్స్‌ని ఈ సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. కొన్ని సీన్స్‌కిగానీ, డైలాగ్స్‌కిగానీ అస్సలు నవ్వే రాదు. కొన్నిసార్లు బలవంతంగా నవ్వు తెచ్చుకొని నవ్వుతాం. మరి కొన్నిసార్లు నిజంగానే నవ్వుతాం. ఈడోరకం ఆడోరకం అనే టైటిల్‌కి మనం చూసిన సినిమాకి సంబంధం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగానే హీరోల ప్రవర్తన వుంటుంది తప్ప వాళ్ళ స్పెషల్ క్వాలిటీస్ అంటూ ఏమీ కనిపించవు. టైటిల్‌ని చూసి హీరోలిద్దరివీ టిపికల్ క్యారెక్టర్స్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఫైనల్‌గా చెప్పాలంటే కథ పరంగా, కథనం పరంగా, పెర్‌ఫార్మెన్స్ పరంగా, టెక్నికల్‌గా ఎలాంటి ప్రత్యేకతలు లేని నాసిరకం సినిమా ఇది.
ఫినిషింగ్ టచ్: ఇదో నాసిరకం సినిమా
సినీజోష్ రేటింగ్: 2/5