Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కేటుగాడు


వెంకటేష్‌ మూవీస్‌ 

Advertisement
CJ Advs

కేటుగాడు 

తారాగణం: తేజస్‌, చాందిని చౌదరి, రాజీవ్‌ కనకాల, 

సుమన్‌, ప్రవీణ్‌, అజయ్‌, సప్తగిరి, పృథ్వి తదితరులు 

సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్‌ జోషి 

ఎడిటింగ్‌: పాశం వెంకటేశ్వరరావు 

సంగీతం: సాయికార్తీక్‌ 

మాటలు: పి.రాజశేఖరరెడ్డి, భాషాశ్రీ 

సమర్పణ: వి.ఎస్‌.పి.తెన్నేటి 

నిర్మాత: వెంకటేష్‌ బాలసాని 

రచన, దర్శకత్వం: కిట్టు నల్లూరి 

విడుదల తేదీ: 18.09.2015 

ప్రకాష్‌రాజ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఉలవచారు బిర్యాని చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన తేజస్‌ హీరోగా, కొన్ని షార్ట్‌ ఫిలింస్‌లో నటించిన చాందిని చౌదరి హీరోయిన్‌గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కేటుగాడు. ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ఈ కేటుగాడు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ ఏం చేశాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: చందు(తేజస్‌), ప్రవీణ్‌(ప్రవీణ్‌) ఇద్దరూ స్నేహితులు. పార్క్‌ చేసి వున్న కార్లను దొంగిలించి అమ్మేయడం వీరి వృత్తి. అలా ఓ ధాబా దగ్గర పార్క్‌ చేసిన కార్‌ని తీసుకొని ఉడాయిస్తాడు చందు. వెంటనే పోలీసులు ఆ కారుని ఛేజ్‌ చేస్తారు. ఆ వెంటనే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ ప్రకాష్‌(రాజీవ్‌ కనకాల) చెల్లెలు అకిర(చాందిని చౌదరి) కిడ్నాప్‌ అయిందని, ఆ అమ్మాయిని చందు అనే వ్యక్తి కిడ్నాప్‌ చేశాడని టి.వి.లో ఫోటోలతో సహా టెలికాస్ట్‌ అవుతుంది. పోలీసుల నుంచి నుంచి తప్పించుకున్న చందు ఆ కారు డిక్కీలో ఓ అమ్మాయి వున్నట్టు తెలుసుకుంటాడు. కొన్నిరోజుల క్రితం తను ఓ పార్టీలో చూసి లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నట్టుగా ప్రేమించిన అమ్మాయే కారు డిక్కీలో కనిపించడంతో షాక్‌ అవుతాడు. టి.వి.లో తన ఫోటో చూసుకున్న చందు, కిడ్నాప్‌ చేసింది తను కాదని చెప్పడానికి ప్రకాష్‌కి ఫోన్‌ చేస్తాడు. అయితే తన చెల్లెల్ని కిడ్నాప్‌ చేయించింది తనేనని ప్రకాష్‌ చెప్పడంతో చందుతోపాటు అకిర కూడా షాక్‌ అవుతుంది. తనని ప్రాణంగా ప్రేమించే అన్నయ్య కిడ్నాప్‌ చేయించే ఛాన్సే లేదని చెప్తుంది అకిర. మరి ప్రకాష్‌ ఆ కిడ్నాప్‌ తనే చేశానని ఎందుకు చెప్పాడు? అకిరను ప్రకాష్‌ కిడ్నాప్‌ చేయించింది ఆస్తి కోసమా? మరేదైనా కారణం వుందా? ఈ కిడ్నాప్‌ వెనుక అసలు మిస్టరీ ఏమిటి? తను ప్రేమించిన అమ్మాయిని కిడ్నాపర్ల బారి నుంచి చందు కాపాడగలిగాడా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: కార్లను దొంగిలించి అమ్ముకుని ఎంజాయ్‌ చేసే మాస్‌ క్యారెక్టర్‌లో తేజస్‌ ఓకే అనిపించాడు. తన క్యారెక్టర్‌లో ఎక్కువగా వేరియేషన్స్‌ లేకపోవడం వల్ల తన లిమిట్స్‌లో తను పెర్‌ఫార్మ్‌ చేశాడు. హీరోయిన్‌ చాందిని చౌదరి లుక్స్‌ పరంగా బాగానే వున్నప్పటికీ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా స్టార్టింగ్‌ నుంచి విలన్‌గా ఎస్టాబ్లిష్‌ అయిన రాజీవ్‌ కనకాల తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. హీరో ఫ్రెండ్‌గా నటించిన ప్రవీణ్‌, హీరో, హీరోయిన్‌తోపాటు ట్రావెల్‌ చేసే సప్తగిరిలకు ఆ క్యారెక్టర్లు కొట్టిన పిండి కావడంతో ఎప్పటిలాగే తమ శక్తిమేర నవ్వించే ప్రయత్నం చేశారు. సుమన్‌ది చాలా చిన్న క్యారెక్టర్‌ అయినా కనిపించిన కాసేపు డిగ్నిఫైడ్‌గా నటించాడు. స్టోరీని మలుపు తిప్పే కీ రోల్‌ చేసిన అజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తుంది. పృథ్వి, ప్రభాస్‌ శ్రీను, రఘు కారుమంచి చాలా రొటీన్‌ క్యారెక్టర్లు చేశారు. 

టెక్నీషియన్స్‌: ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌ చాలా వరకు హెల్ప్‌ అయ్యాయని చెప్పాలి. మల్హర్‌భట్‌ జోషి ఫోటోగ్రఫీ ఆద్యంతం బాగుంది. సాయికార్తీక్‌ పాటలను ఓకే అనిపించాడు. అయితే రీరికార్డింగ్‌ బెటర్‌గా చేశాడు. డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థలో కొన్ని చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన కిట్టు నల్లూరి మొదటి ప్రయత్నంగా చేసిన ఈ సినిమాలో కొన్ని లూప్‌హోల్స్‌ వున్నప్పటికీ డైరెక్టర్‌గా చాలా సందర్భాల్లో సక్సెస్‌ అయినట్టు కనిపించాడు. ఒక కిడ్నాప్‌ వెనుక మిస్టరీని ఛేదించడానికి హీరో బయలుదేరడం అనేది చాలా సినిమాల్లో చూస్తున్న విషయమే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ అన్నయ్యే కిడ్నాపర్‌ అని చివరి వరకు సస్పెన్స్‌ మెయిన్‌ టెయిన్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కిడ్నాప్‌ వెనుక అసలు కథను రివీల్‌ చెయ్యడంలో కూడా తెలివితేటల్ని ప్రదర్శించాడు. ఇక ఆర్టిస్టులందరి నుంచి మంచి ఔట్‌పుట్‌ని రాబట్టుకోగలిగాడు. అయితే కొన్ని అవనసరమైన సీన్స్‌, సప్తగిరితో చేయించిన నవ్వు రాని సీన్స్‌ ఆడియన్స్‌కి బోర్‌ కొట్టించాయి. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమైన వెంకటేష్‌ బాలసాని నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని ఔట్‌పుట్‌ చూస్తే తెలుస్తుంది. 

విశ్లేషణ: కార్ల దొంగ ఒక పార్టీలో చూసిన అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత తను దొంగతనం చేసిన కార్లోనే ఆ అమ్మాయి ప్రత్యక్షం కావడం, ఆ కిడ్నాప్‌ కేసు తనకు చుట్టుకోవడం, దాని నుంచి తనను తాను రక్షించుకోవాలని చూడడం, ఆ తర్వాత తను ప్రేమించిన అమ్మాయి ప్రాబ్లమ్‌లో వుంటే తన స్వార్థం చూసుకోకూడదని రియలైజ్‌ అయి అమ్మాయిని రక్షించడానికి హీరో రెడీ అవడంతో ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అవుతుంది. అలా ఫస్ట్‌ హాఫ్‌ని ఫర్వాలేదు అనిపించేలా చేసిన డైరెక్టర్‌ సెకండాఫ్‌లో ఆ గ్రిప్‌ని కంటిన్యూ చెయ్యలేకపోయాడు. కిడ్నాప్‌ వెనుక వున్న మిస్టరీ ఏమిటో చెప్పడానికి చాలా టైమ్‌ తీసుకున్నాడు. కథ ఓ ఫ్లోలో వెళ్తుంటే మధ్య వచ్చే కామెడీ సీన్స్‌, పాటలు ఆడియన్స్‌ని కథలో ఇన్‌వాల్వ్‌ అవ్వకుండా చేశాయి. సినిమాకి కేటుగాడు అనే టైటిల్‌ పెట్టి హీరోని చాలా సాఫ్ట్‌గా చూపించడం కూడా ఆడియన్స్‌కి రుచించదు. అతను చేసిన పనుల వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ కలగదు. పైగా హీరోయిన్‌ని కాపాడడానికి ముందుకొస్తాడు. కేటుగాడు అనే టైటిల్‌కి సినిమాలో సరైన జస్టిఫికేషన్‌ కనిపించదు. సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచి ఎండ్‌ అయ్యే వరకు సహజత్వానికి దూరంగా వుండే సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఇక కిడ్నాప్‌ వెనుక వున్న మిస్టరీ తెలిసిన తర్వాత కథని క్లైమాక్స్‌కి తీసుకు రావడానికి ఎన్నో ఛేజ్‌లు, మరెన్నో ట్విస్ట్‌లు అవసరమయ్యాయి. క్లైమాక్స్‌కి వచ్చిన కథని ఒక సాధారణమైన ఫైట్‌తో ముగించి కథను సుఖాంతం చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే రెగ్యులర్‌గా ఆడియన్స్‌ కోరుకునే కామెడీ, పాటలు, ఫైట్స్‌ అనుకున్న స్థాయిలో లేకపోవడం, కథలో మంచి ట్విస్ట్‌ వున్నప్పటికీ కథనంలో అనవసరమైన సీన్స్‌ని జొప్పించడం వల్ల ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునే అవకాశాలు తక్కువ. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆడియన్స్‌ని ఏమార్చలేకపోయిన కేటుగాడు 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs