వారాహి చలనచిత్రం, యుక్త క్రియేషన్స్
జతకలిసే
తారాగణం: అశ్విన్, తేజస్వి, సూర్య, పృథ్వీ,
షకలక శంకర్, సప్తగిరి, స్నిగ్థ తదితరులు
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సంగీతం: విక్కీ, సాయికార్తీక్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సాయికార్తీక్
నిర్మాత: నరేష్ రావూరి
రచన, దర్శకత్వం: రాకేష్ శశి
విడుదల తేదీ: 25.12.2015
కొత్త కాన్సెప్ట్‌తో చేసిన సినిమాలు, రొటీన్ కథ తీసుకున్నా దాన్ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన సినిమాలు ప్రస్తుతం విజయాలు సాధిస్తున్నాయి. ఈమధ్య హార్రర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి హార్రర్ సబ్జెక్ట్‌లోనే ఓ కొత్త యాంగిల్‌ని చూపించిన రాజుగారి గది కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. అశ్విన్ హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా తర్వాత అశ్విన్‌తో కొత్త దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో నరేష్ రావూరి నిర్మించిన మరో డిఫరెంట్ మూవీ జతకలిసే. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో రూపొందింది? రాజుగారి గది తర్వాత అశ్విన్ చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
రుషి(అశ్విన్) యు.ఎస్. నుంచి తన ఫ్రెండ్ పెళ్ళికి ఇండియా వస్తాడు. కాసేపట్లో పెళ్ళి జరుగుతుందనగా ఒక ఫుల్ బాటిల్ తాగి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా తాళి కట్టాలని పెళ్ళికొడుకుతో పందెం కాస్తాడు రుషి. రుషితోపాటు అతని నలుగురు ఫ్రెండ్స్ మందు కొడుతుండగా ఆడ పెళ్ళివారు చూస్తారు. అక్కడో పెద్ద గొడవ జరిగి ఆ పెళ్ళి ఆగిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ పింకీ(తేజస్వి). స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా వుండే అమ్మాయి. తను ఐఎఎస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనే తండ్రి కోరికను తీర్చేందుకు కష్టపడుతూ వుంటుంది. పెళ్ళి ఆగిపోయిన తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి క్యాబ్ బుక్ చేసుకొని యు.ఎస్. వెళ్ళడానికి రెడీ అవుతాడు రుషి. మరుసటిరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన పింకీ ట్రావెల్స్ వారిని రిక్వెస్ట్ చేసి అదే కారులో హైదరాబాద్ బయల్దేరుతుంది. పెళ్ళిలో గొడవ పడిన రుషి ఆ కారులో వుండడం చూసి షాక్ అవుతుంది. పెళ్ళిలో పింకీని చూడని రుషి మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ఆ టైమ్‌లోనే కారులోని రేడియోలో వైజాగ్‌లోని టాప్ ఐదుగురు వెధవల గురించి చెప్తుంటుంది ఆర్.జె. అది తమ గ్యాంగ్ గురించే అని తెలుసుకుంటాడు రుషి. పెళ్ళిలో జరిగిన గొడవకు సంబంధించిన ఫోటోలు, వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయిస్తుంది పింకీ. దీంతో రుషి గ్యాంగ్ ఎంత వెధవలో అందరికీ తెలిసిపోతుంది. ఇవన్నీ చేస్తున్నది తన పక్కన ట్రావెల్ చేస్తున్న పింకీయేనని తెలియని రుషి ఇరిటేట్ అవుతుంటాడు. ఆ ట్రావెల్‌లోనే పింకీ విషయం రుషికి తెలిసిపోతుంది. అప్పుడు రుషి ఎలా రియాక్ట్ అయ్యాడు? కోపంతో రగిలిపోయిన రుషి.. పింకీని ఏం చేశాడు? వైజాగ్ టు హైదరాబాద్ కార్ ట్రిప్‌లో ఇంకా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనేది మిగతా కథ.
కొన్ని సీన్స్ మినహాయిస్తే సినిమా అంతా దాదాపుగా హీరో, హీరోయిన్, క్యాబ్ డ్రైవర్ స్నిగ్ధ ఎక్కువగా కనిపిస్తారు. ఎన్నారైగా అశ్విన్ పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదు అనిపిస్తుంది. డాన్స్‌లో, ఫైట్స్‌లో ఓకే అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ తేజస్వి గ్లామరస్‌గా కనిపించింది. కోపంతో మాట్లాడుతున్నా, షాక్ అయి చూస్తున్నా, ఏడుస్తూ మాట్లాడుతున్నా ఆమె మొహం నవ్వుతున్నట్టుగా కనిపించడం ఆమెకు పెద్ద మైనస్ అని చెప్పాలి. దాని వల్ల డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ క్యారీ అవ్వక చాలా సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. మిగతా సీన్స్‌లో, పాటల్లో తేజస్వి పెర్‌ఫార్మెన్స్ బాగుంది. క్యాబ్ డ్రైవర్‌గా స్నిగ్ధ కొంత కామెడీ చేసే ప్రయత్నం చేసింది. షకలక శంకర్, సప్తగిరి తమ కోసం క్రియేట్ చేసిన కామెడీ ట్రాక్‌లో నవ్వించే ప్రయత్నం చేశారు కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. సూర్య, పృథ్వీ, హీరో ఫ్రెండ్స్‌గా నటించిన ఆర్టిస్టులు తమ క్యారెక్టర్ల పరిధి మేరకు ఫర్వాలేదు అనిపించారు.
ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది ఫోటోగ్రఫీ, మ్యూజిక్. జగదీష్ చీకటి ఫోటోగ్రఫీ బాగుంది. ఔట్‌డోర్ లొకేషన్స్, సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. విక్కీ, సాయికార్తీక్ చేసిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడు. డైరెక్టర్ రాకేష్ శశి గురించి చెప్పాలంటే మంచి పాయింట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ వరకే ఆ పాయింట్ ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యగలిగింది. సెకండాఫ్‌లో కథను ముందుకు నడిపేందుకు మెటీరియల్ లేకపోవడంతో కామెడీ ట్రాక్, అనవసరమైన ఛేజ్, ఫైట్‌తో కాలయాపన చేశాడు. అలాగే మధ్యలో హీరోయిన్ అక్క ఫ్యామిలీకి సంబంధించి ఓ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి దాన్ని హీరో సాల్వ్ చెయ్యడం కూడా సినిమాని ముందుకు నడిపించడానికే అన్నట్టుగా వుంది. హీరోపై హీరోయిన్‌కి లవ్ జనరేట్ అయ్యేందుకు ఆ సీన్ చేశారని కూడా అనుకోవచ్చు. ఏది ఏమైనా ఫస్ట్ హాఫ్ చేసినంత గ్రిప్పింగ్‌గా సెకండాఫ్ చెయ్యలేకపోయాడు డైరెక్టర్.
హీరో ఇంట్రడక్షన్, అతని గ్యాంగ్ చేసే అల్లరి. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆమెకు వున్న సోషల్ అవేర్‌నెస్ వంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్‌లో సగం ఆడియన్స్ కథలో ఇన్‌వాల్వ్ అవ్వకుండానే నడిచిపోతుంది. ఎప్పుడైతే హీరో గ్యాంగ్ గురించి రేడియోలో, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ తెలిసిపోతుందో అప్పటి నుంచి కథ ఒక దారిలోకి వస్తుంది. పక్కనే వుండి హీరోని, అతని గ్యాంగ్‌ని ఏడిపించే పింకీ ఫస్ట్‌హాఫ్‌ని స్పీడ్‌గా నడిపిస్తుంది. తనను ఏడిపిస్తున్నది పింకీయేనని హీరో తెలుసుకున్నా అతనికి తెలిసిపోయిందన్న విషయం సెకండాఫ్ వరకు పింకీ తెలియకుండా చేయడం వల్ల కథలో చాలా ల్యాగ్ వచ్చింది. మధ్యలో పాటలు, నిడివిని పెంచే కామెడీ ట్రాక్‌తో సెకండాఫ్ స్లో అయిపోతుంది. ఎప్పుడు క్లైమాక్స్ వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూసే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో, సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో కొన్ని మైనస్‌లు వున్నా ఈమధ్యకాలంలో వస్తున్న రొటీన్ సినిమాలకు భిన్నంగా ఫర్వాలేదు అనిపించే సినిమా జతకలిసే.
ఫినిషింగ్ టచ్: జస్ట్ ఓకే
సినీజోష్ రేటింగ్: 2.25/5