అన్నపూర్ణ స్టూడియోస్
సోగ్గాడే చిన్ని నాయనా
తారాగణం: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,
లావణ్య త్రిపాఠి, సంపత్, నాగబాబు, నాజర్,
అనసూయ, హంసానందిని, పోసాని, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఆర్.సిద్ధార్థ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
మూలకథ: రామ్మోహన్ పి.
నిర్మాత: నాగార్జున అక్కినేని
రచన, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల
విడుదల తేదీ: 15.01.2016
సినిమా అనేది సాధారణ ప్రజలకు అందుబాటులో వున్న వినోదం. తను చూసిన సినిమా కొన్న టిక్కెట్‌కి పూర్తి న్యాయం చేసిందా? సినిమా చూసి తను ఎంత ఎంటర్‌టైన్ అయ్యాను అనేదే ఆలోచిస్తాడు. అంతేతప్ప సినిమాని ఎంత బడ్జెట్‌లో తీశారు? ఏ బ్యాక్‌డ్రాప్‌లో చేశారు? స్టార్‌కాస్ట్ ఎంత వుంది అనేది కామన్ ఆడియన్‌కి అవసరం లేదు. ప్రేక్షకులు మెచ్చే, వారికి నచ్చే సినిమాలు తియ్యాలంటే ఆర్భాటాలు చెయ్యక్కర్లేదు. మంచి కంటెంట్‌తో ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా సినిమా తియ్యగలిగితే దాన్ని సూపర్‌హిట్ చేస్తారని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశారు. అలాంటి ఓ మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్నినాయనా. కళ్యాణ్‌కృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం వుంది? పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయిందనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
30 సంవత్సరాలు వెనక్కి వెళితే శివపురం అనే గ్రామంలో బంగార్రాజు(అక్కినేని నాగార్జున) అనే జమీందారు. అతనికి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. దానికి తగ్గట్టుగానే రాజుగారు కూడా వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. అయితే శివరాత్రికి ముందు రోజు బంగార్రాజు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అతని భార్య సత్య(రమ్యకృష్ణ). తన భర్త ఎప్పుడూ ఆడవాళ్ళ వెంటే తిరిగేవాడని, తన కొడుకు రాము అలా కాకూడదని కట్టుదిట్టంగా పెంచుతుంది. ఆడవాళ్ళంటే ఆమడ దూరం పరిగెట్టేలా తయారవుతాడు రాము. ప్రజెంట్‌లోకి వస్తే రాము(నాగార్జున) పెద్దవాడయ్యాడు, పెళ్ళి కూడా చేసుకున్నాడు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. సడన్‌గా అమెరికా నుంచి రాము, అతని భార్య సీత(లావణ్య త్రిపాఠి) ఇండియా వస్తారు. రాము తనని పట్టించుకోవడం లేదని, తమ ఇద్దరికీ అస్సలు పడడం లేదని, విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యామని అత్తగారితో చెప్తుంది సీత. తను రాముని అలా పెంచడానికి కారణమైన భర్తని తిట్టుకుంటుంది సత్య. యమలోకంలో ఆడ యమభటులతో బిజీగా వున్న బంగార్రాజు అది వింటాడు. యమలోకంలో కూడా ఆడభటులతో సరసాలు మొదలుపెట్టిన బంగార్రాజుని భూలోకానికి వెళ్ళమని ఆదేశిస్తాడు యమధర్మరాజు(నాగబాబు). బంగార్రాజు భూలోకంలో చెయ్యాల్సిన సత్కార్యం ఒకటుందని, అందుకే పంపానని చిత్రగుప్తుడితో చెప్తాడు యమధర్మరాజు. అతని భార్యకి కనపడడంతోపాటు, అతని మాటలు కూడా ఆమెకు వినపడేలా వరం ఇస్తాడు యముడు. భూలోకానికి వచ్చి భార్యను కలుసుకున్న తర్వాత కొడుకు, కోడలు విషయం తెలుకుంటాడు బంగార్రాజు. ఎలాగైనా కొడుకు, కోడలు విడాకుల మాట ఎత్తకుండా చెయ్యమని బంగార్రాజుని అడుగుతుంది సత్య. కొడుకుని తనలా రొమాంటిక్‌గా తయారు చెయ్యడానికి బంగార్రాజు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేశాడు? భూమ్మీద బంగార్రాజు చెయ్యబోయే సత్కార్యం ఏమిటి? అసలు బంగార్రాజు ఎలా చనిపోయాడు? శివపురంలోని శివాలయం మిస్టరీ ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎప్పుడూ హుషారుగా వుంటూ అమ్మాయిల వెంట తిరిగే బంగార్రాజుగా, తన అమాయకత్వంతో భార్యని కూడా పట్టించుకోని రాముగా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని నాగార్జున అత్యద్భుతంగా పోషించాడు. బంగార్రాజులోని చలాకీతనం, రొమాంటిక్ మూమెంట్స్‌ని తన ఫేస్‌లో ఎక్స్‌లెంట్‌గా చూపించాడు. అమ్మాయిల దగ్గర, భార్య దగ్గర ఎంతో అమాయకంగా వుండే రాముగా మరో షేడ్‌ని కూడా ఎక్స్‌లెంట్‌గా చేశాడు. రమ్యకృష్ణతో నాగార్జున చేసిన సీన్స్ అన్నీ చాలా ఎఫెక్టివ్‌గా వచ్చాయంటే దానికి నాగార్జున పెర్‌ఫార్మెన్సే కారణం. రమ్యకృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా నాగార్జునకు గట్టిపోటీ ఇచ్చింది. తన క్యారెక్టర్‌లో చాలా ఇన్‌వాల్వ్ అయి నటించింది. రాము భార్యగా లావణ్య త్రిపాఠి చాలా నేచురల్‌గా పెర్‌ఫార్మ్ చేసింది. పాటల్లో గ్లామర్‌గా, చాలా చోట్ల రొమాంటిక్‌గా కనిపించిన లావణ్య యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. రాము పెద్దనాన్న రుద్రరాజుగా నాజర్ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. మధ్యలో అనసూయ, హంసానందినిలతో నాగార్జున చేసిన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మిగతా క్యారెక్టర్స్‌లో సంపత్, పోసాని, సప్తగిరి, యముడుగా నాగబాబు తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.
చాలా కాలం తర్వాత పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని పి.ఎస్.వినోద్, సిద్ధార్థ అత్యద్భుతంగా తెరకెక్కించారు. పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి సీన్స్‌ని అందంగా చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. అంతేకుండా నాగార్జునని ఇంకా గ్లామర్‌గా చూపించారు. అలాగే లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో మరింత అందంగా కనిపించడంలో సినిమాటోగ్రాఫర్స్ వర్క్ వుంది. అనూప్ రూబెన్స్ చేసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. ఆ పాటల్ని అంతకంటే అందంగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ చాలా ఎక్స్‌లెంట్‌గా చేశాడు అనూప్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి చెప్పాలంటే ఈ కథని హ్యాండిల్ చెయ్యడంలో తన టాలెంట్ ఏమిటో చూపించాడు. రామ్మోహన్ ఇచ్చిన కథని అందరూ మెచ్చే సినిమాగా తెరకెక్కించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు కళ్యాణ్‌కృష్ణ. విలేజ్ డ్రాప్‌లో వున్న కథకి ఒక ఫాంటసీ ఎలిమెంట్‌ని కూడా జోడించి నెక్స్‌ట్ జరగబోతున్నది ఏమిటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని ఆడియన్స్‌లో పెంచాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకొని సినిమా బాగా రావడానికి కారణమయ్యాడు కళ్యాణ్.
శివాలయంలో పాము కాటుకు ఓ వ్యక్తి చనిపోవడంతో సినిమా మొదలవుతుంది. యు.ఎస్. నుంచి రాము, సీత రావడం, విడాకులు తీసుకోవాలనుకోవడం, ఆ వెంటనే బంగార్రాజు యమలోకం నుంచి రావడం, కొడుకు, కోడల్ని కలపడం కోసం రకరకాలుగా ట్రై చెయ్యడం, మధ్య మధ్యలో రాములో ప్రవేశించి అమ్మాయిలతో సరసాలాడడం వంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. వీటన్నింటి మధ్య కథ అనేది ముందుకు కదలదు. కథకు అవసరం లేని సీన్స్ వస్తుంటాయి. చివరి 30 నిముషాలు మాత్రం చాలా ఎమోషనల్‌గా వుంటుంది. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా వుండడమే కాకుండా ఆడియన్స్‌లో నెక్స్‌ట్ ఏం జరగబోతోందనే విషయం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. కళ్యాణ్‌కృష్ణ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో సినిమాని చాలా బాగా చేశాడు. ఈ కథకి ఫాంటసీ ఎలిమెంట్‌ని మిక్స్ చెయ్యడంలో కళ్యాణ్ టాలెంట్ తెలుస్తుంది. అన్నింటినీ మించి ఇలాంటి కథని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చెయ్యడం, దానికి ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ని కూడా జోడించడంతో ఒక దశలో సినిమా గ్రాఫ్ పెరిగిపోయింది. మొత్తం మీద ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు వేశారని చెప్పాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా నీట్‌గా తీసిన ఈ సినిమా అన్నివర్గాలను ఆకట్టుకునే సినిమా అవుతుంది.
ఫినిషింగ్ టచ్: ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
సినీజోష్ రేటింగ్: 3.25/5