నందమూరి తారక రామారావు ఆర్ట్స్
కిక్-2
నటీనటులు: రవితేజ, రకుల్ ప్రీత్, రవికిషన్,
కబీర్‌సింగ్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి,
ఆశిష్ విద్యార్థి, పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఎడిటింగ్: గౌతంరాజు
కథ, మాటలు: వక్కంతం వంశీ
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
విడుదల తేదీ: 21.08.2015
రవితేజ అంటే మాస్ ప్రేక్షకుల హీరో. హీరోయిజం చూపిస్తూనే కామెడీని కూడా పండించే కథానాయకుడు. రవితేజ సినిమా వస్తోందంటే కామెడీతోపాటు యాక్షన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. కొన్ని అపజయాల తర్వాత 'పవర్'తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు 'కిక్2' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2009లో వచ్చిన 'కిక్' రవితేజ కెరీర్‌లో పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు. అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి కిక్ ఇచ్చిన ఆ సినిమాకి సీక్వెల్‌గా ఈరోజు విడుదలైన 'కిక్2' ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకోగలిగింది? రవితేజ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఏమేర ఆకట్టుకోగలిగాడు? 'రేసుగుర్రం' తర్వాత సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ 'కిక్2' ఆడియన్స్‌కి ఎలాంటి కిక్‌నిచ్చింది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ: తను చేసే ప్రతి పనిలోనూ కిక్‌ని వెతుక్కునే కళ్యాణ్ లవర్ కోసం పోలీస్ ఆఫీసర్ అయ్యాడు 'కిక్' సినిమాలో. ఆ తర్వాత యు.ఎస్.లో సెటిల్ అయ్యాడు. దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో మాత్రం కళ్యాణ్ కొడుకు రాబిన్‌హుడ్ కంఫర్ట్ కోసం వెతుకుతుంటాడు. తను కంఫర్ట్‌గా వుండడం కోసం ఎదుటివారిని కూడా ఇబ్బంది పెడుతుంటాడు. ఆ కంఫర్ట్ కోసం డాక్టర్ అయిన రాబిన్‌హుడ్ యు.ఎస్.లో ఒక హాస్పిటల్ కట్టించాలనుకుంటాడు. అది కట్టాలంటే ఇండియాలో వున్న ప్రాపర్టీ అమ్మి కట్టాలి. ఆ ప్రాపర్టీ దుర్గ(ఆశిష్ విద్యార్థి) అనే వ్యక్తి కబ్జాలో వుంటుంది. ఆ ప్రాపర్టీని విడిపించుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. ఒక పథకం ప్రకారం దుర్గకి, అతని మనుషులకు దేహశుద్ది చేసి తన ఆస్తిని దక్కించుకుంటాడు. కట్ చేస్తే అది బీహార్‌లోని విలాస్‌పూర్ గ్రామం. అక్కడ సోలమన్ సింగ్ ఠాకూర్(రవికిషన్)దే రాజ్యం. ఆ గ్రామంలోని పిల్లలకు మత్తు మందు అలవాటు చేసి, వారికి గన్‌లిచ్చి తన సైన్యంగా మార్చుకుంటాడు. ఆ ఊరి ప్రజలకు నిత్యం నరకం చూపిస్తుంటాడు. తమని కాపాడటానికి ఏదో ఒక రూపంలో దేవుడే రావాలని ప్రార్థిస్తుంటారు. హైదరాబాద్‌లో రాబిన్‌హుడ్ సాహసాల్ని చూసిన విలాస్‌పూర్ మనిషి అతని గురించి ఆ గ్రామస్తులకు చెప్తాడు. అతన్ని ఎలాగైనా విలాస్‌పూర్ రప్పించాలనుకుంటారు గ్రామస్తులు. కట్ చేస్తే హైదరాబాద్‌లో వున్న రాబిన్‌హుడ్‌కి చైత్ర(రకుల్ ప్రీత్) పరిచయమవుతుంది. ఆమె ప్రేమిస్తుంది కానీ, రాబిన్‌హుడ్ ఆమెను ప్రేమించడు. ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తాడు. హైదరాబాద్‌లో తన పని పూర్తి చేసుకొని యు.ఎస్. వెళ్ళబోతున్న టైమ్‌లో చైత్ర కిడ్నాప్‌కి గురవుతుంది. ఆమెను వెతుక్కుంటూ విలాస్ పూర్ వస్తాడు రాబిన్‌హుడ్. చైత్రను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆమెను విలాస్‌పూర్‌కే ఎందుకు తీసుకొచ్చారు? రాబిన్‌హుడ్ విలాస్‌పూర్ రావడానికి కిడ్నాప్ డ్రామా ఆడారా? ప్రతి విషయంలో తన కంఫర్ట్ చూసుకునే రాబిన్‌హుడ్ గ్రామస్తుల కోసం సోలమన్ సింగ్‌తో తలపడ్డాడా? తర్వాత జరిగిన పరిణామాలేమిటి? అనేది మిగతా కథ.
కథ, కథనం: వక్కంతం వంశీ, సురేందర్‌రెడ్డి కలిసి చేసిన కిక్ కథలోగానీ, కథనంలోగానీ, క్యారెక్టరైజేషన్‌లోగానీ, క్యారెక్టర్ల ద్వారా వచ్చే కామెడీలో ఒక కిక్ వుంటుంది. దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు 'కిక్2' విషయానికి వస్తే పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటీ క్లారిటీతో వుండదు. కథగా చెప్పుకోవడానికి అందులో గొప్పతనం ఏమీ లేదు. కంఫర్ట్ పేరుతో హీరో క్యారెక్టర్‌ని డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నంలో దర్శకరచయితలు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు. కంఫర్ట్ గురించే మాట్లాడే హీరోకి ఒక ఎయిమ్ అంటూ ఏమీలేదు. వక్కంతం వంశీ ఈ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడన్నది ఎవరికీ అర్థం కాదు. అలాగే ఆ కథని తెరకెక్కించే ప్రయత్నంలో సురేందర్‌రెడ్డి ఏం తీశాడో, ఎందుకు తీశాడో కూడా అర్థంకాని విధంగా కథనం వుంటుంది. క్యారెక్టర్ల పరిచయం రవితేజ, బ్రహ్మానందం మధ్య కొన్ని కామెడీ సీన్స్‌తో, మధ్య మధ్య విలాస్‌పూర్ గ్రామ ప్రజల కష్టాలతో ఫస్ట్ హాఫ్ అయ్యిందనిపించాడు సురేందర్‌రెడ్డి. సెకండాఫ్‌లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎంతసేపూ హీరో తన కంఫర్ట్ కోసమే చూసుకుంటాడు తప్ప కథ ముందుకు వెళ్ళదు. దానికి తగ్గట్టుగా రాబిన్‌హుడ్ క్యారెక్టర్‌లో ఎనర్జీ లేదు. అతను హీరోయిజం చూపించడం కంటే కంఫర్ట్ కోసమే ఎక్కువగా ప్రయత్నించడం కూడా ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తుంది. వక్కంతం వంశీ రాసిన మాటలు కూడా ఎక్కడా పేలలేదు. క్లైమాక్స్‌లో తనికెళ్ళ భరణి చెప్పే కొన్ని డైలాగ్స్ మాత్రం బాగున్నాయనిపిస్తుంది.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: రాబిన్‌హుడ్‌గా రవితేజకి ఈ క్యారెక్టర్ అంతగా సూట్ అవ్వలేదనిపిస్తుంది. కిక్‌లో కళ్యాణ్‌గా ఆడియన్స్‌కి మంచి కిక్ ఇచ్చిన రవితేజ ఈ సినిమాలో రాబిన్‌హుడ్‌గా ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి. కథలో స్పీడ్ లేనట్టుగానే అతని పెర్‌ఫార్మెన్స్‌లో కూడా స్పీడ్ లోపించింది. అతను కంఫర్టబుల్‌గా వుండడం కోసమే ఈ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ క్యారెక్టర్ చాలా సాదా సీదా క్యారెక్టర్. ప్రతి సీన్‌లోనూ యాక్ట్ చేస్తున్నట్టుగానే వుంటుంది తప్ప ఆమె పెర్‌ఫార్మెన్స్‌ని ఆడియన్స్ ఎక్కడా ఫీల్ అవ్వరు. సోలమన్ సింగ్ ఠాకూర్‌గా చేసిన రవికిషన్ క్యారెక్టర్‌లో కూడా కొత్తదనం లేదు, అతని పెర్‌ఫార్మెన్స్ కూడా అలాగే వుంది. ఇక బ్రహ్మానందం చేసిన పండిట్ రవితేజ క్యారెక్టర్ కూడా రొటీనే. అలాంటి క్యారెక్టర్లు ఇప్పటికి లెక్కకు మించి చేసి వుంటాడు బ్రహ్మానందం. మిగతా క్యారెక్టర్లలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు.
టెక్నీషియన్స్: సినిమాకి మెయిన్‌గా వుండాల్సిన మంచి కథ, కథనాలు లేకపోవడం వల్ల టెక్నికల్‌గా ఎంత స్టాండర్డ్స్‌లో తీసినా దాని ఇంపాక్ట్ సినిమాలో కనిపించదు. అలాగే మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ బాగున్నప్పటికీ దానికి తగ్గ కథాబలం లేకపోవడం వల్ల అతని ఎఫర్ట్ హైలైట్ అవ్వదు. విజువల్‌గా మనోజ్ తన శక్తిమేరకు బాగానే చూపించే ప్రయత్నం చేశాడు. సంగీతం విషయానికి వస్తే కిక్‌తో తెలుగులో సంగీత దర్శకుడుగా పరిచయమైన థమన్‌కి రవితేజతో ఇది ఏడో సినిమా. కిక్ ఆడియోపరంగా, పాటల పిక్చరైజేషన్ పరంగా చాలా కొత్తగా అనిపిస్తాయి. కానీ, ఈ సినిమాలో ఆడియో పరంగా రెండు పాటలు బాగున్నప్పటికీ విజువల్‌గా అన్ని పాటలూ రొటీన్‌గానే వున్నాయి తప్ప కొత్తదనం కనిపించదు. థమన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా లౌడ్‌గా వుండడం వల్ల వీనులకు విందుగా అనిపించదు. గౌతంరాజు ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండు గంటల నలభై నిముషాల సినిమాని ట్రిమ్ చేస్తే ఓ 20 నిముషాలు లెంగ్త్ తగ్గి వుండేది. అప్పటికీ ఆల్బమ్‌లో వున్న ఒక పాట సినిమాలో లేదు. దాన్ని ఎండ్ టైటిల్స్ వాడారు. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గురించి చెప్పాలంటే తన ప్రతి సినిమాలో కొత్తగా ఏదో చెప్పాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మాత్రం అలాంటి ఛాయలు మనకు కనిపించవు. ఒక పక్క ఖలేజా, మరో పక్క విక్రమార్కుడు.. ఇలా కథనంలో చాలా సినిమాలు మనకు గుర్తొస్తాయి. కామెడీ సన్నివేశాల్లో మరెన్నో సినిమాలు స్ఫురిస్తాయి. రాబిన్‌హుడ్ అనే క్యారెక్టర్‌ని స్ట్రాంగ్‌గా చూపించలేకపోవడంతో అతని క్యారెక్టర్ చాలా చప్పగా అనిపిస్తుంది. అన్నిరకాలుగా ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చెయ్యలేకపోయాడు సురేందర్‌రెడ్డి.
విశ్లేషణ: తన ప్రతి సినిమాలోనూ హీరోకి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌ని క్రియేట్ చేసే సురేందర్‌రెడ్డి ఈ సినిమాలో కంఫర్ట్ పేరుతో చేసిన ఎటెమ్ట్ ఆడియన్స్‌ని కంఫర్ట్‌గా కూర్చోనివ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంత కామెడీతో, కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో నెట్టుకొచ్చి ఫర్వాలేదు అనుకుంటున్న తరుణంలో సెకండాఫ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఆడియన్స్ కంఫర్ట్ గురించి ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కథని క్లైమాక్స్‌కి తీసుకు రావడానికి రకరకాల విన్యాసాలు చేసినా ఏ ఒక్కటీ కంఫర్ట్‌గా లేకపోవడంతో ఎప్పటికోగానీ క్లైమాక్స్ రాదు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు తనికెళ్ళ భరణి చాలా సార్లు 'ఇది వర్కవుట్ అవ్వదు..' అంటూ వుంటాడు. సినిమా పూర్తయిన తర్వాత ఆ మాటలు సినిమా కోసం అన్నాడా అన్న డౌట్ వస్తుంది మనకు. కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో బలం లేకపోవడం, హీరో క్యారెక్టరైజేషన్ వీక్‌గా వుండడం, అనవసరమైన కామెడీ సీన్స్‌తో నవ్వించే ప్రయత్నం చెయ్యడం, మధ్య మధ్య సహాయ నటులు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం.. వీటన్నింటితో సినిమా పూర్తయిందనిపిస్తుంది తప్ప ఏ ఒక్కటీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవు. ఫైనల్‌గా చెప్పాలంటే పవర్ తర్వాత రవితేజ చేసిన సినిమా కావడం వల్ల ఓపెనింగ్స్ భారీగానే వుంటాయి. పటాస్ తర్వాత నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన సినిమా కావడం కూడా కలెక్షన్లపరంగా కొంత ప్లస్ అయ్యే అవకాశం వుంది.
ఫినిషింగ్ టచ్: 'కంఫర్ట్'గా లేని 'కిక్-2'
సినీజోష్ రేటింగ్: 2.75/5