Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: సైజ్‌ జీరో


పి.వి.పి. సినిమా 

Advertisement
CJ Advs

సైజ్‌ జీరో 

తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌, 

ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, ఆలీ, భరత్‌, ఊర్వశి, 

గొల్లపూడి తదితరులు 

సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

సంగీతం: యం.యం.కీరవాణి 

మాటలు: కిరణ్‌ 

కథ, స్క్రీన్‌ప్లే: కనిక కోవెలమూడి 

సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి 

నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నే 

దర్శకత్వం: కె.ఎస్‌.ప్రకాష్‌రావు 

విడుదల తేదీ: 27.11.2015 

ఈ సంవత్సరం బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ చిత్రాల్లో నటించిన అనుష్క సైజ్‌ జీరో అనే ఒక డిఫరెంట్‌ మూవీలో నటించడం, ఈ సినిమా కోసం 20 కేజీల వరకు బరువు పెరగడం, ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ చెయ్యడంతో బాగా హైప్‌ వచ్చింది. ఈ సినిమా ఎలా వుండబోతోంది? అనుష్క క్యారెక్టర్‌ ఎలా వుంటుంది? బరువు పెరిగిన అనుష్క ఎలా పెర్‌ఫార్మ్‌ చేసింది? అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలిగింది. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన కె.రాఘవేంద్రరావు తనయుడు కె.ఎస్‌.ప్రకాష్‌రావు సైజ్‌ జీరో అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాడు. పి.వి.పి. సినిమా బేనర్‌లో ప్రసాద్‌ వి. పొట్లూరి ఎంతో భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇన్ని ప్రత్యేకతలు వున్న ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంది? అనుష్క ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయింది? డైరెక్టర్‌ కె.ఎస్‌.ప్రకాష్‌రావు రెండో సినిమాతో విజయం అందుకోగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

చిన్నప్పటి నుంచి ఓవర్‌ వెయిట్‌తో పెరిగిన సౌందర్య అలియాస్‌ స్వీటీ(అనుష్క) కథ ఇది. తన వెయిట్‌ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేస్తూ వుంటుంది. స్వీటీకి పెళ్లి చెయ్యడమే తనకు పెద్ద బాధ్యతగా భావిస్తుంది ఆమె తల్లి(ఊర్వశి). ఎన్ని సంబంధాలు తెచ్చినా స్వీటీ ఓవర్‌ వెయిట్‌ చూసి అందరూ భయపడి వెళ్లిపోతారు. ఒకరోజు డాక్యుమెంటరీలు తీసే అభి(ఆర్య) స్వీటీని చూసుకోవడానికి వస్తాడు. కానీ, అతను తనకు నచ్చలేదని పెళ్ళి చూపుల్లో ఫస్ట్‌ టైమ్‌ చెప్తుంది స్వీటీ. అక్కడితో ఆ పరిచయం ఆగదు. ఏదో ఒక సందర్భంలో ఇద్దరూ కలుస్తుంటారు. తన వెయిట్‌ని దృష్టిలో పెట్టుకోకుండా తన అందాన్ని పొగిడే అభి అంటే స్వీటీకి ఇష్టం ఏర్పడుతుంది. అలా అభిని ప్రేమిస్తుంది. అదే టైమ్‌లో సోషల్‌ వర్కర్‌ అయిన సిమ్రాన్‌(సోనాల్‌ చౌహాన్‌) ఎంటర్‌ అవుతుంది. ఒకరోజు వాళ్ళిద్దరు చాలా సన్నిహితం వుండడం చూసిన స్వీటీ అప్పటి నుంచి అభిని దూరం పెడుతుంది. తన వెయిట్‌ వల్లే అందరూ తనను చిన్నచూపు చూస్తున్నారన్న ఫీలింగ్‌ పెంచుకుంటుంది. ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్‌ అవుతుంది. సైజ్‌ జీరో అనే క్లీనిక్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరి సైజ్‌ జీరో ట్రీట్‌మెంట్‌ ద్వారా స్వీటీ బరువు తగ్గిందా? తను ప్రేమించిన అభికి దగ్గరయ్యిందా? వీరిద్దరి ప్రేమ కథ చివరికి ఎలా ఎండ్‌ అయ్యింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఓవర్‌ వెయిట్‌ వున్న అమ్మాయి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చెప్పుకోదగింది ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన కితకితలు. ఆద్యంతం కామెడీతో నడిచే ఆ చిత్రం ద్వారా చక్కని మెసేజ్‌ కూడా ఇచ్చారు. ఇప్పుడొచ్చిన సైజ్‌ జీరో గురించి చెప్పాలంటే టైటిల్‌కి తగ్గట్టుగానే ఇందులో కథగా చెప్పుకోవడానికి జీరోయే మిగులుతుంది. ఓవర్‌ వెయిట్‌ వున్న ఒక అమ్మాయి కథగా ఈ చిత్రాన్ని తీసినప్పటికీ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఒక్క సీన్‌ కూడా మనకు కన్విన్సింగ్‌గా అనిపించదు. ప్రతి సీన్‌లో అసహజత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హీరోని హీరోయిన్‌ ప్రేమించే సిట్యుయేషన్‌గానీ, హీరో ఆమె ప్రేమ కోసం తపించే సన్నివేశాలుగానీ కృతకంగానే అనిపిస్తాయి తప్ప ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా వుండవు. పైగా హీరో, హీరోయిన్‌కి సంబంధించిన టాపిక్‌ రన్‌ అవుతుండగానే మరో పక్క క్లీన్‌ ఇండియా కాంపెయిన్‌ కోసం ఆర్య, సోనాల్‌ చౌహాన్‌లతో చేసే సీన్స్‌ విసిగిస్తాయి. ఇదిలా వుంటే సైజ్‌జీరో క్లినిక్‌లో చేరిన స్వీటీ ఫ్రెండ్‌ జ్యోతి హాస్పిటల్‌ పాలవడం, దానికోసం సైజ్‌జీరో క్లీనిక్‌ ఓనర్‌ అయిన సత్యానంద్‌(ప్రకాష్‌రాజ్‌) దగ్గరకి స్వీటీ వచ్చి గొడవ చెయ్యడం, హీరోతో కలిసి ఒక వీడియో చేయడం, ఆ తర్వాత ప్రకాష్‌రాజ్‌ని అభాసుపాలు చెయ్యడం వంటి సీన్స్‌తో అసలు కథను వదిలిపెట్టి పనికిరాని విషయాలన్నీ మనపై రుద్దే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. ఇదిలా వుంటే జ్యోతి ట్రీట్‌మెంట్‌కి 25 లక్షలు కావాలని, దాని కోసం ఒక ఇండోర్‌ స్టేడియంలో అందరూ కలిసి యుద్ధ ప్రాతిపదికన సైకిలింగ్‌ చెయ్యడం, వీరితోపాటు తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు కూడా దానిలో పాల్గొనడం వంటి సీన్స్‌తో సెకండాఫ్‌ని చెత్త కుప్ప చేసేశారు. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త ఫర్వాలేదు అనుకున్న ఆడియన్స్‌కి సెకండాఫ్‌ని చూసిన తర్వాత ఫస్ట్‌ హాఫ్‌ కూడా అలాగే వుందనే ఫీలింగ్‌ కలిగించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. 

ఈ సినిమాకి వున్న ఒకే ఒక్క ప్లస్‌ పాయింట్‌ అనుష్క. రెండు భారీ చిత్రాల తర్వాత వచ్చిన అనుష్క సినిమా అంటే ఆడియన్స్‌లో క్రేజ్‌ వుండడం సహజం. అయితే క్యారెక్టర్‌ కోసం తన వెయిట్‌ని పెంచుకొని ఎంతో రిస్క్‌ చేసిన అనుష్కను మొదట అభినందించాలి. ఇన్ని మైనస్‌లు వున్న ఈ సినిమాని ఎవరైనా చూసే సాహసం చేస్తారా అంటే అది అనుష్క కోసమే చెయ్యాలి. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌లో నిరవ్‌షా ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా తీశాడు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి వర్క్‌ సూపర్బ్‌గా వుంది. ప్రతి సీన్‌లో రిచ్‌నెస్‌ కనబడేలా సాయి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక కీరవాణి మ్యూజిక్‌ విషయానికి వస్తే సినిమాలో రెండు పాటలు మాత్రమే బాగున్నాయి. విజువల్‌గా పాటల్ని బాగా తియ్యలేకపోయారు. సాధారణంగా కీరవాణి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా వుంటుంది. అయితే ఈ సినిమాకి మాత్రం అలాంటి అద్భుతం ఏమీ జరగలేదు. చాలా సాదా సీదాగా వుంది మ్యూజిక్‌. కె.ఎస్‌.ప్రకాష్‌రావు డైరెక్టర్‌గా సక్సెస్‌ కాలేకపోయాడని చెప్పాలి. కనిక ఇచ్చిన కథ, స్క్రీన్‌ప్లేలో పస లేకపోవడం, దానికి తగ్గట్టుగానే ప్రకాష్‌ డైరెక్షన్‌ కూడా అంతంత మాత్రంగానే వుండడంతో ఒక నాసిరకం ప్రొడక్ట్‌ బయటికి వచ్చింది. కిరణ్‌ రాసిన మాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. 

పివిపి లాంటి ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చిన సైజ్‌ జీరో మేకింగ్‌ పరంగా చాలా రిచ్‌గా వుంది. కథగానీ, కథనంగానీ, టేకింగ్‌గాని చాలా పూర్‌గా వున్నాయి. అయితే అనుష్క నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో మాత్రం ప్రకాష్‌ సక్సెస్‌ అయ్యాడు. ఇక హీరో ఆర్య లుక్స్‌ పరంగా చాలా వీక్‌గా వుండడమే కాకుండా అతనికి ఇచ్చిన వాయిస్‌ కూడా వీక్‌గానే వుండడం విచిత్రంగా అనిపిస్తుంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన ఈ సినిమా ఔట్‌పుట్‌ చూస్తే ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే అవకాశాలు తక్కువ అనేది అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ, కథనాలు, డైరెక్షన్‌ గురించి పక్కన పెడితే అనుష్క పెర్‌ఫార్మెన్స్‌ కోసం, రిచ్‌గా కనిపించే మేకింగ్‌ గురించి మాత్రమే ఈ చిత్రాన్ని చూడొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: సైజ్ జీరోలో విషయం జీరో 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs