Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: శ్రీమంతుడు


మైత్రి మూవీ మేకర్స్‌ అండ్‌ 

Advertisement
CJ Advs

ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ 

శ్రీమంతుడు 

నటీనటులు: మహేష్‌బాబు, శృతిహాసన్‌, జగపతిబాబు, 

రాజేంద్రప్రసాద్‌, ముఖేష్‌ రుషి, సంపత్‌రాజ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: మది 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం.) 

రచన, దర్శకత్వం: కొరటాల శివ 

విడుదల తేదీ: 07.08.2015 

'1' నేనొక్కడినే, ఆగడు చిత్రాల పరాజయాలతో కొత్త పాఠాలు నేర్చుకున్న మహేష్‌ ఈసారి కొరటాల శివ చెప్పిన కొత్త కథకి ఫ్లాట్‌ అయిపోయాడు. ఒక ఊరుని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌కి నో చెప్పలేకపోయాడు. 'మిర్చి'తో మాస్‌ ఆడియన్స్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా మెప్పించిన కొరటాల శివ తన రెండో చిత్రంగా 'శ్రీమంతుడు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పేరుతో మహేష్‌ స్టార్ట్‌ చేసిన చిత్ర నిర్మాణ సంస్థ కూడా తోడైంది. కొరటాల శివ కాన్సెప్ట్‌ మీద కాన్ఫిడెన్స్‌ వున్న నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి మహేష్‌కి వున్న ఇమేజ్‌ని దృష్టిలో వుంచుకొని కొరటాల శివ 'శ్రీమంతుడు'ని ఎలా తీర్చిదిద్దాడు? తను అనుకున్న కొత్త కాన్సెప్ట్‌ని ఎంతవరకు ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యేలా చెయ్యగలిగాడు? 'శ్రీమంతుడు'గా మహేష్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకోగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: హర్షవర్థన్‌(మహేష్‌) కోటీశ్వరుడైన రవికాంత్‌(జగపతిబాబు) ఒక్కగానొక్క కొడుకు. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన హర్షకి భాగ్యవంతుల విలాసాలు, ఆ వాతావరణం పడదు. ఎప్పుడూ తన చుట్టూ వున్న వారికి ఏదో ఒక విధంగా సహాయపడాలి అనే మనస్తత్వం వున్నవాడు. చిన్నతనం నుంచి కుటుంబంలో ఒకడిగా కాకుండా, కుటుంబానికి దూరంగా పెరుగుతూ చదువుకున్న హర్ష ఎప్పుడు బిజినెస్‌లోకి వస్తాడా, ఎప్పుడు వ్యాపార బాధ్యతల్ని తీసుకుంటాడా అని ఎదురుచూస్తుంటాడు రవికాంత్‌. కానీ, అతని దారి వేరని తెలుసుకుంటాడు రవికాంత్‌. కట్‌ చేస్తే అది దేవరకోట గ్రామం. సరైన వసతులు లేని ఆ గ్రామం నుంచి ఒక్కో కుటుంబం సిటీకి వలస వెళ్ళిపోతూ వుంటుంది. ఆ ఊరి పెద్ద అయిన నారాయణరావు(రాజేంద్రప్రసాద్‌) వలస వెళ్ళే ప్రతి కుటుంబాన్ని వెళ్ళొద్దని ప్రాధేయ పడుతుంటాడు. తన కండబలంతో, పలుకుబడితో దేవరకోట గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి ఒక్క దాన్నీ మేసేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటూ వుంటాడు శశి(సంపత్‌రాజ్‌). సెంట్రల్‌ మినిస్టర్‌ వెంకటరత్నం(ముఖేష్‌రుషి) అండదండలతో తన దందాలను కొనసాగిస్తుంటాడు శశి. ఎదిరించిన వారిని భయపెడతాడు, వినకపోతే చంపేస్తాడు. నారాయణరావు కూతురైన చారుశీల(శృతిహాసన్‌) ఎం.బి.ఎ. పూర్తి చేసి రూరల్‌ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కోర్సు చేస్తుంటుంది. ఓ సందర్భంలో చారుశీలను చూసి మనసు పారేసుకున్న హర్ష చారుశీల చదువుతున్న కాలేజీలోనే అతను చేరతాడు. అయితే అతను కాలేజీలో చేరింది తనకోసం కాదని, తను చేస్తున్న కోర్సు మీద వున్న ఇంట్రెస్ట్‌తోనే అని తర్వాత గ్రహిస్తుంది చారుశీల. ఇలా వుండగా హర్ష కోటీశ్వరుడు రవికాంత్‌ కొడుకని తెలుసుకొని అతన్ని దూరంగా వుంచుతుంది. అలా ఎందుకు చేస్తోందో అర్థం కాని హర్ష అదే విషయం గురించి ఆమెను అడుగుతాడు. అప్పుడు దేవరకోట గ్రామం గురించి ఆమె చెప్పిన మాటలు విని షాక్‌ అవుతాడు. దేవరకోట గ్రామంతో తన కుటుంబానికి కూడా సంబంధం వుందని తెలుసుకొని వెంటనే దేవరకోట గ్రామానికి బయల్దేరతాడు హర్ష. దేవరకోట గ్రామంతో హర్ష కుటుంబానికి ఎలాంటి సంబంధం వుంది? ఆ గ్రామానికి వెళ్ళిన హర్ష అక్కడ ఏం చేశాడు? ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపాడు? దుష్టశక్తులైన శశి, వెంకటరత్నంలకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఓ కోటీశ్వరుడి కొడుకుగా, నలుగురికీ సాయపడాలని తపన పడే వ్యక్తిగా, తండ్రి పేరుని నిలబెట్టే కొడుకుగా హర్షవర్థన్‌ పాత్రలో మహేష్‌బాబు జీవించాడని చెప్పాలి. సెంటిమెంట్‌ సీన్స్‌లో, ఎమోషనల్‌ సీన్స్‌లో, దుష్టశక్తుల మెడలు విరిచే ధీరోదాత్తుడుగా మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతం. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు డిగ్నిఫైడ్‌గా 'శ్రీమంతుడు' క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. కొరటాల శివ హీరో క్యారెక్టర్‌ని ఎలా డిజైన్‌ చేశాడో, ఎలాంటి ఔట్‌పుట్‌ హీరో నుంచి రావాలనుకున్నాడో దాన్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ స్క్రీన్‌ మీద చూపించి శివని శాటిస్‌ఫై చేశాడు మహేష్‌. చారుశీలగా శృతిహాసన్‌ పాటలకు, ప్రేమ సన్నివేశాలకే పరిమితం కాకుండా హీరోని ఇన్‌స్పైర్‌ చేసే క్యారెక్టర్‌లో బాగా చేసింది. లుక్స్‌ పరంగా అంత గ్లామరస్‌గా లేకపోయినా కథ ప్రధానంగా సాగే సినిమా కావడంతో ఈ విషయాన్ని ఆడియన్స్‌ అంతగా పట్టించుకోక పోవచ్చు. ఇక హర్ష తండ్రిగా జగపతిబాబు చాలా సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. మొదట్లో కొడుకు భావాలకు వ్యతిరేకంగా వున్నట్టు అతని క్యారెక్టర్‌ కనిపించినా, ఫ్లాష్‌బ్యాక్‌లో జగపతిబాబుని చూసిన తర్వాత ఆ క్యారెక్టర్‌ మీద గౌరవం పెరుగుతుంది. విలన్ల విషయానికి వస్తే శశిగా సంపత్‌రాజ్‌ అద్భుతమైన విలనీని చూపించాడు. ముఖేష్‌ రుషి, హరీష్‌ ఉత్తమన్‌ క్యారెక్టర్లకు అంతగా ప్రాధాన్యత లేదు. రొటీన్‌గా వారు ప్రతి సినిమాలో చేసే క్యారెక్టర్సే ఈ సినిమాలోనూ చేశారు. ఊరి పెద్ద నారాయణరావు పాత్రలో రాజేంద్రప్రసాద్‌ ఆట్టుకున్నాడు. వెన్నెల కిషోర్‌, ఆలీ నవ్వించేందుకు చాలా తక్కువగా ట్రై చేశారు, వున్నంతలో ఓకే అనిపించారు. కథకు ఏమాత్రం ఉపయోగం లేని క్యారెక్టర్‌లో సుబ్బరాజు కనిపిస్తాడు. అతనికి ఇచ్చిన డైలాగ్స్‌ కూడా చాలా తక్కువ. మిగతా క్యారెక్టర్లలో తులసి, సితార, సుకన్య కూడా ఫర్వాలేదనిపించారు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి సంబంధించి ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ మది గురించి. ఎక్స్‌లెంట్‌ ఫోటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించాడు. ముఖ్యంగా మహేష్‌ని చాలా అందంగా చూపించడంలో టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. పాటలు, ఫైట్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌.. ఇలా అన్ని సందర్భాల్లోనూ తన ఫోటోగ్రఫీతో కనువిందు చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ '1' తర్వాత ఈ సినిమాకి మరో మంచి ఆల్బమ్‌ చేశాడు. ఆడియో పరంగా పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా కేర్‌ తీసుకొని సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యేలా చేశాడు. పాటల్ని విజువల్‌గా కొత్తగా చూపించడంలో మాత్రం కొరియోగ్రాఫర్స్‌ అంత సక్సెస్‌ అవ్వలేదని చెప్పాలి. పాటల విషయంలో కొత్త కాన్సెప్ట్‌ల జోలికి వెళ్ళకుండా పాత ధోరణిలోనే కానిచ్చేశారు. ఇందులో విజువల్‌గా సూపర్‌ అనిపించే పాట ఒక్కటి కూడా లేదు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ కూడా బాగుంది. రెండు గంటల నలభై మూడు నిముషాల నిడివి వున్న ఈ సినిమాని సెకండాఫ్‌లో కొంత ట్రిమ్‌ చేసే అవకాశం వుంది. అలా చేసి వుంటే మరి కాస్త స్పీడ్‌ అయి వుండేది. డైరెక్టర్‌ కొరటాల శివ గురించి చెప్పాలంటే ఒక ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌కి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు. మహేష్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని, తను అనుకున్న కాన్సెప్ట్‌ పక్కదోవ పట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ సీరియస్‌గా నడిచే కథ, కథనాల వల్ల ఆడియన్స్‌ ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవకుండా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో శివ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. శివ రాసిన మాటలు కూడా అర్థవంతంగా వుంటూనే అక్కడక్కడ నవ్వించాయి. 

విశ్లేషణ: సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ వున్న మహేష్‌లాంటి హీరోకి ఇలాంటి కథ చెప్పి ఒప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే డైరెక్టర్‌ మీద నమ్మకంతో, అతను చెప్పిన కథను ఓకే చేసి సినిమా చెయ్యడానికి మహేష్‌ ఒప్పుకోవడం గొప్ప సాహసమనే చెప్పాలి. ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. ఎంతో కొంత తిరిగి ఇచ్చెయ్యాలి అనే కాన్సెప్ట్‌ వినడానికి మాములుగా వున్నప్పటికీ దానికి సినిమాటిక్‌గా, ఒక స్టార్‌ హీరోని, అతని అభిమానుల్ని మెప్పించే కథగా తీర్చిదిద్దడంలో కొరటాల శివ సక్సెస్‌ అయ్యాడు. హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌, ఆ తర్వాత వచ్చే ఒక్కో సీన్‌, హీరోయిన్‌తో పరిచయం, వారిద్దరి మధ్య సీన్స్‌, మధ్యలో తండ్రికి, కొడుక్కి మధ్య సీన్స్‌..ఇలా అసలు కాన్సెప్ట్‌లోకి వెళ్ళడానికే శివకి ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం సరిపోయింది. సెకండాఫ్‌ నుంచి నడిచే అసలు కథ స్పీడ్‌గానే వెళ్తున్న మధ్య కొన్ని సీన్స్‌ స్పీడ్‌ బ్రేకర్స్‌లా అడ్డు తగిలి ఫ్లోని దెబ్బ తీశాయి. ఫస్ట్‌ హాఫ్‌లో కొంత, సెకండాఫ్‌లో కొంత ఫుటేజ్‌ తగ్గించి వుంటే రన్‌ టైమ్‌ తగ్గి ఇంకా స్పీడ్‌గా వుండేది. ఇక ఈ సినిమాకి అతి పెద్ద మైనస్‌ కామెడీ. దూకుడు, ఆగడు వంటి సినిమాల్లో మహేష్‌ చెప్పిన మాస్‌ డైలాగ్స్‌, కామెడీ పంచ్‌లు ఈ సినిమాలో వుండవు. మంచి కామెడీ వుంటుందని ఈ సినిమాకి వచ్చే ఆడియన్స్‌కి నిరాశ తప్పదు. కథ ప్రకారం ఈ సినిమాలో కామెడీని జొప్పించే అవకాశం లేదు. కామెడీ లేకపోగా ఎంత సేపూ ఊరి సమస్యలు, రౌడీలను హీరో చితక బాదడం వంటి సీన్స్‌ రిపీటెడ్‌గా వుండడం వల్ల ఆడియన్స్‌కి అక్కడక్కడ బోర్‌ కొట్టే అవకాశం వుంది. పాటలు కూడా విజువల్‌ అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం కూడా సినిమాకి మైనస్‌ అయింది. కేవలం ఒక సీరియస్‌ సినిమాని పెద్ద స్క్రీన్‌ మీద చూడడానికి మాత్రమే వెళ్ళాలి తప్ప అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయని వెళ్తే మాత్రం ఆయా విషయాల్లో డిజప్పాయింట్‌ అవ్వక తప్పదు. ఫైనల్‌గా చెప్పాలంటే మహేష్‌కి సూపర్‌హిట్‌ మూవీ రావాలని ఎదురుచూస్తున్న అభిమానులకు 'శ్రీమంతుడు' పండగ చేసుకునే అవకాశం ఇచ్చాడు.

ఫినిషింగ్‌ టచ్‌: 'శ్రీమంతుడు' పనిమంతుడే..!

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs