సర్వంత్‌రామ్ క్రియేషన్స్, సాయిచంద్ర ఫిలింస్
జయసూర్య
తారాగణం: విశాల్, కాజల్, సముద్ర ఖని,
హరీష్ ఉత్తమన్, సూరి, మురళీశర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్
ఎడిటింగ్: ఆంటోని
సంగీతం: డి.ఇమాన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు
నిర్మాతలు: జి.నాగేశ్వరరెడ్డి, ఎస్.నరసింహప్రసాద్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుశీంద్రన్
విడుదల తేదీ: 04.09.2015
పందెంకోడి చిత్రంతో మాస్ యాక్షన్ హీరోగా తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విశాల్ ఆ తర్వాత చాలా సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జయసూర్యగా మన ముందుకు వచ్చాడు. నాపేరు శివ వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తన మిత్రుడు ఎస్.నరసింహప్రసాద్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విశాల్‌కి ఎలాంటి ఫలితాన్నిచ్చింది? సుశీంద్రన్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్ వచ్చిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: జయసూర్య(విశాల్) వైజాగ్‌లో ఒక పోలీస్ ఆఫీసర్. అతని తాత ప్రముఖ రాజకీయ నాయకుడు తాతలాగ తను కూడా నాయకుడిగా ఎదగాలని కలలు కనే మనవడు శ్రీను(సముద్రఖని). జయసూర్య ఫ్యామిలీ గుంటూరులో వుంటుంది. గుంటూరులో బాగా పేరు మోసిన భవానీ గ్యాంగ్ బిజినెస్ మెన్ పాలిట సింహస్వప్నంగా మారుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు పంపించమని బెదిరిస్తుంటారు. కాదన్న వారిని చంపేస్తుంటారు. వారి ఆటలు కట్టించడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దించిన అల్బర్ట్(హరీష్ ఉత్తమన్)ని చంపేస్తుంది ఆ గ్యాంగ్. దాంతో భవానీ గ్యాంగ్‌ని అంతం చేసేందుకు అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది డిపార్ట్‌మెంట్. ఆ మిషన్ కోసం వైజాగ్ నుంచి గుంటూరు వస్తాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయసూర్య(విశాల్). ఓ పక్క అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూనే సౌమ్య(కాజల్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు జయసూర్య. భవానీ గ్యాంగ్‌లోని అందర్నీ లేపేసి క్లియర్ చేస్తాడు. కానీ, ఈ గ్యాంగ్ మెయిన్ పర్సన్ వేరే వున్నాడని తెలుస్తుంది. దాంతో గుంటూరు ఏరియాలోనే స్పెషల్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకొని ఎంక్వయిరీ మొదలెడతాడు. ఈ క్రమంలో ఆ గ్యాంగ్‌కి మెయిన్ లీడర్ జయసూర్య అన్నయ్య శ్రీను అనేది ఆడియన్స్‌కి రివీల్ అవుతుంది. తమ్ముడి పక్కన వుంటూనే ఎంక్వయిరీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటూ అతనికి దొరక్కుండా తప్పించుకుంటూ వుంటాడు శ్రీను. ఈ క్రమంలో చాలా మంది బిజినెస్‌మేన్ ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో జయసూర్య శ్రీనుని కనిపెట్టగలిగాడా? మెయిన్ లీడర్ తన అన్నయ్య అని తెలిసిన తర్వాత జయసూర్య ఎలా ఫీల్ అయ్యాడు? ఎన్నో నేరాలకు పాల్పడ్డ అన్నయ్యకు ఎలాంటి శిక్ష వేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: పోలీస్ ఆఫీసర్‌గా గతంలో విశాల్ నటించినప్పటికీ ఇదొక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో చేసిన సబ్జెక్ట్ కావడం వల్ల అతనికి ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్‌ని పెర్‌ఫార్మ్ చెయ్యడంలో విశాల్ కొత్తగా చేసిన రిస్కేమీ లేదు. గతంలో అతను చేసిన సినిమాల్లోని పెర్‌ఫార్మెన్స్‌లాగే వుంది. విశాల్‌కి అన్నయ్యగా, విలన్‌గా నటించిన సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ పక్క అన్నయ్యగా, ఇంటికి పెద్ద కొడుకుగా వుంటూనే మరో పక్క ఒక గ్యాంగ్‌కి లీడర్‌గా నేరాలు చేస్తూ వుండే క్యారెక్టర్‌ని చాలా ఎక్స్‌లెంట్‌గా చేశాడు. ఈ సినిమాకి సముద్రఖని పెర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా చెప్పొచ్చు. కాజల్ హీరోయిన్‌గా తన క్యారెక్టర్ తను చేసుకుంటూ వెళ్ళింది. అవసరమైనప్పుడు హీరోతో కలిసి స్టెప్పులేసింది తప్ప అంతకుమించి ఆమె క్యారెక్టర్‌కి అంత ప్రాధాన్యత లేదు. శ్రీను గ్యాంగ్‌లో ముఖ్యమైన వ్యక్తి లాలాగా మురళీశర్మ కూడా బాగానే చేశాడు. ఐటమ్ సాంగ్‌లో కనిపించిన నిఖిత తన అందాలతో ఆకట్టుకోలేకపోయింది.
టెక్నీషియన్స్: వేల్‌రాజ్ ఫోటోగ్రఫీ ఎక్కువ ఆర్భాటాలకు, ఎక్కువ లైటింగ్స్‌కి వెళ్ళకుండా నేచురల్‌గా ప్రతి సీన్‌ని చూపించే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ మ్యూజిక్ బాగుంది. ఉన్న నాలుగు పాటలూ బాగున్నాయి. అలాగే వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంది. దానికి తగ్గట్టుగానే ఇమాన్ మంచి మ్యూజిక్ చేశాడు. అయితే అక్కడక్కడా మోతాదు మించి మోతగా అనిపించింది. ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్టర్ సుశీంద్రన్ ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే అసలైన నేరస్థుడు వుంటూ సినిమా చివరి వరకు రివీల్ కాకపోవడం అనేది మనం చాలా సినిమాల్లో చూశాం. దాన్ని ఈ సినిమాలో కూడా అలాగే చూపించే ప్రయత్నం చేశాడు తప్ప కొత్తగా చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. హీరో అన్నయ్యే అసలు విలన్ అని ఫస్ట్ హాఫ్‌లో రివీల్ అవ్వలేదు. దాంతో ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ సీన్స్‌తో, పాటలతో సినిమాలో ఏమీ లేదు అనిపించేలా చేశాడు. సముద్రఖని ఎంటర్ అయ్యాక సినిమా స్పీడ్ అందుకొని క్లైమాక్స్ వరకు వెళ్తుంది. సెకండాఫ్ చేసినంత గ్రిప్పింగ్‌గా ఫస్ట్ హాఫ్ చెయ్యలేకపోయాడు సుశీంద్రన్. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే డబ్బింగ్ చాలా చీప్‌గా చేశారు. డి గ్రేడ్ సినిమాల డబ్బింగ్ కూడా అంత వీక్‌గా వుండదు. ఒకొక్కక్కరి వాయిస్ ఒక్కో సౌండింగ్‌తో వినిపిస్తూ విసిగిస్తుంది. డబ్బింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది.
విశ్లేషణ: యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాదా సీదా కథతో రూపొందిన చిత్రమిది. గతంలో విశాల్ చేసిన సినిమానే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. పెర్‌ఫార్మెన్స్ పరంగా విశాల్ కొత్తగా కనిపించడు. పైగా విశాల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ కూడా చాలా తక్కువ. పెర్‌ఫార్మెన్స్ పరంగా సముద్రఖనికి ఎక్కువ మార్కులు పడతాయి. సినిమాలో కామెడీ పార్ట్ లేకపోవడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీరియస్‌గా వుండడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ఆడియన్స్‌కి నిరాశ ఎదురవుతుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ సీన్స్, రొటీన్ సాంగ్స్‌తో రన్ అవుతుంది. సెకండాఫ్ సినిమా స్పీడ్ అందుకొని ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెడుతుంది. క్లైమాక్స్‌లో హీరో, అతని అన్నయ్య, తండ్రి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో నిండిన ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్‌కి మాత్రమే నచ్చే అవకాశం వుంది.
ఫినిషింగ్ టచ్: రొటీన్ పోలీస్ స్టోరీ
సినీజోష్ రేటింగ్: 2.5/5