Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కళావతి


గుడ్‌ సినిమా గ్రూప్‌ 

Advertisement
CJ Advs

కళావతి 

తారాగణం: సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక, పూనమ్‌ బజ్వా, 

రాధారవి, సూరి, కోవై సరళ, సుందర్‌ సి. తదితరులు 

సినిమాటోగ్రఫీ: యు.కె.సెంథిల్‌కుమార్‌ 

సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌ 

సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు 

నిర్మాతలు: గుడ్‌ ఫ్రెండ్స్‌ 

రచన, దర్శకత్వం: సుందర్‌ సి. 

విడుదల తేదీ: 29.01.2016 

అరణ్మయి పేరుతో తమిళ్‌లో సుందర్‌ సి. రూపొందించిన చిత్రం చంద్రకళ పేరుతో తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌ ఇచ్చిన ఉత్సాహంతో సుందర్‌ సి. అరణ్మయి 2 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కళావతి పేరుతో గుడ్‌ సినిమా గ్రూప్‌ విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది? సుందర్‌ సి. రెండోసారి కూడా సక్సెస్‌ అయ్యాడా? కళావతి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఒక ఆత్మకు సంబంధించిన హార్రర్‌ మూవీ అనగానే ఒక ప్యాలెస్‌, అందులో వుండే వారిలో ఎవరో ఒకరిని ఆవహించడం, వారి ద్వారా రకరకాల సమస్యలు ఎదురు కావడం వంటి సీన్సే వుంటాయి. అలాగే మధ్య మధ్యలో కమెడియన్స్‌ నవ్వించే ప్రయత్నాలు చెయ్యడం జరుగుతుంటుంది. సుందర్‌ సి. చేసిన గత చిత్రం చంద్రకళలో కూడా ఇదే జరిగింది. కళావతి చిత్రంలో కూడా అదే తంతు కొనసాగించాడు. కొవిలూర్‌ అనే గ్రామంలోని అత్యంత భారీగా వున్న అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేయడం కోసం ఆ ఊరి పెద్దలు సిద్ధమవుతారు. అందుకోసం ఆ విగ్రహానికి స్థానం భ్రంశం కలిగిస్తారు. దాంతో అప్పటివరకు అమ్మవారికి భయపడి ఎక్కడో దాక్కున్న ఆత్మలు ఒక్కసారిగా విజృంభిస్తాయి. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు స్వాములు కొన్ని ఆత్మలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఒక ఆత్మ ఆ ఊరి జమీందారు బంగళాలోకి ఎంటర్‌ అవుతుంది. ఆ ఆత్మ వచ్చిందే ఆ ఇంటిలోని వారిపై పగ తీర్చుకునేందుకు. ముందుగా జమీందార్‌పై ఎటాక్‌ చేసి అతన్ని కోమాలోకి పంపిస్తుంది. ఇది తెలుసుకున్న చిన్న కొడుకు మురళి(సిద్ధార్థ), కాబోయే కోడలు అనిత(త్రిష) ఊరికి బయల్దేరతారు. ఆ ఇంటిలో ఏదో వుందనే విషయాన్ని ఇద్దరూ గ్రహిస్తారు. సిటీ నుంచి వచ్చిన అనిత అన్నయ్య రవి(సుందర్‌ సి.) దాని గురించి ఎంక్వయిరీ మొదలుపెడతాడు. రవి ఎంక్వయిరీ ఎలాంటి విషయాలు బయటికి వచ్చాయి? ఆ ఆత్మ జమీందారు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్‌ చేసింది? దానికి జరిగిన అన్యాయం ఏమిటి? ఆ ఆత్మ పగ తీర్చుకొని శాంతించిందా? దాన్ని ఆ బంగళా నుంచి పంపించేందుకు రవి ఎలాంటి రిస్క్‌ తీసుకున్నాడు? అనేది మిగతా కథ. 

ఈ చిత్రంలో కళావతి హన్సిక అయితే, హీరో సుందర్‌ సి. అని చెప్పాలి. ఎందుకంటే ఆత్మకు సంబంధించిన అన్ని విషయాలూ తెలుసుకోవడంలో, అది ఎవరిని ఆవహించిందో గుర్తించడంలో, దాన్ని బయటికి పంపేందుకు తన ప్రాణాలను సైతం రిస్క్‌ చేయడంలో రవి హీరోయిజాన్ని ప్రదర్శించాడు. పైగా కొన్ని ఫైట్స్‌ కూడా చేశాడు కాబట్టి ఆ క్యారెక్టర్‌ చేసిన సుందర్‌ని ఈ సినిమా హీరోగా చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్‌ క్యారెక్టర్‌ పాటలకు, కొన్ని సీన్స్‌కి మాత్రమే పరిమితమైపోయింది తప్ప కథను మలుపు తిప్పడంలోగానీ, హీరోయిజం ప్రదర్శించడంలోగానీ ఉపయోగపడలేదు. కళావతిగా హన్సిక ఇంతకుముందు చంద్రకళ చిత్రంలో చేసిన తరహా క్యారెక్టరే చేసింది. ఇందులో కూడా అన్యాయానికి గురై జమీందారు కుటుంబంపై పగ పెంచుకుంటుంది. కళావతి ఆవహించిన అనిత క్యారెక్టర్‌లో త్రిష అభినయం చాలా అసహజంగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాల్లో అప్పటివరకు చలాకీగా కనిపించే క్యారెక్టర్‌లో ఒక్కసారిగా వేష భాషల పరంగా ఎన్ని మార్పులు వచ్చినా తోటి క్యారెక్టర్లకు ఇసుమంతైనా అనుమానం రాదు. ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. ఇక కామెడీ విషయానికి వస్తే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచే కామెడీని బాగా హైలైట్‌ చేసే ప్రయత్నం చేశాడు సుందర్‌. సూరి, కోవై సరళ బృందం చేసే కామెడీ చాలా చోట్ల నవ్వించింది. సూరి చెప్పే డైలాగ్స్‌ చాలా ఫన్నీగా వుండడంతో వాటిని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేశారనే చెప్పాలి. పాత సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలిగినా కామెడీ హైలైట్‌ అవ్వడంతో దాన్ని ఎంజాయ్‌ చేస్తూ కథ విషయాన్ని ఆడియన్స్‌ అంతగా పట్టించుకోకపోవచ్చు. 

చంద్రకళ తర్వాత మరో మంచి హార్రర్‌ కామెడీని చేద్దామనుకున్న సుందర్‌కి టెక్నికల్‌ టీమ్‌ కొంత వరకు తోడ్పడింది. సెంథిల్‌కుమార్‌ ఫోటోగ్రఫీ ఆద్యంతం రిచ్‌గానే కనిపించింది. హిప్‌ హాప్‌ తమిళ చేసిన పాటలు వినసొంపుగా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగానే చేశాడు. ఈ హార్రర్‌ మూవీకి ఎక్కువ ప్లస్‌ అయింది సౌండ్‌ ఎఫెక్ట్స్‌. వాటిని పర్‌ఫెక్ట్‌గా వాడుకోవడంలో సుందర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ, స్క్రీన్‌పే, డైరెక్షన్‌ గురించి చెప్పాల్సి వస్తే చంద్రకళలో మనం ఏం చూశామో దాదాపు కళావతిలోనూ అదే చూస్తాం. అలాంటి కథతోనే, అలాంటి ట్రీట్‌మెంట్‌తోనే రూపొందిన కళావతిలో ఆర్టిస్టులు మాత్రం వేరుగా కనిపిస్తారు. సెకండాఫ్‌లో కళావతికి ఏం అన్యాయం జరిగింది? ఎలా జరిగింది? అసలామె ఎలా చనిపోయింది అనేది ఆడియన్స్‌ నుంచి సింపతిని గెయిన్‌ చేస్తుంది. అయితే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండింగ్‌ వరకు చాలా సందర్భాల్లో చంద్రకళ సినిమాలో ఇలాగే చూపించాడు కదా అనే ఫీలింగ్‌ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. చంద్రకళ ప్రభావం ఈ సినిమాపై ఎక్కువగా వుండడం వల్ల ఆ సినిమానే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది తప్ప కళావతి అనేది కొత్త సినిమా అనే ఫీల్‌ రాదు. 

సినిమాలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే అంశాలు, నవ్వించే సీన్స్‌, భయపెట్టే సన్నివేశాలు చాలానే వున్నాయి. దానికి తగ్గట్టుగానే మైనస్‌ పాయింట్స్‌ కూడా చాలా వున్నాయి. కొన్ని సీన్స్‌కి అసలు లాజిక్‌ అనేది దొరకదు. సినిమాలో మొదటి నుంచీ చూపిస్తూ వస్తున్న జమీందారు మంచాన పడిన తర్వాత త్రిష రూపంలో వున్న కళావతి అతన్ని చంపేస్తుంది. ఈ విషయాన్ని కుటుంబంలోని ఏ ఒక్కరూ గుర్తించరు. అలాగే కనిపించకుండా పోయిన పెద్ద కొడుకు గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. అలాగే కళావతి తన చెల్లెలు అని సిద్ధార్థ చెప్పే ఫ్లాష్‌ బ్యాక్‌లో త్రిష కూడా వున్నా ప్రజెంట్‌లో కళావతి అంటే ఎవరో తెలీనట్టుగానే ఆమె క్యారెక్టర్‌ బిహేవ్‌ చేస్తుంది. ఇలాంటి లూప్‌హోల్స్‌ సినిమాలో చాలా వున్నాయి. ఫస్ట్‌ హాఫ్‌ అంతా బంగళాలోని ఒక్కొక్కరినీ ఒక్కోలా ఆత్మ భయపెట్టడం, మధ్య మధ్య సూరి, కోవై సరళ కామెడీ, సుందర్‌ ఆ ఆత్మకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలతో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత సినిమాని క్లైమాక్స్‌కి తీసుకు రావడానికి కామెడీ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు సుందర్‌. ఆత్మను బయటికి పంపేందుకు రకరకాల మంత్ర, తంత్రాలను ఆశ్రయించిన తర్వాత ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. ఈ సినిమాలో ఆడియన్స్‌ని భయపెట్టిన సీన్స్‌ ఎన్ని వున్నాయో, నవ్వించిన సీన్స్‌ అంతకంటే ఎక్కువ వున్నాయి. అందరికీ ఇది చూసిన సినిమాలాగే అనిపించినా కామెడీ పరంగా బి, సి సెంటర్స్‌లో కలెక్ట్‌ చేసే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: చంద్ర'కళ'తో 'కళావతి' 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

 

 

 

Click Here for Seethamma Andalu Ramayya Sithralu Review

 

Click Here for Lachchimdeviki O Lekkundi Review

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs