Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు


శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ 

Advertisement
CJ Advs

సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు 

తారాగణం: రాజ్‌ తరుణ్‌, అర్తన, షకలక శంకర్‌, 

మధు నందన్‌, రాజా రవీంద్ర తదితరులు 

సినిమాటోగ్రఫీ: విశ్వ డి.బి. 

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌ 

సంగీతం: గోపిసుందర్‌ 

నిర్మాతలు: ఎస్‌.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి, 

హరీష్‌ దుగ్గిశెట్టి 

రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ గవిరెడ్డి 

విడుదల తేదీ: 29.01.2016 

ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్‌ తరుణ్‌ ఆ తర్వాత వరసగా సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు అనే మంచి టైటిల్‌తో సినిమా వస్తోందంటే ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ని చాలా కొత్త ప్రొజెక్ట్‌ చేసి వుంటారని అందరూ అనుకోవడంలో తప్పులేదు. మరి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన శ్రీనివాస్‌ గవిరెడ్డి.. రాజ్‌ తరుణ్‌ని ఎంత కొత్తగా చూపించాడు? ఈ సినిమాకి టైటిల్‌ ఎంతవరకు ప్లస్‌ అయింది? మరో హ్యాట్రిక్‌ని స్టార్ట్‌ చెయ్యాలనుకున్న రాజ్‌తరుణ్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

రామచంద్రాపురంలో శ్రీరామ్‌(రాజ్‌తరుణ్‌) అనే కుర్రాడు. అన్ని సినిమాల్లోలాగే బేవార్స్‌ బ్యాచ్‌తో తిరుగుతూ, తాగుతూ టైమ్‌ పాస్‌ చేస్తుంటాడు. రాసిన పరీక్షే మళ్ళీ రాస్తూ ఇంటర్‌ గట్టు ఎక్కలేక ప్రతిరోజూ ఇంట్లో తిట్లు తినే రామ్‌కి ఒక ఛైల్డ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ వుంది. అతని స్కూల్‌ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఎం.బి.బి.ఎస్‌. చేస్తుంటుంది. చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోయిన సీతామహాలక్ష్మి(అర్తన)కి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న తన ప్రేమ విషయాన్ని ఓరోజు ధైర్యంగా చెప్పేస్తాడు. దాన్ని రిజెక్ట్‌ చెయ్యడమే కాకుండా రామ్‌ పనీపాట లేని వాడిని పెళ్ళి చేసుకోనని చెప్తుంది సీత. దాంతో ఫ్రెండ్స్‌తో కలిసి పీకల దాకా తాగి చచ్చిపోతానని కత్తి తీస్తాడు. అదే టైమ్‌లో తనకి ఇష్టం లేని పెళ్ళి చూపులు ఎరేంజ్‌ చేస్తున్నందుకు తండ్రి మీద కోపంతో చచ్చిపోతానని కత్తి చేత్తో పట్టుకుంటుంది సీత. అది ఇంటర్వెల్‌. 

ఓ ఫైన్‌ మార్నింగ్‌ రామ్‌ ప్రేమను సీత ఓకే చేస్తుంది. అయితే తన తండ్రి హైదరాబాద్‌ నుంచి క్రికెటర్‌ వరుణ్‌(ఆదర్శ్‌) సంబంధం తెచ్చాడని, అది ఎలాగైనా చెడగొట్టమని రామ్‌కి చెప్తుంది సీత. రామ్‌ బ్యాచ్‌ హైదరాబాద్‌ బయల్దేరుతుంది. సీత విషయంలో ఓ పందెం వేసుకుంటారు రామ్‌, వరుణ్‌. ఏమిటా పందెం? చివరికి రామ్‌, సీతల పెళ్ళికి సీత తండ్రి ఒప్పుకున్నాడా? అనేది మిగతా కథ. 

ఇందులోని అన్ని క్యారెక్టర్స్‌ కాస్త ఓవర్‌గా బిహేవ్‌ చేసేలా వుంటాయి. దానికి ఆర్టిస్టుల ఓవర్‌ యాక్షన్‌ కూడా తోడవడంతో సినిమా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. రాజ్‌ తరుణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎప్పటిలాగే వుంది. అతని క్యారెక్టర్‌లో కొత్తదనం లేదు, పెర్‌ఫార్మెన్స్‌ కూడా కొత్తగా లేదు. సినిమాలో ఎక్కువ భాగం హీరో, అతని బ్యాచ్‌ సీన్సే ఎక్కువగా వుంటాయి. వారితో కామెడీ చేయించాలని డైరెక్టర్‌ విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ, వర్కవుట్‌ అయింది మాత్రం చాలా తక్కువ. అది కూడా షకలక శంకర్‌ చెప్పిన కొన్ని డైలాగ్స్‌ పేలాయి తప్ప మిగతావన్నీ తుస్సే. హీరోయిన్‌ కళ్యాణి పోలికలతో వున్న అర్తన గురించి చెప్పాలంటే ఏమాత్రం ఎట్రాక్టివ్‌గా లేని ఫేస్‌తో, ఎలాంటి ఫీలింగ్స్‌ లేని ఎక్స్‌ప్రెషన్స్‌తో రకరకాలుగా పెర్‌ఫార్మ్‌ చేసింది అర్తన. ఒక విధంగా చెప్పాలంటే హీరో ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఆమె ప్రేమను పొందలేక బాధపడిపోయేంత అందం కూడా ఆమె దగ్గర లేదు. ఇక మిగతా క్యారెక్టర్లన్నీ కథకు ఏమాత్రం ఉపయోగపడని ఎక్స్‌ట్రా క్యారెక్టర్స్‌గా చెప్పుకోవచ్చు. 

ఇది పూర్తిగా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అయినప్పటికీ ఆ విలేజ్‌ బ్యూటీ అనేది ఫోటోగ్రఫీలో ఎక్కడా కనిపించదు. ప్రతి సీన్‌ని చాలా నార్మల్‌గా తీసినట్టుగా వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా కలర్‌ఫుల్‌గా లేదు. దాదాపు రెండుంపావు గంటలు వున్న ఈ సినిమాలో కట్‌ చెయ్యాల్సిన సీన్స్‌ చాలా వున్నా ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్‌కి ఆ అవకాశం ఇచ్చినట్టు కనిపించదు. కొన్ని సీన్స్‌ ఎందుకు వచ్చాయో అర్థం కాకుండా వుంటాయి. మ్యూజిక్‌ విషయానికి వస్తే గోపి సుందర్‌ పాటలు గొప్పగా అనిపించవు. పరవశమే.. అంటూ సాగే లవ్‌ సాంగ్‌ ఒక్కటే సినిమాలో చెప్పుకోదగిన పాట. ఆ పాటని విజువల్‌గా కూడా బాగానే తీశారనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. మూడు హిట్స్‌ వరసగా వచ్చిన రాజ్‌తరుణ్‌లాంటి హీరోతో ఒక ఔట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌ శ్రీనివాస్‌. హీరోయిన్‌ కోసం కబడ్డీ ఆడిన జగపతిబాబు కబడ్డీ కబడ్డీ మనం చూశాం. మళ్ళీ అదే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాడు డైరెక్టర్‌. దాదాపు అరగంట పాటు నడిచే క్లైమాక్స్‌ అంతా క్రికెట్‌తో నిండిపోయి వుంటుంది. చివరి పావుగంట మనకు క్రికెట్‌ మ్యాచ్‌ చూపించాడు. ఏ విధంగా చూసినా ఇది ఇప్పటి ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేసే సబ్జెక్ట్‌ కాదు. 

సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు అనే టైటిల్‌కి సినిమా కథాంశానికి అస్సలు పొంతన లేదు. ఎందుకంటే సీతమ్మ అందాలు సినిమాలో ఎక్కడా కనిపించవు. అలాగే ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతూ వుండే రామయ్య చేసే సిత్రాలు కూడా సినిమాలో ఏమీ లేవు. ఒక సాదా సీదా సబ్జెక్ట్‌ని తీసుకొని దాన్ని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసి అందర్నీ మెప్పించాలని చూసిన డైరెక్టర్‌ శ్రీనివాస్‌ సక్సెస్‌ అవ్వలేకపోయాడు. సినిమా మొదలైనప్పటి నుంచి పది నిముషాలు కూడా ఆడియన్స్‌ కథలో ఇన్‌వాల్వ్‌ అవ్వరు. కాకపోతే క్రికెట్‌ అంటే ఇష్టపడే వారు చాలా మంది వుంటారు కాబట్టి చివరి పదిహేను నిముషాలు క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తారు తప్ప క్రికెట్‌ మ్యాచ్‌ హీరో గెలుస్తాడా? హీరోయిన్‌ని పెళ్ళి చేసుకుంటాడా? లేదా? అనే టెన్షన్‌ ఆడియన్స్‌లో కలిగించలేకపోయాడు డైరెక్టర్‌. ఆడియన్స్‌కి ఎలాంటి క్యూరియాసిటీ కలిగించని సినిమా ఇది. కాకపోతే సినిమాలో అప్పుడప్పుడు పేలే కొన్ని జోక్స్‌ని మాత్రం ఎంజాయ్‌ చెయ్యడానికి వీలుంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టాలనుకున్న రాజ్‌తరుణ్‌ని డిజప్పాయింట్‌ చేసే సినిమా సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు. 

ఫినిషింగ్‌ టచ్‌: అందాలు లేవు, సిత్రాలూ లేవు 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs