Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ఎక్స్‌ప్రెస్‌ రాజా


సినీజోష్‌ రివ్యూ: ఎక్స్‌ప్రెస్‌ రాజా 

Advertisement
CJ Advs

యు.వి. క్రియేషన్స్‌ 

ఎక్స్‌ప్రెస్‌ రాజా 

తారాగణం: శర్వానంద్‌, సురభి, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, 

సుప్రీత్‌, పోసాని, హరీష్‌ ఉత్తమన్‌, సప్తగిరి, షకలక శంకర్‌, 

ఊర్వశి, నాగినీడు తదితరులు 

సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 

సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు 

నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌ 

రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ 

విడుదల తేదీ: 14.01.2016 

మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సూపర్‌హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ, తను చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం వుండాలని కోరుకునే హీరో శర్వానంద్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాజా. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైన ఈ చిత్రం శర్వానంద్‌కి, మేర్లపాక గాంధీకి ఎలాంటి సినిమా అయింది? గాంధీ తన రెండో సినిమాతో మళ్ళీ హిట్‌ కొట్టాడా? యు.వి. క్రియేషన్స్‌లో రన్‌రాజారన్‌ వంటి సూపర్‌హిట్‌ మూవీ చేసిన శర్వానంద్‌కి ఇదే బేనర్‌లో రెండో హిట్‌ వచ్చిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సాధారణంగా తెలుగు సినిమాల్లోని హీరోల్లాగే ఏ లక్ష్యం లేకుండా గాలికి తిరిగే కుర్రాడు రాజా(శర్వానంద్‌). అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో మంచి వ్యక్తిగా అతని తండ్రి నాగినీడు మంచి పేరు తెచ్చుకుంటాడు. రాజా తండ్రిని ఇష్టపడే ఎస్‌.ఐ. పోసానికి రాజా, అతని ఫ్రెండ్‌ ప్రభాస్‌ శ్రీను ప్రవర్తన నచ్చదు. అందుకే వాళ్ళిద్దరినీ హైదరాబాద్‌ వెళ్ళి ఏదైనా జాబ్‌ చేసుకోమని పంపిస్తాడు. హైదరాబాద్‌ వచ్చిన రాజా.. అమ్యూల(సురభి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చేయడం కోసం పడరాని కష్టాలు పడతాడు. చివరికి అమూల్య కూడా అతనంటే ఇష్టపడుతుంది. ఓ ఫైన్‌ మార్నింగ్‌ అతనికి ఐ లవ్‌ యూ చెప్పాలని బయల్దేరిన అమూల్యకి అతను ఎలాంటి వాడో అర్థమవుతుంది. తను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కుక్కపిల్లని మున్సిపాలిటీకి అప్పగిస్తాడు రాజా. దీంతో అతన్ని ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. ఆ కుక్క మిస్‌ అయిన క్షణం నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఎమ్మెల్యే కావాలని కలలు కనే కేశవరెడ్డి(హరీష్‌ ఉత్తమన్‌)తో అమూల్యకి నిశ్చితార్థం జరుగుతుంది. ఈ కథకి ఎన్నో కథలు యాడ్‌ అవుతాయి. కేశవరెడ్డి కథ, బినామీ బ్రిటీష్‌(సుప్రీత్‌), పొల్యూషన్‌ గిరి(సప్తగిరి), రికార్డింగ్‌ డాన్స్‌ కంపెనీ ఓనర్‌ అయిన నటరాజ్‌(షకలక).. ఇలా ఒకదానికొకటి లింక్‌ అవుతూ వెళ్తాయి. ఈ కథల్లోని వ్యక్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి ఎలాంటి సమస్యలు? ఆ సమస్యలకి మన హీరో, హీరోయిన్‌లకు ఎలాంటి సంబంధం వుంటుంది? ఈ సమస్యలన్నింటినీ ఎవరు పరిష్కరించారు? చివరికి రాజా, అమూల్య పెళ్ళి చేసుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే. 

ఎలాంటి లక్ష్యంలేని కుర్రాడిగా, తొలిచూపులోనే తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత రిస్కయినా చేసే లవర్‌గా, తనకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకునే ఇంటెలిజెంట్‌గా, కొడుకు గాలికి తిరుగుతున్నాడని తండ్రి భావించినా ఆ తండ్రికి వచ్చిన సమస్య నుంచి కాపాడే కొడుకుగా ఇలా రకరకాల పాత్రల మధ్య హీరో క్యారెక్టర్‌ తిరుగుతూ వుంటుంది. ఈ క్యారెక్టర్‌లో డైరెక్టర్‌కి కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని ఇచ్చాడు శర్వానంద్‌. అయితే అతని పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు అనిపిస్తుంది. ఇక హీరోయిన్‌ సురభికి పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం తక్కువగానే లభించిందని చెప్పాలి. ఉన్నంతలో ఫర్వాలేదు అనిపించింది. హీరో ఫ్రెండ్‌గా ప్రభాస్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో నవ్వించడానికి ట్రై చేశాడు. సినిమాలో సప్తగిరికి ఎక్కువగా నవ్వించే అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకొని నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. సుప్రీత్‌ కూడా కామెడీ టచ్‌ వున్న క్యారెక్టర్‌లో ఓకే అనిపించాడు. కేశవరెడ్డి తల్లిగా, వసంతకోకిలలో శ్రీదేవి క్యారెక్టర్‌లో నటించిన ఊర్వశి ఎక్కువ సందర్భాల్లో విసిగించిందని చెప్పాలి. కేశవరెడ్డిగా నటించిన హరీష్‌ ఉత్తమన్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా యాజిటీజ్‌గా అంతకుముందు సినిమాల్లోలాగే వుంది. రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌ లీడర్‌గా కొన్ని చోట్ల నవ్వించడానికి, కొన్నిచోట్ల విసిగించడానికి ట్రై చేశాడు షకలక శంకర్‌. బిల్‌గేట్స్‌గా నటించిన బ్రహ్మాజీ కూడా తన పెర్‌ఫార్మెన్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. 

టెక్నికల్‌ టీమ్‌ చేసిన ఎఫర్ట్స్‌ గురించి చెప్పుకోవాలంటే ఘట్టమనేని కార్తీక్‌ ఫోటోగ్రఫీ ఫర్వాలేదనిపించాడు. ఫోటోగ్రఫీ పరంగా అద్భుతమైన స్కిల్స్‌ చూపించే అవసరం లేని కథ కావడంతో అతని వర్క్‌ కూడా దానికి తగ్గట్టుగానే వుంది. ప్రవీణ్‌ లక్కరాజు చేసిన పాటలు సోసోగా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనేలా వుంది. డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ గురించి చెప్పాలంటే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని ట్రై చేశాడు. అయితే కథా గమనంలో ఎన్నో చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు అడ్డు తగిలాయి. సినిమా కొన్నిచోట్ల బాగుంది అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల విసిగిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో హీరో డిక్షనరీలు అమ్మే సీన్‌ని ఎక్కువ సేపు చూపించడం, కథ అక్కడక్కడే తిరుగుతుండడంతో ఆడియన్స్‌ చాలా బోర్‌ ఫీల్‌ అయ్యారు. ఇక సెకండాఫ్‌లో ఎంటర్‌ అయ్యే కొత్త క్యారెక్టర్ల గ్రూప్‌కి సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌లు వెయ్యడం ద్వారా ఆడియన్స్‌ని మరింత కన్‌ఫ్యూజ్‌ చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్‌లో అతను కుక్కలను అసహ్యించుకుంటాడనే టాపిక్‌ని చాలా సార్లు తీసుకురావడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటో అర్థం కాదు. కుక్కని చంపేస్తానని పదే పదే అనడం కూడా అందర్నీ ఇబ్బంది పెడుతుంది. 

టోటల్‌గా సినిమా ఎలా వుందో చెప్పాలంటే ఫస్ట్‌ హాఫ్‌లో హీరోయిన్‌ని తొలిచూపులోనే హీరో ప్రేమించడం ఆమె కోసం డిక్షనరీలు అమ్ముతూ ఆమెను రోజూ కలుసుకోవడం, ఆ తర్వాత అతని లవ్‌ సక్సెస్‌ అవ్వడం, మధ్యలో పాటలు, అతని లవ్‌ని హీరోయిన్‌ యాక్సెప్ట్‌ చేసే టైమ్‌లో హీరో బ్యాడ్‌ అవ్వడం వంటి సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి రకరకాల క్యారెక్టర్లు ఎంటర్‌ అయిపోయి, రకరకాల కథలతో సినిమా రన్‌ అవుతూ వుంటుంది. ఒకరికి డైమండ్‌ కావాలి, మరొకరికి పెళ్ళి కావాలి, ఇంకొకరు రికార్డింగ్‌ డాన్స్‌కి వెళ్లాలి..ఇలా అన్ని కథలను లింక్‌ చేస్తూ క్లైమాక్స్‌ వరకు వస్తుంది. ఇలా చెప్పుకోవడానికి బాగానే వున్నా కొన్నిచోట్ల అక్కడక్కడే కథ తిరగడం వల్ల కొంత ల్యాగ్‌ వచ్చింది. సినిమా మొత్తంలో సప్తగిరి చేసిన కామెడీ హైలైట్‌ అయింది. అతను చెప్పే ప్రతి డైలాగ్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నటరాజ్‌గా షకలక శంకర్‌ కూడా సెకండాఫ్‌లో నవ్వించడానికి ట్రై చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో కొంత కన్‌ఫ్యూజన్‌ వున్నా, చాలా చోట్ల బోర్‌ కొట్టించినా కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆహ్లాదకరమైన ప్రయాణం..సరదాగా నవ్వుకొండిక! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs