Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: తుంటరి


శ్రీ కీర్తి ఫిలింస్‌ 

Advertisement
CJ Advs

తుంటరి 

తారాగణం: నారా రోహిత్‌, లత హెగ్డే, వెన్నెల కిషోర్‌, 

కబీర్‌ సింగ్‌, పూజిత, షకలక శంకర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: పళనికుమార్‌ 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: తమ్మిరాజు 

కథ: ఎ.ఆర్‌.మురుగదాస్‌ 

మాటలు: లక్ష్మీభూపాల్‌, శ్రీకాంత్‌రెడ్డి 

సమర్పణ: అర్జున్‌ 

నిర్మాత: అశోక్‌ బాబా 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర 

విడుదల తేదీ: 11.03.2016 

బాణంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్‌ కథలను సెలెక్ట్‌ చేసుకొని లెక్కకు మించిన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు నారా రోహిత్‌ చేసిన సినిమాల్లో బాణం, సోలో తప్ప మిగతావన్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమాలే. ఆ వరసలో లేటెస్ట్‌గా ఈరోజు విడుదలైన తుంటరి కూడా చేరుతుందని చెప్పడానికి సినిమాలో కావాల్సినన్ని రీజన్స్‌ వున్నాయి. గుండెల్లో గోదారి, జోరు వంటి ఫ్లాప్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసిన కుమార్‌ నాగేంద్ర కొంత కామెడీ టచ్‌, మరికొంత మాస్‌ టచ్‌ వున్న మాన్‌ కరాటే అనే తమిళ సినిమాను రీమేక్‌ చెయ్యాలనుకున్నాడు. ఎ.ఆర్‌.మురుగదాస్‌ కథతో రూపొందిన మాన్‌ కరాటే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కుమార్‌ నాగేంద్ర తియ్యగలిగాడా? తమిళ్‌లో శివకార్తికేయన్‌ చేసిన హీరో క్యారెక్టర్‌కి తెలుగులో నారా రోహిత్‌ ఎంత వరకు న్యాయం చెయ్యగలిగాడు? ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఏ మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఓపెన్‌ చేస్తే అదొక అడవి. సత్వం కంప్యూటర్స్‌లో జాబ్‌ చేసే నలుగురు యువతీ యువకులు అక్కడ ఏం చేద్దామని వస్తారో తెలీదుగానీ ఓ సాధువుని కలుసుకుంటారు. అతనికి మహిమలు వున్నాయని తెలుసుకొని విజయదశమి మరుసటి రోజు డైలీ పేపర్‌ కావాలని కోరతారు. వెంటనే ఆ సాధువు వారు అడిగిన పేపర్‌ని గాల్లోంచి చేతుల్లోకి రప్పిస్తాడు. విచిత్రం ఏమిటంటే విజయదశమి రోజు అన్ని డైలీ పేపర్లకు సెలవు వుంటుంది కాబట్టి మరుసటి రోజు పేపర్‌ పబ్లిష్‌ అవ్వదు. అయినా సాధువు ఆ పేపర్‌ని ఆ నలుగురి ముందు పెట్టి వెళ్ళిపోతాడు. నాలుగు నెలలు తర్వాత రావాల్సిన ఆ పేపర్‌లో సత్వం కంప్యూటర్స్‌ కంపెనీ మూతపడుతుందని వుంటుంది. అందులో రాసినట్టుగానే కంపెనీని క్లోజ్‌ చేస్తారు. దాంతో ఆ పేపర్‌లో ఇంకా ఏం వున్నాయా అని వెతుకుతున్న వారికి ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజు అనే యువకుడు బాక్సింగ్‌లో ఛాంపియన్‌షిప్‌ సాధించి 5 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడని, అతను గెలవడానికి ఈ నలుగురే కారణమని రాసి వుంటుంది. అది చూసి షాక్‌ అయిన నలుగురు మిత్రులు ఆ రాజు కోసం వెతకడం స్టార్ట్‌ చేస్తారు. మొత్తానికి రాజు(నారా రోహిత్‌)ని వెతికి పట్టుకొని అతనికి నెలకు లక్ష రూపాయలు ఇస్తామని, వెంటనే బాక్సింగ్‌ నేర్చుకొని పోటీకి వెళ్ళాలని అగ్రిమెంట్‌ రాయించుకుంటారు. ఈ నలుగురు చెప్పిన డీల్‌కి రాజు ఒప్పుకున్నాడా? బాక్సింగ్‌ అంటే ఏమిటో తెలియని రాజు బాక్సింగ్‌ ఛాంపియన్‌ అయ్యాడా? ఎప్పుడూ లేనిది దసరా మరుసటి రోజు పేపర్‌ ఎలా వచ్చింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

తుంటరి అనే టైటిల్‌కి ఈ సినిమా కాన్సెప్ట్‌కి అస్సలు సంబంధం లేదు. తుంటరి అనే టైటిల్‌ పెట్టారు కాబట్టి కాస్త వెటకారం, కాస్త కామెడీని మిక్స్‌ చేసి డైలాగ్స్‌ చెప్పేసి టైటిల్‌కి జస్టిఫికేషన్‌ ఇచ్చేశాడు నారా రోహిత్‌. తమిళ్‌లో మంచి ఫాలోయింగ్‌ వున్న శివకార్తికేయన్‌ మాన్‌ కరాటేలో కథానాయకుడు. అతనికి వున్న మాస్‌ ఇమేజ్‌, అతనిలోని హ్యూమర్‌ వల్ల ఆ కథలోని హీరో క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. తెలుగుకి వచ్చేసరికి నారా రోహిత్‌ ఫిజిక్‌గానీ, అతని బాడీ లాంగ్వేజ్‌గానీ, డైలాగ్‌ మాడ్యులేషన్‌గానీ క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. దానికి తగ్గట్టు హెవీ వెయిట్‌తో సీన్స్‌లోనూ, పాటల్లోనూ ఇబ్బందిగా కదులుతూ ప్రేక్షకుల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. డిఫరెంట్‌ డైలాగ్‌ మాడ్యులేషన్‌తో అతను చెప్పాలనుకున్న డైలాగ్స్‌ కొన్ని సీన్స్‌లో నవ్వు తెప్పించినా అవి డైలాగ్స్‌ వల్ల వచ్చిందే తప్ప రోహిత్‌ పెర్‌ఫార్మెన్స్‌ వల్ల కాదు. ఇక హీరోయిన్‌ లత హెగ్డే గురించి చెప్పాలంటే స్క్రీన్‌ ప్రజెన్స్‌ లేని హీరోయిన్‌ అనిపించుకుంది. ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించిన లత పెర్‌ఫార్మెన్స్‌ పరంగా, డాన్స్‌ పరంగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని సీన్స్‌లో, పాటల్లో అందాలు ఆరబోసే ప్రయత్నం చేసి అంతవరకు ఓకే అనిపించుకుంది. మిగతా క్యారెక్టర్స్‌లో రోహిత్‌ ఫ్రెండ్‌గా షకలక శంకర్‌ లిమిటెడ్‌గానే కామెడీ చెయ్యాల్సి వచ్చింది. అలాగే వెన్నెల కిషోర్‌కి కూడా నవ్వించే అవకాశం ఎక్కువ రాలేదు. బాక్సర్‌గా కబీర్‌ సింగ్‌ ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. హీరో, హీరోయిన్‌, హీరో ఫ్రెండ్‌, నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే సినిమా అంతా కనిపిస్తారు కాబట్టి మిగతా క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్‌ లేదు. 

కథ, కథనాలను పక్కన పెడితే సినిమాకి అంతో ఇంతో ప్లస్‌ అయింది సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌. పళనికుమార్‌ ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. ప్రతి సీన్‌ని బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించడంలో అతను సక్సెస్‌ అయ్యాడు. సాయికార్తీక్‌ చేసిన పాటల్లో ఒకటి, రెండు తప్ప అంతగా ఆకట్టుకునేవి లేవు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి చెప్పాల్సి వస్తే సాయికార్తీక్‌ ఆరాటమే కనిపించింది తప్ప ఆయా సీన్స్‌లో అంత డెప్త్‌ వుందని మనకు అనిపించదు. కథ విషయానికి వస్తే మురుగదాస్‌ రాసుకున్న కథ కొత్తగా వున్నా నాలుగు నెలల ముందు వచ్చే పేపర్‌ ఈరోజే వచ్చెయ్యడం, అందులో హీరో బాక్సింగ్‌ ఛాంపియన్‌ అయిపోయి 5 కోట్లు గెలుచుకోవడం అనే న్యూస్‌ పడడంతో క్లైమాక్స్‌ ఏమిటనేది ఆడియన్స్‌కి ముందే తెలిసిపోయింది. గాలికి తిరిగేవాడిని తీసుకొచ్చి బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ ఇచ్చినా చివరికి హీరోయే గెలుస్తాడని తెలుసు కాబట్టి ఆడియన్స్‌లో ఎలాంటి క్యూరియాసిటీ కలగదు. ఆడియన్స్‌ని ఎంత మాత్రం థ్రిల్‌ చెయ్యదు. తమిళ్‌ వెర్షన్‌కి వచ్చేసరికి క్లైమాక్స్‌ ముందే తెలిసినా హీరో చేసే కామెడీ, కథనం ఆడియన్స్‌ని క్లైమాక్స్‌ వరకు కూర్చోబెట్టాయి. తెలుగు వెర్షన్‌లో అలాంటి జిమ్మిక్కులు ఏమీ లేక కొన్ని అనవసరమై సీన్స్‌, పది నిముషాలకు ఒక పాట పెట్టేసి సినిమాని రెండు గంటలు నడిపించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథని వండడంలో కుమార్‌ నాగేంద్ర సక్సెస్‌ అవ్వలేకపోయాడు. చెప్పుకుంటే నాలుగు ముక్కల్లో అయిపోయే కథని రెండు గంటల సేపు నడిపించడానికి డైరెక్టర్‌ నానా పాట్లు పడాల్సి వచ్చింది, అనవసరమైన పాటలు పెట్టాల్సి వచ్చింది. 

నలుగురు ఫ్రెండ్స్‌ అడవికి వెళ్ళి నాలుగు నెలల తర్వాత వచ్చే పేపర్‌ని తేవడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత హీరోని వెతికి పట్టుకోవడం, అతనికి బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వాలనుకోవడం, ఈలోగా హీరో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకోవడం, ఆమె ప్రేమ కోసం వెంట పడడం వంటి సీన్స్‌తో, పాటలతో కథలో ఎలాంటి కదలిక లేకుండా ఫస్ట్‌హాఫ్‌ రన్‌ అవుతుంది. ఒక ట్విస్ట్‌తో ముగిసిన ఫస్ట్‌ హాఫ్‌.. సెకండాఫ్‌పై కాస్త ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేసిందనుకునే లోపే వరసగా రెండు పాటలు ఒకదాని వెనక ఒకటి అన్నట్టు వచ్చి మనలో అసహనాన్ని క్రియేట్‌ చేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఎలా వున్నాయంటే బాక్సింగ్‌లో ఓనమాలు రాని హీరో, బాక్సింగ్‌ అంటే ఏమిటో తెలియకుండానే ఒక టోర్నమెంట్‌ ఫైనల్‌కి వెళ్ళడం పిచ్చికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఓవర్‌నైట్‌ ప్రాక్టీస్‌ చేసేసి బాక్సర్‌ కిల్లర్‌ రాజుని ఓడించాలనుకునే హీరో అతని చేతుల్లో చావు దెబ్బలు తినడం, మనకు నీరసం రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. హీరో అన్న తర్వాత ఎలాగూ గెలవాలి కాబట్టి హీరోయిన్‌తో కిల్లర్‌ రాజు అసభ్యంగా మాట్లాడడంతో రెచ్చిపోయి అతన్ని తన పంచ్‌లతో మట్టి కరిపిస్తాడు. బాక్సింగ్‌కి సంబంధించిన సినిమాల్లో తమ్ముడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి సినిమాల్లో హీరో బాక్సింగ్‌ పోటీలకు వెళ్ళడానికి, గెలవడానికి సరైన రీజన్స్‌ వుంటాయి. ఆ కథల్లో ఎమోషన్స్‌ కూడా ఆ రేంజ్‌లోనే వుంటాయి. కానీ, ఈ సినిమాలో అవి మనకు ఇసుమంత కూడా కనిపించవు. బాక్సింగ్‌ అంటే ఏముంది కామెడీగా చేసెయ్యొచ్చు అనేలా వుంటుంది తప్ప నేచురాలిటీ అనేది కనిపించదు. ఫైనల్‌గా చెప్పాలంటే కథలో క్యూరియాసిటీ లేదు, కథనంలో బలం లేదు, హీరో, హీరోయిన్ల పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకునేలా లేదు. టోటల్‌గా సినిమాలో విషయం లేదు. ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది ప్రశ్నార్థకమే. 

ఫినిషింగ్‌ టచ్‌: అస్తవ్యస్తం.. అగమ్యగోచరం 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs