Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కళ్యాణ వైభోగమే


శ్రీరంజిత్‌ మూవీస్‌ 

Advertisement
CJ Advs

కళ్యాణ వైభోగమే 

తారాగణం: నాగశౌర్య, మాళవిక నాయర్‌, ఆనంద్‌, 

రాశి, రాజ్‌ మాదిరాజ్‌, ప్రగతి తదితరులు 

సినిమాటోగ్రఫీ: జి.వి.ఎస్‌.రాజు 

సంగీతం: కళ్యాణ్‌ కోడూరి 

ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖి 

మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్‌ 

నిర్మాత: కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి 

విడుదల తేదీ: 04.03.2016 

ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోగా పరిచయమై ఆ తర్వాత సరైన హిట్‌ అందుకోని నాగశౌర్య, అలా మొదలైంది వంటి డిఫరెంట్‌ మూవీని రూపొందించిన బి.వి.నందినిరెడ్డి కాంబినేషన్‌లో శ్రీ రంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కళ్యాణవైభోగమే. ఫ్లాపుల్లో వున్న నాగశౌర్య, అలా మొదలైంది తర్వాత జబర్దస్త్‌ వంటి సూపర్‌ ఫ్లాప్‌ తీసిన నందినిరెడ్డి కాంబినేషన్‌లో ఈరోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్‌ అయింది? పెళ్ళంటే ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకోవడం అనే కాన్సెప్ట్‌ని ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా నందినిరెడ్డి తెరకెక్కించగలిగిందా? హిట్‌ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యకి ఈ సినిమా ఎంత వరకు హెల్ప్‌ అవుతుంది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

పెళ్ళంటే నూరేళ్ళ పంట అని, పెళ్ళి అనే బంధంతో దగ్గరైన ఇద్దరు వ్యక్తులు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరి వరకు కలిసి మెలిసి జీవితాన్ని పంచుకోవాలని మన వివాహ వ్యవస్థ చెబుతోంది. అయితే కాలం మారుతోంది, యువతీయువకుల ఆలోచనలు మారుతున్నాయి. పెళ్ళి మీద గౌరవం తగ్గిపోతోంది. పెళ్ళి చేసుకొని తమ లైఫ్‌ యాంబిషన్‌ని ఎందుకు పక్కన పెట్టాలన్న ఆలోచన అబ్బాయిల్లో, అమ్మాయిల్లో పెరుగుతోంది. యువతలో ప్రస్తుతం వున్న ఇలాంటి ఆలోచనల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం కళ్యాణ వైభోగమే చిత్రంలో జరిగింది. 

గేమింగ్‌ ప్రోగ్రామర్‌ అయిన శౌర్య(నాగశౌర్య), డాక్టర్‌ అయిన దివ్య(మాళవిక నాయర్‌).. ఈ ఇద్దరి మనస్తత్వాలు ఒకటే. జీవితంలో పెళ్ళి అనేది చేసుకోకూడదన్నది వీరి లక్ష్యం. పెద్దలు మాత్రం వాళ్ళకి పెళ్ళి సంబంధాలు తెస్తూనే వుంటారు. వీళ్ళు రిజెక్ట్‌ చేస్తూనే వుంటారు. ఒకరోజు వీళ్ళిద్దరికీ పెళ్ళి ఫిక్స్‌ చేస్తారు పెద్దవాళ్ళు. ఇద్దరికీ పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు కాబట్టి ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చి ఒకరి మీద ఒకరు లేనిపోనివి పెద్దవాళ్ళకు చెప్పి పెళ్ళి క్యాన్సిల్‌ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. అలాంటి టైమ్‌లో శౌర్య ఒక ప్లాన్‌ చెప్తాడు. ఆ ప్లాన్‌ ప్రకారం పెళ్ళి చేసుకుంటే ఇద్దరికి ఎలాంటి ఇబ్బందీ వుండదని, తమ లైఫ్‌ యాంబిషన్‌ కూడా పూర్తి చేసుకోవచ్చని చెప్తాడు. దానికి ఓకే చెప్పి పెళ్ళికి సిద్ధమవుతుంది దివ్య. ఇద్దరూ పెళ్ళి చేసుకొని హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అవుతారు. పెళ్ళి విషయంలో ఇద్దరూ కలిసి చేసుకున్న ఒప్పందం ఏమిటి? పెళ్ళి తర్వాత ఇద్దరూ ఏం చేద్దామనుకున్నారు? పెళ్ళి తర్వాత వీళ్ళిద్దరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? వీళ్ళ పెళ్ళి నాటకం పెద్దవాళ్ళకు తెలిసిందా? పెళ్ళి తర్వాత ఇద్దరూ తమ ఒప్పందం ప్రకారమే నడుచుకున్నారా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

పెళ్ళంటే ఇష్టపడని అబ్బాయిగా, లైఫ్‌ని జాలీగా ఎంజాయ్‌ చేస్తూ గడిపెయ్యాలని ఆశ పడే కుర్రాడిగా నాగశౌర్య పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు తన నటనతో అందర్నీ ఆకట్టుకుంటాడు. కామెడీ సీన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌ చెయ్యడంలో అతనిలో కొంత మెచ్యూరిటీ వచ్చిందనిపించింది. నాగశౌర్య కెరీర్‌కి ఈ సినిమా మంచి హెల్ప్‌ అవుతుంది. ఇక హీరోయిన్‌ మాళవిక నాయర్‌ ప్రతి సీన్‌లో అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేసిందని చెప్పాలి. తన ఫేస్‌లో అన్ని భావాలు పలికించడంలో సక్సెస్‌ అయింది. ఒక విధంగా మాళవిక పెర్‌ఫార్మెన్స్‌ నాగశౌర్యని డామినేట్‌ చేసిందని చెప్పాలి. హీరో తండ్రిగా నటించిన దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. అలాగే హీరోయిన్‌ తండ్రిగా ఆనంద్‌ నటన డిగ్నిఫైడ్‌గా వుంది. ఝాన్సీ స్లాంగ్‌ని గుర్తు చేస్తూ ప్రగతి తన క్యారెక్టర్‌ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే ప్రయత్నం చేసింది. అలా మొదలైంది చిత్రంలో మాదిరిగానే ఇందులో కూడా క్లైమాక్స్‌లో ఎంటరై హీరో, హీరోయిన్‌ని ఒక దారికి తెచ్చే తాగుబోతు క్యారెక్టర్‌లో తాగుబోతు రమేష్‌ అందర్నీ నవ్వించాడు. 

ఈ చిత్రానికి సంబంధించిన టెక్నికల్‌ ఎస్సెట్స్‌ గురించి చెప్పాలంటే జి.వి.ఎస్‌.రాజు ఫోటోగ్రఫీ బాగుంది. కంటికి ఇబ్బంది కలిగించే కెమెరా కదలికలు లేకుండా ప్రతి సీన్‌ని అందంగా, కూల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. పాటల్లో మనసంతా అనే పాట పిక్చరైజేషన్‌ బాగుంది. కళ్యాణ్‌ కోడూరి చేసిన పాటల్లో టైటిల్‌ సాంగ్‌, మనసంతా పాటలు బాగున్నాయి. కథలోని ఎమోషన్‌ని, ఫీల్‌ని, సెంటిమెంట్‌ని క్యారీ చేస్తూ మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాడు. లక్ష్మీభూపాల్‌ రాసిన మాటలు, పాటలు బాగున్నాయి. కొన్ని సీన్స్‌లోని డైలాగ్స్‌ అందర్నీ ఆలోచింపజేసేవిగా వున్నాయి. అలాగే హీరో తండ్రి చెప్పిన డైలాగ్స్‌ లెంగ్తీగా వుండడం కాస్త ఇబ్బంది పెడుతుంది. డైరెక్టర్‌ నందినిరెడ్డి గురించి చెప్పాలంటే తను రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. తను చెప్పాలనుకున్న పాయింట్‌ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్‌ అయింది. ఆర్టిస్టుల నుంచి హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకుంది. అయితే సినిమా నిడివి రెండు గంటల నలభై నిముషాలు వుంది. ఫస్ట్‌ హాఫ్‌ వున్నంత గ్రిప్పింగ్‌గా సెకండాఫ్‌ వుండదు. సెకండాఫ్‌లో కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌ కూడా వుండడం, కథకు అవసరం లేని కొన్ని సీన్స్‌ని పెట్టడంతో లెంగ్త్‌ పెరిగింది. రెండు గంటల 20 నిముషాలకు సినిమాని తగ్గించి వుంటే ఇంకాస్త స్పీడ్‌గా వుండేది. దామోదర ప్రసాద్‌ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగుండడం వల్ల ప్రతి సీన్‌ మనకు రిచ్‌గానే కనిపిస్తుంది. 

ఫస్ట్‌ హాఫ్‌ అంతా ప్రజెంట్‌ యూత్‌ని రిప్రజెంట్‌ చేసే విధంగా కథను నడిపించారు. హీరో, అతని ఫ్రెండ్స్‌ కలిసి ఎంజాయ్‌ చేయడం, అనుకోకుండా హీరోయిన్‌ని చూడడం, పెళ్ళి చూపులకు ఆ అమ్మాయి ఇంటికే వెళ్ళడం వంటి సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ అంతా సరదాగా నడుస్తుంది. పెళ్ళి తర్వాత జరిగే సీన్స్‌తో సెకండాఫ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయినా పెళ్ళి చేసుకున్న హీరో, హీరోయిన్‌ల ఆలోచనల్లో మార్పులు రావడం, ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడడం వంటి సీన్స్‌తో చాలా స్లోగా సినిమా నడుస్తుంది. మధ్యలో హీరో మరో అమ్మాయితో లవ్‌లో పడడం, ఆ సీన్స్‌ని కూడా ఎక్కువగా చూపించడం వల్ల లెంగ్త్‌ పెరిగింది. దీంతో ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే పెళ్ళంటే ఏమిటి, ఫ్యామిలీ అంటే ఏమిటి, అనుబంధాలంటే ఏమిటి, ప్రస్తుతం యువత ఆలోచనలు ఎలా వున్నాయి వంటి విషయాలను ఈ సినిమాలో డీప్‌గా డిస్కస్‌ చేశారు. ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని, ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ని ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నిర్మాతకు ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌పైనే ఆధారపడి వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs