Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: బందూక్‌


బి.బి.ఎస్‌. స్టూడియో మోషన్‌ పిక్చర్స్‌

Advertisement
CJ Advs

బందూక్‌

నటీనటులు: దేశపతి శ్రీనివాస్‌, మిథున్‌రెడ్డి, చైతన్య,

జోషి, దేవా, మధు, సెహెరా బాను తదితరులు

సినిమాటోగ్రఫీ: రాహుల్‌

సంగీతం: కార్తీక్‌

సమర్పణ: తనిష్క మల్టివిజన్

నిర్మాత: గుజ్జ యుగంధర్‌రావు

రచన, దర్శకత్వం: లక్ష్మణ్‌ మురారి(బాబి)

విడుదల తేదీ: 19.06.2015

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ప్రజల్ని ఆకట్టుకున్నాయి, కొన్ని ఉత్తేజ పరిచాయి. అయితే అవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వచ్చిన సినిమాలు కావడంవల్ల, ఉద్యమ వాతావరణం వుండడం వల్ల ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను ఆదరించారు. తాజాగా లక్ష్మణ్‌ మురారి(బాబి) దర్శకత్వంలో బిబిఎస్‌ స్టూడియో మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై గుజ్జ యుగంధర్‌రావు నిర్మించిన ‘బంధూక్‌’ చిత్రం మాత్రం ఉద్యమ నేపథ్యం వుంటూనే ఒక కొత్త కోణాన్ని చూపించింది. తెలంగాణ నటీనటులు, టెక్నీషియన్స్‌తో రూపొందించిన మొట్ట మొదటి సినిమా ‘బందూక్‌’ కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? సినిమాలో బందూక్‌ ప్రాధాన్యం ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: హింస ద్వారా తెలంగాణ సాధించుకోవాలన్న కలను నిజం చేసుకోవాలనుకునే ఒక యువకుడు, మహాత్మా గాంధీ మార్గంలో ఒక్క నెత్తుటి బొట్టు కూడా చిందకుండా అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆలోచించే కొంతమంది యువతీ యువకులు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య, ఎవరి వాదం కరెక్ట్‌ అనే సంఘర్షణ మధ్య సాగే కథే ఈ ‘బంధూక్‌’. ఆత్మహత్య చేసుకున్న ఒక చేనేత కార్మికుడి కొడుకు చైతన్య. చేనేత కార్మికుల బతుకులు ఇలా వుండడానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని భావించిన చైతన్య అన్నలతో కలిసిపోవాలని అడవికి వెళ్తాడు. ఉద్యమంపై వారిలో కూడా భిన్నాభిప్రాయాలు వుండడాన్ని గమనించిన చైతన్య అక్కడి నుంచి ఒక రివాల్వర్‌ తీసుకొని సిటీకి బయల్దేరతాడు. అమాయకులతో ఆడుకునేవారిని, అక్రమాలకు పాల్పడేవారిని తన బందూక్‌కి బలి చేస్తుంటాడు. మరో పక్క సంజయ్‌, చారి, గిరి, అనురూప్‌, గాయత్రి మరి కొందరు వీధి నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయుధం పట్టిన చైతన్య, అహింసా మార్గంలో ఉద్యమం చేసే ఫ్రెండ్స్‌ వారు వెళ్తున్న మార్గంలో వలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? ఎంతవరకు సక్సెస్‌ కాగలిగారు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన దేశపతి శ్రీనివాస్‌, మిథున్‌రెడ్డి, చైతన్య, జోషి, దేవా, మధు, సెహెరా బాను.. వీరంతా తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రజెంట్‌ వున్న నటీనటులతోనే సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు అర్పించిన కొందరు అమర వీరుల క్యారెక్టర్స్‌ కూడా చేయించారు. ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి ఆర్టిస్టు అద్భుతంగా నటించారు. ఎన్‌.శంకర్‌, గోరేటి వెంకన్న వంటి ప్రముఖులు కూడా ఒక పాటలో కనిపించడం విశేషం. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గురించి. ప్రతి సీన్‌ని చాలా అద్భుతంగా చిత్రీకరించడంలో సినిమాటోగ్రాఫర్‌ రాహుల్‌ సక్సెస్‌ అయ్యాడు. కార్తీక్‌ అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలన్నీ ఆకట్టుకునేలా వున్నాయి. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం, సాయుధ రైతాంగ పోరాటం, ఒక యువకుడి మానసిక సంఘర్షణ..ఇలాంటి సన్నివేశాల్లో కార్తీక్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతం అనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయానికి వస్తే కొన్ని సీన్స్‌ లెంగ్త్‌ ఎక్కువగా వుండడం వల్ల సినిమా లెంగ్త్‌ పెరిగింది. ఆ సీన్స్‌ని ట్రిమ్‌ చేస్తే సినిమా ఇంకా స్పీడ్‌ అయ్యేది. డైరెక్టర్‌ లక్ష్మణ్‌ మురారి గురించి చెప్పాలంటే తను ఎంచుకున్న కాన్సెప్ట్‌ బాగుంది. అయితే బందూక్‌ పట్టిన చైతన్య లక్ష్యం ఏమిటి? అవినీతి పరులను ఎంతవరకు అంతం చేయగలడు? దాని ద్వారా అతను సాధించాలనుకున్నది ఏమిటి? అనేది అతని క్యారెక్టరైజేషన్‌లో చెప్పలేకపోయాడు. అతనికి ఎక్కువ డైలాగ్స్‌ పెట్టకపోవడం, అతని మనసులోని మాటలు ఇతరులకు తెలియకపోవడం వల్ల అతను ఏం చేస్తున్నాడో అతనికే క్లారిటీ లేదని తెలుస్తుంది. హింస కంటే అహింస ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని దర్శకుడు సినిమాలోని మిగతా క్యారెక్టర్ల ద్వారా చెప్పించడం బాగుంది. సినిమాలో నటించిన ఆర్టిస్టులందరి నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని చాలా ఎక్స్‌లెంట్‌గా తీశారు. ఆ ఎపిసోడ్‌లో ఆర్టిస్టులంతా జీవించారని చెప్పాలి. 

విశ్లేషణ: తెలంగాణ ఉద్యమంలో వెలుగు చూడని కొత్త కోణం అంటూ దర్శకుడు లక్ష్మణ్‌ మురారి చేసిన ఈ కొత్త ప్రయోగం కొంతవరకు ఆకట్టుకుంటుంది. అయితే పాయింట్‌ చిన్నది కావడంవల్ల రెండున్నర గంటల సినిమాలో చూసిన సీన్సే మళ్ళీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లోగానీ, సెకండాఫ్‌లోగానీ ఇలాంటి సీన్స్‌ చాలా కనిపిస్తాయి. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో బందూక్‌ పట్టిన చైతన్య ఏం చేస్తాడోనన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలుగుతుంది. అయితే కొన్ని సీన్స్‌ తర్వాత అది రొటీన్‌గా మారిపోతుంది. వీధి నాటకాల ద్వారా ప్రజల్ని మేల్కొలిపే మిత్ర బృందంలో వారి వారి వ్యక్తిగత సమస్యలు కూడా చూపించడం వల్ల వారి తల్లిదండ్రులు పిల్లల మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు, వారి ఉన్నతిని ఎంతగా ఆశిస్తున్నారు అనేది అర్థమయ్యేలా వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిపోయింది కాబట్టి ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ఇలాంటి సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపించకపోవచ్చు. కానీ, ఉద్యమంలో పనిచేసిన వారు, ఉద్యమాలంటే బాగా కనెక్ట్‌ అయ్యేవారు, ఉద్యమం వల్ల కలిగిన కష్టనష్టాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించిన వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఉద్యమ నేపథ్యంలో వచ్చే సినిమాలను ఇష్టపడే అందరూ ఈ సినిమాని కూడా ఇష్టపడతారు. 

- హరా జి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs