రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ అండ్
శ్రీగోకులం మూవీస్
తారాగణం: కమల్‌హాసన్, త్రిష, ప్రకాష్‌రాజ్,
సంపత్, కిషోర్, ఆశా శరత్, యుగి సేతు,
అమన్ అబ్దుల్లా తదితరులు
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గీస్
ఎడిటింగ్: షాన్ మహమ్మద్
సంగీతం: జిబ్రాన్
మాటలు: అబ్బూరి రవి
స్క్రీన్‌ప్లే: కమల్‌హాసన్
నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమల్‌హాసన్
దర్శకత్వం: రాజేష్ ఎం.సెల్వ
విడుదల తేదీ: 20.11.2015
కమల్‌హాసన్.. వైవిధ్యానికి మారు పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. తను చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యం వుండాలి, తనలోని నటుడ్ని ఛాలెంజ్ చేసే అంశాలు తను చేసే క్యారెక్టర్‌లో వుండాలి. అలాంటి పాత్రల కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా కమల్ రెడీ. అలాంటి క్యారెక్టర్స్ ఎన్ని చేసినా కమల్‌హాసన్‌లోని నటుడికి తృప్తి లేదు. 40 ఏళ్ళుగా ఎన్నో రకాల పాత్రలు పోషించి జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కమల్ ఈమధ్యకాలంలో కమర్షియాలిటీని పక్కన పెట్టి తను చేయాలనుకున్న సినిమాలు, తనలోని నటుడ్ని సంతృప్తి పరిచే సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అలాంటి మరో విభిన్న చిత్రమే చీకటిరాజ్యం. తమిళ్‌లో తూంగవానం పేరుతో విడుదలైన ఈ చిత్రం ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు కె.బాలచందర్ దర్శకత్వంలో ఆకలిరాజ్యం అనే సంచలన చిత్రం చేసిన కమల్‌హాసన్ ఇప్పుడు ఈ చీకటిరాజ్యం కోసం ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నాడు? కమల్ నుంచి ఎప్పుడూ కొత్తదనాన్నే కోరుకునే ప్రేక్షకులకు చీకటిరాజ్యం ఎలాంటి అనుభూతిని కలిగించింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
చిన్న పాయింట్‌ని రెండు గంటల పది నిముషాల సినిమాగా ఎలా చెప్పొచ్చు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆడియన్స్‌కి తర్వాత సీన్‌లో ఏం జరగబోతోంది అనేది చూచాయగా తెలిసినా అదేమిటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలిగించేలా ప్రతి సీన్‌ని ఆసక్తికరంగా మలచడం, సినిమాలోని పాత్రలతో పాటు చూస్తున్న ఆడియన్స్‌కి కూడా టెన్షన్ క్రియేట్ చెయ్యడం అనేది ఈ సినిమాలోని ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. దివాకర్(కమల్‌హాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. ఈ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్న మణి(యుగిసేతు)తో కలిసి ఓ ఉదయం డ్రగ్స్‌తో కారులో వెళ్తున్న ముఠాని ముసుగులు ధరించి ఎటాక్ చేసి అందులో ఒకరిని చంపి కొకైన్‌తో నిండి వున్న బ్యాగ్‌తో అక్కడి నుంచి మాయమవుతారు. ఆ బ్యాగ్ డ్రగ్ స్మగ్లర్ అయిన విఠల్‌రావు(ప్రకాష్‌రాజ్)కి చెందినది. దివాకర్ ఆ బ్యాగ్‌ని తీసుకెళ్ళాడని తెలుసుకున్న విఠల్.. దివాకర్ కొడుకు వాసు(అమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేస్తాడు. ఆ బ్యాగ్ తెచ్చి ఇచ్చి నీ కొడుకును తీసుకెళ్ళు అని బేరం మొదలు పెడతాడు విఠల్. ఒక పబ్‌కి ఓనర్ అయిన విఠల్‌కి ఆ బ్యాగ్‌ని ఇవ్వడానికి ఆ పబ్‌కి వెళ్తాడు దివాకర్. విఠల్ డిమాండ్ చేసినట్టుగా ఆ బ్యాగ్‌ని అతనికి అప్పగించి దివాకర్ తన కొడుకుని విడిపించుకోగలిగాడా? ఈ మధ్యలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? వాటి నుంచి దివాకర్ బయట పడగలిగాడా? తన కొడుకుని రక్షించుకోగలిగాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఒక్కమాటలో చెప్పాలంటే కిడ్నాప్ చేసిన కొడుకుని తండ్రి ఎలా రక్షించాడనేదే కథ. అయితే ఈ సినిమాలో కథ కంటే కథనానికి ఎక్కువ ప్రాధాన్యత వుంది. దాదాపు సినిమా అంతా ఒక పబ్‌లోనే జరుగుతుంది. అయినా ప్రతి సీన్‌ని ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూపించడమే కాకుండా కథలో ఆడియన్స్‌ని బాగా ఇన్‌వాల్వ్ చెయ్యగలిగాడు డైరెక్టర్ రాజేష్. సినిమా స్టార్ట్ అయిన పది నిముషాల్లోనే అసలు కథలోకి వెళ్ళి నెక్స్‌ట్ ఏం జరగబోతోందనే విషయం మనకు తెలిసినట్టుగానే అనిపించినా అది ఎలా జరుగుతుందో చూడాలన్న క్యూరియాసిటీని కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ చిన్న పాయింట్‌కి కమల్‌హాసన్ అందించిన స్క్రీన్‌ప్లే ప్రాణమని చెప్పాలి. సినిమా మొదలైనప్పటి నుంచి కథలో గ్రిప్పింగ్ అనేది పోకుండా ఆడియన్స్‌ని తన స్క్రీన్‌ప్లేతో మెస్మరైజ్ చేశాడు కమల్. ప్రతి సీన్ ఆడియన్స్‌ని టెన్షన్ పెట్టే విధంగా మలచడంలో కమల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.
కమల్‌హాసన్ ఈ సినిమాలో తన వయసుకి తగిన పాత్ర చేశాడు. గ్లామర్‌గా కనిపించాలి అనే ఆలోచన కంటే పాత్రే ఆడియన్స్‌కి కనిపించాలన్న తపన దివాకర్ క్యారెక్టరైజేషన్‌లో, బాడీ లాంగ్వేజ్‌లో తెలిసిపోతుంది. కమల్ ఎంతో ఇన్‌వాల్వ్ అయి ఈ క్యారెక్టర్‌ని చేశాడు. నార్కోటిక్ ఆఫీసర్ మల్లికగా త్రిష ఇప్పటి వరకు చెయ్యని ఒక కొత్త తరహా క్యారెక్టర్ చేసిందని చెప్పాలి. క్యారెక్టర్‌లో పూర్తిగా ఒదిగిపోయి నటించింది. ఇక స్మగ్లర్స్‌గా ప్రకాష్‌రాజ్, సంపత్‌రాజ్ ఎప్పటిలాగే తమ తమ క్యారెక్టర్స్‌కి న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. వాసుగా అమన్ అబ్దుల్లా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. మరో నార్కొటిక్స్ ఆఫీసర్‌గా కిశోర్ కూడా ఓకే అనిపించాడు.
ఎంత మంచి సినిమా అయినా, కమర్షియల్‌గా ఎంత సక్సెస్ అయిన సినిమా అయినా అందులో ప్లస్‌లు వుంటాయి, మైనస్‌లు వుంటాయి. అలాగే ఈసినిమాలో కూడా మైనస్‌లు చాలా వున్నాయి. రెండు గంటల పది నిముషాల సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా త్వరగా కంప్లీట్ అయిన ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే కావాలనే ఫస్ట్ హాఫ్ డ్యురేషన్ తగ్గించారని, సెకండాఫ్ నిడివి ఎక్కువ వుందని సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్‌కి అర్థమవుతుంది. దానికితోడు ఫస్ట్ హాఫ్‌లో వున్న స్పీడ్ సెకండాఫ్‌లో లేకపోవడం, కథ ఓ కొలిక్కి రాకుండా సాగ దీయడం, క్లైమాక్స్‌కి వచ్చేస్తుందనుకున్న తరుణంలో కథను మరో మలుపు తిప్పడం, సినిమా అంతా ఒకే లొకేషన్‌లో చేయడం వల్ల ఆడియన్స్ విపరీతమైన బోర్ ఫీల్ అవుతారు. హీరో తన కొడుకుని విడిపించుకొని వెళ్ళిపోతే మేం ఇంటికి వెళ్ళిపోతాం అని ఆడియన్స్ క్లైమాక్స్ కోసం ఎదురుచూసేలా చేసింది సెకండాఫ్. తీపి అంటే ఎంత ఇష్టం వున్నా, తినగా తినగా మొహం మొత్తుతుంది. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు అన్ని సీన్స్‌ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్‌కి సెకండాఫ్‌లో కూడా అవే సీన్స్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తే బోర్ కొట్టడం ఖాయమే కదా. ఓవరాల్‌గా చెప్పాల్సొస్తే ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చే సినిమా చీకటిరాజ్యం. సినిమాటోగ్రాఫర్ వర్గీస్‌కి ఈ సినిమాలోని ప్రతి షాట్ ఒక ఛాలెంజ్‌లాగే అనిపించి వుంటుంది. పబ్‌లోని కిచెన్‌లో, ఇరుకుగా వుండే గదుల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు తియ్యడం ఎంత కష్టమైన పనో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ విషయంలో సినిమాటోగ్రాఫర్‌ని, ఫైట్‌మాస్టర్‌ని మెచ్చుకొని తీరాలి. అలాగే జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ రాజేష్ గురించి చెప్పాలంటే ఈ కొత్త తరహా కథని, గ్రిప్పింగ్‌గా వున్న కమల్‌హాసన్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్‌లో మరి కాస్త జాగ్రత్త తీసుకొని వుంటే సినిమా ఇంకా స్పీడ్‌గా వుండేది.
లవ్ స్టోరీలు, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు, హార్రర్ థ్రిల్లర్లు, హార్రర్ కామెడీలు చూసి చూసి అలసిపోయిన ఆడియన్స్‌కి చీకటిరాజ్యం ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి సినిమా చూడాలంటే ప్రేక్షకులకు కాస్త ఓపిక ఎక్కువే వుండాలి. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో కొన్ని మైనస్‌లు వున్నప్పటికీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు చీకటిరాజ్యం తప్పకుండా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్: డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్
సినీజోష్ రేటింగ్: 2.75/5