Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: సర్దార్‌ గబ్బర్‌సింగ్‌


పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ 

Advertisement
CJ Advs

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ 

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ 

తారాగణం: పవన్‌కళ్యాణ్‌, కాజల్‌, శరద్‌ కేల్కర్‌, ముఖేష్‌ రుషి, 

బ్రహ్మానందం, ఆలీ, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఎ.విల్సన్‌ 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

కథ, స్క్రీన్‌ప్లే: పవన్‌కళ్యాణ్‌ 

మాటలు: సాయిమాధవ్‌ బుర్రా 

నిర్మాతలు: సునీల్‌ లుల్లా, శరత్‌ మరార్‌ 

దర్శకత్వం: కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) 

విడుదల తేదీ: 08.04.2016 

టాలీవుడ్‌ హీరోల్లో పవన్‌కళ్యాణ్‌ది ఓ విభిన్నమైన శైలి. అతని బాడీ లాంగ్వేజ్‌గానీ, డైలాగ్‌ డెలివరీగానీ, కామెడీ టైమింగ్‌గానీ, మేనరిజమ్స్‌గానీ డిఫరెంట్‌గా వుంటాయి. దీంతో యూత్‌లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ అతనికి విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది. పవన్‌కళ్యాణ్‌ కొత్త సినిమా వస్తోందీ అంటే అతని వీరాభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. కొన్ని ఫ్లాప్‌ చిత్రాల తర్వాత పవన్‌ చేసిన గబ్బర్‌సింగ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాని తర్వాత అత్తారింటికి దారేది, గోపాల గోపాల చిత్రాలతో టాప్‌ రేంజ్‌కి వెళ్లిపోయాడు పవన్‌. గబ్బర్‌సింగ్‌కి సీక్వెల్‌గా పవన్‌కళ్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చెయ్యబోతున్నాడన్న వార్త వచ్చినప్పటి నుంచి ఈరోజు అంటే ఈ సినిమా రిలీజ్‌ అయ్యే రోజు వరకు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. ఈరోజు సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. పవర్‌ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్‌ అయింది? ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడంలో పవన్‌కళ్యాణ్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

గబ్బర్‌సింగ్‌ చిత్రానికి సీక్వెల్‌గా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ వస్తోందని అందరూ అనుకున్నప్పటికీ వాస్తవానికి ఆ సినిమాకి, ఈ సినిమాకి కథపరంగా ఎలాంటి సంబంధం లేదు. ఒక అనాథ అయిన గబ్బర్‌సింగ్‌ని పెంచి పెద్ద చేసి పోలీస్‌ ఆఫీసర్‌ని చేస్తాడు తనికెళ్ళ భరణి. రతన్‌పూర్‌కి సి.ఐ.గా వస్తాడు గబ్బర్‌. అక్కడ భైరవ్‌సింగ్‌(శరద్‌కేల్కర్‌), అతని మనుషులు చేసే ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వుంటాడు. మధ్యలో రతన్‌పూర్‌ రాజకుమారి ఆర్షిదేవి(కాజల్‌ అగర్వాల్‌) ప్రేమిస్తుంటాడు. సినిమా అంతా దాదాపు ఇలాగే నడుస్తూ వుంటుంది. తల, తోక లేని కథని తీసుకొని రెండు గంటల 43 నిముషాల పాటు ప్రేక్షకుల్ని ఛిత్రవధ చేయడమే పనిగా పెట్టుకొని ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్‌ అవ్వడమే అస్తవ్యస్తంగా స్టార్ట్‌ అవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సరదా సరదాగా నడిచే సీన్స్‌తో ఒక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో అనే ఆత్రుత ఒక పర్సెంట్‌ కూడా లేకుండా చెయ్యడంలో పవన్‌కళ్యాణ్‌ సక్సెస్‌ అయ్యాడు. ఎన్నో వింతలు, విడ్డూరాల తర్వాత క్లైమాక్స్‌కి వస్తుంది సినిమా. ఓ సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. 

ఈ కథని పవన్‌కళ్యాణ్‌ 15 ఏళ్ళ క్రితం రాసుకున్నాడని డైరెక్టర్‌ బాబీ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే 15 ఏళ్ళ క్రితం కథని తీసుకొని ఇప్పటి ఆడియన్స్‌ని మెప్పించడం ఎంత కష్టమైన పనో పవన్‌కి తెలీదా? కామన్‌ ఆడియన్‌ ఏం కోరుకుంటున్నాడు? ఎలాంటి కథలైతే అతనికి నచ్చుతాయి? ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా వుండాలి? ఊహించని ట్విస్ట్‌లతో అతని ఎలా థ్రిల్‌ చెయ్యాలి? అనే విషయాల్ని ఒక్క నిముషం ఆలోచించినా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌లాంటి సినిమాలు రావు. ఎంత వీరాభిమానులైనా సినిమా బాగోకపోతే నిర్మొహమాటంగా తిప్పి కొడతారన్న విషయం పవన్‌కళ్యాణ్‌కీ తెలుసు. అయితే తను ఏం చేసినా జనం చూస్తారు, తన నోటి నుంచి వచ్చిన డైలాగే పంచ్‌ డైలాగ్‌, తను చేసిందే కామెడీ, తను చేసే ఫైట్స్‌కి ఆడియన్స్‌ థ్రిల్‌ అయిపోతారు అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా చేసినట్టు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. పైగా సినిమాలోని ఇతర పాత్రలతో తనను పొగిడించుకోవడం, మధ్య మధ్యలో జనం గురించి మాట్లాడడం, డైలాగ్స్‌లో కాస్త పొలిటికల్‌ టచ్‌ కూడా ఇవ్వడం చూస్తుంటే తన కోసమే ఈ సినిమా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. గబ్బర్‌సింగ్‌లో విలన్‌ పవర్‌ఫుల్‌గా వుండడంతో హీరో హీరోయిజం బాగా ఎలివేట్‌ అయింది. కానీ, ఈ సినిమాలో భైరవ్‌సింగ్‌గా నటించిన శరద్‌కేల్కర్‌ సినిమాకి పెద్ద మైనస్‌గా అయ్యాడు. అతని విలనిజం హీరో హీరోయిజాన్ని ఏమాత్రం ఎలివేట్‌ చెయ్యలేకపోయింది. పైగా విలన్‌ దగ్గరే హీరో పాటలు పాడడం, డాన్సులు చెయ్యడంతో హీరోయిజం కాస్తా కామెడీ అయిపోయింది. 

ఏ సినిమాకైనా డైరెక్టర్‌ అనేవాడు చాలా అవసరం. కథ ఎలా వున్నా, కథనం ఎలా వున్నా, హీరో ఎలా వున్నా డైరెక్టర్‌ ఆ సినిమాని నిలబెట్టడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తాడనేది నిజం. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ విషయానికి వస్తే కథ, స్క్రీన్‌ప్లే పవన్‌కళ్యాణే రాసుకున్నాడు. డైరెక్షన్‌ బాధ్యతని బాబీకి అప్పగించాడు. రవితేజతో పవర్‌ వంటి సూపర్‌హిట్‌ సినిమా చేసిన బాబీకి ఈ సినిమా డైరెక్ట్‌ చేసే అవకాశం ఇవ్వలేదని సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. ప్రతి సీన్‌ని పవన్‌ కళ్యాణే డైరెక్ట్‌ చేశాడనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీన్‌లో అతని తాలూకు తిక్క కనిపిస్తుంది. ఆర్షిదేవిగా నటించిన కాజల్‌ ఈ సినిమాతో వెటరన్‌ హీరోయిన్‌ అయిపోయినట్టుగా కనిపించింది. ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. పవన్‌కళ్యాణ్‌, కాజల్‌ సీన్స్‌ చాలా పేలవంగా వున్నాయి. కథ, కథనాలను, హీరో పెర్‌ఫార్మెన్స్‌ని ఓ పట్టాన జీర్ణించుకోలేక సతమతమయ్యే ఆడియన్స్‌కి మధ్య మధ్యలో వచ్చే పాటలు వారిని మరింత ఇరిటేట్‌ చేస్తాయి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చెప్పుకోవడానికి సినిమాలో ఒక్క ఆర్టిస్టు కూడా లేడు అనేది వాస్తవం. గబ్బర్‌సింగ్‌లో సాంబగా నటించిన ఆలీ ఈ సినిమాలో కూడా సాంబ క్యారెక్టరే చేశాడు. గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌ కూడా ఈ సినిమాలో వుంది. అయితే వీటిని ఏమాత్రం ఉపయోగించుకోలేదు పవన్‌కళ్యాణ్‌. ఎంత సేపు స్లో మోషన్‌లో బైక్‌పై రావడం, స్లో మోషన్‌లో ఫైట్స్‌ చెయ్యడం, మధ్య మధ్యలో కామెడీ చేస్తున్నానని అనుకోవడం తప్ప మిగతా క్యారెక్టర్స్‌తో కామెడీ చేయించాలన్న ఆలోచన అతనికి రాలేదు. 

గబ్బర్‌సింగ్‌ పాటలతో ఓ ఊపు ఊపిన దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమా కోసం కూడా అలాంటి ప్రయత్నం చేశాడు. ఆడియో బాగానే వుంది. కొన్ని పాటలు ఫర్వాలేదు అనుకుంటూ థియేటర్‌కి వెళ్ళే ఆడియన్స్‌కి సినిమాలోని పాటలు చూసి అవాక్కవుతారు. ఆడియో పరంగా బాగానే వున్నాయనుకున్న పాటల్ని విజువల్‌గా ఎంత చెత్తగా తియ్యాలో అంత చెత్తగా తీశారు. ఆర్థర్‌ ఎ. విల్సన్‌ ఫోటోగ్రఫీ పరంగా కొన్ని మెరుపులు మెరిపించాడు. 2 గంటల 43 నిముషాల సినిమాలో ఓ అరగంట ట్రిమ్‌ చేస్తే కాస్త బెటర్‌గా వుండేదేమో. కానీ, గౌతంరాజుకి ఆ అవకాశం ఇచ్చినట్టు లేరు. ఎందుకంటే సినిమాలో ఎక్కువ శాతం స్లో మోషనే వుండడంతో టైమ్‌ అంతా అక్కడే తినేసి వుంటుంది. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ గురించి చెప్పాలంటే అతను గతంలో కొన్ని ఫీల్‌గుడ్‌ మూవీస్‌కి, ఆలోచింపజేసే సినిమాలకు మంచి డైలాగ్స్‌ రాశాడు. కానీ, ఈ సినిమాలో మంచి డైలాగ్స్‌ రాయడానికి ఒక శాతం కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ సినిమాలో అతని డైలాగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి చెప్పుకోవాలంటే ఒక సెట్‌లోనే ఎక్కువ శాతం సినిమా తీసేశారు. ఫైట్స్‌కి ఎక్కువ ఖర్చు పెట్టారు. 

ఈమధ్యకాలంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఏ సినిమా అయినా ఇంత దారుణంగా లేదని అభిమానులే చెప్తున్నారంటే సినిమా ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. తమ హీరో లేడీ వాయిస్‌తో పాటలు పాడడం, విలన్‌ దగ్గర సిగ్గు పడుతూ నిలబడడం, విలన్‌ ముందు పాటలు పాడి, డాన్సులు చెయ్యడం వంటి సీన్స్‌ అభిమానుల్ని బాగా హర్ట్‌ చేశాయి. ఒక స్టార్‌ హీరో, ఒక పవర్‌ఫుల్‌ హీరో తన హీరోయిజాన్ని పక్కన పెట్టి సీరియస్‌ సిట్యుయేషన్‌లో సైతం కామెడీ చేస్తే ఆడియన్స్‌ తట్టుకోగలరా? ఈ సినిమాకి అదే జరిగింది. నిజానికి కొన్ని సీన్స్‌లో పవన్‌కళ్యాణ్‌ కామెడీ చెయ్యకపోయినా అతని పెర్‌ఫార్మెన్స్‌ నవ్వు తెప్పించేలా వుంది. ఒక బలమైన కథ లేకపోవడం, స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సినిమాని ముక్కలు ముక్కలుగా చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. ఏ సీన్‌ ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్తుందో తెలీని దుస్థితి ఆడియన్స్‌కి ఏర్పడుతుంది. సెకండాఫ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత క్లైమాక్స్‌ ఎప్పుడు వస్తుందా? సినిమా ఎప్పుడు అయిపోతుందా? అని ఆడియన్స్‌ ఎదురుచూసే పరిస్థితి కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లో అత్యంత దారుణమైన సినిమా ఇది. ఈమధ్యకాలంలో ఇలాంటి సినిమాని ప్రేక్షకులు చూసి వుండరు. పవన్‌కళ్యాణ్‌ సినిమా ఫ్లాప్‌ అయినా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంటుంది. అయితే ఈ సినిమాకి మాత్రం మినహాయింపు వుండేలా వుంది. బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమాకి నిరాశ తప్పదని తెలుస్తోంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs