సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్
జాదూగాడు
నటీనటులు: నాగశౌర్య, సోనారికా బదోరియా, శ్రీనివాసరెడ్డి,
కోట శ్రీనివాసరావు, జాకీర్ హుస్సేన్, అజయ్,
ఆశిష్ విద్యార్థి, రవి కాలే, సప్తగిరి, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
సంగీతం: సాగర్ మహతి
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
కథ, మాటలు: మధుసూదన్
నిర్మాత: వి.వి.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: యోగేష్
విడుదల తేదీ: 26.06.2015
ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి సినిమాలతో లవర్ బోయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్న నాగశౌర్య ఇప్పుడు ‘జాదూగాడు’గా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. గతంలో చింతకాయల రవి వంటి హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన యోగేష్ కొంత గ్యాప్ తర్వాత నాగశౌర్యను మాస్ కమర్షియల్ హీరోగా ప్రజెంట్ చెయ్యడానికి ‘జాదూగాడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవర్‌బోయ్ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న నాగశౌర్య ‘జాదూగాడు’ చిత్రంతో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? గ్యాప్ తీసుకొని చేసిన డైరెక్టర్ యోగేష్‌కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ని ఇచ్చింది? నాగశౌర్యను మాస్ ఆడియన్స్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్ళగలిగాడా? ఈ సినిమా విషయంలో హీరో నాగశౌర్య, డైరెక్టర్ యోగేష్ చేసిన జాదూ ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఓపెన్ చేస్తే ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూ దొరికింది దొరికినట్టు అమ్ముకొని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు మన హీరో కృష్ణ(నాగశౌర్య). ఆ ఊళ్ళో తన పని బెడిసి కొట్టడంతో రెండు నెలల్లో కోటి రూపాయలు సంపాదిస్తానని చెప్పి ఆ ఊరి పెద్దలతో ఛాలెంజ్ చేసి స్నేహితుడితో కలిసి సిటీకి బయల్దేరతాడు. సిటీకి రావడంతోనే సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే శ్రీనివాసరెడ్డి ఇంట్లో దిగుతాడు. అంతటితో ఆగకుండా ఐఎస్‌డి బ్యాంక్ రికవరీ ఆఫీసర్‌గా అవతారమెత్తుతాడు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఎగనామం పెట్టిన మొండి ఖాతాలను కృష్ణకు అప్పగిస్తుంది బ్యాంక్. అవి వసూలు చేసుకొని రావడానికి వెళ్ళి తన్నులు తిని వస్తాడు కృష్ణ. ఆ టైమ్‌లోనే ఊళ్ళో పెద్ద గూండాగా పేరున్న శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) దగ్గర పని దొరుకుతుంది. శ్రీశైలం పేరుని అడ్డం పెట్టుకొని లోన్స్ రికవరీ చేస్తుంటాడు. ఆ టైమ్‌లోనే పార్వతి అనే నర్స్ పరిచయమవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు కృష్ణ. దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలన్నది పార్వతి యాంబిషన్. ఆ తర్వాతే ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచిస్తానంటుంది. అయినప్పటికీ అతని ప్రేమలో పడుతుంది. ఇదిలా వుంటే శ్రీశైలంకి అధికార పార్టీ నాయకుడు జగదీష్ నాయుడు(కోట శ్రీనివాసరావు) సపోర్ట్ వుంటుంది. ఒక ఇల్లీగల్ బిజినెస్‌కి సంబంధించి రెండు వేల కోట్ల డీల్‌ను శ్రీశైలంకి అప్పగిస్తాడు జగదీష్‌నాయుడు. దానికి బినామీగా కృష్ణను వాడుకుంటాడు శ్రీశైలం. అసలు ఆ రెండు వేల కోట్ల డీల్ ఏమిటి? దానికి కృష్ణను ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది? ఈ బిజినెస్ డీల్‌లో ఇంకా ఎవరెవరు ఇన్‌వాల్వ్ అయ్యారు? జాదూగాడు అనే టైటిల్ రోల్ ప్లే చేస్తున్న కృష్ణ ఈ డీల్ విషయంలో ఎలాంటి జాదూ చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: జాదూగాడిగా నాగశౌర్య చేసిన క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ వున్నాయి. ఇప్పటివరకు లవర్‌బోయ్‌గా నాగశౌర్యను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా మాస్ క్యారెక్టర్ చూడడం కష్టమే అని చెప్పాలి. అతని బాడీ లాంగ్వేజ్‌కి, అతను చెప్పే డైలాగ్స్‌కి, అతను చేసే యాక్షన్‌కి ఏమాత్రం సూట్ అవ్వలేదు. లవర్‌గా అతని పెర్‌ఫార్మెన్స్ ఓకే అనిపించినా, ఎమోషనల్ సీన్స్‌లో, విలన్ గ్యాంగ్‌ని ఆటాడిరచే సీన్స్‌లో నాగశౌర్య అంతగా రాణించలేకపోయాడు. అయితే డాన్సుల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యడానికి మరికొన్నాళ్ళు టైమ్ తీసుకొని వుంటే బాగుండేది అనిపించింది. అతను ఎంత సీరియస్ సిట్యుయేషన్‌లో డైలాగ్స్ చెప్తున్నా, సీరియస్‌గా ఫైట్స్ చేస్తున్నా చూసేవారికి మాత్రం ఎక్కడా టెన్షన్ అనేది క్రియేట్ అవ్వదు. హీరోయిన్ సోనారికా గురించి చెప్పాలంటే తన అందంతో ఆకట్టుకుంది. డాన్సుల్లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆమె పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదు అనిపించింది. శ్రీశైలంగా జాకీర్ హుస్సేన్ చాలా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. జగదీష్‌నాయుడుగా కోట శ్రీనివాసరావు తనకు బాగా అలవాటైన నటన ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్‌లో సత్య, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వి, సెకండాఫ్‌లో సప్తగిరి తమ కామెడీతో అక్కడక్కడా నవ్వించారు. హీరోతో కలిసి జాదూ చేసే శ్రీను క్యారెక్టర్‌లో అజయ్ పెర్‌ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. పోలీస్ కమిషనర్‌గా ఆశిష్ విద్యార్థి, సి.ఐ.గా రవి కాలే తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు బాగానే చేశారు.
టెక్నీషియన్స్: సాంకేతికవర్గంలో సాయిశ్రీరామ్ ఫోటోగ్రఫీ, సాగర్ మహతి సంగీతం, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ చెప్పుకోదగినవిగా వున్నాయి. గత చిత్రాలతో పోలిస్తే సాయిశ్రీరామ్ ఫోటోగ్రఫీలో మెరుపులు ఈ సినిమాలో తగ్గాయని చెప్పాలి. అయినప్పటికీ కొన్ని సీన్స్‌ని బాగా తీశాడు. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన సాగర్ మహతి పాటల విషయంలో తండ్రి మణిశర్మను ఫాలో అయినట్టుగా అనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మణిశర్మ మార్క్‌లాగే అనిపించినా అక్కడక్కడా తన ప్రత్యేకతను చూపించాడు సాగర్. ఎం.ఆర్.వర్మ చేసిన ఎడిటింగ్ ఫర్వాలేదు అనిపించింది. సెకండాఫ్ స్టార్ట్ అయిన కాసేపటి తర్వాత అనవసరంగా సినిమాను క్లైమాక్స్ వరకు సాగదీసినట్టుగా అనిపించింది. అక్కడ కొంత ట్రిమ్ చేసి వుంటే బాగుండేది. కథా రచయిత మధుసూదన్ గురించి చెప్పాలంటే ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌లో కథ చెప్పాలనుకున్నాడు. అయితే ఈ కథలో చాలా కన్‌ఫ్యూజన్ వుంది. దానికి తగ్గట్టుగానే స్క్రీన్‌ప్లే వుండడంతో అది ఇంకాస్త కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ కథలో వున్న క్లారిటీ సెకండాఫ్‌లో కనిపించదు. రకరకాల ట్విస్ట్‌లు పెట్టడంతో క్లారిటీ మిస్ అయి కన్‌ఫ్యూజ్‌కి ఎక్కువ అవకాశమిచ్చాడు డైరెక్టర్. కథలోని క్లారిటీ విషయంలో మరికొంత కేర్ తీసుకొని వుంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
అక్కడక్కడా కామెడీ
మైనస్ పాయింట్:
కథలో క్లారిటీ లేకపోవడం
స్క్రీన్‌ప్లే
నాగశౌర్యకి మించిన క్యారెక్టర్
విశ్లేషణ: ఆకతాయిగా తిరిగే కుర్రాడు వున్నట్టుండి కోటి రూపాయలు సంపాదిస్తానని సిటీకి బయల్దేరడం, లోన్ రికవరీ ఆఫీసర్‌గా మారడం, విలన్ డెన్‌లో స్థానం సంపాదించడం, మధ్యలో ప్రేమ వ్యవహారం.. వీటితో ఫస్ట్ హాఫ్ అంతా ఫర్వాలేదు ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరో ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కోవడం, దానికి చాలామంది లింక్ అయి వుండడం, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వుండే పోలీస్ కమిషనర్, సి.ఐ. హీరోని ఇబ్బందులు పెట్టడం, ఆ తర్వాత హీరో అందరి ఆట కట్టించడానికి ఒక ప్లాన్ చెయ్యడం..చెప్పడానికి బాగానే వున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వలేదు. పైగా డైరెక్టర్ డిజైన్ చేసిన కృష్ణ క్యారెక్టర్ నాగశౌర్య శక్తికి మించి వుండడంతో ఆడియన్స్‌ని ఆకట్టుకోకపోగా అతి అనిపించేలా చేసింది. సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కథను ఎక్కడ కావాలంటే అక్కడ ఎండ్ చేసెయ్యొచ్చు. కానీ, రన్ టైమ్ కోసం కథతో సంబంధం లేకపోయినా సప్తగిరి క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే తాగుబోతు రమేష్ క్యారెక్టర్ కూడా కేవలం సినిమాని సాగదియ్యడం కోసమే అన్నట్టుగా వుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కనిపించే శ్రీనివాసరెడ్డి, సత్య, పృథ్వి సెకండాఫ్‌లో పత్తా వుండరు. ఇప్పటివరకు లవర్‌బోయ్‌గా యూత్‌ని ఆకట్టుకున్న నాగశౌర్య ఈ సినిమాతో మాస్ ఇమేజ్‌ని తెచ్చుకోవాలని విఫలయత్నం చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌తో చేసిన కొన్ని లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్‌లో మాత్రం బాగానే ఆకట్టుకోగలిగాడు. ఫైనల్‌గా చెప్పాలంటే నాగశౌర్యని లవర్‌బోయ్‌గా చూసి ఇష్టపడిన వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. హీరోతో సంబంధం లేకుండా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా ఫర్వాలేదు అనిపిస్తుంది.
ఫినిషింగ్ టచ్: జాదూ లేదు.. కన్‌ఫ్యూజన్ వుంది.
సినీజోష్ రేటింగ్: 2.5/5