Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: త్రిపుర


క్రేజీ మీడియా 

Advertisement
CJ Advs

త్రిపుర 

తారాగణం: స్వాతి, నవీన్‌చంద్ర, రావు రమేష్‌, సప్తగిరి, 

పూజ రామచంద్రన్‌, ధన్‌రాజ్‌, జె.పి., షకలక శంకర్‌, 

శివన్నారాయణ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రవికుమార్‌ సానా 

మాటలు: రాజా 

స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, వెలిగొండ శ్రీనివాస్‌ 

సంగీతం: కామ్రాన్‌ 

ఎడిటింగ్‌: ఉపేంద్ర 

సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు 

నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్‌ 

కథ, దర్శకత్వం: రాజకిరణ్‌ 

విడుదల తేదీ: 06.11..2015 

హార్రర్‌ చిత్రాల విజయ పరంపర కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మరో హార్రర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్‌ పాత్రలో స్వాతి నటించిన త్రిపుర చిత్రాన్ని ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్‌ నిర్మించారు. అంజలితో గీతాంజలి వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన రాజకిరణ్‌ తన రెండో చిత్రాన్ని కూడా హార్రర్‌ కథాంశంతోనే చేశాడు. మరి ఈ త్రిపుర చిత్రం ఆడియన్స్‌ని భయపెట్టేందుకు ఎలాంటి కథని సెలెక్ట్‌ చేసుకున్నాడు? త్రిపురగా స్వాతి ఎంతవరకు మెప్పించింది? హార్రర్‌ కామెడీ చిత్రాలకు నీరాజనాలు పడుతున్న ప్రేక్షకులు త్రిపుర చిత్రాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

ఓ మర్డర్‌తో సినిమా ఓపెన్‌ అవ్వడంతోనే చనిపోయిన అమ్మాయి తాలూకు ఆత్మ కథే ఈ సినిమా అనేది ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. కట్‌ చేస్తే ఓ అందమైన పల్లెటూరులో వుండే త్రిపుర(స్వాతి)కి వచ్చే కలలు నిజమవుతూ వుంటాయి. తమకు సంబంధించిన కలలు ఏమైనా వచ్చాయా అని తెలుసుకునేందుకు ఆమె దగ్గరికి చాలా మంది వచ్చి పోతుంటారు. దీంతో త్రిపురకు పెళ్ళి చేయడం ఆమె తండ్రి శివన్నారాయణకు సమస్యగా మారుతుంది. ఏ సంబంధం వచ్చినా దాన్ని చెడగొట్టి పంపిస్తుంది త్రిపుర. ఆమెకు వున్న విపరీత లక్షణాలకు ట్రీట్‌మెంట్‌ తీసుకునేందుకు త్రిపుర ఫ్యామిలీ హైదరాబాద్‌ బయల్దేరుతుంది. తనకు ట్రీట్‌మెంట్‌ చేసే డాక్టర్‌ నవీన్‌చంద్రతో ప్రేమలో పడుతుంది త్రిపుర. కట్‌చేస్తే ఇద్దరికీ పెళ్ళి. వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. ఇదిలా వుంటే సినిమా ఓపెనింగ్‌ సీన్‌లో మర్డర్‌కి గురైంది నవీన్‌ కొలీగ్‌ ఈషా(పూజ రామచంద్రన్‌). ఈ కేసును నవీన్‌, ఈషా కామన్‌ ఫ్రెండ్‌ అయిన తిలక్‌ ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. నవీన్‌కి, ఈషాకి వున్న ఫ్రెండ్‌షిప్‌ని దృష్టిలో పెట్టుకొని నవీన్‌ని అనుమానిస్తాడు తిలక్‌. ఈషా హత్య విషయంలో పోలీస్‌ ఆఫీసర్‌ తిలక్‌ నవీన్‌ని టార్గెట్‌ చెయ్యడానికి కారణం ఏమిటి? ఈషా హత్య గురించి త్రిపురకు కలలు వచ్చాయా? నవీన్‌కి, ఈషాకి సంబంధం వుందన్న విషయం తెలుసుకున్న త్రిపుర రియాక్షన్‌ ఏమిటి? చివరికి ఈషాను హత్య చేసిన వాడిని పోలీసులు కనిపెట్టగలిగారా? అనేది మిగతా కథ. 

త్రిపురగా స్వాతి బాగా భయపెడుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేసిన వారు డిజప్పాయింట్‌ అవ్వక తప్పదు. స్వాతిని లంగా ఓణీల్లో, చీరల్లో వీలైనంత గ్లామర్‌గా చూపించడానికే ఎక్కువ ప్రయత్నించారు. నిజానికి క్లైమాక్స్‌లో త్రిపురలో ఆత్మ ప్రవేశించిన తర్వాత కేవలం రెండు నిముషాలు మాత్రమే అలా కనిపిస్తుంది తప్ప మిగతా సినిమా అంతా నార్మల్‌గానే వుంటుంది. ఆ రెండు నిముషాలకు సంబంధించిన స్టిల్స్‌నే ప్రతి పోస్టర్‌లో వాడడం వల్ల సినిమా అంతా హార్రర్‌ మయం అనుకునే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. త్రిపుర భయపెట్టేది కాదు, ఒక మంచి హౌస్‌ వైఫ్‌ అని మాత్రమే చెప్పొచ్చు. నవీన్‌చంద్ర గురించి చెప్పాలంటే లవ్‌ సీన్స్‌లో ఎంత రొమాంటిక్‌గా చేశాడో, ఈషా విషయంలో ఇరిటేట్‌ అవ్వడంలోగానీ, త్రిపురను ఇరిటేట్‌ చేసే సన్నివేశాల్లోగానీ బాగా చేశాడు. ప్రొఫెసర్‌గా నటించిన రావు రమేష్‌ కలలకు సంబంధించిన విషయాలు చెప్పడానికి, ఈషా హత్య అతనే చేశాడా అనే అనుమానం కలిగించడానికి తప్ప అతని క్యారెక్టర్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. హార్రర్‌తోపాటు కామెడీ కూడా వుండాలన్న ఉద్దేశంతో క్రియేట్‌ చేసిన సప్తగిరి క్యారెక్టర్‌ మధ్య మధ్యలో వచ్చి హడావిడి చేసేసి కాస్త నవ్వించి వెళ్తుంటుంది. అతనికితోడు ధన్‌రాజ్‌, సప్తగిరి, జె.పి. షకలక శంకర్‌ తమ శాయశక్తులా నవ్వించే ప్రయత్నం చేశారు. 

సినిమాకి సంబంధించిన కథ, కథనాలు ఎలా వున్నా రవికుమార్‌ సానా ఫోటోగ్రఫీ మాత్రం డీసెంట్‌గా అనిపిస్తుంది. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ప్రతి సీన్‌ని అందంగా చూపించాడు. హార్రర్‌ మూవీలో కనిపించే రొటీన్‌ షాట్‌లు చాలా వున్నప్పటికీ ఓవరాల్‌గా ఫోటోగ్రఫీ బాగుంది. కామ్రాన్‌ పాటలు పర్వాలేదనింపించింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అక్కడక్కడా ఎఫెక్టివ్‌గా వుంది. రాజా రాసిన మాటలు చాలా స 

సాదా సీదాగా వున్నాయి. అక్కడక్కడ నవ్వు తెప్పించేలా కూడా వున్నాయి. డైరెక్టర్‌ రాజకిరణ్‌ విషయానికి వస్తే దాదాపు అన్ని హార్రర్‌ సినిమాల్లోలాగే ఒక మర్డర్‌తో సినిమా స్టార్ట్‌ అయినా ఈ సినిమా దారి వేరుగా వుంటుందని అందరూ అనుకుంటారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ హీరోయిన్‌కి ఆవహించే కథగా కాకుండా హీరోయిన్‌కి ఒక విచిత్రమైన శక్తి వుందని, జరిగినవిగానీ, జరగబోయేవిగానీ ఆమె కల కంటుందని చెప్పడంతో ఆ దిశగా కథ వెళ్తుందని అందరూ భావిస్తారు. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తాన్ని అలాగే రన్‌ చేసి హీరోయిన్‌కి పెళ్ళి కాగానే ఆ కలల విషయాన్ని పక్కన పెట్టేసి ఈషా మర్డర్‌పై కాన్‌సన్‌ట్రేట్‌ చేశాడు డైరెక్టర్‌. అంటే అప్పటివరకు కలల గురించి అతను చెప్పిన విషయాలు, చూపించిన సీన్స్‌ అన్నీ వృధా అయినట్టే. అయితే క్లైమాక్స్‌ తర్వాత ఈషా మర్డర్‌కి సంబంధించిన కలల గురించి ప్రస్తావించినప్పటికీ అది ఏమాత్రం ఎఫెక్టివ్‌గా అనిపించదు. తన మొదటి చిత్రం గీతాంజలి కథ విషయంలో రాజకిరణ్‌కి వున్న గ్రిప్‌ ఈ సినిమా కథ విషయంలో కనిపించదు. అసలు కథ కంటే అనవసరమైన సీన్స్‌, కామెడీతో సాగదీసే ప్రయత్నం చేశాడు. హార్రర్‌ సినిమా అనగానే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తులు విచిత్రంగా కనిపించడం, అంతకంటే విచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా యధాతథంగా ప్రీతి నిగమ్‌కి అలాంటి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌ చేసే విన్యాసాలతో చాలా టైమ్‌ వేస్ట్‌ చేసేశాడు. 

త్రిపుర అనే సినిమా పూర్తి హార్రర్‌ మూవీ అని థియేటర్‌కి వెళ్ళే వారికి మాత్రం నిరాశ తప్పదు. మర్డర్‌తో స్టార్ట్‌ అయ్యే సినిమాని ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరోయిన్‌కి వచ్చే కలల గురించి, ఆమెకు వచ్చే పెళ్ళి సంబంధాల గురించి చూపిస్తూ వచ్చాడు డైరెక్టర్‌. మధ్య మధ్య సప్తగిరి, ధన్‌రాజ్‌ కామెడీ, హీరో, హీరోయిన్‌ మధ్య రొమాన్స్‌ వంటి సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపించాడు. త్రిపుర తనకు వచ్చే కలలతో సెకండాఫ్‌ థ్రిల్‌ చేస్తుందని ఆశించిన ఆడియన్స్‌ షాక్‌ అవుతారు. కథను మర్డర్‌ మిస్టరీ వైపు మళ్ళించి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌తోనే కాలయాపన చేశాడు డైరెక్టర్‌. తను మొదట్లో ఎత్తుకున్న కాన్సెప్ట్‌ని వదిలేసి ఈషా అనే క్యారెక్టర్‌ మర్డర్‌ ఎలా జరిగింది? ఎవరు చేశారు? అనే విషయంపైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేశాడు. ఆ మర్డర్‌ ఎవరు చేశారు అనేది కామన్‌ ఆడియన్‌కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్‌ ఇచ్చినప్పటికీ అలాంటివి చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. త్రిపుర ఒక హార్రర్‌ మూవీగా కాకుండా ఒక మర్డర్‌ని ఛేదించే సినిమాగా చెప్పుకోవచ్చు. చక్కని ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌, స్వాతి, నవీన్‌చంద్రల రొమాన్స్‌, అక్కడక్కడా కమెడియన్స్‌ అందించే కామెడీతో సినిమా నడుస్తుంది. కంటెంట్‌ పరంగాగానీ, లాజిక్‌ పరంగాగానీ ఎలాంటి ఆలోచన లేకుండా థియేటర్‌కి వెళ్తే సినిమాని ఎంజాయ్‌ చెయ్యొచ్చు. అయితే త్రిపుర మాత్రం ఆడియన్స్‌ని భయపెట్టడంలో సక్సెస్‌ అవ్వలేదు. ఈమధ్యకాలంలో వచ్చిన హార్రర్‌ థ్రిల్లర్స్‌, హార్రర్‌ కామెడీ మూవీస్‌ లిస్ట్‌లోకి త్రిపుర చేరదన్నది మాత్రం నిజం. 

ఫినిషింగ్‌ టచ్‌: భయపెట్టలేకపోయిన త్రిపుర 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs